మెయన్ ఫీచర్

రైతన్నకు కుడిఎడమల దగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన రాజకీయ నాయకులు ప్రజలకన్నా, వ్యక్తిగతానే్న నమ్ముకున్నారు కాబట్టి- ఒకరు ‘మన్‌కీ బాత్’ అంటే, మరొకరు ‘సర్వేలే సర్వాంతర్యామి’ అంటారు. ఇంకొకరు రాజధాని నిర్మాణమే ‘సర్వరోగ నివారిణి’ అంటారు. ఈ నేతలు అయిదేళ్ల పాలన అప్పుడే ముగిసినట్లు, ఇక మిగిలింది ఎన్నికల సీజన్ అని ప్రజలను భ్రమింపచేస్తున్నారు. మూడేళ్ల పాలనను మూడు దశాబ్దాల పాలనలా మురిపిస్తున్నారు. గతంలో లేని విధంగా ఎన్నికల జ్వరం రాజకీయ పార్టీలను వెంటాడుతుంటే సుపరిపాలన ఎండమావిగా మారింది. గతంలో ఏ ప్రభుత్వం ఇలాంటి ఘన కార్యాల్ని చేయలేదంటూ ‘గోబెల్స్’ను మించిన ప్రచారాన్ని చేసుకుంటున్నారు. జనం చెవుల్లో పూలు పెట్టడమే కాదు, కళ్ళు బైర్లుకమ్మే ప్రకటనల్ని గుప్పిస్తున్నారు. రైతులకు ఒనగూరుతున్న ప్రయోజనాల్ని చూస్తే మన ప్రభుత్వాలు ఎవరి పక్షమో తెలుస్తుంది.
* * *
అది మహారాష్టల్రోని మరట్వాడా ప్రాంతంలోని ఉస్మానాబాద్ జిల్లా సుంబహ గ్రామం. కల్యాణ మోతె అనే రైతు తన పదెకరాల మెట్ట భూమిలో కంది పంట వేసాడు. అధిక దిగుబడి రావడంతో దాదాపు 40 క్వింటాళ్ల కందులు కల్లంలోనే వుండిపోయాయి. 34 కి.మీ దూరంలో వున్న కందుల కొనుగోలు కేంద్రానికి అతను రోజూ వెళుతున్నా, సంచులు లేవని, నిల్వ చేయడానికి గోదాములు లేవని కొనని స్థితి. ఇదే పరిస్థితి విదర్భ ప్రాంత రైతులది. మహారాష్టల్రో 80 శాతం కందిపంట ఈ రెండు ప్రాంతాల్లోనే సాగవుతుంది. గతంలో 4 లక్షల మెట్రిక్ టన్నులు పండగా ఈసారి 20 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది. దిగుబడి భారీగా పెరగడంతో మరో 100 కొనుగోలు కేంద్రాలను మార్కెటింగ్ శాఖ ఏర్పాటుచేసినా ఇప్పటివరకు 5 లక్షల మెట్రిక్ టన్నుల కందులు మాత్రమే కొనుగోలు చేశారు. గత ఏడాది క్వింటాలుకు రూ.10వేలు ధర పలకడంతో, రైతులు అధికంగా కంది పంట వేయడం, దిగుబడి పెరగడంతో ఈసారి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ.5,050 కావడం గమనార్హం. అప్పులు తీర్చడానికి, రోజువారీ కుటుంబ ఖర్చులకు పంటను అమ్మడం అనివార్యంగా భావించి దళారులు ఇస్తున్న రూ.3,500-5,400 అమ్ముకోవాల్సి వస్తోంది.
