క్రీడాభూమి

క్షణక్షణం ఉత్కంఠ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బర్మింగ్‌హామ్, జూన్ 3: ‘మినీ ప్రపంచ కప్’ చాంపియన్స్ ట్రోఫీలో భారత్ టైటిల్‌ను నిలబెట్టుకుంటుందా? లేదా? అనే విషయం కంటే ఆదివారం పాకిస్తాన్‌తో జరిగే గ్రూప్ మ్యాచ్‌లో గెలుస్తుందా? లేదా? అనే ప్రశే్న అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాక్ క్రికెట్ జట్లు ఎక్కడ తలపడినా అభిమానుల దృష్టి అక్కడే కేంద్రీకృతమవుతుంది. క్రికెట్ మైదానం ఒక యుద్ధ్భూమిగా మారితే, స్టాండ్స్‌లో ఇరు దేశాల అభిమానులు ఏ క్షణంలోనైనా పరస్పరం తలపడే పరిస్థితి నెలకొంటుంది. ఇక వరల్డ్ కప్ లేదా చాంపియన్స్ ట్రోఫీ వంటి ప్రతిష్ఠాత్మక టోర్నీల్లో ఈ రెండు జట్లు తలపడితే ఎలాంటి వాతావరణం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఈ హై ఓల్టేజీ మ్యాచ్‌ని తిలకించడానికి స్టేడియంలో ప్రేక్షకులతోపాటు, ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది అభిమానులు ప్రతి క్షణం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూడడం సహజం. జయాపజయాలు ఎలావున్నా, ఒక గొప్ప పోరాటాన్ని తిలకించే అవకాశం లభిస్తుంది. రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గున మండుతున్న పరిస్థితుల్లో ఆదివారం నాటి మ్యాచ్‌కి ప్రాధాన్యం మరింత పెరిగింది. ఎవరు అవునన్నా, కాదన్నా, రెండు దేశాల మధ్య సామాజిక, రాజకీయ ఉద్రిక్తతల ప్రభావం ఈ మ్యాచ్‌పై తప్పక ఉంటుంది. ఇరు జట్ల మధ్య చిరకాలంగా ఆధిపత్య పోరాటం కొనసాగుతున్నది. సరిహద్దుల్లో ఉగ్రవాద దాడులను ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ అంతటితో ఆగకుండా, పదేపదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నది. ఈ ఉద్రిక్త పరిస్థితుల్లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌ని భారత్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడం ఖాయం. ఈ పోరులో గెలిస్తే, ఆతర్వాత ఫలితాలు ఎలావున్నా సమస్య లేదన్న అభిప్రాయం చాలా మంది భారత అభిమానుల్లో ఉంది. అన్ని మ్యాచ్‌ల మాదిరిగానే ఇది కూడా ఒక సాధారణ మ్యాచ్ అనీ, దీనికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదని భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, పాకిస్తాన్ కెప్టెన్ సర్ఫ్‌రాజ్ ఖాన్ వ్యాఖ్యానిస్తున్నప్పటికీ, ఇద్దరూ దీనిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారన్నది వాస్తవం. అందుకే ఆదివారం నాటి పోరు చాంపియన్స్ ట్రోఫీకే హైలైట్ కానుంది. రెండు దేశాల క్రికెట్ అభిమానులకు ఇక రకంగా ఇదే ఫైనల్.
బ్యాటింగే భారత్ బలం
ప్రపంచ మేటి ఫాస్ట్ బౌలర్లలో ఒకడైన మహమ్మద్ అమీర్, సూపర్ బ్యాట్స్‌మన్‌గా ఎదిగిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ మధ్య జరిగే సంకుల సమరం సహజంగానే అభిమానులను ఆకట్టుకుంటుంది. కోహ్లీ, శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, యువరాజ్ సింగ్, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తదితరులతో భారత్ బ్యాటింగ్ ఆర్డర్ బలంగా ఉంటే, మహమ్మద్ అమీర్, అతనితో పోటీపడగల జునైద్ ఖాన్ వంటి సమర్థులతో పాకిస్తాన్ బౌలింగ్ విభాగం పటిష్టంగా ఉంది. అయితే, బ్యాటింగ్ బలంపైనే ఆధారపడి భారత జట్టు బరిలోకి దిగనుంది. ఇంగ్లాండ్‌లో పిచ్‌లు బ్యాటింగ్‌కు సహకరిస్తాయని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కానీ, పిచ్ స్వభావంతో సబంధం లేకుండా, వైవిధ్యభరితమైన బంతులతో బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేసే శక్తి మహమ్మద్ అమీర్, జునైద్ ఖాన్, మహమ్మద్ హఫీజ్ వంటి బౌలర్లకు ఉంది. అదే విధంగా భారత బౌలింగ్ విభాగానికి వస్తే జస్‌ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్ స్ట్రయిక్ బౌలర్లుగా బరిలోకి దిగనున్నారు. ఉమేష్ యాదవ్, మహమ్మద్ షమీ కూడా బంతిని స్వింగ్ చేయగల సమర్థులే. పాకిస్తాన్ బ్యాట్స్‌మెన్‌లో ఎక్కువ మంది కుడిచేతి వాటం వారే కావడంతో, తుది జట్టులో స్థానం సంపాదించే అవకాశాలు రవీంద్ర జడేజా కంటే రవిచంద్రన్ అశ్విన్‌కే అధికంగా ఉన్నాయి.
ఆటపైనే దృష్టి!
ఒకసారి మైదానంలోకి దిగిన తర్వాత ఆఫ్ ఫీల్డ్ వివాదాలు కనుమరుగై జట్టులోని ఆటగాళ్లంతా సమష్టిగా పోరాటం సాగిస్తారని టీమిండియా విషయంలో అనేక సందర్భాల్లో రుజువైంది. ఇతరత్రా విషయాలను పట్టించుకోబోమని, తమ దృష్టి మొత్తం ఆటపైనే కేంద్రీకృతమైందని కోహ్లీ బృందం ఇప్పటికే ప్రకటించింది. కోచ్ అనిల్ కుంబ్లే, కెప్టెన్ కోహ్లీ మధ్య తలెత్తిన వివాదం కూడా ఆటపై ఎలాంటి ప్రభావం చూపబోదన్న వాదన ఉంది. ఇలావుంటే, అంతర్గత విభేదాలు టీమిండియాకు మాత్రమే పరిమితం కాదు. ఈ విషయంలో అన్ని జట్ల కంటే పాకిస్తాన్ ముందుంటుంది. ఆధిపత్య పోరాటం ఆ జట్టులోనే ఎక్కువ. ఆటగాళ్లు బహిరంగంగా దూషించుకోవడం, విమర్శించుకోవడం కొత్తేమీ కాదు. ఫిట్నెస్ ఆశించిన స్థాయిలో లేదంటూ ఉమర్ అక్మల్‌ను జట్టు మేనేజ్‌మెంట్ స్వదేశానికి తిప్పిపంపింది. అయితే, కెప్టెన్ సర్ఫ్‌రాజ్ ఖాన్, కోచ్ మికీ ఆర్థర్‌తో అతనికి సరిపడడం లేదని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని కొంత మంది వాదిస్తున్నారు. అయితే, పాక్ మేనేజ్‌మెంట్ సైతం విభేదాలు లేవని ప్రకటించింది. ఆటగాళ్లంతా మ్యాచ్‌లకు సిద్ధంగా ఉన్నారని పేర్కొంది.
పాక్ ఆధిపత్యం!
