రాష్ట్రీయం

మెరుపులు.. మరకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూన్ 7: ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన సందర్భం భవిష్యత్ ఏమిటో తెలియని ఒక శూన్యంలోకి రాష్ట్రాన్ని నెట్టింది. 16వేల కోట్ల లోటు బడ్జెట్. రాజధాని లేని అనాథ. రెండేళ్లు హైదరాబాద్‌కే పరిమితమైన అధికారులు. హోదా హామీకి తూట్లు..అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు అడ్డంకులు. సాగునీరు ప్రాజెక్టుల్లో లెక్కలేనన్ని అవినీతి ఆరోపణలు. ఇసుక దందాలో తమ్ముళ్ల దూకుడు. తాజా విశాఖ వరకూ భూముల కబ్జా ఆరోపణలు. పార్టీలో తమ్ముళ్ల అలకల పర్వం.. వీటన్నింటి నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మూడేళ్ల పదవీకాలం నేటితో పూర్తయింది.
రాజధాని లేని రాష్ట్రానికి సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన బాబు దాదాపు రెండేళ్లు అసౌకర్యంగానే పరిపాలన సాగించారు. ఉద్యోగులు, సచివాలయం, ఐఏఎస్, ఐపిఎస్ అధికారులంతా హైదరాబాద్‌లోనే ఉండటం, కేవలం సమీక్షలకే వారంతా విజయవాడ రావడంతో పాలన ఊపందుకోలేదు. వారిని అమరావతికి తీసుకురావడానికి నానా ప్రయాస పడిన తర్వాత వేసిన తొలి అడుగు అమరావతి నగరానికి శంకుస్థాపన. ఆ తర్వాత తాత్కాలిక సచివాయలం-అసెంబ్లీ నిర్మాణాలు. అంతకంటే ముందు.. సీఎంగా బాధ్యతలు స్వీకరించకముందే ఢిల్లీపై ఒత్తిడి తెచ్చి పోలవరం ప్రాజెక్టు పూర్తి కోసం 7ముంపు మండలాలను విలీనం చేయించి తొలి విజయం సాధించారు.
రాష్ట్ర విభజనకు ముందు సీమాంధ్రలో విద్యుత్ సరఫరా పరిస్థితి అత్యంత దయనీయం. ఎప్పుడు కరెంటు వస్తుందో తెలియని పరిస్థితి నుంచి నిరంతర విద్యుత్ స్థాయికి తీసుకురావడంతో ముఖ్యమంత్రి పారిశ్రామికవేత్తల్లో భరోసా నింపగలిగారు. విశాఖ, కాకినాడ, నెల్లూరు వంటి సువిశాల తీరప్రాంతంలో ప్రాజెక్టులకు ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. తానే తీసుకువచ్చిన ఐటీ సహా, పరిశ్రమలన్నీ హైదరాబాద్‌కు పరిమితం కావడంతో నవ్యాంధ్రలోనూ వాటిని తెచ్చే లక్ష్యంలో భాగంగా బాబు చేస్తున్న విదేశీ పర్యటనలు సత్ఫలితాలిస్తున్నాయి. అందులో భాగంగా అమరావతిలో హెచ్‌సీఎల్, తిరుపతిలో నీలిట్, గంభీరంలో సమీర్ వంటి కేంద్రప్రభుత్వరంగ సంస్థలను తీసుకువచ్చారు.
16వేల కోట్ల లోటు బడ్జెట్‌లోనూ ఎక్కడా సంక్షేమానికి నిధులు ఆపని వైనం బాబును వివిధ సామాజికవర్గాలకు చేరువ చేసింది. 70వేల కోట్లకు సంక్షేమ నిధులు పెరిగాయి. కాపు-బ్రాహ్మణ-ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు వేల కోట్లతో వివిధ పథకాలు అందిస్తున్నారు. దాదాపు 47 లక్షల పించన్లు ఇస్తున్న రాష్ట్రం ఏపి ఒక్కటేనంటే పథకాలపై గతానికి భిన్నంగా, బాబు ఏ స్థాయిలో ఆసక్తి చూపుతున్నారో అర్థమవుతోంది. సీఎం కోర్ డాష్‌బోర్డు దేశంలోనే ఓ వినూత్న ప్రక్రియ. ఇందులో 33 శాఖలకు సంబంధించిన 200 పథకాల సమాచారాన్ని ఎవరైనా ఎప్పుడైనా తెలుసుకునే వీలు కల్పించారు. సీఎం తన ఆఫీసులో కూర్చుని ఏ గంటకు ఎన్ని పథకాలు ఎంతమంది లబ్థిదారులకు చేరువయ్యాయన్నది తెలుసుకుంటున్నారు.
