ఉత్తర తెలంగాణ

బ్రతుకు పచ్చడి (మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రతుకు పచ్చడి

నేనొక గూడు లేని పక్షిని
కష్టాల కన్నీళ్లలో వేప పూల రుచిని చూశాను!
సంతోష సంబరాలవోలే
బెల్లంలాంటి తీపిని ఆస్వాదించాను!
అవమాన, అరాచకాల్లో
మామిడికాయల వగరును అనుభవించాను
చిన్ని చిన్ని ఆశలకు పులకరించిపోయినపుడు
చింతపులుపును రుచి చూశాను
నేను రుచి చూసింది ఉగాది పచ్చడే కాదండీ..
బ్రతుకు పచ్చడిని కూడా!
బ్రతుకంటే ఉగాది... ఉగాదంటే బ్రతుకు
అయితే లేదండి మరి.. ఆలస్యమెందుకు?
మీరు మీ గతం చుట్టూ తిరుగుతున్నారా?
ఒక్కసారి మీ ఇంటి చుట్టూ తిరిగి చూడండి..
మామిడికాయల పిందెలలో ఉంది నా పిలుపు
నిరాశ, నిస్పృహల్లో ఉన్నారా? అయితే
ఒక్కసారి నింగికేసి చూడండి
వేప పూలతో మీ హృదయాన్ని కడిగే వర్షాన్ని నేను
ప్రకృతే ఉగాది. ఉగాదే ప్రకృతి
ఒక్కసారి మీ గూటి తలుపులు తెరవండి
ఉగాది ఉషస్సులకు ఆహ్వాన పలకండి!
నేనిప్పుడు గూడు దొరికిన పక్షిని!
నా గూడు పేరే ఉగాది!!

- ఎండి.నజ్మ, కాటారం, జయశంకర్ జిల్లా
సెల్.నం.9849645118

నా తెలంగాణ!

జానపదం ఝల్లుమంటుంటే
అచ్చ తెలుగు నా ముంగిట్లో
గుస్సాడీల వాద్యం, పేరిణీల నృత్యం
ఫిలిగ్రీల రూపం, కాకతీయుల శిల్పం
ఇదీ నా తెలంగాణ అని
స్వాభిమానం చాటుతుంటే
భద్రాద్రి రాముడు, యాదాద్రి నరసింహుడు
వేములాడ రాజేశుడు, బాసర దేవీ సరస్వతి
నలుదిక్కుల నలువాడలా సల్లంగ చూడంగా
సమ్మక్క సారలమ్మలు
పోచమ్మ మైసమ్మలు దీవెనలు ఈయంగా..
జాన్న అంబలినే తీర్థం చేసి
గటుక బువ్వతో భోనం పోసి
తంగేడు వనాల తోరణాల నడుమ
తన్మయ హృదయాల ధారణ ప్రతిమ
నా తల్లి తెలంగాణకి
సాష్టాంగ ప్రణామం చేస్తున్నా..!

- బొడ్డు మహేందర్
చెన్నూర్, మంచిర్యాల జిల్లా
సెల్.నం.9963427242

ఎందుకు?

అనుభవాల చిహ్నాలే
అనుభూతులు
అనుభూతులు లేని
జ్ఞాపకాలెందుకు?
జ్ఞాపకాలు లేని
హృదయాలెందుకు?
హృదయాలే లేని
మనుషులెందుకు?
ఎందుకు..ఎందుకు..ఎందుకు..
హృదయాలేలేని మనుషులెందుకు?

- మొగిలి స్వామిరాజ్
బోధన్, జిల్లా నిజామాబాద్
సెల్.నం.9963642205

నవ్వు

ముఖానికి
నిండు అందాన్నిచ్చేది నవ్వు!
బాధలను
మరిపించేదీ నవ్వే!
నవ్వుతోనే..
ప్రేమను చిగురింపజేయగలం!
మనస్సు
తేలిక పడాలంటే..
నవ్వును ఆశ్రయించక తప్పదు!
ఆరోగ్యానికి ఔషధం నవ్వు!
మనకు
సుందర ఆభరణం నవ్వు!!

