అంతర్జాతీయం

ఇరాన్ పార్లమెంటుపై ఉగ్ర దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టెహరాన్, జూన్ 7: ఇరాన్ రాజధాని టెహరాన్ బుధవారం సాయుధ, ఆత్మాహుతి దాడులతో దద్దరిల్లింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే పార్లమెంటు భవనంలోపల, అలాగే దేశ విప్లవ నాయకుడు అయతొల్లా ఖొమేనే సమాధుల వద్ద జరిగిన జంట దాడుల్లో కనీసం 12మంది చనిపోగా, పలువురు గాయపడ్డారు. కాగా ఈ దాడులు తామే జరిపినట్టు ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్ సంస్థ ప్రకటించుకుంది. ఇరాన్‌లో ఇంత భారీఎత్తున దాడులు జరగడం ఇటీవలి సంవత్సరాల్లో ఇదే తొలిసారి. బుధవారం ఉదయం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలోనే ఎకె రైఫిల్స్ ధరించిన దుండగులు పార్లమెంటు భవనంలోకి దూసుకు వచ్చారు. తర్వాత దుండగుల్లో ఒకరు భవనంలోపలే పేల్చేసుకున్నాడని ఇరాన్ హోంమంత్రి మహమ్మద్ హొస్సేన్ జొల్ఫిఘరి ఇరాన్ ప్రభుత్వ టీవీకి చెప్పారు. దాడి చేసిన దుండగులంతా మగవాళ్లే అయినప్పటికీ మహిళల దుస్తుల్లో ఉన్నట్టు కూడా ఆయన చెప్పారు. దాడిచేసిన నలుగురు దుండగులను భద్రతా దళాలు కాల్చివేయడంతో ముట్టడి ముగిసిందని ‘తస్నిమ్’ న్యూస్ ఏజన్సీ వెల్లడించింది. ఈ రెండు దాడుల్లో మొత్తం 12మంది చనిపోగా, 42మంది గాయపడినట్టు ఇరాన్ ఎమర్జెన్సీ విభాగం చీఫ్ పిర్హోస్సెన్ కోలివంద్ చెప్పినట్టు ‘మీజాన్’ న్యూస్ వెబ్‌సైట్ పేర్కొంది. కాగా, పార్లమెంటు లోపల దాడికి సంబంధించి 24 సెకన్ల వీడియోను ఐసిస్ అధికారిక న్యూస్ ఏజన్సీ ‘ఆమక్’ విడుదల చేసింది. ఆన్‌లైన్‌లో విస్తృతంగా ప్రచారమైన ఆ వీడియోలో సాయుధ దుండగులు, నేలపైన విగత జీవుడై పడివున్న వ్యక్తి ఉన్నారు. ‘మేము వెళ్లి పోతామని మీరు అనుకుంటున్నారా? దేవుడు దయతలిస్తే మేము ఎప్పటికీ ఉంటాం’ అని దాడి చేసిన ఇద్దరు వ్యక్తులు అరబిక్ భాషలో నినాదాలివ్వడం కూడా వీడియోలో వినిపించింది. పార్లమెంటు భవనం చుట్టుపక్కల భవనాలపై చాలామంది పోలీసు స్నైపర్లు ఉండడం చూశానని అసోసియేటెడ్ ప్రెస్ వార్తా సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. పోలీసు హెలికాప్టర్లు పార్లమెంటు భవనంపైన చక్కర్లు కొట్టడం కూడా కనిపించింది. ఈ దాడిని పిరికిపందల చర్యగా ఇరాన్ పార్లమెంటు స్పీకర్ అలీ లర్జానీ అభివర్ణించారు.
కాగా, పార్లమెంటుపై దాడి జరిగిన కొద్ది సేపటికే నగర శివార్లలో ఇరాన్ విప్లవ యోధుడు అయతుల్లా రుహొల్లా ఖొమేనీ సమాధి ప్రాంతంపై మానవ బాంబు, ఇతర దుండగులు దాడి చేశారు. దాడి చేసిన దుండగులు ఒక సెక్యూరిటీ గార్డును కాల్చి చంపారని, సెక్యూరిటీ గార్డులు దాడి చేసిన దుండగుల్లో ఒకరిని కాల్చి చంపారని, ఒక మహిళను అరెస్టు చేసినట్టు అధికార వార్తా సంస్థ తెలిపింది.

మిలిటెంట్ మృతదేహాన్ని పరిశీలిస్తున్న ఇరాన్ బలగాలు