రెండుసార్లు విశాఖలో జరిగిన భాగస్వామ్య సదస్సులో 10.5 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు జరిగాయి. ఆ తర్వాత ప్రతిష్ఠాత్మక కియో కార్ల కంపెనీని అనంతపురం జిల్లాకు తీసుకురావడంలో విజయం సాథించారు. విశాఖను వణికించిన హుద్ హుద్ తుపాను తర్వాత కేవలం 7 రోజుల్లోనే విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరించడంతోపాటు, పరిస్థితి చక్కబడే వరకూ అక్కడే బస చేసిన వైనం ఉత్తరాంధ్రకు బాబును మరింత దగ్గర చేసింది.
పిడుగులను ముందే పసిగట్టి, హెచ్చరించే వ్యవస్థను దేశంలోనే తొలిసారి ఇస్రో సాయంతో చేపట్టి అందరినీ మెప్పించారు. రాష్ట్రంలో క్యాబినెట్ సమావేశాలు కూడా ఈ-ఆఫీస్ పద్ధతిలో జరుగుతున్న కొత్త సాంకేతిక వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. అధికారులు ప్రయాణ సమయాల్లో కూడా ఈ- ఆఫీసు ద్వారా ఫైళ్లు పరిష్కరిస్తున్నారు. డ్రోన్లు, సిసి కెమెరాలను వినియోగించడం ద్వారా మిగతా రాష్ట్రాలకు ఆదర్శమయ్యారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా 2.13 కోట్ల మంది కార్మికులకు చంద్రన్న బీమా పథకం చేరింది. తాజాగా1100 కాల్‌సెంటర్ల ఏర్పాటుతో అవినీతి ఉద్యోగులకు దడ పుట్టిస్తున్నారు.
విభజన అనంతరం అరకొరగా ఉన్న అధికారులతోనే ముఖ్యమంత్రి పనిచేయించుకుంటున్నారు. అటు కేంద్రంతో ప్రభుత్వపరంగా సఖ్యతగా ఉంటూనే ఇటు పార్టీపరంగా మిత్రపక్షంతో వస్తున్న సమస్యలను అధిగమిస్తున్నారు.
సమీక్షల అ‘సహనం’
బాబు ఈ మూడేళ్లలో చేస్తున్న సుదీర్ఘ సమీక్షలు అధికారులకు విసుగు తెప్పిస్తున్నాయన్న విమర్శలున్నాయి. తమకు ఆలోచించుకునే సమయం కూడా ఇవ్వకుండా ఉదయం నుంచి రాత్రి వరకూ సమీక్షలు చేస్తే ఇక పని ఎప్పుడు చేయాలన్నది అధికారుల ప్రశ్న. అటు పార్టీ-ప్రభుత్వ సభల్లోనూ చెప్పిందే చెప్పడం, తానే ఎక్కువసేపు మాట్లాడాలన్న ధోరణి బాబును విమర్శల పాల్జేస్తున్నాయి. వైఎస్, కేసీఆర్ వంటి అగ్రనేతలు కూడా అర్ధగంటకు మించి మట్లాడరని, అయినా వారి ప్రసంగాల్లో పంచ్ ఉంటుందని విశే్లషిస్తున్నారు. చంద్రబాబు ప్రసంగాలు ప్రభుత్వ అనుకూల మీడియాలోనే వస్తుండటం ప్రస్తావనార్హం. ముందే ప్రణాళికలు సిద్ధం చేసుకోకుండా సమావేశాల్లోనే ఇన్‌స్టంట్‌గా ఆలోచనలు ప్రారంభిస్తున్న సంప్రదాయానికి ఇంకా స్వస్తి పలకకపోవడం మిగిలిన వారికి అసహనం కలిగిస్తోంది. అయితే.. ముఖ్యమంత్రి ఆ రకంగా వెంటపడితేనే పనులవుతున్నాయని, లేకుంటే అతి తక్కువ కాలంలో పట్టిసీమ సాధ్యం కాదని పార్టీ నేతలు అంటున్నారు. పోలవరంపై ప్రతి సోమవారం ప్రత్యక్ష పర్యవేక్షణ చేస్తుండటం వల్లే నేడు కాఫర్ డ్యామ్‌కు భూమిపూజ చేసే పరిస్థితి వచ్చిందంటున్నారు. 2019 ఎన్నికల్లోగా పోలవరం పూర్తి చేయాలన్న బాబు లక్ష్యం కచ్చితంగా పూర్తి అవుతుందని చెబుతున్నారు.
