డైలీ సీరియల్

ట్విన్ టవర్స్ - 24

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెల్లవారు జామున పడుకున్న నాకు కళ్ళు ఎప్పుడు మూతలు పడ్డాయో, మెలకువ వచ్చేటప్పటికి చాలా ఆలస్యమయింది. ఎండ బాగా పైకి వచ్చింది.
ఆ రోజంతా గదిలోనే గడిపాను. ఆ రోజేమిటి, హైదరాబాద్ నుండి వచ్చినప్పటినుండి దాదాపు నా గదిలోనే గడుపుతున్నాను. అవసరం మించి, బయటకు వెళ్లడం లేదు. ఎవరితోనూ ఎక్కువ మాట్లాడటంలేదు.
వికారం అదీ కూడా తగ్గినట్లనిపించింది. సాయంత్రం అవుతుంటే- వెళ్లి స్నానం చేసి వచ్చాను. కనకాంబరం రంగు చీర కట్టుకున్నాను. మామ్మ కట్టి ఉంచిన జాజిపూల దండలో కొన్ని తలలో పెట్టుకుని మరొక దండ పేపర్‌లో చూట్టాను.
నా వాలకం చూసి మామ్మే అడిగింది, ‘బయటకు వెడుతున్నావా?’ అంది.
‘‘అవును మామ్మా’’ అన్నాను.
ఎక్కడికి అని ఆవిడ అడగలేదు. నేను చెప్పలేదు.
చెప్పులు వేసుకుంటుంటే వదిన అడిగింది.
‘‘నేను రానా?’’
వద్దని తల ఊగించాను.
‘‘ఎక్కడికి వెళుతున్నావు?’’ అంది.
‘‘వచ్చాకా చెప్తాను వదిన’’ అన్నాను. నేనప్పుడప్పుడు నా స్నేహితురాలిని కలవడానికి వెళ్ళడం మామూలే. అందుకే ఎవరు ఏమి ప్రశ్నించలేదు.
రిక్షాలో కూచుని సరాసరి కనకదుర్గ గుడికి తీసుకు వెళ్ళమన్నాను.
గుడి ముందు ఆపాడు. మెల్లిగా మెట్లు ఎక్కడం మొదలుపెట్టాను. శుక్రవారం కాకపోవడంతో మరీ రద్దీగా లేదు. చాలామంది కుర్రాళ్ళు కబుర్లు చెప్పుకుంటూ గబ గబా మెట్లెక్కుతున్నారు. అన్ని మెట్లు ఎక్కేసరికి ఆయాసమనించింది. చివరి మెట్టు పక్కన పిట్ట గోడకు ఆనుకొని కాసేపు ఉండిపోయాను. అక్కడ ఎతె్తైన ప్రదేశం మూలంగా క్రింద ఎంత వేడిగా అనిపించినా, చల్లని చిరుగాలి వేస్తోంది. మెట్లు ఎక్కేటప్పుడు కలిగిన చమటపై ఆ చల్లని గాలి ఎంతో హాయి అనిపించింది. చేతిలో ఉన్న రుమాలుతో నుదుటపైన చమట తుడుచుకుంటూ వెళ్లి గర్భగుడిలోకి వెళ్ళే లైన్‌లో నుంచున్నాను. అక్కడ చాలా కొద్దిగా ఉన్నారు. నా ముందు ఇద్దరో ముగ్గురో.
గర్భగుడి గడప దాటుతుంటే ఎందుకో కాళ్ళు వణికాయి. గుడికి వెళ్ళేటప్పుడు శుచిగా వెళ్లాలంటారు. స్నానం చేసి మంచి దుస్తులు ధరిస్తే శుచిగా ఉన్నట్లేనా? మనసంతా పాపపు ఆలోచనలతో నిండినప్పుడు, బాహ్య శుచి, ఏం ప్రయోజనం? మెల్లిగా ధైర్యం కూడగట్టుకుని గర్భగుడిలో అడుగుపెట్టాను చేతులు జోడించి.
‘‘అమ్మా లలితమ్మగారు, ఆ పక్కగా నుంచుని చదువుకోండి- భక్తులు మిమ్మల్ని తోసుకువెళ్ళకుండా’’ అంటున్నాడు శటగోపం పెడుతున్న శాస్త్రులుగారు. ఆవిడెవరో నిత్య భక్తురాలయి ఉంటుంది. పేరుతో పిలుస్తున్నాడనుకున్నాను.
చేతులు జోడించి, వంచి ఉన్న తల ఎత్తకుండా క్రీగంట ఆవిడను చూచాను.
