రాజమండ్రి

‘డియర్ ఎడిటర్’... మైలవరపు స్వరం (పుస్తక పరిచయం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయడం అంటూ తగ్గిపోయిన ఈ రోజుల్లో ఉత్తరాల ప్రసక్తి తీసుకొస్తే కాస్త వింతగానే ఉంటుంది. అయితే తెల్లకాగితాల మీదో, ఇన్‌లాండ్ లెటర్ మీదో, పోస్టుకార్డు మీదో కాకుండా, మానిటర్ మీదో, సెల్‌ఫోన్ స్క్రీన్ మీదో సందేశాలు రాయకుండా ఇప్పుడు ఎవరూ లేరు. పోస్టల్ శాఖ ద్వారా ఉత్తరాలు లేదా లేఖలు రాసి పంపడం మాత్రం తగ్గింది. ఇదంతా లేఖా సాహిత్యం మీద కాస్త కురచగా చెప్పుకునే సంగతి. ‘డియర్ ఎడిటర్’ తెలుగులో చెప్పుకుంటే ‘సంపాదక లేఖ’ అన్న మాట. పత్రికలలో వచ్చిన వ్యాసాలపై కాని, జరిగిన ఘటనలపై కాని వివిధ సమస్యలపై కాని వెనువెంటనే స్పందించి లేఖాస్త్రంతో సంధించిన బాణాలు ‘డియర్ ఎడిటర్’ శీర్షికతో మైలవరపు రామమూర్తి రాసిన పుస్తకం. సమాజంలో జరుగుతున్న అనేక సమస్యలపై దృష్టిసారించి ఉండటమే కాదు దాని మీద డియర్ ఎడిటర్ అంటూ ఓ లేఖను కొట్టేయడం. అలానే సామాజిక స్పృహ కొరవడినా ఎవరికైనా, ఎక్కడైనా వెనుకనే ఓ లెటర్. నైతిక విలువ మీద, హేతువాద దృష్టి కొరవడినా సరే లేఖలు ఎక్కుపెట్టడం మైలవరపు వారి దినకృత్యం. నిజమే మరి న్యూస్‌పేపర్‌లో వచ్చే విషయాలు ఆయన్ని నిలువ నీయవు. ఏది ఏమైనా సంఘంలో మంచిని పెంచడానికి, చెడును ఎండగట్టడానికి రామమూర్తి ఆయుధంగా ఎంచుకున్నారు ‘లెటర్’ను. అవి వివిధ దినపత్రికలు ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, వార్త, ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కి ఈ లేఖలు పంపేవారు.
రచయిత మైలవరపు వారు ఎక్కువ లేఖలు సాహితీ సంబంధమైన విషయాలు కనుక ఆయనలోని సాహిత్యాభిలాష ఈ లేఖలో యిమిడి ఉండటాన్ని గమనిస్తాము. ఇవేకాక సామాజిక బాధ్యత కలిగిన అనేక విషయాలపై వ్రాశారు. ప్రముఖులు రాసిన ఉత్తరాలు ఎంత చైతన్యపరిచినవో ఎంత స్ఫూర్తిదాయకమై నిలిచాయో చరిత్ర గతంలోకి చూస్తే తెలుస్తుంది. ముఖ్యంగా స్వాతంత్రోద్యమ కాలంలో జైలు నుంచి నెహ్రూ రాసిన లేఖలు ఇందిరాగాంధీ రాజకీయ సంపత్తికి దోహదపడిందంటారు. అలానే ఈ లేఖలు ఆనాటి కాలమాన పరిస్థితులను అంచనా వేయటానికి ఉపకరిస్తాయి. కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గురించి ఒక లేఖ రాస్తూ ఆయనలోని నిరంకుశ, నిర్భీతి, అహంభావ ధోరణులు వారికి అలంకారాలుగా భాసిల్లేవి అంటారు. భవన్స్ జర్నల్‌లో పదిహేను నెలలపాటు ‘నా దృష్టిలో రామాయణం’ శీర్షికన ధారావాహికంగా వ్యాసాలు రాసి ఆంగ్లంలో కూడా ప్రశంసనీయమైన పాండిత్యం కనపర్చారంటారు. అలాగే శ్రీశ్రీ చనిపోయినప్పుడు ఆయన స్మృతార్థం తపాలా బిళ్ల విడుదల చేయాలని కోరడంతోపాటు ప్రజలూ ప్రభుత్వం శ్రీశ్రీ కుటుంబ సభ్యులకు సహాయపడే పద్ధతులు కూడా ఆలోచించాలనటం పౌర బాధ్యతకు నిదర్శనం. మత విశ్వాసి, దైవభక్తులు మైలవరపు వారు. అయితేనేమి తగదు అనిపిస్తే... 