అవినీతి ఆరోపణలతో అప్రతిష్ఠ
ఈ మూడేళ్ల కాలంలో వెలుగుచూసిన అవినీతి ఆరోపణలు ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీశాయి. రెండేళ్లు ఎమ్మెల్యేలు, మంత్రుల విచ్చలవిడితనాన్ని మూడో ఏడుకు గానీ తగ్గించలేకపోయారు. పోలవరం, పట్టిసీమ, కొండవీటివాగు ప్రాజెక్టు, పురుషోత్తపట్నం, గాలేరు-నగరి, హంద్రీ-నీవా ప్రాజెక్టుల్లో భారీ అవినీతి జరిగిందన్న ఆరోపణలు కుదిపేశాయి. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులు మేఘా ఇంజనీరింగ్, ఎంపి సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్, టిడిపి నేత సుధాకర్‌యాదవ్‌కు చెందిన కంపెనీలకే దక్కాయన్న విమర్శలు ప్రభుత్వాన్ని ఇరుకున పడేశాయి. ప్రధానంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేఘా ఇంజనీరింగ్ కాంగ్రెస్ ఎంపి కెవిపి బినామీదని, తాము అధికారంలోకి వస్తే దానిపై విచారణ జరిపిస్తామని ప్రకటించిన బాబు అధికారంలోకి వచ్చిన తర్వాత మూడేళ్లకు ముందు కొనసాగిస్తున్న ప్రాజెక్టులను కొనసాగించటంతోపాటు, కొత్తగా పట్టిసీమ-కొండవీటి వాగులతోపాటు, ఇతర కాంట్రాక్టు పనులనూ అప్పగించడం శ్రేణుల్లో అసంతృప్తి కలిగించింది. కాకినాడ సెజ్ అక్రమాలపై జరిగిన ధర్నాలో స్వయంగా పాల్గొన్న బాబు తాము అధికారంలోకి వస్తే చర్య తీసుకుంటామన్నారు. కానీ ఇప్పటివరకూ ఎలాంటి చర్య లేకపోగా, ఆయననే కొనసాగిస్తున్నారు. కృష్ణపట్నం వ్యవహారమూ అంతే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాము ఎవరిపైనయితే పోరాడామో, ఇప్పుడు వారే చుట్టూ ఉండటాన్ని శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. గత ప్రభుత్వ అవినీతిపై విచారణ జరిపిస్తామన్న ప్రకటనా అమలుకు నోచుకోలేదు.
విభజన గాయం గుర్తు చేసే ‘దీక్ష’లు
విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి చేసిన ద్రోహాన్ని ప్రతి ఏడాదీ ప్రజలకు గుర్తుచేసి, ఆ గాయాలను తలచుకుని, విడగొట్టిన వారే ఏడ్చే స్థాయిలో అభివృద్ధి జరగాలన్న సంకల్పంతో నిర్వహిస్తున్న నవనిర్మాణ దీక్షలకు ప్రజాస్పందన లభిస్తోంది. ఫలితంగా రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్లీ కోలుకునే పరిస్థితి లేకుండా పోయింది.
పెద్దనోట్ల రద్దులో కీలకపాత్ర
దేశంలో సంచలనం సృష్టించిన పెద్దనోట్ల రద్దులో కీలకపాత్ర పోషించిన బాబు, ఆ తర్వాత డిజిటలైజేషన్‌పై వేసిన ముఖ్యమంత్రుల కమిటీకి చైర్మన్‌గా నియమితులు కావడంతో బాబు ప్రతిష్ఠ పెరిగినట్టయింది. బాబు సమర్థను గుర్తించిన మోదీ ఏరికోరి ఆయనను కన్వీనర్‌గా నియమించారు. నీతి ఆయోగ్ కూడా చంద్రబాబు చొరవను ప్రశంసించలేకుండా ఉండలేకపోయింది.