మెయన్ ఫీచర్

కలాలు,గళాలను బతకనివ్వరా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సామాజిక మీడియాపై కొందరు నేతలకు, ప్రభుత్వ వర్గాలకు ఎందుకంత అక్కసు! స్వేచ్ఛగా జీవించే హక్కు ఉన్నట్టే స్వే చ్ఛగా ఆలోచించే హక్కు కూడా ప్రజలకు ఉంది. అది అనాదిగాను ఉంది, దాన్ని రాజ్యాంగమూ ఇచ్చింది. కానీ, ప్రజలకున్న ఆ ప్రాథమిక హక్కుకు కత్తెర వేసేవారు ఇటీవల ఎక్కువైపోతున్నారు. అలా కత్తెర వేయడమేమిటని ప్రశ్నించే వారిని అణగదొక్కే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రభువులకో నీతి, ప్రజలకో నీతి ఎ లా ఉంటుంది?
ప్రింట్ మీడియాలోగానీ, ఎలక్ట్రానిక్ మీడియాలోగానీ, ఇప్పుడు అత్యంత వేగంగా విస్తరిస్తున్న సోషల్ మీడియాలోగానీ- సమాచారాన్ని ప్రజలకు త్వరగా చేరవేయడమే వాటి లక్ష్యం. మారుతున్న పెట్టుబడిదారీ విధానాలు, ప్రపంచీకరణ ఫలితంగా సోషల్ నెట్‌వర్క్ అనూహ్యంగా విస్తరించడంతో మాధ్యమాల సంఖ్య పెరుగుతోంది. వాటి ప్రభావం అధికమవుతోంది. మీడియా స్వరూప స్వభావాలు కూడా కాలానుగుణంగా కొత్త రంగు, రుచిని ఆపాదించుకుంటున్నాయి. సాంకేతిక ప్రగతితో పాటు సౌకర్యాలు విస్తరించడంతో సోషల్ మీడియా ఇప్పుడు అతి వేగంగా అభివృద్ధి చెందుతోంది. పత్రికలు, టీవీ చానళ్లలో కంటే కొద్ది సెకన్లలోనే ‘్ఫ్లష్ న్యూస్’ సోషల్ మీడియాలో ‘వైరల్’ అవుతోంది. బహుశా అందుకేనేమో.. అందరిలోను అంత గుబులు! అనుచిత వ్యవహారాలు నడిపే నేతలకు అంత దిగులు!
రాజకీయ నాయకులో లేక సమాజంలో పెద్ద మనుషులుగా చె లామణి అవుతున్నవారో- తాము అనుచితంగా వ్యవహరిస్తే లేని తప్పు అది మీడియాలో ప్రజలకు చేరినప్పుడు తప్పెలా అవుతుంది? అలా చేర్చే వారిని శత్రువులుగా భావించడం ఒప్పెలా అవుతుంది? మీడియాపై ప్రజలకు చాలా నమ్మకం ఉంటుంది. సమాజంలో ఎప్పుడు ఏం జరుగుతోందో తెలుసుకోవాలనే తహతహ వారిలో ఎప్పుడూ ఉంటుంది. అందుకే ఇన్ని రకాల మాధ్యమాలు ప్రజల ముందు ప్రత్యక్షమవుతున్నాయి. వాటిని ఆహ్వానించడానికి బదులు ఆ మీడియాను, వాటి నిర్వాహకులను కబళించడానికి ప్రయత్నిస్తే అది ప్రజాస్వామ్యామెలా అవుతుంది! మనం నియంతల కాలంలో లేము కదా! కానీ, ఆ నియంతల వారసులు ఎక్కువవుతున్నందున స్వేచ్చా గళాలకు, కలాలకు సంకెళ్లు పడుతున్నాయి. ఈ అణచివేత ఏ రూపంలో ఉన్నా నిరసించవలసిందే! కానీ, ఆ నిరసనను వ్యక్తం చేయనీయకుండా, తమ భావాలను పరులతో పంచుకోనీయకుండా నాయకులు వ్యవహరించడం సిగ్గుచేటు.
