చిత్తూరు

భారత్‌ను సూపర్‌పవర్‌గా నిలుపుతున్న మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూన్ 9: ప్రపంచ దేశాల్లో భారత్‌ను సూపర్ పవర్‌గా నిలుపుతున్న ఘనత ప్రధాని మోదీకి దక్కుతుందని కేంద్ర విద్యుత్, బొగ్గు, గనులు, సాంప్రదాయ ఇంధన వనరుల శాఖ సహాయమంత్రి పియూష్ గోయల్ పేర్కొన్నారు. ఈనెల 11వ తేదీ వరకు మూడు రోజులపాటు జరుగనున్న మోదీఫెస్ట్ ఎగ్జిబిషన్‌ను శుక్రవారం మంత్రి స్థానిక ఇందిరా మైదానంలో ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ యువకులు, మహిళలు, నిరుపేదలు, రైతులు, ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీల సంక్షేమం, దేశాభివృద్ధి కోసం కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. దీనదయాల్ ఉపాధ్యాయ ఆశయాల సాధన కోసం పనిచేస్తున్న ప్రభుత్వం దేశంలోని 125 కోట్ల మంది ప్రజలు తలెత్తుకుని గర్వంగా భారతీయుడని చెప్పుకునే అవకాశాన్ని కల్పిస్తోందన్నారు. ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన జన్‌ధన్ యోజన పథకం ద్వారా 21 కోట్లమంది భారతీయులు బ్యాంక్ అకౌంట్లను పొందారని, వివిధ పథకాల ద్వారా 13కోట్ల మంది లబ్ధి పొందారని చెప్పారు. కేంద్రం రూ. 100 ఇస్తే అది లబ్ధిదారుని వద్దకు చేరే సరికి రూ.15గా చేరుతోందని, దీనిని నివారించడానికే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరుమీదుగా భీమ్‌యాప్‌ను తీసుకువచ్చారన్నారు. కేవలం ఆధార్‌కార్డు, బ్యాంక్ అకౌంట్, వేలి ముద్ర ఉంటే నగదురహిత లావాదేవీలు జరుపుకోవచ్చన్నారు. ఈ యాప్‌ను భవిష్యత్తులో ప్రపంచ దేశాలు అనుసరిస్తాయని మంత్రి చెప్పారు. ముద్ర యోజన ద్వారా చిన్న వ్యాపారులు, యువకులు తమ స్వశక్తితో ఆర్థిక స్వతంత్రత సాధించేందుకు ఇది దోహదం చేసిందన్నారు. దేశంలో 5లక్షల మంది దీనిని వినియోగించుకున్నారని చెప్పారు. ప్రపంచంలో ఎక్కడున్నా భారతీయులను కాపాడేందుకు కేంద్రం నిరంతరం కృషి చేస్తోందని ఇందులో భాగంగా కులభూషణ్ యాదవ్‌కు పాకిస్థాన్ ఉరిశిక్ష విధిస్తే అంతర్జాతీయ న్యాయ స్థానాన్ని ఆశ్రయించి ఆయన ప్రాణం నిలపడం జరిగిందన్నారు. దేశ భద్రతను దెబ్బతీసే ఉగ్రవాదులను, మావోయిస్టులను ఏమాత్రం ఉపేక్షించేది లేదన్నారు. మన దేశానికి ఒక్కసారి నష్టం కలిగిస్తే వారికి 10 రెట్లు నష్టం కలిగించేలా కేంద్రం జవాబిస్తోందన్నారు. ప్రధానమంత్రి పసల్ బీమా యోజన ద్వారా 100 శాతం పంట నష్టపరిహారం అందించిన ఘనత బిజెపి ప్రభుత్వానిదేనని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో ఎరువుల కోసం ఎప్పుడు రైతులు రోడ్డెక్కేవారని, నేడు దేశంలో ఎక్కడా రైతులు ఎరువులు కోసం రోడ్లపైకి రాని విధంగా ఎరువులను అందిస్తున్నామన్నారు. కేంద్రం అందించిన ఎల్‌ఇడి బల్బుల ద్వారా సామాన్యులకు రూ.40వేల కోట్లు చార్జీల భారాన్ని తగ్గించిన ఘనత తమ ప్రభుత్వానిదేనని తెలిపారు. ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజలచే పనిచేస్తున్న మోదీ ప్రభుత్వాన్ని అన్ని వర్గాల ప్రజలు ఆశీర్వదిస్తున్నారని చెప్పారు. పారదర్శకంగా, వేగంగా దేశాన్ని ప్రగతి బాటలో నడిపిస్తున్న ప్రధాని మోదీ 2022 నాటికి దేశంలో ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు, మరుగుదొడ్డి, స్వచ్ఛమైన తాగునీరు, విద్య అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. అంతకుమునుపు సప్తగిరి గ్రామీణ బ్యాంక్, ఆంధ్రాబ్యాంక్, కెనరా బ్యాంక్ ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు చంద్రారెడ్డి, జాతీయ నాయకురాలు శాంతారెడ్డి, బిజెపి రాష్ట్ర మాజీ అధ్యక్షుడు చిలకం రామచంద్రారెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి, బిజెపి ఓబిసి మోర్చా రాష్ట్ర అధ్యక్షులు జల్లి మధుసూదన్, తిరుపతి పార్లమెంట్ నియోజక వర్గ ప్రచార కార్యదర్శి ఎస్.మునిసుబ్రహ్మణ్యం, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి పొనగంటి భాస్కర్, లీడ్ బ్యాంక్ మేనేజర్ ఆర్.రామ్మోహన్, ఇండియన్ బ్యాంక్ మేనేజర్ లక్ష్మీనారాయణ, ఆంధ్రాబ్యాంక్ మేనేజర్ గణపతిరావు, సప్తగిరి బ్యాంక్ మేనేజర్ జయరాం, కెనరాబ్యాంక్ మేనేజర్ సాంబశివరావు బిజెపి నాయకులు గుండాల గోపినాథ్ రెడ్డి, కండ్రిగ ఉమ, చల్లపల్లి నరసింహారెడ్డి, వరప్రసాద్, కోలా ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.