ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

కల్లోల కాశ్మీర్‌కు సాంత్వన ఎప్పుడు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏడు దశాబ్దాలుగా రగులుతున్న కాశ్మీర్ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనేందుకు మోదీ ప్ర భుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా? పాకిస్తాన్‌తోపాటు మరికొన్ని దేశాలు అవలంబిస్తున్న మతపరమైన రాజకీయాలతో కాశ్మీర్ సమస్య అంత్యంత జటిలంగా మారింది. ఈ నేపథ్యంలో దీన్ని పరిష్కరించటం అనుకున్నంత సులభం కాదు. పాక్‌ను వ్యూహాత్మకంగా కట్టడి చేయటంతోపాటు జమ్ము- కాశ్మీర్‌ను జాతీయ జన జీవన స్రవంతిలో కలిపేందుకు ధైర్యంతో కూడిన నిర్ణయాలు తీసుకుంటే తప్ప ఈ సమస్యకు మోక్షం లేదు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి అంటే కాశ్మీర్ సమస్య రావణ కాష్ఠంలా రగులుతూనే ఉంది. ఈ సమస్యకు మధ్యలో కొంత తెరిపి లభించినా, ఆ తర్వాత పాకిస్తాన్ కుట్రలు, కుతంత్రాలు తోడుకావటంతో ఇది నానాటికీ ముదురుతోంది తప్ప తగ్గటం లేదు. కేంద్రంలో మోదీ నాయకత్వాన ఎన్‌డిఏ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి కాశ్మీర్ సమస్య మరింత ఉగ్రరూపం ధరించింది.
‘370 ఆర్టికల్’ కొనసాగినంత కాలం కాశ్మీర్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించదనేది పచ్చి నిజం. ‘370 ఆర్టికల్’ను రద్దు చేయటం ద్వారా కాశ్మీర్‌ను జాతీయ స్రవంతిలోకి తీసుకురావలసిన అవసరం ఉంది. జమ్ము- కాశ్మీర్‌ను ప్రత్యేక ప్రతిపత్తిగల ప్రాంతంగా గుర్తించటం వల్లనే స్థానికులు స్వాతంత్య్రం కోసం డిమాండ్ చేసే అవకాశాన్ని కల్పిస్తున్నామని పాలకులు గ్రహించటం లేదు. కాశ్మీర్ భారత్‌లో భాగమైనప్పుడు, అవిభాజిత ప్రాంతమైనప్పుడు 370 ఆర్టికల్‌ను ఎందుకు కొనసాగించాలి? దీన్ని రద్దు చేయటంతోపాటు వేర్పాటువాదానికి ఆజ్యం పోస్తున్న పాక్ పట్ల కఠినంగా వ్యవహరించనంత కాలం సమస్యకు పరిష్కారం లేనట్టే. దీనికి ‘రాజకీయ పరిష్కారం’ అసాధ్యమనేది కాదనలేని వాస్తవం. రాజకీయ పరిష్కారం అంటే ఏమిటి? కాశ్మీర్‌కు మరింత స్వయం ప్రతిపత్తి ఇవ్వడమా? ఇప్పుడు కల్పించిన స్వయం ప్రతిపత్తి వల్లనే సమస్య కొనసాగుతోంది. గనుక రాజకీయ పరిష్కారం దాదాపుగా అసాధ్యం. నిరుద్యోగం, వెనకబాటుతనం తదితర సామాజిక సమస్యలకు పరిష్కారం కనుగొనవచ్చు. కానీ దేశం నుండి విడిపోవాలన్న డిమాండ్‌కు రాజకీయ పరిష్కారం ఎలా సాధ్యమవుతుంది? పాకిస్తాన్ పాలకులు చెప్పినట్లు చేస్తున్న హురియత్ తదితర వేర్పాటువాద సంస్థల నాయకుల ఆటల్ని కట్టించ గలిగితే సమస్యను కొంత వరకూ అదుపు చేయవచ్చు.
హవాలా మార్గంలో పాకిస్తాన్ పంపిస్తున్న డబ్బుతో వేర్పాటువాదాన్ని కొనసాగిస్తూ కోట్లకు పడగెత్తుతున్న హురియత్ తదితర వేర్పాటువాద సంస్థల నాయకులను అదుపుచేయాలి. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) కొద్దిరోజుల క్రితం దిల్లీ, హర్యానా, కాశ్మీర్ లోయలో హురియత్ తదితర సంస్థల నాయకుల ఇళ్లపై దాడులు జరిపింది. పాకిస్తాన్ నుండి వస్తున్న నిధుల గురించి ఆరా తీసేందుకు ఈ దాడులు జరిగాయి. ఎప్పుడో జరగాల్సిన ఈ దాడులను ఇప్పుడైనా జరిపినందుకు మనం సంతోషించాలి. ఉగ్రవాద సంస్థలకు నిధులు అందకుండా చేయనంతకాలం కాశ్మీర్‌లో అల్లర్లను ఆపటం అసాధ్యం. ‘హురియత్’ నాయకులు సైనికులపై రాళ్లు విసిరే ప్రతి యువకుడికి రోజుకు ఐదు వందల రూపాయల చొప్పున చెల్లిస్తూ ఉగ్రవాదాన్ని ఉసిగొల్పుతున్నారు.