ప్రజాప్రతినిధులుగా చట్టసభల్లోకి అడుగుపెడుతున్న కొందరు సభ్యతను మరిచిపోయి, ‘నువ్వు శుంఠవు అంటే నువ్వు శుంఠవు..’ అని నిందించుకోవడమే కాక పరస్పరం భౌతిక దాడులకు కూడా సిద్ధమవుతున్నారు. చట్టసభల దిగజారుడు తనానికి నిదర్శనాలు కోకొల్లలు. గతంలో తమిళ అసెంబ్లీలో జరిగిన దుశ్శాసన పర్వాన్ని ఎవరు మరిచిపోగలరు! అప్పటి ప్రతిపక్ష నాయకురాలు జయలలితను చీరలాగి అవమానించిన డిఎంకే నేతల తీరును మీడియా ద్వారా తెలుసుకున్న వారెవరైనా మరవగలరా! ఇక, ప్రజాసమస్యలను వదిలేసి, పరస్పర ఆరోపణలతో చట్టసభలను ఎంత రచ్చరచ్చ చేయడం లే దు? ఇందుకు ఏ రాష్ట్ర చట్టసభా మినహాయింపు కాదు. ఏపి నుండి యుపి దాకా, ఒడిశా, బిహార్, గుజరాత్ ఇలా దాదాపు అన్ని చట్టసభలు, వాటి ‘గౌరవనీయ సభ్యులు’ ఒకే దారిలో వెడుతున్నారు. గవర్నర్ ప్రసంగిస్తుండగా తమ చేతుల్లోని పుస్తకాలను చించివేసి వాటిని ఆ ‘పెద్ద మనిషి’పై విసిరిన ఘటనలు పలుమార్లు తెలుగు చట్టసభల్లో కూడా చూశాం. ఒడిశా, బిహార్ అసెంబ్లీల్లో మైకులు విరిచి విసిరేసుకున్న ఘటనలు, సభ్యులు బాహాబాహీకి దిగిన ఉదంతాలు పలుమార్లు చూసాం. గత నెల 31న దిల్లీ అసెంబ్లీలో ఒక సభ్యునిపై మిగిలిన సభ్యులు చేసిన దాడి- సభ్యతకు నిదర్శనమా? ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన మాజీ మంత్రి కపిల్ మిశ్రాపై కొందరు సభ్యులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. సిఎం కేజ్రీవాల్, ఆరోగ్యమంత్రి సత్యేంద్ర జైన్‌లపై అవినీతి ఆరోపణలు చేయడంతో అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఆ దుశ్చర్యకు పాల్పడ్డారు. గౌరవ సభ్యులే చట్టసభల గౌరవాన్ని తుంగలో తొక్కుతున్నప్పుడు- ప్రజలు ఆ ఘటనలపై స్పందించడం, ప్రశ్నించడం అమర్యాద ఎలా అవుతుంది!
ప్రజలు అన్నివేళలా ప్రశ్నించే పరిస్థితిలో ఉండకపోవచ్చు. అందుకే ఆ బాధ్యతను మీడియా తలకెత్తుకుంటోంది. నేర చరిత్ర కలిగిన వారు, బడా వ్యాపారులు చట్టసభల్లోకి ప్రవేశించడం, మీడియా కూడా వారి చేతుల్లోనే ఉండడంతో- నిష్పక్షపాతంగా వాస్తవాలను ప్రతిబింబించే మీడియా ఇప్పుడు అవసరమైంది. అది ప్రజలకు సోషల్ మీడియా రూపంలో కనిపిస్తోంది. అందుకే నాయకగణం ఇప్పుడు సోషల్ మీడియా నోరు నొక్కేయడానికి అంతగా ప్రయత్నిస్తోంది. ఫేస్‌బుక్, వాట్సప్, లింక్‌డ్ ఇన్, ట్విట్టర్ వంటి అనేకానేక సోషల్ మీడియా సాధనాలు ప్రజలకు అంతగా చేరువయ్యాయి. దీన్ని సహించలేని నాయకగణమే ఆంక్షల కత్తులను విసురుతోంది. ఆమధ్య పంజాబ్‌లో పఠాన్‌కోట్‌పై జరిగిన ఉగ్రదాడిని ప్రసారం చేసినందుకు ఓ ప్రముఖ ఇంగ్లీష్ చానల్‌పై నిషేధం విధించారు. ఓ బిజెపి నేత ఇంట్లో హింసకు గురవుతున్న బాలుడి దయనీయ గాథను ప్రసారం చేసినందుకు ‘న్యూస్‌టైమ్స్ ఆఫ్ అస్సాం’పై వేటుపడింది. అభ్యంతరకర సమాచారాన్ని ప్రసారం చేసిందనే ఆరోపణతో ‘వరల్డ్‌కేర్ టీవీ’ చానల్‌ను ఆ మధ్య వారం పాటు నిషేధించారు. ఇటీవల నెలరోజుల పాటు జమ్ము-కశ్మీర్‌లో సోషల్ మీడియాపై నిషేధం విధించారు. ఆంధ్రప్రదేశ్‌లో కొందరు ‘వాట్సప్’ అడ్మిన్‌లను అరెస్టు చేసి నానా కష్టాలకు గురి చేశారు. ఇదంతా ప్రజాస్వామ్యమేనా? ప్రజలకు రాజ్యాంగం ఇచ్చిన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉందా? లేదా?