1985లో తెనాలిలో పుష్పగిరి పీఠాధిపతులు జగద్గురు శంకరాచార్యుల వార్ని వజ్రాలు పొదిగిన బంగారు కిరీటంతోను ఇతర రాజ లాంఛనాలతో అలంకరించిన వార్త చూసి ఆయన ఖండించారు. అదే లేఖ రాశారు. అలాగే జయేంద్ర సరస్వతి విషయంలో వెనుకడుగు వేయలేదు. 87 సంవత్సరంలో ప్రముఖ న్యాయవాదిని పట్టుకొని ‘మొరిగే కుక్క’గా ప్రస్తావించడం ప్రధానమంత్రికి తగదన్న కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి.. మత సంబంధమైన వ్యవహారాల్లో రాజకీయ నాయకులు జోక్యం చేసుకోకూడదనటం సబబా? అంటారు. రామమూర్తి రాసే ఉత్తరాలు విమర్శనాత్మకంగానే కాదు ఆలోచనాత్మకంగా ఉండటం వల్ల ఆయన లేఖలు ప్రజాభిమానం పొందాయి. రాజమండ్రి పేరు మార్పు గురించి ఆయన ఎండగట్టిన విధానం పాతికేళ్ల కిందటే చేసేసారు. మహాపుష్కరాల పేరిట తమ పార్టీ ప్రజాప్రతినిధి ఓ రిక్వెస్ట్ పెడితే అది రాజమహేంద్రవరం అయిపోయింది. ఊరి పేర్లు మార్పిడి అనవసరం అంటారు.
అన్నగారైన తారకరాముడ్ని కూడా సుతిమెత్తగా చీవాట్లు పెట్టారండోయి మైలవరపువారు 1983లో వివాహితైన పరస్ర్తితో సాగించిన ప్రణయం తరువాత పరిణయం గురించి చెప్తూ ‘పెద్దలెట్లు వ్యవహరింతురో దానినే సామాన్యులనుకరింతురు. వారేర్పరిచిన ప్రమాణమునే జన సామాన్యము అవలంబింతురు’ గీతలోని మాటను తన రాతతో ఆంధ్రభూమి ద్వారా చెప్పారు. గొప్ప ప్రజ్ఞా పాటవాలున్న సినీ తారల మీద ఆయన అభిప్రాయాలు తెలుగు పాఠకులతో పంచుకొన్నారు. అలనాటి నటీమణి భానుమతిది ప్రత్యేక వ్యక్తిత్వం. ఆమెకు ‘దాదాఫాల్కే’ అవార్డు ప్రకటిస్తే తిరస్కరించడం జరిగింది. ఆ అవార్డు స్థాయిని దాటిపోయాననడం తానే ఒక దాదా ఫాల్కేననడం ఆమెకు తప్పక ఒప్పుతుందంటారు. చలనచిత్ర రంగాల్లో అన్ని శాఖల్లో పరిణతి సాధించడం వల్ల ఆమె ఆ మాట అనగలిగారంటారు. మరోసారి ఆమె డిగ్రీ విషయం మీద లేఖ రాయడం ప్రజ్ఞకు డిగ్రీలు కొలమానం కావు కథా రచయితగా కూడా ఆమె పేరు ప్రముఖమయింది. ఎక్కడైనా ఎప్పుడైనా సరే అమానవీయంగా మాట్లాడితే చాలు ఆయన కలం పదునుదేలిపోతుంది. ఇలాంటి లేఖలే కాదు సత్యసాయి సేవల మీద, ఆయన సోత్కర్ష మీద, ప్రముఖుల విగ్రహాల మీద, మనకు తెలీని ప్రముఖుల జీవితాల్లోని అంశాల్ని తన ఉత్తరాల ద్వారా తెలిపారు. లోక నాయక్ జయప్రకాష్‌నారాయణ, వావిలాల గోపాలకృష్ణ, రామనాథ్ గోయంకా, ఉషశ్రీ, అడవి బాపిరాజు, బాపు వంటి వార్ల వ్యక్తిత్వ విలువలు ఆయన ఉత్తరాల్లో ప్రత్యేక ప్రస్తావన ఉంది. 1974 నుంచి లేఖలు రాయడం అలవాటుగా ప్రారంభించి ఆయన ఇంగ్లీషు, తెలుగు భాషల్లో మొత్తం మూడువేలు వరకు ఉంటాయి. ఎంపిక చేసుకున్న ఇంగ్లీషు లెటర్స్‌ను 2006 ఒక పుస్తకంగా కూడా అచ్చువేశారు. నిత్య విద్యార్థిని అని చెప్పుకునే రామమూర్తి ఇప్పటివరకు ఆరు పుస్తకాలు రాశారు. రెండు ఇంగ్లీషు రచనలు కూడా ఇందులో ఉన్నాయి. మంచి సుగుణ స్వభావాలున్న సహజ రచయితను మనం చూడొచ్చు మైలవరపు రామమూర్తి సంపాదక లేఖల్లో. కొత్త సమాజానికి కిటికీల్లాంటివి ఈ లేఖలు.

ప్రతులకు:
జయసూర్య ఆశ్రమం
6-150/5/2, సాయిరామ్ కాలనీ
కొంతమూరు
రాజమహేంద్రవరం రూరల్ - 533102
వెల: అమూల్యం, పేజీలు: 85

- రవికాంత్, 96424 89244