రాళ్లు విసిరే యువతను కట్టడి చేయడం మన జవాన్లకు పెను సవాల్‌గా మారింది. దారితప్పిన ఈ యువకులపై సైనికులు బలప్రయోగం చేయకూడదనటం ఏ విధంగా సమర్థనీయం? రాళ్ల వర్షం నుంచి సైనికులతోపాటు ఎన్నికల సిబ్బందిని కాపాడేందుకు మేజర్ గొగోయ్ చేసిన ప్రయత్నాన్ని శరద్‌యాదవ్ లాంటి సీనియర్ నాయకుడు విమర్శించటం శోచనీయం. రాళ్ల దాడి నుండి తమను తాము కాపాడుకునేందుకు మేజర్ గొగోయ్ ఒక యువకుడిని సైనిక జీపు ముందు భాగాన కట్టివేయటం సామాజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టించింది. మేజర్ గొగోయ్‌ను ఆర్మీ చీఫ్ జనరల్ రావత్ సత్కరించటాన్ని కూడా కొందరు వివాదాస్పదం చేశారు. సైన్యం పట్ల ప్రజలకు భయం లేకుండాపోతే భయంకరమైన పరిణామాలు ఎదురవుతాయని శరద్ యాదవ్ లాంటి నాయకులు ఎందుకు అర్థం చేసుకోవటం లేదు? సైన్యం అంటే భయం లేదు కాబట్టే భద్రతాసిబ్బందిపై యువకులు చేయి చేసుకుంటున్నారు. సైనికుల టోపీలు లాగివేసి అపహాస్యం చేయటం సహించరాని విషయం. రాళ్ల దాడి నుంచి బయటపడేందుకు సైనికులు ఏం చేయాలి? యువకులకు లొంగిపోవాలా? తోకముడిచి పారిపోవాలా? అసాంఘిక శక్తులను అదుపు చేయాలా? ఈ విషయంపై రాజకీయ పార్టీలు మాత్రం నోరు మెదపవు. కాశ్మీర్‌లో పరిస్థితిని అదుపు చేయాలంటే రాళ్లు రువ్వే యువత పట్ల కఠినంగా వ్యవహరించాలి. వీరికి ‘రోజుకూలీ’ చెల్లిస్తున్న హురియత్ నాయకులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పేందుకు ఆ దేశంతో అన్ని రకాల సంబంధాలను నిలిపివేయాలి. వ్యాపార,వాణిజ్య, క్రీడా సంబంధాలను కొనసాగిస్తూ ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని అదుపు చేయాలనుకోవటం అతి తెలివి అవుతుంది. ఈ అతి తెలివిని చూపించకుండా పాకిస్తాన్‌తో భారత్ తెగతెంపులు చేసుకోవాలి, రాయబార సంబంధాలను కూడా నిలిపివేయాలి.
దిల్లీలోని పాకిస్తాన్ రాయబార కార్యాలయం కాశ్మీర్ ఉగ్రవాదుల కేంద్రంగా మారింది. ఇక్కడి పాక్ రాయబారి ఎప్పటికప్పుడు కాశ్మీర్ ఉగ్రవాద సంస్థల అధినాయకులతో సమావేశాలు జరుపుతూ వారికి మార్గదర్శనం చేయిస్తుంటారు. ఇస్లామిక్ ఉగ్రవాదులు ఒక వైపు మన భద్రతా దళాలపై దాడులు చేస్తుంటే మరోవైపు భారత, పాక్‌ల మధ్య క్రికెట్ మ్యాచ్‌లను నిర్వహించటం ఏమిటి? పాకిస్తాన్ వాణిజ్య సంబంధాలను ఉగ్రవాదానికి ఉపయోగించుకుంటోంది. కాశ్మీర్ నుండి డ్రైఫ్రూట్స్ పాకిస్తాన్‌కు ఎగుమతి అవుతున్నాయి. హురియత్ సంస్థతో సంబంధం ఉన్న కొందరు వ్యాపారులు పాకిస్తాన్‌కు పది లక్షల రూపాయల విలువ చేసే ఢ్రైఫ్రూట్స్ ఎగుమతి చేసి, బిల్లు మాత్రం పది రేట్లు అధికం చేసి చూపిస్తున్నారు. పాక్ గూఢచార సంస్థతో సంబంధం ఉన్న వారే కాశ్మీర్ నుండి డ్రైఫ్రూట్స్ దిగుమతి చేసుకుని అధికంగా డబ్బు చెల్లిస్తున్నారు. ఇలా వాణిజ్యాన్ని దుర్వినియోగం చేయటం ద్వారా కాశ్మీర్‌లోని ఉగ్రవాదులకు డబ్బు చేరుతోంది. హురియత్ నాయకులు ఈ డబ్బును కాశ్మీర్‌లో గొడవలు సృష్టించేందుకు ఉపయోగిస్తున్నారు.
పాక్‌తో వాణిజ్యాన్ని నిలిపివేస్తే వేర్పాటువాద సంస్థలకు నిధులు చేరటం ఆగుతుంది. ఆ దేశాన్ని మనం కూడా బద్ధశత్రువుగానే పరిగణించాలి. ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినట్లు- స్నేహం పెంచుకునేందుకు మనం ప్రయత్నించిన ప్రతిసారీ పాక్ నుండి దౌర్జన్యం, దగా, మోసం ఎదురైంది. భారత్ ఎంత మంచి చేసినా తాను మాత్రం చెడు చేయాలనే దాయాది దేశం భావిస్తోంది. అలాంటప్పుడు ఆ దేశంతో ఇక ఎంత మాత్రం స్నేహం సాధ్యం కాదు. శత్రువును దెబ్బ తీసేందుకు అవసరమైన వ్యూహాన్ని అమలు చేసినప్పుడే కాశ్మీర్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. *