రాజమండ్రి

తమదాకావస్తే.. (కథానిక)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామారావు ప్రభుత్వ ఉద్యోగిగా రిటైరై ఐదేళ్లయింది. ప్రభుత్వ పింఛనుతో భార్య జానకి, కుమారుడు సురేష్‌తో కలిసి ఆయన కాలం వెళ్లదీస్తున్నాడు. విశ్రాంత ఉద్యోగి అయినా జీవికకు ఏదోఒక పనిచేయక తప్పదు. ఏదో పని కల్పించుకోక తప్పదు. తన ఏకైక పుత్రుడు సురేష్‌ను బాగానే చదివించినా వచ్చే ఉద్యోగాలన్నిటినీ కాలదన్నుతూ బాధ్యతా రాహిత్యంలో అగ్రస్థానంలో నిలుస్తున్నాడు. దీంతో రామారావుకు అరవై మూడేళ్లు పైబడుతున్నా ఇంటి బాధ్యత మరింత పెరిగింది. మార్కెట్ పనిమీద ఆయన బజారుకు బయలుదేరాడు. పక్కింట్లో ఆధిపత్యం కోసం అత్తా-కోడళ్ల మధ్య రేగిన వాగ్వివాదం ఆయన ప్రమేయం లేకుండా చెవిన పడింది. తెలియకుండానే ఆయనలో ఆసక్తి రేగింది. అత్తా కోడళ్ల మధ్య ఆ ఇంటి యజమాని నలిగిపోతున్నాడని అర్థమయింది. వాళ్ల తగవులో తలదూర్చలేక, తల్లికీ భార్యకూ సమాధానం చెప్పలేక ఇంటి యజమాని ఏదో పని వంకతో బజారు దారి పట్టాడు. అత్తా కోడళ్ల తగవు అంతకంతకూ పెరిగిపోతోంది. నోటి దురుసు పుణ్యమాని అత్త నోరుజారటంతో కోడలు కూడా తానూ తక్కువేం తినలేదన్నట్లు మాటకు మాట బదులిస్తోంది. ‘నాముందు నీ బతుకెంత?’ అని అత్త అంటే, ‘నాముందు నీ వేషాలు సాగవు’ అంటూ కోడలు సవాలు విరుసుతోంది. వారి మాటల యుద్ధం రామారావుకు మాత్రం బాహుబలి-2 సినిమా అంత ఆసక్తి కలిగిస్తోంది. పైగా రామారావు పక్కింటి భాగ్యానికి నోచుకోవటంతో ఆయనింటి కిటికీలు, తలుపులు కూడా ‘చూసుకో నా రాజా..!’ అంటూ రెచ్చగొడుతున్నాయి. పాపం! ఆ అత్తాకోడళ్ల మధ్య ఇంటి యజమాని ఎంతగా నలుగుతున్నాడో అనుకుంటూనే ‘అయినా అతను ఇంటి యజమాని కదా! పైగా పెద్ద ఉద్యోగస్తుడు. తనకేమీ పట్టనట్లు ఊరుకుంటాడేమిటి? వారిద్దరి తగవుకు ఏమాత్రం పరిష్కారం కనిపెట్టక, అదుపులో పెట్టక, అలా ఏమీ పట్టనట్టుగా పని వంకతో తప్పించుకుంటాడేమిటి? ఆమాత్రం తల్లికి, భార్యకూ సర్దిచెప్పలేడా? యజమాని ఏమాత్రం పట్టించుకోకపోతే ఇల్లు నిత్యం కలహాల కాపురమే కదా! నా దృష్టిలో అతను చేతకానివాడే. చేవలేనివాడే’ అంటూ పరిపరివిధాల ఆలోచిస్తున్నాడు రామారావు. తారస్థాయికి చేరాక అత్తా కోడళ్ల వాగ్యుద్ధం తగ్గుముఖం పట్టటంతో యథావిధిగా ఎవరి పనుల్లో వారు నిమగ్నమయ్యారు. వాళ్లు మాత్రం ఎంతసేపని ఘర్షణ పడతారు? తమ పనులకోసమైనా విరామం కోరక తప్పదుకదా!
ఇక రామారావుకు తన పని గుర్తుకొచ్చింది. బజారుకెళ్లి పని పూర్తి చేసుకున్నాడు. ఇంట్లోకి అడుగు పెట్టీపెట్టగానే వినరాని మాటలేవో వినిపిస్తున్నాయి. ఆయన కొడుకు సురేష్ తల్లిని ప్రశ్నిస్తున్నాడు. ‘అమ్మా! నాన్న నాకెప్పుడూ డబ్బులిమ్మంటే ఇవ్వడేమిటి? ఇచ్చినా అవసరం మేరకే గీచిగీచి ఇస్తాడు. నాకూ సరదాలుంటాయి కదా! బయటకు అడుగు పెట్టాలన్నా డబ్బులు కావాలి కదా! ఇంటి ఖర్చులకని నాన్న నీకిచ్చిన 10వేల రూపాయల్లో కనీసం ఆరువేలైనా నాకు కావాలి’ అంటూ డిమాండ్ చేస్తున్నాడు. ‘నాయనా సురేష్! నీకు సరైన చదువుండీ ఏ ఉద్యోగమూ చేయక, ఇలా ఎన్నాళ్లు గడుపుతావురా? నీకు డబ్బుల విలువ ఎప్పుడు తెలుస్తుందిరా? మాకు కష్టం కలిగించాలనే ధ్యేయంగా పెట్టుకున్నావా?’ అంటూ కొడుకు తీరుపై ఆవేదనగా చిరుకోపం ప్రదర్శిస్తోంది ఇంటి యజమానురాలు జానకి.