చాంపియన్స్ ట్రోఫీలో భారత్, పాకిస్తాన్ జట్లు ఇప్పటి వరకూ మూడు మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. వీటిలో రెండింటిని సొంతం చేసుకున్న పాక్ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నది. గణాంకాలు టీమిండియాను బలహీనమైన జట్టుగా చూపుతున్నప్పటికీ, ప్రస్తుత పాక్ జట్టుతో పోలిస్తే కోహ్లీ బృందం బలమైన స్థితిలో ఉందనేది వాస్తవం. పాక్ కంటే భారత జట్టులోనే అనుభవం, నైపుణ్యం గల ఆటగాళ్లు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. 2013లో చాంపియన్స్ ట్రోఫీని భారత్ గెల్చుకోవడంలో కీలక పాత్ర పోషించిన శిఖర్ ధావన్ మరోసారి తన సత్తా చాటాల్సిన అవసరం ఉంది. అతనితో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశం ఉన్న రోహిత్ శర్మ ఆరు నెలల తర్వాత మొదటి అంతర్జాతీయ మ్యాచ్‌ని ఆడనున్నాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకున్న అతను ఫామ్‌లో ఉంటే, పాకిస్తాన్ బౌలర్లకు సమస్యలు తప్పవు. కాగా, పాక్ బ్యాటింగ్ ఎక్కువగా అజర్ అలీ, మహమ్మద్ షెజాద్ ప్రతిభపై ఆధారపడింది. ఫస్ట్‌డౌన్‌లో స్టీవెన్ స్మిత్, కేన్ విలియమ్‌సన్, జో రూట్ వంటి సమర్థులతో సమాన స్థానంలో కోహ్లీ రాణిస్తున్నాడు. పాక్ ఫస్ట్‌డౌన్ బ్యాట్స్‌మన్ బాబర్ ఆజమ్ సగటు 45 పరుగులుగా ఉన్నప్పటికీ అతనిని కోహ్లీతో పోల్చడానికి వీల్లేదు. సీనియర్లు యువరాజ్ సింగ్, ధోనీ భారత జట్టులో ఉంటే, వారితో సరితూగగల మహమ్మద్ హఫీజ్, సర్ఫ్‌రాజ్ ఖాన్ పాక్‌కు అండగా నిలుస్తున్నారు. జ్వరం కారణంగా వామప్ మ్యాచ్‌లో ఆడలేకపోయిన యువీ ఫిట్నెస్‌పై ఇంకా ఎలాంటి స్పష్టత రావడం లేదు. ఒకవేళ అతను లేకపోతే, ఆ స్థానాన్ని దినేష్ కార్తీక్ భర్తీ చేసే అవకాశం ఉంది. మొత్తం మీద బ్యాటింగ్‌లో భారత్ ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంటే, బౌలింగ్‌లో పాక్ కొంత మెరుగ్గా ఉంది. మహమ్మద్ అమీర్‌తోపాటు జునైద్ ఖాన్, వాహబ్ రియాజ్, ఆల్‌రౌండర్ మహమ్మద్ హఫీజ్ ప్రదర్శనను బట్టి ఆదివారం నాటి మ్యాచ్ ఫలితం ఆధారపడుతుంది.

* టీమిండియాలో లుకలుకలు బయటపడిన నేపథ్యంలో, పాకిస్తాన్‌తో ఆదివారం జరిగే మ్యాచ్‌పై దాని ప్రభావం ఎలా ఉంటుందనే ఆందోళన అభిమానులను వేధిస్తున్నది. కోచ్ అనీల్ కుంబ్లే, కెప్టెన్ విరాట్ కోహ్లీ మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ కారణంగానే కుంబ్లే కాంట్రాక్టును బిసిసిఐ కొనసాగించడం లేదని సమాచారం. కొత్త కోచ్ నియామకానికి దరఖాస్తులను ఆహ్వానించడంతో, కుంబ్లే దరఖాస్తు చేసుకున్నప్పటికీ, అతనికి అవకాశం దక్కుతుందా లేక మరెవరికైనా పగ్గాలు దక్కుతాయా అనేది ఆసక్తి రేపుతున్నది. అంతేగాక, చాంపియన్స్ ట్రోఫీ ముగిసే వరకూ కుంబ్లే జట్టుతోనే ఉండడని, అతను ఇప్పటికే రాజీనామా చేశాడని కూడా వార్తలు వస్తున్నాయి. ఒకవేళ కుంబ్లే వైదొలగితే, వెంటనే అతని స్థానాన్ని మాజీ ఓపెనర్ వీరేందర్ సెవాగ్ భర్తీ చేస్తాడన్న వాదన కూడా ఉంది. మొత్తం మీద కుంబ్లేను ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి నెట్టిన కోహ్లీ తనను తాను నిరూపించుకుంటాడా లేదా అన్న ప్రశ్న కూడా తెరపైకి వచ్చింది. పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లో భారత్ గెలిస్తే కోహ్లీ పరువు నిలుస్తుంది. లేకపోతే, అతిగా ప్రవర్తించి జట్టుకు అన్యాయం చేశాడనే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏ రకంగా చూసినా కోహ్లీకి ఇది అగ్ని పరీక్షే.

వామప్ మ్యాచ్‌లో
భారత అభిమానుల హడావుడి

భారత కాలమానం ప్రకారం మ్యాచ్ ఆదివారం సాయంత్రం 3 గంటలకు మొదలవుతుంది