సోషల్ మీడియాలో వాస్తవాలు రాసే అవకాశం ఉన్నా బెదిరింపులు, దాడులు ‘స్వేచ్ఛాజీవుల’ నోళ్లు నొక్కుతున్నాయి. ఇవాళ ‘పొలిటికల్ పంచ్’ అడ్మిన్ రవికిరణ్ కావచ్చు, రేపు మరొకరు కావచ్చు. సోషల్ మీడియా నిర్వాహకులను అలా అరెస్టు చేస్తూ వెళ్తే ప్రజలందరినీ నిర్బంధంలోకి తీసుకుంటున్నట్టే కదా! ఇలా కలాలు, గళాలను నొక్కివేస్తే అరాచక సంస్కృతి నుంచి బయటపడడం ఎలా?
గతంలో ‘శివసేన’ అధినేత బాల్ థాకరే మరణానంతరం ఫేస్‌బుక్‌లో పోస్టయిన ఓ కామెంట్‌ను ‘లైక్’ చేసినందుకే రేణు శ్రీనివాసన్ అనే యువతిని పోలీసులు అరెస్టు చేశారు. థాకరే మరణానంతరం బంద్‌కు పిలుపు నివ్వడంపై ‘ఆన్‌లైన్’లో ప్రశ్నించిందని మరో యువతి షహీన్‌పై కేసు పెట్టారు. ఈ ఉదంతాలు అప్పట్లో తీవ్ర సంచలనం కలిగించడం అందరికీ తెలిసిందే. బెంగాల్ సిఎం మమతా బెనర్జీపై వ్యంగ్య కార్టూన్లు ఆన్‌లైన్‌లో ప్రచారం చేసారనే అభియోగంతో అరెస్టయిన జాదవ్‌పూర్ వర్సిటీ ప్రొఫెసర్ అభిషేక్ మహాపాత్ర గురించి మనం చూసాం.
మరి కొంచెం వెనక్కి వెళ్తే.. అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పత్రికల్లో అనేకానేక వ్యంగ్య కార్టూన్లు వచ్చాయి. ఆనాటి నేతలపై ఒక ప్రముఖ తెలుగు దినపత్రిక నిత్యం వ్యంగ్య కార్టూన్లు ప్రచురించేది. ఇంగ్లీషు దినపత్రికలలో ఇవి మరింత ఎక్కువగానూ కనిపించేవి. కానీ, అప్పట్లో ఆ పత్రికలపై ఎలాంటి ఆంక్షలూ లేవు. ఇప్పుడు సోషల్ మీడియాలో అదే తరహాలో వస్తుంటే- వాటిని ఎలా అణచివేద్దామా? అని చూస్తున్నారు. అంటే- నేటి పాలకులు, రాజకీయ నాయకుల్లో ‘అసహనం’ అంతగా పెరిగిపోతున్నదన్న మాట. తమ తప్పుల్ని ఎవరో బయటపెడుతున్నారంటే వారికి భరించలేని పరిస్థితి అంతగా ఏర్పడుతోందన్నమాట! ఈ ‘అసహనం’ యుపిఎ హయాంలో మరింతగా బయటపడి 2000 సంవత్సరంలో ‘సమాచార సాంకేతిక విజ్ఞాన చట్టం’ (ఐటి యాక్ట్)లో 66-ఎ సెక్షన్‌ను చేర్చదాకా వెళ్లింది. ఆన్‌లైన్‌లో ఏ విధానాన్ని వినియోగించుకునైనా స్థూలంగా సమాజాన్ని ప్రభావితం చేసేలా లేక ఒక వ్యక్తిని అవమానపరిచేలా సందేశాలు, ఫొటోలు వంటివి ప్రచారం చేస్తే ఆ సెక్షన్ కింద నేరమే. అలా అరెస్టుచేస్తే దాదాపు మూడేళ్లు జైలుశిక్ష పడుతుంది. పాలకులు దాన్ని దుర్వినియోగం చేస్తూ- ప్రజాప్రతినిధుల తప్పులను ఎత్తి చూపి నిజాలు బయటపెట్టిన వారిని బలిచేస్తూ వచ్చారు. దీన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై ఇటీవల సుప్రీం కోర్టు విచారణ జరిపి ఆ సెక్షన్‌లో ఉన్న అంశాలు రాజ్యాంగంలోని భావ ప్రకటనా స్వేచ్ఛకు ఉద్దేశించిన ఆర్టికల్ 19(1ఏ)కు విరుద్ధంగా ఉన్నాయంటూ ఆ సెక్షన్‌నే రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. సుప్రీం తీర్పు ప్రభుత్వానికి చెంపదెబ్బ. తన ఇష్టానుసారం ఐటి యాక్ట్‌లో సెక్షన్లు చేర్చి ప్రజల భావప్రకటనా స్వేచ్ఛను హరించవేయడానికి ఏ ప్రభుత్వమైనా ప్రయత్నిస్తే ఫలితం ఎలా ఉంటుందో సుప్రీం కోర్టు తన తీర్పు ద్వారా రుచి చూపించింది. ఇతరుల మనోభావాలను గాయపరిచేలా ఎవరైనా ప్రయత్నిస్తే దానికి అవసరమైన చర్యలున్నాయి. ఆ వంకతో ప్రజల భావప్రకటనా స్వేచ్ఛను హరించాలనుకోవడమే ప్రజాస్వామ్య విరుద్ధం. సెక్షన్ 66-ఎను తమకు అనుకూలంగా ఉపయోగించుకోవాలని మోదీ ప్రభుత్వం కూడా ఒక దశలో ప్రయత్నించింది. కానీ సుప్రీం కోర్టు కేంద్రం వాదనను తిరస్కరిస్తూ ఆ సెక్షన్‌ను తొలగించడమే న్యాయమని తీర్పు చెప్పింది. ఇది జరిగిన తర్వాతైనా నేతల ఆలోచనాధోరణి మారకపోవడమే విచారకరం.