- చీకట్ల సంగీత
తక్కళ్లపల్లి గ్రామం
జగిత్యాల జిల్లా
సెల్.నం.8374991063

జీవిత మజిలీ

జీవితంలో ప్రతిక్షణం..
కొత్తదనపు అనుభూతుల సమాహారం!
బతుకు పుస్తకంలో పేజీలు ఆత్రంగా
తిప్పేయడం తప్ప
నీవేమి సాధించావో ఆలోచించావా?
ప్రతి పేజీ సారాన్ని జీర్ణించుకోక ముందే..
తర్వాత పేజీ చూడాలనే ఆత్రం..
చివరి పేజీ వచ్చేసరికి
వెక్కిరించే వెనుక పేజీలు..
ముందు ఖాళీగా వున్న తెల్ల పేజీ..
జీవితం చిన్నది
గడిచిన కాలం వెనక్కు రాదు
గతించిన చరితలు
తిరగరాయలము!
జీవితం అంటే బ్రతకడం కాదు..
ప్రతిక్షణం జీవించాలి!
నీ చుట్టూ వున్న గీతను చెరిపేసి..
చుట్టూ వున్న ప్రపంచాన్ని
కొత్తగా చదవడం మొదలుపెట్టు
ఈసారి పుస్తకంలో
ప్రతి పేజీ కొత్తగా
కనిపించడం మొదలవుతుంది!

- గంజి భాగ్యలక్ష్మి, హన్మకొండ, సెల్.నం.9441993044

నవ్వుల రాగాలు

పూలు నవ్వుతున్నాయి
పూజకు తమ జీవితాలు అంకితమైనందుకు!
గాలి నవ్వుతోంది
ప్రాణాలను తానే నిలుపుతున్నందుకు!
నీళ్లు నవ్వుతున్నాయి
నిర్మల ప్రకృతిని తీర్చిదిద్దుతున్నందుకు!
నింగి నవ్వుతోంది
రమణీయ తారకలను రాజిల్లజేసినందుకు!
నేల నవ్వుతోంది
నిఖిలాన్ని తనపై నిలుపుతున్నందుకు!
సూర్యచంద్రులు నవ్వుతున్నారు
రాత్రింబవళ్ల రాగాలను దిద్దుతున్నందుకు
ప్రకృతి నవ్వుతోంది
అన్నీ తానై అలరిస్తున్నందుకు!
అందరూ తనకై కలవరిస్తున్నందుకు!!

- డాక్టర్ అయాచితం నటేశ్వరశర్మ, కామారెడ్డి, సెల్.నం.9440468557

నిత్య నూతనం!

ప్రతి దినమూ కొత్త సమస్యను
నెత్తిన పెట్టి ప్రభవిస్తుంది ఉదయం!
ప్రతి సమయమూ సందిగ్ధ సమయంలా
డోలాయమానంలో ఊగిసలాడుతుంది బతుకు చిత్రం!
ప్రతిక్షణమూ విరామమెరుగని పోరాటం
అలుపులేని ఒంటరిపోరులా జీవనం!
సంశయాలు సందిగ్ధాల నడుమ ప్రభవించిన
నేటి రోజును ఎప్పటికప్పుడు సిద్ధం చేసుకో!
ప్రతిదినమూ ఒక తాజాపుష్పం
నీ కొరకై విచ్చుకుంటుంది!
బతుకులోని మధురిమను పంచుతూ..
శోభను సాధన దిశగా ముందుకు సాగిపొమ్మంటూ
వేకువపిట్ట తెలియని రాగమేదో ఆలాపించింది!
నిత్య నూతనంగా..వైభవోపేతంగా..
ఉత్సాహ ఉత్సవకేళిగా..
బతుకు జీవన చిత్రం ఆవిష్కరించుకో!
దిన దిన ప్రవర్థమానంగా..
ఇక ప్రతి రోజు నీదే!
క్షణ క్షణమూ రాగ రంజితంగా..
అనుక్షణం ఈ జీవనం మీదే!!

- బి.కళాగోపాల్, నిజామాబాద్, సెల్.నం.9441631029

నువ్వు..!

నువ్వు ఈ రోజే
నాటిన విత్తువి
పోరాడాలి ఈ
క్షణం నుండే
ఈ పోరాటాలు
నీకు కొత్త కాదు
చిన్నప్పుడు నువ్వు
నాటిన విత్తనం
భూమిని చీల్చడం
నీకు తెలియనిదా!
కోడి పిల్లలు గుడ్డు
నుండి బయటకు
రావడం గుర్తుకు లేదా!
నీ సంతోషం కోసం
చిన్నప్పుడు నువ్వు
ఏడ్చె ఏడుపులో కూడా
ఉద్యమం దాగుంది..

- గుడికందుల అరుణ్, ఇందుర్తి, సెల్.7093791674