ఎవరో పెద్దావిడ. చామనఛాయ రంగు. పొట్టిగా ఉంది. సంపెంగ రంగు పట్టుచీర, నుదుట నయాపైస అంత బొట్టు.. వెండిలా మెరుస్తున్న జుట్టు అనుభవించిన వయసు తెలుపుతోంది. జుట్టు వెనక ముడి, ముడిపైన అర్ధచంద్రాకారంలో చుట్టిన జాజిపూదండ. నల్లటి కళ్ళు, ముక్కు ఇరుపక్కలా మెరుస్తున్న రవ్వలు. ఆవిడ కళ్ళు మూసుకుని ప్రార్థన చేయడం లేదు. తన పెద్ద పెద్ద కళ్ళతో అమ్మవారి అందాన్నంతా ఆస్వాదించాలన్నట్టు ఉన్నది. ఆమెలో అందం కంటే కళ ఎక్కువగా ఉంది. ఆవిడ మొహంలో ఏదో ప్రత్యేకత ఉంది. ఇది అని విడమర్చి చెప్పలేని ప్రత్యేకత. ఆవిడ మంద్రస్వరంతో సర్వ సంక్షోభిని, సర్వ విద్రాపిని, సర్వ.. గడగడా చదువుతుంటే కంటస్థం చేసిన మంత్రాలలా లేవు. భక్తి పారవశ్యంతో పొంగిపొరలుతున్న నదీ ప్రవాహంలా ఉంది.
తటస్థంగా నుంచుని తేరిపార చూస్తున్న నన్ను ‘‘్భయపడకు. ముందుకు వెళ్ళు’’ అంది. తెల్లబోయినట్లు ఆవిడ వంక చూచాను. నేను భయపడుతున్నట్లు ఆవిడకు ఎలా తెలుసు?’’ అనుకున్నాను. ఆవిడ నన్ను గమనించడంలేదు. ఆవిడ కళ్ళననుసరించి నా దృష్టి అమ్మవారిపై మరల్చాను.
ఆ రోజు కనకదుర్గ కన్నుల పండుగ చేసేలా ఉంది. పసుపు రాసిన పచ్చని ముఖం, నల్లటి కనుబొమ్మల మధ్య రూపాయంత కుంకుమ బొట్టు. మెరుపులీనుతున్న బులాకీ, నత్తు, చెవులకు వజ్రాలు, పచ్చలు, కెంపులతో, పెద్ద పెద్ద తటాకాలు. నల్లటి కళ్ళు మన గుండెల్లోకి గుచ్చి చూస్తున్నట్లే ఉన్నాయి. ఎర్రటి పెదిమలపై చెరగని చిరునవ్వు. కనుబొమల మధ్య కుంకుమ బొట్టుతో పోటీ పడుతూ అదే కొలమానంతో పచ్చ, మరకతం కిరీటానికి ఇరుపక్కలా సూర్యచంద్రుల్లా నిలిచాయి. అమ్మ అలంకరణ ఎంత గొప్పగా ఉందంటే,. ఆమె పైనుంచి నా కళ్ళు మరల్చుకోలేకపోయాను.
కాని అంతలోనే నా ఒళ్ళు జలదరించింది. నా దృష్టి ఎక్కువసేపు అమ్మపై నిలపలేకపోయాను. ఆమె దృష్టి నా గుండెల్లోకి చూస్తున్నట్లే అనిపించింది. నా మనసులో మెదిలే ప్రతి ఆలోచన ఆవిడకు తెలిసినట్లే అనిపించింది. నా అసమర్థతకు ఆవిడ పెదిమలు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. ఆ నవ్వును తదేకంగా చూస్తున్న నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. గుండెల్లో పొంగుతున్నదేదో కరిగి కారి పోసాగాయి. ఎందుకనో నాకే తెలియదు. హృదయ ప్రక్షాళనం జరుగుతోంది.
శఠగోపం పెట్టబోతున్న శాస్త్రులవారు నా వంక ఒక్క క్షణం పాటు చూశారు. తలపై తాకిస్తూ ‘‘మనోవాంఛా ఫలసిద్ధిరస్తు’’ అన్నారు.
ఒక్క క్షణం వెర్రిదానిలా అతని వంక చూచాను.
చేతిలో వున్న పూలు ఆయనకు అందించాను. వాటిని తీసుకువెళ్లి దుర్గ పాదాల దగ్గర ఉంచారు. ఆయన ఇచ్చిన కుంకుమ అందుకొని, కన్నీళ్ళు తుడుచుకుంటూ గుడి బయటకు వచ్చాను.
సన్నటి గాలి చివ్వున తిగిలింది. క్షణం సేపు కళ్ళు తిరిగినట్లు అనిపించింది. కొద్దిసేపు గోడను ఆనుకుని ఉండిపోయాను.
శాస్త్రులవారి ఆశీర్వచనమే పదే పదే చెవులలో వినిపిస్తోంది. ‘మనోవాంఛ’- అసలు నా మనసులో ఉన్న వాంఛ ఏమిటి? కాల చక్రం గిర్రున రెండు నెలలు వెనక్కి తిరిగిపోవాలి. నా జీవితం ఎప్పుడూలా ఏ గడబిడ లేకుండా, నిశ్చింతగా అయిపోవాలి.
‘‘అది సాధ్యమా?’’
-ఇంకాఉంది

- రమాదేవి చెరుకూరి