ఎదురుచెప్పటంలో సిద్ధహస్తుడైన సురేష్ ‘నా చదువుకి తగిన ఉద్యోగం వస్తేనే చేస్తా. అంతవరకు నువ్వు చెప్పినా, నాన్న చెప్పినా, చివరికి ఆ బ్రహ్మ చెప్పినా వినేదిలేదు’ అంటూ డబ్బులివ్వమని గొడవ చేస్తున్నాడు. ఇవ్వనని మొండికేసింది జానకి. అమ్మ చేతిలోని పది వేలల్లో ఆరు వేల రూపాయలు బలవంతంగా లాక్కొని, తండ్రి వచ్చినట్లు గమనించినా చూడనట్టుగానే బయటికి వెళ్లిపోయాడు సురేష్.
జానకి నిస్సహాయురాలై నిలబడిపోయింది తప్ప ఏమీ చేయలేకపోయింది. అప్పటికి గానీ తన భర్త రాకను గమనించలేదామె. ఇంతసేపూ తన భార్య, కొడుకు మధ్య జరిగిన వాగ్వివాదం రామారావుకు మనోవేదనగా, వీనులవిందుగా ఏమీ లేదు. ఎందుకంటే ఇది తన కుటుంబ సమస్య కదా! ఎదురింటిదో, పక్కింటి సమస్యో కాదుకదా! వ్యక్తులు వేరైనా, విషయాలు వేరైనా, సమస్యలు సమస్యలే కదా! ఆ పక్కింటి యజమానిలా తనూ ఒకింటి యజమానే కదా! తన కొడుక్కి సరైన చదువు ఉన్నా, తన భార్య చేసే అతి గారాబంతో పాటు సోమరితనం, నిర్లక్ష్యం అలంకారాలుగా అమరాయి. అందుకే సమస్యలకు సురేష్ ప్రాణం పోస్తున్నాడు. ‘పరాయివాళ్లెవరైనా గొడవ పడుతుంటే ఆసక్తిగా చూస్తుంటాం. వాళ్ల సమస్యలు చెబుతుంటే పరమానందంగా ఆలకిస్తుంటాం. వాళ్లు కోరకున్నా ఉచిత సలహాలు ఇచ్చిపారేస్తాం. ఆపై వాళ్లను చులకనగా చూస్తాం. ఎంతైనా జీవకోటిలో మనం మానవులం కదా! అందరినీ సమదృష్టితో చూడాలంటే మనకు విశాల హృదయం ఉండాలి కదా! అయితే ఒక్కోసారి మనం విచక్షణా శక్తికి పదును పెడుతుంటాం. కనుక, సమయ సందర్భాలను బట్టి మనం విశాల హృదయాన్ని ప్రదర్శిస్తుంటాం. విచిత్రమయింది కదా మన మనస్సు!’ అనుకుంటూ ఆలోచనల పరంపర నుంచి బయటి ప్రపంచంలోకి వచ్చిన రామారావు చివరికి ఓ గట్టి నిర్ణయానికొచ్చాడు.
‘ముందుగా సురేష్ తీరు వల్ల ఇంట్లో ముదురుతున్న సమస్యకు పరిష్కారం వెదకాలి. అందుకు ఓర్పు, సహనం, జానకి సహకారం ముఖ్యం. సురేష్‌కు కష్టం విలువ తెలిసేలా కఠిన నిర్ణయం తీసుకోవాలి. అప్పుడు కానీ వాడికి డబ్బు విలువ తెలిసిరాదు. పిల్లలకు తల్లిదండ్రుల ప్రేమ అవసరమే. కానీ, అది హద్దులు దాటితే వారి భవిష్యత్తే అంధకారంగా మారుతుంది. ప్రేమ సంగతి దేవుడెరుగు. దీనివల్ల చివరికి పిల్లలే మనకు శత్రువులవుతారు. ఈ చేదునిజం ఏ తల్లిదండ్రీ ఎప్పటికీ మరిచిపోకూడదు’ అనుకుంటూ ఓ సమయోచిత కఠిన నిర్ణయం వైపు అడుగులేశాడు రామారావు.

- గాడేపల్లి మల్లికార్జునుడు, చరవాణి : 9000749651