ఇక తెలంగాణ విషయానికొస్తే- దేశం మొత్తంలో పండే పసుపులో ఆర్మూర్, జగిత్యాల, నిర్మల్ ప్రాంత రైతులు 30 శాతాన్ని పండిస్తారు. మేలురకం పసుపు పండే ఈ ప్రాంతంలో ‘పసుపు బోర్డు’ను ఏర్పాటుచేయాలని దశాబ్దాలుగా రైతులు కోరుతున్నా ఫలితం లేదు. పసుపు బోర్డు ఏర్పాటైతే కొన్ని రాయితీలతోపాటు, కనీస మద్దతు ధర వుంటుందనేది రైతుల ఆశ. తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు సాధ్యం కాదంటూ, సుగంధ ద్రవ్యాల పార్కుతో సరిపెట్టుకోవాలని కేంద్రం సెలవిచ్చింది. కేరళ, పశ్చిమ కనుమల్లో పండే సుగంధ ద్రవ్యాలకు వర్తించే పార్కు- ఆహార ధాన్యాలు, పసుపు పండే ప్రాంతానికి ఎలా వర్తిస్తుందో అర్థం కాదు. కేవలం నిజామాబాద్ జిల్లాలోని 8 మండలాల్లో 25వేల ఎకరాల్లో పసుపు పండిస్తారు. కంది పంట లానే ఈసారి పసుపుపంటలో అధిక దిగుబడి కావడంతో, గత ఏడాది క్వింటాలుకు రూ.10వేలు ధర పలకగా, ఈసారి అమాంతం రూ.3వేల నుంచి 4వేలకు పడిపోయింది. ఈ విపత్కర పరిస్థితిలోనే దాసరి చిన గంగారాం (65) అనే రైతు నిజామాబాద్ మార్కెట్ యార్డ్‌లో తాను తెచ్చిన పసుపు కుప్పపైనే ప్రాణాలు వదిలాడు.
ఇక వరి ధాన్యానిది మరో కథ. గత కొనే్నళ్లుగా వరి దిగుబడి అనూహ్యంగా పెరిగింది. వెయ్యి పది రకం (దొడ్డు) వరితోపాటు, బిపిటి లాంటి సన్న రకం వరి ధాన్యాన్ని తెలంగాణలో రైతులు పండిస్తారు. దొడ్డు ధాన్యానికి మద్దతు ధర ప్రకటించిన ప్రభుత్వం సన్న ధాన్యాన్ని పట్టించుకోకపోవడంతో, కొనుగోళ్లు లేక సన్న ధాన్యం కల్లాల్లోనే వారాల తరబడి వుండిపోయింది. మధ్యాహ్న భోజన పథకంతో పాటు అంగన్‌వాడీలకు, సంక్షేమ హాస్టళ్ళకు సన్న బియ్యాన్ని సరఫరా చేస్తున్నామని చెపుతున్న ప్రభుత్వం సన్న ధాన్యాన్ని కొనకపోవడంతో, దొడ్డు ధాన్యం ధరకన్నా తక్కువ ధరకే రైతులు విధిలేక దళారులకు అమ్ముకోవాల్సి వచ్చింది. ఈసారి రబీలో సాగు చేసిన 22 లక్షల ఎకరాల్లో 60 లక్షల మెట్రిక్ టన్నులు పండినా వరి ధాన్యం రైతుకు సంతోషానికన్నా దిగులునే మిగిల్చింది. 3వేల కొనుగోలు కేంద్రాల్ని ఏర్పాటు చేసినా, ఎక్కడి రాశులు అక్కడనే దర్శనమిస్తున్నాయి. అప్పుల పాలైన రైతుల్లో కొందరు ఆత్మహత్యలే శరణ్యంగా భావిస్తున్నారు. తాజాగా మిర్చి రైతు కథ తెలిసిందే. గతంలో పత్తి పంటతో అనేకమంది ప్రాణాలు తీసుకోగా, పత్తికి బదులు మిర్చి వేయాలనే ప్రచారం వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే మొదలైంది. గత ఏడాది క్వింటాల్ మిర్చి ధర రూ.12వేలుగా వుండడంతో, పాత నష్టాన్ని పూడ్చుకోవాలనే ఉద్దేశంతో 2015-16లో 61వేల హెక్టార్లలో పండిస్తే ఈసారి లక్షా 12వేల హెక్టార్లలో మిర్చి వేశారు. గత సంవత్సరం రెండు లక్షల ఏడు మెట్రిక్ టన్నులకు దిగుబడి పెరిగింది. కనీస మద్దతు ధర లేకపోవడంతో వ్యాపారస్తులంతా ‘సిండికేటు’గా మారి అమాంతంగా ధరని తగ్గించి, క్వింటాలుకు రూ.ఏడు వందలే చెల్లించడం గమనార్హం. చాంబర్ ఆఫ్ కామర్స్‌కు చెందిన దాదాపు 95 శాతం వ్యాపారస్తులంతా పాలకపక్ష పార్టీలో చేరి, ఉదయం పాడే మొదటి పాట (వేలం)లో తక్కువ రాశి వున్న మేలు రకం మిర్చికి (తేజ) అధిక ధరకు వేలం పాడి, మిగతావాటికి సగానికి సగం తగ్గించి పాట పాడడం ఖమ్మం మార్కెట్ యార్డ్‌లో సర్వసాధారణమని రైతులు చెపుతుంటారు. విధిలేక రైతులు అమ్ముకోవడం జరుగుతోంది. దీన్ని గుర్తించిన రైతులు గత ఏప్రిల్ 27న మార్కెట్ యార్డ్ కార్యాలయంపై దాడి చేయడం, పది మంది రైతుల్ని అరెస్టుచేయడం, వారికి బేడీలు వేసి కోర్టుకు వడం తెలిసిందే.
