భక్తి కథలు

స్వామియే శరణం అయ్యప్పా! - 54

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏదీ, అందరూ ఒక్కసారి ముక్తకంఠాలతో ఆ స్వానిని మనోనేత్రాలతో దర్శించి నమస్కరించండి.
‘‘హరిహరాసనం విశ్వమోహనం హరితదీశ్వరం ఆరాధ్యపాదుకం
హరి విమర్దనం నిత్యనర్తనం హరిహరాత్మజం దేవమాశ్రయ్! ఓం స్వామియే శరణం అయ్యప్ప’’ అంటూ స్తుతించారు సూత మహర్షి కన్నులరమోడ్చి, అంజలి ఘటిస్తూ!
‘‘ఓం స్వామియే శరణం! శరణం అయ్యప్ప!’’ అంటూ ముక్తంఠాలతో మనులందరూ శరణుఘోష భజన చేస్తుంటే నైమిశారణ్య ప్రాంతమంతా భక్తిపూరిత వాతావరణం నెలకొన్నది!
***
‘‘చాలా బాగుంది తాతయ్యా అయ్యప్పస్వామి చరితం! ఎప్పుడెప్పుడు వెళ్లి ఆ స్వామి దర్శనం చేసుకుంటామా అని ఎంత ఆత్రంగా వుందో తెలుసా నాకు?’’ తాతగారు చెప్పిందంతా ఎంతో శ్రద్ధగా విన్న ప్రణవ్ ఉత్సాహంగా చప్పట్లు చరుస్తూ అన్నాడు!
ప్రణవ్‌కి పనె్నండు సంవత్సరాలు! చురుకైన కుర్రాడు! తల్లిదండ్రులతో అమెరికాలో వుంటున్నా ప్రతి సంవత్సరం సెలవుల్లో ఇండియాకు వచ్చి తాతగారు, నాన్నమ్మల దగ్గర రెండు, మూడు వారాలు గడిపి వెళుతుంటాడు! ఇప్పుడు కూడా తల్లిదండ్రులు తిరిగి వెళ్లినా మరో పది రోజులు తాత, నాన్నమ్మలతో గడిపే అవకాశం వచ్చింది. మనవడు వున్నన్ని రోజులు అతనికి మన హిందీ సంస్కృతి, సాంప్రదాయాల గూర్చి వివరించడం, పురాణ గాథలు చెప్పడం, తమ వెంట యాత్రలకు తీసుకువెళ్లడం అలవాటు సుబ్బారావుగారికి! ఆయన రిటైర్డ్ తెలుగు ప్రొఫెసరు! ఆయన కొడుకు, కోడలు అమెరికాలో సెటిల్ కావడంతో చూడాలనిపించినప్పుడల్లా వెళ్లి చూసి వస్తుంటారు! కుమారుడు దగ్గర లేడని అసంతృప్తితో కుంగిపోతూ వుండరు ఆయన, ఆయన భార్య రాజ్యలక్ష్మి! ఎక్కడ వున్నా పిల్లలు తల్లిదండ్రులను మరచిపోకుండా గౌరవాభిమానాలతో చూస్తే చాలనుకుంటారు వాళ్లు! అందుకే తమకున్న దాంట్లో తృప్తిగా కాలక్షేపం చేస్తూ వుంటారు!
ప్రణవ్‌ని తీసుకుని ఒక రోజు దగ్గర్లో వున్న అయ్యప్పస్వామి గుడికి వెళ్లారు సుబ్బారావుగారు! డిసెంబరు నెల కావడంతో గుడి భక్తులతో కిటకిటలాడుతున్నది! మాలలు వేయించుకుని దీక్ష స్వీకరిస్తున్న భక్తులవైపు ఆశ్చర్యంగా చూస్తూ, అలా ఎందుకు చేస్తున్నారో చెప్పమని తాతగారిని అడిగాడు ప్రణవ్! అందుకు సమాధానంగా ఇంటికి వచ్చాక అయ్యప్పస్వామి చరితం గూర్చి వివరంగా తెలియజెప్పారు సుబ్బారావుగారు! స్వామి చరితం ఎంతగానో నచ్చింది ప్రణవ్‌కి! ఇంకా మరికొన్ని విషయాలు తెలుసుకోవాలని కుతూహలంతో అడిగాడు. ‘‘తాతయ్యా! శబరిమల మీద విగ్రహ రూపంలో వెలసిన అయ్యప్పస్వామి తర్వాత ఏం చేశాడు? ఎవరికైనా కనిపించాడా? ఆ వివరాలు కూడా చెప్పండి ప్లీజ్!’’ అడిగాడు!
‘‘అయ్యప్పస్వామి జ్యోతిగా మారాక జరిగిన విషయాలు పురాణాలలో చెప్పబడలేదు! భక్తులందరూ కాలినడకన అరణ్యప్రాంతంలో కష్టపడి ప్రయాణించి శబరిమలకు చేరుకుని స్వామి దర్శనం చేశాడు గదా! క్రమంగా యాత్ర చేసే భక్తుల సంఖ్య పెరిగి పుణ్యక్షేత్రంగా రూపుదిద్దుకుంది శబరిమల ప్రాంతం! అంతవరకే పౌరాణిక గాథ! అయితే ఆ ప్రాంతంలో వుండే ప్రజలలో ఒక జానపద గాథ చాలా ప్రచారంలో వుండేది! అది అయ్యప్పస్వామికి సంబంధించి వుండటంతో దాన్ని కూడా అయ్యప్ప చరితంలో భాగంగానే భావిస్తారు ఇప్పటికీ ఆ ప్రాంత ప్రజలు! చాలా ఆసక్తికరంగా వుంటుంది ఆ గాథ కూడా! చెప్పమంటావా?’’ అడిగారు సుబ్బారావుగారు! ‘‘చెప్పండి వింటాను!’’ అని ప్రణవ్ ఉత్సాహంగా అనడంతో చెప్పసాగారు సుబ్బారావుగారు!
***
ఎనిమిదవ అధ్యాయం
అయ్యప్పస్వామి జానపద చరితం - స్వామి మహిమ
ధర్మశాస్త పంచరత్నం
‘‘లోక వీర్యం మహాపూజ్యం
సర్వరక్షాకరం విభుం
పార్వతీ హృదయానందం
శాస్తారం ప్రణమామ్యహం
విప్ర పూజ్యం విశ్వవంద్యం
విష్ణుం శంభుప్రియసుతం
క్షిప్రప్రసాదనిరతం శాస్తారం
ప్రణమామ్యహం!
మత్తమాతంగ గమనం
కారుణ్యామృత పూజితం
సర్వవిఘ్నహరం దేవం
శాస్తారం ప్రణమామ్యహం
అస్మత్ కులేశ్వరం దేవం
అస్మద్ శతృ వినాశనం
అస్మదిష్ట ప్రదాతారాం
శాస్తారం ప్రణమామ్యహం
పాండ్యేశ వంగ తిలకం
కేరళే కేళి విగ్రహం
ఆర్తత్రాణ పరందేవం
శాస్తారం ప్రణమామ్యహం!
ఫలశ్రుతి:
పంచ రత్నాఖ్యమే తద్యో నిత్యం శుద్ధః పఠేన్నరః
తస్య ప్రసన్నో భగవాన్ శాస్తా వసతి మానసే!

