విజయవాడ

ఓ కర్రి కోయిలమ్మ.. (మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓ కర్రి కోయిలమ్మ..

పాత పల్లవినెందుకె పదేపదే పాడేవు?
పట్టుజారిపోతున్న పాత రాగంతోటి
అలుపురాదటే నీకు లాగి లాగి కూసేవు
ఎవ్వరిచ్చారె నీకు
ఆస్కార పత్రాలు, పురస్కార గుచ్ఛాలు
అవని అంతా నాదని అడవితల్లే నాదని
గున్నమావి తోపుల్లో
గుబురు చిగురులు మెక్కుతు పచ్చి
కచ్చిగ కూస్తు రెచ్చిపోతున్నావు
పాత పల్లవినెందుకె పదేపదే పాడేవు?
శ్రవణ దోషమొదిలించే
కొత్త రాగమెత్తుకో
పాతను పాతర వేస్తూ
కొత్త దారినెంచుకో
మొండికోయిల నువ్వు మొనగత్తెవటే?
రాజ్యాలు పోయాయి రాజులు పోయారు
మావిచిగురులలోను వగరు మారుతోంది
పుల్లమావిళ్లలో పులుపు జారుతోంది
ఇన్ని మారుతువుంటె
నీ పాత పల్లవినెందుకె పదేపదే పాడేవు?
గళం మార్చవె గుంట గళం మార్చు
గతపు కూతలు మాని గమ్యాన్ని ఎంచుకో
రాటుదేలవె బుడింగి రాటుదేలు
అతివ అందాలనంత కొత్త రాగంతోను తట్టిలేపు
శృంగార గాయాలతో చెమ్మచెక్కలాడించు
సిగ్గు దోచెయ్ అంటు, వళ్లు వలుచుకొమ్మంటూ
జననాడిని పట్టి కుమ్మేసి వదులు
గళమెత్తి రెచ్చిపో
పచ్చిపచ్చిగ రెచ్చిపో
పాటలతొ రెచ్చిపో
ఆస్కారులు నీవె
పురస్కారాలు నీకె
పసిడి కంకణాలు నీవె
పట్టుశాలువాలు నీకె!

- యర్రంశెట్టి పాప,
విజయవాడ.
చరవాణి : 9966771999

తొలి నేస్తం

కారుచీకటి నా కంట
అప్పుడే వెనె్నల జల్లుతున్న
చందమామ మా ఇంటి ముంగిట
పూల పరిమళాలు
మోసుకొస్తున్న పిల్లగాలులు
ఆరుబయట విశ్రమిస్తున్న
పల్లెవాసులు
ఎంత అందమైనదో కదా
ఆ ప్రకృతి చిత్రం!
ఆ సమయాన
నాకు వినిపించేవి
కొన్ని మధురమైన మాటలు
అవే నాన్న చెప్పే నీతికథలు
తిరిగిరాని నా బాల్యం
మరపురాని ఆ కథలు
నాకెప్పటికీ మధుర స్మృతులే!
నాన్న, నాన్న మాత్రమే కాదు
నా తొలి మిత్రుడు కూడా!
నేనానందపడితే
నాన్న మరమానందభరితుడు
నేను బాధపడితే
నాన్న ఓదారుస్తాడు
నేను భయపడితే
భుజం తట్టి ధైర్యం
చెబుతాడు
నేను వెనుకంజ వేస్తే
చేయూతనిచ్చి
ముందుకు నడిపిస్తాడు
నానే్న నా నేస్తం
తొలిసారి నాన్న గుండెలపై
తలవాల్చినపుడు తెలిసింది
నాకోసం నాన్నపడే తపన
తన హృదయ స్పందన
తెలిసిన భావన
ప్రతిధ్వనిలా నాకు
వినిపిస్తూనే ఉంటుంది
ఎప్పటికీ!

- కట్టా శ్రావణి,
జగ్గయ్యపేట, కృష్ణా జిల్లా.
చరవాణి : 9912450428

రాలిన సుమాలు

నీ చూపులు వర్షించని క్షణం
భావాలు ఎండి బీటలువారాయి
నిన్ను శ్వాసించని నిముషం
ప్రాణం అనంతవాయువుల్లో
నిశీథాలకు చిక్కుకుంది
నీ పలుకులు ప్రసరించని సంధ్యలో
నా అంతరంగ సంద్రం
వెలవెలాబోయింది
నీ ఆలోచనల రహదారిలో
నేను పరచిన ఎదపానుపు
నీ నిష్క్రమణపు పదఘట్టనలతో
కుంగిపోయింది
నా కన్నుల కాంతిరేఖలు ముకురంలో
ప్రతిఫలించిన క్షణం నుంచీ
గుండెలో వెలుగుతున్న
నీ రూపాన్ని కళ్లకద్దుకున్నా
నా తోటలో పూవులు
విచ్చుకునే నిశ్శబ్దంలో
నీ చరణాల శ్రుతి కోసం
వీనుల వాయులీనాలను
ఎదకానించుకున్నా
అస్తమించే వయసుకి
ప్రభాత యవ్వనాన్ని
బాధ్యతావలయిత
హృదయానికి
ప్రణయ సౌకుమార్య సౌందర్యాన్నిచ్చిన
ఊహల విహంగాలకు
ఆశల రెక్కలు తొడిగి
రంగుల లోకంలో విహరింపజేసిన
నీవు వస్తావని
ఏ ఎదకోవెల ద్వారాలు తెరిచి
ఎదురుచూడను? నేస్తం!

- దేవికా రత్నాకర్,
తెనాలి, గుంటూరు జిల్లా.
చరవాణి : 9908706218