అంతర్జాతీయం

లండన్‌లో మళ్లీ ఉగ్ర కలకలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూన్ 4: బ్రిటన్ రాజధాని లండన్ మహానగరం మరోసారి ఉగ్రదాడులతో రక్తసిక్తమయింది. స్థానిక కాలమానం ప్రకారం శనివారం రాత్రి పది గంటల సమయంలో అత్యంత వేగంగా వచ్చిన ఒక తెల్లవ్యాన్ ప్రఖ్యాత లండన్ బ్రిడ్జిపై పాదచారులపైకి దూసుకెళ్లింది. కొద్ది దూరం వెళ్లి వ్యాన్ ఆగిపోవడంతో వ్యాన్‌లోంచి దిగిన ముగ్గురు దుండగులు కత్తులతో దగ్గర్లోనే ఉన్న బోరో మార్కెట్ ప్రాంతంలోకి చొరబడి అక్కడి బార్లు, రెస్టారెంట్ల వద్ద ఉన్న జనంపై దాడి చేసి కనిపించిన వారిని కనిపించినట్లుగా దారుణంగా పొడిచారు. ఈ దాడుల్లో మొత్తం ఏడుగురు చనిపోగా, మరో 48 మంది కత్తిపోట్లతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని మెట్రోపాలిటన్ పోలీసులు తెలిపారు. దాడి చేసిన వారిపై ఆపరేషన్ నిర్వహించిన పోలీసులు తొలి పోన్‌కాల్ అందిన ఎనిమిది నిమిషాల్లోనే ముగ్గురు దుండగులనూ కాల్చి చంపారు. వ్యాన్‌ను పాదచారులపైకి వేగంగా నడపడంతో ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారని, ఆ తర్వాత దుండగులు ‘అల్లా కోసం...’ అని అరుస్తూ కనిపించిన వారినల్లా కత్తులతో గొంతులు కోశారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సాయుధ అధికారులు వేగంగా, ధైర్యంగా స్పందించారని, తొలి ఫోన్‌కాల్ అందిన ఎనిమిది నిమిషాల్లోనే ముగ్గురు దుండగులను బోరో మార్కెట్లో కాల్చి చంపారని మెట్రోపాలిటన్ పోలీస్ అసిస్టెంట్ కమిషనర్ మార్క్ రౌలే చెప్పారు. దుండగులు పేలుడు పదార్థాలను పోలిన వాటితో కూడిన జాకెట్లను ధరించి ఉన్నారని, అయితే అవి నకిలీవని ఆ తర్వాత నిర్ధారణ అయిందని ఆయన చెప్పారు. ఈ దాడులను తాము ఉగ్రవాద సంఘటనగానే పరిగణిస్తున్నామని మెట్రోపాలిటన్ పోలీసుకు చెందిన ఉగ్రవాద నిరోధక కమాండ్ నేతృత్వంలో పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగుతోందని ఆయన చెప్పారు. కాగా, ఈ దాడికి తామే బాధ్యులమని ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థా ప్రకటించుకోలేదు. చనిపోయిన వారిలో ఒక బ్రిటీష్ ట్రాన్స్‌పోర్ట్ పోలీసు, ఒక జర్నలిస్టు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దాడి జరిగిన తర్వాత పోలీసులు లండన్ బ్రిడ్జిని రాకపోకలకు మూసివేశారు. గత నెల 22న మాంచెస్టర్‌లో సంగీత కచేరి జరుగుతున్న స్టేడియం వద్ద ఆత్మాహుతి దాడి జరిగి రెండు వారాలు కూడా గడవక ముందే మరో దాడి జరగడంతో బ్రిటన్ ప్రజలు భయంతో వణికి పోతున్నారు.
ఇదిలా ఉండగా, మృతులకు సంతాప సూచకంగా డౌనింగ్ స్ట్రీట్‌లో జాతీయ పతాకాన్ని అవనతం చేశారు. మరోవైపు లండన్ మేయర్ సాదిక్ కాన్ ఈ దాడులను పిరికిపందల చర్యగా అభివర్ణించారు. కాగా, దాడుల్లో ఎవరైనా భారీయులు చిక్కుకుని ఉంటే వారి సమాచారం కోసం లండన్‌లోని భారత హైకమిషనర్ కార్యాలయం ఒక పబ్లిక్ రెస్పాన్స్ యూనిట్‌ను ఏర్పాటు చేసింది. ఆదివారం ఎన్నికల ప్రచారాన్ని ఆపి వేస్తున్నట్లు అధికార కన్సర్వేటివ్ పార్టీ ప్రకటించింది.