పశ్చిమగోదావరి

అత్యుత్తమ పర్యాటక ప్రాంతంగా ‘పోలవరం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోలవరం, జూన్ 8: పోలవరం ప్రాజెక్టుతో సమాంతరంగా ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందేలా కార్యచరణ ప్రణాళిక రూపొందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు కార్యాలయంలో గురువారం జలవనరుల శాఖ, కాంట్రాక్టు ఏజన్సీ ప్రతినిధులు, పర్యాటక శాఖ అధికారులతో ప్రాజెక్టు నిర్మాణ పనుల ప్రగతిని, పర్యాటక రంగ అభివృద్ధిపై సిఎం సమీక్షించారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ ఉభయ గోదావరి జిల్లాల్లో కోనసీమ, కాకినాడ, రాజమహేంద్రవరం, నరసాపురం, పోలవరం ప్రాంతాలను దృష్టిలో పెట్టుకుని అత్యుత్తమ పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి పరచాలన్నారు. ఇందుకు అవసరమైన కన్సల్టెన్సీలతో చర్చించి, ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయడంతోపాటు 5, 7 నక్షత్రాల హోటళ్లు ఏర్పాటయ్యేలా చూడాలన్నారు. అలాగే ఏజన్సీ 1/70 యాక్ట్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాంతాన్ని కూడా పర్యాటకంగా అభివృద్ధి పరచాలన్నారు. దీనిపై పర్యాటక శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ వచ్చే నెలలో దీనిపై ప్రణాళిక రూపొందించి, మీకు సమర్పిస్తామని సిఎంకు చెప్పారు. ఇదే సమయంలో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ సిఎంతో మాట్లాడుతూ పట్టిసీమ పర్యాటక సమగ్ర ప్రాజెక్టు నివేదికను రూపొందించామని, ఇందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి స్వదేశీ స్వచ్ఛత్ కింద నిధులు విడుదలకు చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. దీనిపై సిఎం స్పందిస్తూ ఈ విషయంపై సంబంధిత అధికారులతో చర్చించాలని జనవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రిజర్వాయర్ల ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధిపరిచి వాటర్ సోర్స్, అతిథి గృహాలు ఏర్పాటుచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇకపై ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్టుతోపాటు పర్యాటక అంశంపై కూడా సమీక్షిస్తానని, దీనికి ఆ శాఖ అధికారులు కూడా హాజరుకావాలని సిఎం ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 2018 నాటికి కాపర్ డ్యాం పనులు పూర్తిచేసి గ్రావిటీ ద్వారా నీరు అందించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. రానున్న రెండు సీజన్లలో పోలవరం ప్రాజెక్టు పూర్తిచేయాలన్నదే తన తనపన అని ముఖ్యమంత్రి అధికారుతో పేర్కొన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి స్పిల్‌వే, డయాఫ్రమ్‌వాల్, కాంక్రీటు పనులకు సంబంధించి ఇంకా రావాల్సిన ఆధునిక యంత్రాలను వేగంగా రప్పించాలన్నారు. ఈ విషయంలో ఆయా నౌకాశ్రయాలలో ఎదురవుతున్న అవరోధాలను సంబంధిత అధికారులతో తాను మాట్లాడతానని సిఎం చెప్పారు. ఒకానొక సందర్భంలో రాష్ట్రంలో నీరు-చెట్టు, వివిధ ప్రాజెక్టులు, కెనాల్స్ పూడికతీత పనుల నిమిత్తం పొక్లయినర్ల కొరత ఏర్పడితే కలెక్టర్లతోపాటు తాను కూడా స్వయంగా ఆ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేసినట్టు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు వివిధ పనులకు సంబంధించి ఒక్క చిన్న విమర్శ కూడా రాకుండా పూర్తి పారదర్శకంగా పనులు నిర్వహించాలన్నారు. ఇప్పటికే తాను 17సార్లు ప్రాజెక్టు నిర్మాణ పనులను ప్రత్యక్షంగా పరిశీలించానని, 26సార్లు వర్ట్యువల్ సమీక్షలు నిర్వహించానని, ఇంకా పనుల్లో అవాంతరాలు వస్తున్నాయన్న మాటలకు తావివ్వకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనన్నారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో వరదలను దృష్టిలో ఉంచుకుని పనుల నిర్వహణకు పటిష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్లాలని, ఇందుకు బావర్, ఎల్‌అండ్‌టి సంస్థలతో సమన్వయంతో పనిచేయాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి స్పిల్‌వే, కాంక్రీటు పనుల ప్రగతిపై సమీక్షిస్తూ 1.94 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పనులు ఈ నెలాఖరునాటికి పూర్తిచేయాల్సి ఉండగా, ఇప్పటి వరకూ 1.06 లక్షల క్యూబిక్ మీటర్ల మేర పనులు చేశారని, ఈ పనులు మరింత వేగవంతం చేసేందుకు అవసరమైన యంత్ర సామాగ్రిని సిద్ధం చేసుకోవాలని అధికారులకు సూచించారు. ఎక్కడైతే పనులు మందకొడిగా సాగుతున్నాయో వాటిని గుర్తించి, ఆ పనులు వేగవంతం చేసేందుకు పటిష్టమైన ఇంజినీరింగ్ అధికారుల పర్యవేక్షణ పెంచాలన్నారు. రేడియల్ గేట్ల నిర్మాణ ప్రగతిపై సమీక్ష జరుపుతూ ఇందుకు 23,300 మెట్రిక్ టన్నుల స్టీలు సేకరించాల్సి ఉండగా, ఇప్పటి వరకూ 2,700 మెట్రిక్ టన్నుల స్టీలు సేకరించినట్టు తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన ఉక్కు కొనుగోలు విషయంలో జూలై 1నుంచి అమలయ్యే జిఎస్‌టిని దృష్టిలో ఉంచుకుని సంబంధిత ఏజన్సీలు, జనవనరుల శాఖ సమన్వయం చేసుకుని అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ అమలు, భూసేకరణలో జిల్లా కలెక్టర్ అవలంభించిన పద్ధతులను కుకునూరు, వేలేరుపాడు మండలాలతోపాటు తూర్పుగోదావరి జిల్లాలో అమలుచేయాలన్నారు. అలాగే డంపింగ్ యార్డు విషయమై సిఎం మాట్లాడుతూ ఇందుకు అవసరమైన భూ సేకరణపై కాంట్రాక్టు ఏజన్సీ, జిల్లా యంత్రాంగం సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలన్నారు. దీనికి మీరే స్వయంగా పర్యవేక్షణలో వెళ్లాలని జిల్లా కలక్టెర్ కాటంనేని భాస్కర్‌కు సిఎం సూచించారు. సమావేశంలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, పోలవరం ఎమ్మెల్యే మొడియం శ్రీనివాసరావు, జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్‌కుమార్ మీనా, పర్యాటక శాఖ కమిషనర్ రేఖారాణి, ఇఎన్‌సి ఎన్ వెంకటేశ్వరరావు, పోలవరం ప్రాజెక్టు సిఇ రమేష్‌బాబు, జలవనరుల శాఖ ఎస్‌ఇ శ్రీనివాస్ యాదవ్, భూసేకరణ ప్రత్యేక కలెక్టర్ భానూప్రసాద్, ఐటిడిఎ పిఒ షాణ్మోహన్, అసిస్టెంట్ కలెక్టర్ చేతన్ తదితరులు ఉన్నారు.