‘‘అయ్యప్పస్వామి! నీవు శబరిమల మీద వెలసి మమ్మల్నందరిని కాపాడుతూ వుంటానని మాట ఇచ్చావు గదా! మరి ఈ కష్టాలు మాకెందుకు కలుగుతున్నాయి స్వామీ! పాండ్య వంశస్థుడైన రాజశేఖరునికి పుత్రుడివై పందల రాజకుమారుడిగా నీవు పాలించిన పందల రాజ్యం ఈనాడు ఉదయనుడే గజదొంగ దాడులతో ఛిన్నాభిన్నమైపోయింది! ఆ వంశపు వాళ్లు ఇక్కడ కట్టించిన మీ దేవాలయంలో మీ పూజార్చనలు ఎంతో కష్టంమీద జరుపుతూ అరచేతుల్లో ప్రాణాలు పెట్టుకుని బ్రతుకుతున్నాం నేనూ, నా కుమారుడు!
ధర్మదేవతను శాసించే హే! ధర్మశాస్తా! అయ్యప్పా! ఇప్పుడు నామమాత్రంగా మిగిలిన ఈ చిన్న పందల రాజ ప్రభువు రాజశేఖరుడు కూడా మీ దయాదృష్టికోసం ఎదురుచూస్తూ కాలం గడుపుతున్నాడు! మా అందరి కష్టాలు తీర్చి మిమ్మల్ని కాపాడుస్వామి!’’
పందల రాజ్యంలోని ధర్మశాస్తా మందిరం పూజారి స్వామి విహ్రం ముందు నిలుచుని దీనంగా మొరపెట్టుకున్నాడు!
-ఇంకాఉంది

- డా. టి. కళ్యాణీసచ్చిదానందం