సోషల్ మీడియాలో చోటుచేసుకుంటున్న కొన్ని అవాంఛనీయ అంశాలను తిరస్కరించాల్సిందే. ఎవరూ కాదనరు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో ఇటీవల ఓ ఉదంతం చాలా తీవ్రమైన ప్రతిస్పందనను చవి చూసింది. ఓ యువకుడు వాట్సప్‌లో ఓ వర్గాన్ని కించపరిచేలా వాయిస్ మెసేజ్‌ని పోస్టు చేయడంతో రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసి పోలీసులు లాఠీ చార్జి జరిపేదాకా వెళ్లింది. అల్లరి మూకలు రెచ్చిపోయి విధ్వంసం సృష్టించారు. సోషల్ మీడియా ద్వారా ఇలాంటి ఉద్రిక్తతలు సృష్టించడాన్ని కచ్చితంగా అదుపు చేయాల్సిందే. కానీ ప్రజల భావ ప్రకటనా స్వేచ్ఛను మొత్తంగా అడ్డుకోవడానికి ప్రయత్నించడమే క్షమార్హం కాదనిపిస్తుంది. రాష్ట్రాన్ని సైబర్ హబ్‌గా మారుస్తామంటూ ప్రకటనలు చేస్తున్న పాలకులు వాస్తవానికి ప్రజలు ఆ అభివృద్ధికి దూరమయ్యేలా వ్యవహరిస్తున్నారనే చెప్పాలి. సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాలను నిష్పాక్షికంగా తెలిపే వారిపై అణచివేత అస్త్రం ప్రయోగించడమంటే అదే. ఈ వైఖరిలో తొలుత మార్పు రావాల్సి ఉంది. ‘్ఫర్త్ ఎస్టేట్’గా ఇంతకాలం పేరు తెచ్చుకున్న ప్రింట్ జర్నలిజానికి సమాంతరంగా ఇప్పుడు సోషల్ మీడియా ‘్ఫఫ్త్ ఎస్టేట్’గా అభివృద్ధి చెందుతోంది. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల్లోని పెడధోరణులకు భిన్నంగా వాస్తవ చిత్రాన్ని సోషల్ మీడియా ప్రజల ముందుకు తెస్తోంది. దీన్ని చూసి భయపడే నేతలు అణచివేతకు పాల్పడితే ప్రజలు చూస్తూ వూరుకునే పరిస్థితి ఇప్పుడు లేదు. అందరికీ అన్నీ తెలుస్తున్నాయి. వాట్సప్‌లో ఎవరో ఏదో రాశారని అరెస్టు చేయడం మొదలుపెట్టి వరసగా జైళ్లలో వేసుకుంటూ వెడితే ప్రజలు హర్షించరు కదా! వారి చేతుల్లో ‘ఓటు’ ఆయుధం ఉందన్న విషయాన్ని పాలకులు గుర్తుంచుకోవాలి.
ఐటి చట్టంలోని 66-ఏ సెక్షన్‌ను సుప్రీం కోర్టు రద్దు చేసినపుడే ప్రభుత్వాల, నాయకుల ధోరణిలో మార్పు వచ్చి ఉంటే గత రెండు మూడు నెలల్లో నాలుగైదు అరెస్టులు జరిగి ఉండేవి కావు. మనం ఎటువంటి సభ్య సమాజంలో, నాగరిక ప్రపంచంలో ఉన్నామో పాలకులు గుర్తుంచుకోవాలి. నేతలు సవ్యంగా ఉంటే మీడియాలో మాత్రం ఎందుకు విరుద్ధమైన స్పందనలు వస్తాయి? గళాలను, కలాలను బతికిస్తేనే సమాజం ముందుకు వెళ్తుంది. *

-అడుసుమిల్లి జయప్రకాష్ సెల్: 98481 28844