క్రీడాభూమి

క్వార్టర్ ఫైనల్స్‌కు సైనా, ప్రణీత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్యాంకాక్, జూన్ 1: థాయిలాండ్ గ్రాండ్‌ప్రీ గోల్డ్ బాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్‌తో పాటు బి.సాయి ప్రణీత్ క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లారు. ఈ టోర్నీలో రెండో సీడ్‌గా బరిలోకి దిగిన సైనా నెహ్వాల్ గురువారం ఇక్కడ జరిగిన మహిళల సింగిల్స్ ప్రీ-క్వార్టర్ ఫైనల్ పోరులో 21-11, 21-14 గేముల తేడాతో మలేషియాకి చెందిన ఇంగ్ ఇంగ్ లీపై సునాయాసంగా విజయం సాధించింది. పూర్తి ఏకపక్షంగా జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థిని కేవలం 40 నిమిషాల వ్యవధిలోనే మట్టికరిపించిన సైనా నెహ్వాల్ క్వార్టర్ ఫైనల్‌లో జపాన్‌కు చెందిన క్వాలిఫయర్ హరుకో సుజుకీతో తలపడనుంది. కాగా, పురుషుల సింగిల్స్ ప్రీ-క్వార్టర్ ఫైనల్ పోరులో సాయ ప్రణీత్ మలేషియాకి చెందిన ఇస్కందర్ జుల్కర్‌నైన్‌పై సునాయాసంగా విజయం సాధించాడు. ఇటీవల సింగపూర్ ఓపెన్ టోర్నీలో చాంపియన్‌గా నిలిచిన ప్రణీత్ ఈ మ్యాచ్‌లో 21-13, 21-18 గేముల తేడాతో ప్రత్యర్థిని మట్టికరిపించాడు. ఈ టోర్నీలో మూడో సీడ్‌గా బరిలోకి దిగిన ప్రణీత్ శుక్రవారం జరిగే క్వార్టర్ ఫైనల్ పోరులో థాయిలాండ్‌కు చెందిన కాంటపోన్ వాంగ్చరొయెన్‌తో తలపడనున్నాడు. అయితే ఈ టోర్నీలో భారత్‌కు చెందిన సౌరభ్ వర్మ, చుక్కా సాయి ఉత్తేజితరావు పోరాటానికి తెరపడింది. పురుషుల సింగిల్స్ విభాగంలో 12వ సీడ్‌గా బరిలోకి దిగిన సౌరభ్ వర్మ 16-21, 25-23, 11-21 గేముల తేడాతో ఫ్రాన్స్‌కు చెందిన ఐదో సీడ్ ఆటగాడు బ్రైస్ లెవర్దెజ్ చేతిలో ఓటమిపాలవగా, మహిళల సింగిల్స్ పోరులో థాయిలాండ్‌కు చెందిన పట్టరసుద చైవాన్ 21-15, 21-17 తేడాతో సాయి ఉత్తేజితరావుపై విజయం సాధించింది.