అమాంతంగా పడిపోయిన ధరకు అమ్మడం కన్నా, తగలబెట్టడం మంచిదని వేలాది క్వింటాళ్ళ మిర్చిని రైతులు తగలబెట్టడం మనం చూసిందే! ఈ సంధి కాలంలో కేంద్రం స్పందించి, కనీస మద్దతు ధరను రూ.5వేలుగా ప్రకటిస్తూ, మరో రూ.1250 ఖర్చుల కింద ఇవ్వడానికి నిర్ణయించింది. పండిన పంటలో 85 శాతం తక్కువ ధరకే అమ్మడం, ప్రకటించిన మద్దతు ధర కూడా ఇప్పుడు కొనేదానికేనని, అది కూడా తెలంగాణలో 33,700 మెట్రిక్ టన్నులేనని, ఏపిలో 88,300 మెట్రిక్ టన్నులేనని ప్రకటించడంతో మిర్చి పంట రాజకీయంగా మరింత ఎరుపెక్కింది. ఇక ఏపి సిఎం చంద్రబాబు క్వింటాలుకు రూ.1500లను బోనస్‌గా ప్రకటించినా కొనుగోలు చేసింది అతి స్వల్పమే! గుంటూరు మిర్చి యార్డులో టన్నులకొద్దీ మిర్చి కొనుగోళ్లు లేక పడి వుంది. ఒక్క ఖమ్మం మార్కెట్‌లోనే పేరుమోసిన దాదాపు 30 మంది ట్రేడర్లు మిర్చిపై సాలీనా రూ.10-15 కోట్లు సంపాదిస్తున్నారనేది ఆరోపణ.
ఇక టమాటా రైతులకూ విషాదమే. ఎకరాకు రూ.15-20 వేలు పెట్టబడి పెట్టి పండిస్తే 23 కిలోల బాక్సు ధర ఒక్కోసారి రూ.50 కూడా పలకని వైనం. ఇలాంటి సందర్భాలలోనే రోడ్లపై టమాటాలను కుమ్మరించడం చూస్తూనే వున్నాం. ప్రభుత్వ విధానాలు, దళార్ల మోసాలతో రైతులు నష్టాల పాలవుతున్నారు. కూరగాయల రైతులు కూడా దోపిడీకి గురవుతూ సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాతావరణ, ఫసల్‌బీమా పథకాలు ఎలా వున్నాయో అనంతపురం జిల్లాను చూస్తే తెలుస్తుంది. గత ఏడాది మేలో ఫసల్‌బీమా పథకాన్ని, అంతకుముందు వాతావరణ బీమా పథకాన్ని ప్రధానమంత్రి మోదీ ప్రవేశపెట్టారు. ఫసల్ బీమాకై రైతులు ఖరీఫ్‌లో 2శాతం, రబీలో 1.5 శాతం ప్రీమియంగా చెల్లించాలని నిబంధనల్ని విధించారు. ఇలా చెల్లించిన రైతులకు హెక్టారు వరి పంటకు రూ.33,750, జొన్నకు రూ.20వేలు, శనగకు రూ.21,250, వేరుశనగకు రూ.45వేలు, పొద్దుతిరుగుడుకు రూ.25వేలు ఇవ్వాలని ఒప్పందం జరిగినా ఇప్పటికీ బీమా మొత్తాలను చెల్లించని వైనం. గత ఏడాది వర్షాభావంతో అనంతపురం జిల్లాలో వేరుశనగ పంటపై నష్టం రూ.1875 కోట్లుగా గుర్తించి, రూ.1075 కోట్లు ఇవ్వాలని కేంద్ర కరువు పరిశీలక బృందానికి నివేదిక పంపిస్తే వాతావరణ బీమా కింద నిధులు విడుదల కాలేదు. రూ.1032కోట్లను మంజూరు చేస్తానని ఏపి సిఎం ఇచ్చిన హామీ నెరవేర లేదు. గత సంవత్సరం వాతావరణ బీమా కింద 5లక్షల 22వేల మంది రైతులు చెల్లించిన ప్రీమియం రూ.48కోట్లు కాగా, గత జనవరిలో విడుదల చేస్తామన్న బీమా డబ్బు రూ.367 కోట్లు ఇప్పటికీ చెల్లించలేదు. ప్రభుత్వాల్లో స్పందన లేదు. ల్యాబ్ నుంచి ల్యాండ్ దాగా, చుక్క నీటితో ఎక్కువ సేద్యం అంటూ ఫసల్‌బీమా పథకం దేశవ్యాప్తంగా 7 రెట్లు పెరిగిందంటూ మే 19న మోదీ ప్రకటించారు. 2022 నాటికి రైతు ఆదాయం రెట్టింపు అవుతుందని ప్రధాని సెలవిస్తూనే వున్నాడు. ఆయన మరోసారి అధికారం చేపడితే గానీ ఆ హామీ నెరవేరదేమో! ఎనె్నన్నో ఆకర్షణీయ పథకాలకు వందలాది కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వాలు రైతులకు నిధులు విదిల్చేందుకు మాత్రం ముందుకు రావడం లేదు. మిర్చి పంటకు మద్దతు ధర విషయమై కేంద్రాన్ని విమర్శిస్తున్న తెలంగాణ సిఎం కేసిఆర్ ఒక్క రూపాయి బోనస్‌ను ప్రకటించలేదు. విపక్షాలు ఏమన్నా అంటే- అడక్కుండానే సాలుకు రూ.8000 చొప్పున రెండు దఫాలుగా ఎరువులకు, ఇతర ఖర్చులకు ఇస్తున్నానని ఆయన అనవచ్చు. ఈ మొత్తం ఎవరికి అందుతుందో, ఎంతమందికి అందుతుందో భవిష్యత్తులో తేలుతుంది.
పాలకుల తీరు ఇలావుంటే, ప్రతిపక్షం ఏమైనా తక్కువ తిందా? తాము అధికారంలోకి వస్తే క్వింటాలు మిర్చికి రూ.12వేలు ఇస్తామంటూ, లక్ష మందికి నిరుద్యోగ భృతిగా నెలకు మూడువేలు, రైతు రుణమాఫీని రెండు లక్షలకు పెంచుతామంటూ కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ రాక సందర్భంగా టి.పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హామీలిచ్చారు. ఇంకా నయం.. కేసిఆర్ గత మూడేళ్లలో 365 పథకాల్ని ప్రకటిస్తే తాము రోజుకో పథకాన్ని ప్రకటిస్తామని కాంగ్రెస్ నేతలు సెలివివ్వలేదు. మోదీ మొదలుపెట్టిన 80 పథకాలను రద్దుచేసి, కొత్తగా వంద పథకాల్ని చేపడతామని కాంగ్రెస్ నేతలు చెప్పనందుకు సంతోషిద్దాం! అన్ని పార్టీల నాయకులూ రైతులను ఆదుకోవడమే తమ కర్తవ్యమని అంటున్నా- వ్యవసాయ రంగం నానాటికీ సంక్షోభంలో కూరుకుపోతోంది. *

- డా. జి.లచ్చయ్య సెల్: 94401 16162