భక్తి కథలు

స్వామియే శరణం అయ్యప్పా!..47

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాళ్లను చిరునవ్వుతో పలకరించి తీర్థ, ప్రసాదాలు ఇచ్చారు అర్చక తంత్రులు!
‘‘్భక్తులారా! స్వామిని మీరీవిధంగా రోజూ దర్శించుకోవచ్చును! మీ తనివితీరా దర్శించుకుని మీ నివాసాలకు తిరిగి వెళ్లి మీ గృహాలలో స్వామి రూపాలను చిత్రపటాలుగా గానీ, విగ్రహాలుగా గానీ పవిత్రమైన స్థలంలో వుంచుకుని పూజించుకోండి!’’ అంటూ వాళ్లకు చిత్ర పటాలు, విగ్రహాలు ఇచ్చారు!
‘‘రాజా! పరశురాములవారు, అగస్త్య మహర్షి మీ అందరికోసం ఈ పటాలను, విగ్రహాలను ఇచ్చి వెళ్లారు! స్వామికి రోజూ పూజార్చనలు చేసుకోండి! మీకు మనస్సు కలిగినప్పుడు వచ్చి ఈ శబరిగిరి క్షేత్రంలో స్వామిని దర్శించుకోండి! మీకు పూజా విధానం తెలియజేస్తాము! మీరు మీ రాజ్యానికి తిరిగి వెళ్లి అక్కడ కూడా స్వామికి ఆలయం నిర్మింపజేయండి నిపుణులైన శిల్పులతో! స్వామి విగ్రహ ప్రతిష్ఠ మేము కావించుతాము!’’ అంటూ ప్రధాన తంత్రి చెప్పినది విని ‘‘తప్పకుండా అట్లాగే చేస్తాను! అర్చకస్వాములారా! నాదొక విన్నపం! మణికంఠుడు మా కన్నుల వెలుగు రాజకుమారునిగా అమూల్యమైన ఆభరణాలు ధరించి ఆనందాన్ని పంచిన రోజులు ఇంకా మా కళ్లముందు కదలాడుతూనే వున్నాయి! పులిపాల కోసం అరణ్యానికి బయలుదేరినప్పుడు ఆ ఆభరణాలు తీసివేసి నార బట్టలు ధరించి వెళ్లాడు! ఆ నగలు రాజభవనంలో జాగ్రత్త చేయబడి వున్నాయి! వాటిని స్వామి విగ్రహానికి అలంకరింప జేయాలని ఆశిస్తున్నాను!’’ అన్నాడు ప్రార్థన పూర్వకంగా నమస్కరించి!
‘‘తప్పకుండా! ప్రతి సంవత్సరం మకరజ్యోతిగా స్వామి దర్శనమిచ్చే సమయంలో మీరు ఆ ఆభరణాలను స్వయంగా తీసుకుని వచ్చి మాకందిస్తే వాటిని విగ్రహనికి అలంకరిస్తాము! మీరు తృప్తితీరా చూడవచ్చును! తిరిగి వాటిని మర్నాడు తీసుకువెళ్లి మీ రక్షణలో వుంచి మరు సంవత్సరం తిరిగి తీసుకుని రావాలి! ప్రతి రోజూ విగ్రహానికి స్వామి స్వయంగా వ్యక్తమైనపుడు వుండిన ఆభరణాలు మాత్రమే అలంకరింపజేయడం జరుగుతుంది’’ అని వాళ్ళు చెప్పింది విని తృప్తిగా నిశ్వసించాడు రాజు!
***
‘‘శౌనకాది మునులారా! ఆ విధంగా అయ్యప్పస్వామి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది! ప్రధాన తంత్రుల ద్వారా స్వామి పూజా విధానం సామాన్యజనులు నేర్చుకుని వ్యాప్తి కావించారు. పందళ రాజ్యంలోనూ, చుట్టుప్రక్కల క్రమంగా ఆలయాలు వెలసి స్వామి విగ్రహ ప్రతిష్ఠలు శాస్త్రోక్తంగా జరిగాయి.. ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో! ఇండ్లలో తమ ప్రాంతాలలోని గుడులలో స్వామి అర్చించుకుంటున్నా శబరిగిరి మీది స్వామిని దర్శించుకోవడంలో లభించే ఆనందం, తృప్తి వర్ణనాతీతమైవని గ్రహించారు పందళ ప్రజలు! అందుకే శబరిగిరి కి ప్రయాణమవాలని ఉబలాటపడేవారు! మెట్లెక్కి వెళ్లి స్వామి సన్నిధానం చేరాలన్న ఆశే అందరిలో! అది గమనించి ప్రధాన తంత్రులు (మేల్‌శాం) వారి ఆశ నెరవేరడానికి అయ్యప్ప స్వామి నిర్దేశించిన దీక్షావిధి, నియమాలు పాటించవలసి వుంటుందనీ, అప్పుడే ఆ స్వామిని మెట్లెక్కి వెళ్లి దర్శించే అర్హత కలుగుతుందని చెప్పడంతో అందరూ భక్తివిశ్వాసాలకు, ఉత్సాహం తోడుకాగా ప్రధాన తంత్రులనుండి ఆ విధుల గూర్చి ఉపదేశం పొంది ఆ ప్రకారం ఆచరించి స్వామిని పద్దెనిమిది మెట్లెక్కి వెళ్లి దర్శించుకుని జీవితాలు ధన్యం కావించుకునేవారు! ఇహపర సౌఖ్యాలు ప్రసాదించి మెల్లగా చూసేవాడు అయ్యప్ప.
పంబళ రాజు రాజశేఖరుడు మరు సంవత్సరం మణికంఠుని ఆభరణాలను ఉత్సవంగా మకర జ్యోతిగా దర్శనమిచ్చే రోజున శబరిగిరికి తీసుకువెళ్లి ప్రధాన తంత్రులు వాటిని స్వామి మూల విగ్రహానికి ధరింపజేయడం కన్నుల కరువు తీరా చూసి పులకించిపోతాడు! ఆయనకు జీవితంలో ఇక కావలసినదేమీ లేదనిపించింది! తనకు తిరిగి జన్మ లేకుండా స్వామిలో లీనమై మోక్షాన్ని పొందాలని తహతహలాడాడు! స్వామికి మొరపెట్టుకున్నాడు!
‘‘ఆర్తితో నీవు నన్ను మోక్షప్రాప్తిని అనుగ్రహించమని కోరుతున్నావు! రాజా! నీవు కోరిన వరాన్ని అనుగ్రహిస్తున్నాను! ఇకపై ప్రతి సంవత్సరం నీ వంశీయులు నా ఆభరణాలను మకర సంక్రమణం రోజున తీసుకురావడం, వాటిని నా విగ్రహానికి ధరింపజేయడం జరుగుతుంది! నీ పేరు భూమిపై చిరస్థాయిగా నిలిచిపోతుంది’’ అని స్వామి విగ్రహం నుండి పలుకులు వినరావడంతో ‘‘్ధన్యుడిని స్వామి ధన్యుడిని! అయ్యప్ప స్వామి! నీ పాదాలే భక్తులందరికీ ఆశ్రయమిచ్చి కాపాడాలి! స్వామి శరణం! అయ్యప్ప శరణం!’’ అని భక్తి పారవశ్యంతో భజిస్తూ వుండగా, ఆయనలోనుండి జీవాత్మ జ్యోతిరూపంలో వెలువడి పరమాత్మలో లీనమైంది! రాజశేఖరుడికి మోక్షప్రాప్తి లభించింది! అంటూ చెప్పటం ఆపారు సూతమహర్షి!
‘‘మహర్షి! మీ నోట అయ్యప్పస్వామి దివ్యచరితాన్ని విని ధన్యులమైనాము! దుష్టశిక్షణ, శిష్టరక్షణ అవతార లక్ష్యాలుగా హరిహర పుత్రునిగా జన్మించిన మణికంఠుడు అయ్యప్పస్వామిగా శబరిగిరిమీద వెలసి భక్తులను అనుగ్రహిస్తున్న దివ్యచరితాన్ని ఎన్నిసార్లు విన్నా తనివితీరదినిపిస్తున్నది!
శబరిగిరి దివ్యక్షేత్రాన్ని దర్శించడానికి ఆచరించవలసిన దీక్షా విధులగూర్చి గూడా వివరించవలసిందిగా ప్రార్థిస్తున్నాము అంటూ అందరూ ముక్తకంఠాలతో ప్రార్థించారు.

- డా. టి. కళ్యాణీసచ్చిదానందం