విజయవాడ

నిదానపురం బాలకవుల ‘వెలుగుబాట’! (పుస్తక సమీక్ష)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విద్యార్థుల్లో దాగిన సృజనను వెలికితీయగలిగే సామర్థ్యమున్న గురువు లభిస్తే ఆ శిష్యుడు భావి సమాజానికి మార్గనిర్దేశనం చేయగలిగిన జ్ఞానుడు అవుతాడనటంలో అతిశయోక్తి లేదు. అలాంటి గురువులు ప్రాచీన కాలంలో ఎందరో శిష్యులను తయారుచేయటం వల్లే మనదేశ సంస్కృతి వేనోళ్ల కొనియాడబడుతోంది. నేటి ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల పనితీరు అనేక విమర్శలకు గురవుతున్న తరుణంలో విద్యార్థుల్ని శక్తిమంతులు, బాధ్యాతాయుతులైన పౌరులుగా తయారుచేయగలమని నిరూపించారు ఖమ్మం జిల్లా నిదానపురం ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు. మాతృభాషపై మక్కువ పెంచటమే కాకుండా కవిత్వంపై ఆసక్తి కలిగించి క్రమేణా ఛందోబద్దమైన పద్యరచన చేయటంలోనూ తర్ఫీదునిచ్చి తమ విద్యార్థులతో శత పద్య సంకలనం తెచ్చారు తెలుగు ఉపాధ్యాయుడు కొమ్మవరపు కృష్ణయ్యగారు. ఇదివరలో ఇదే పాఠశాల విద్యార్థులతో ‘బాలకిరణాలు’ కవితా సంకలనం ప్రచురించి సాహితీలోకానికి విద్యార్థుల కవితాశక్తి ఏమిటో తెలియపరిచారు. అంతటితో ఆగకుండా వారికి పద్యం రుచిచూపించి నిరంతర కృషితో ఆ విద్యార్థులతోనే ఆటవెలది పద్యాలు రాయించే స్థాయికి తీర్చిదిద్దిన కృష్ణయ్య మాస్టారు మనసు నిండా మానవత్వం నిండిన ఉత్తమ బోధకులు. ఎందుకంటే మట్టిలో మాణిక్యాలను వెతికి పట్టుకొని సానబట్టి మరింత వెలుగులు విరజిమ్మగల ఓర్పు, నేర్పు ఆయనకున్నాయని నిరూపించింది ‘వెలుగుబాట’ శత పద్య సంకలనం.
గద్యం చదవటానికే ఎంతో కష్టపడటమే కాకుండా తెలుగుభాషను చిన్నచూపు చూస్తున్న నేటికాలంలో ఈ సంకలనంలోని పద్యాలు చదువుతుంటే విద్యార్థులకు భాషపై ఉన్న పట్టు, మాతృభాషపై వారికున్న ప్రేమ, అభిమానం తేటతెల్లవౌతాయి. 8వ తరగతి చదివే విద్యార్థిని వట్టివేళ్ల శ్రీలక్ష్మి తన గట్టి వేళ్లతో కలంపట్టి కులమతాలను పట్టి వెంపర్లాడే వారిని ఎండగడుతూ రాసిన పద్యం ఎంతగానో ఆలోచింపజేస్తుంది.
‘కులము మతము యంటు కొట్టుకోకుండుము
ఒకరినొకరు కలసి ఓర్మితోడ
కలసి మెలసి ఉండు కలకాలము ధరపై
ఇల నిదానపురపు వెలుగుబాట’
ఈ పద్యాన్ని మనముందుంచటం ద్వారా శ్రీలక్ష్మి సామాజిక స్పృహ అవగతవౌతుంది. ‘వాగ్భూషణం భూషణం’ అన్న భర్తృహరి భావనను వంటపట్టించుకున్న గోరింట్ల అజయ్‌కుమార్ ‘మంచిమిత్రు గెల్వ మంచి వాక్కవసరం/ సత్యవాక్కు కీర్తి సల్పు మనకు/ తాను జారుమాట తలకొరివిని దెచ్చు/ ఇల నిదానపురపు వెలుగుబాట’ అనే పద్యం రాసి సత్యం పలకటం వల్ల కలిగే ప్రయోజనాన్ని తెలియజేశాడు. మరో పద్యంలో లంచగొండి అధికారులకు కనువిప్పు కలిగిస్తాడు. తల్లిదండ్రులను మరిచిపోయే ప్రబుద్ధులకు హితబోధ చేస్తూ రాసిన ఈ పద్యం చూడండి. ‘విగ్రహముల మొక్కి విసుగు చెందుటేల/ రాయి నీకు రాత రాయలేదు/ భక్తితోడ నీకు బతుకునిచ్చిన వార్ని/ బుద్ధి శుద్ధి తోడ పూజమేలు’ అంటాడు. పదో తరగతి చదివే ఈ అభినవ వేమన అలవోకగా 18 ఆటవెలదులు అందించాడు. మరో పదో తరగతి విద్యార్థి బాదా షాబాష్‌రెడ్డి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం స్ఫూర్తిని రగిలించే ముచ్చటైన మూడు పద్యాలు అందించాడు. షేక్ యూసఫ్ అనే విద్యార్థి ‘మంత్రగాళ్ల యొక్క మాయ నమ్ము నరుడు/ మాయ చేసి బతుకు మార్చు నరుడు/ చెరుపుగాక వాడు చెరబట్టి పోవును/ ఇల నిదానపురపు వెలుగుబాట’ అంటూ మంత్రాలు, మాయమాటలతో బురిడీ కొట్టించే మోసగాళ్లను నమ్మవద్దంటాడు. సిమినేని పూజిత చదువు గొప్పతనాన్ని తెలియజెపితే, షేక్ జాన్‌బీ మొక్కలు పెంచాల్సిన అవసరాన్ని మనకు చెపుతుంది. అభిలాష్ పల్లెల భాగ్యాన్ని తెలియజేస్తే, అల్లు అఖిల్ సినిమా పిచ్చి వల్ల కలిగే నష్టాన్ని తెలియజేస్తారు.
‘మద్యపాన మంటు మదమెక్కినోళ్లకు/ భార్యబిడ్డలనెడ బాపువాడు/ దేశదిమ్మరులుగ తిరుగు నరులకును/ బతుకు హక్కులేదు భువనమునను’ పనిచేసే వాడికే జీవించే హక్కు అనే కారల్ మార్క్స్ భావజాలం దాగిన ఈ పద్యం మేసిపోగు ప్రవీణ్‌కుమార్ కలం నుంచి జాలువారింది. సోమరిపోతులు, తాగుబోతులకు ఈ భూమిపై జీవించే హక్కు లేదంటాడు. వాస్తవంగా అలాంటి వారివల్ల వారి కుటుంబానికి, సమాజానికి గానీ ఉపయోగం లేదు సరికదా, నష్టమే ఎక్కువ. ఇలాంటి ఆలోచనలు ఈ చిన్నిబుర్రల్లో రావటం, సమాజాన్ని చైతన్యపర్చాలనే తపన దాగి వుండటం ముదావహం.
‘అమ్మ, అక్క, చెల్లి, అర్ధాంగి కావలె/ కూతురొద్దంటు కుట్రచేస్తె/ ఇంతి లేకయున్న ఇలన నరుడు లేడు/ ఇల నిదానపురపు వెలుగుబాట’ అంటూ స్ర్తి ప్రాధాన్యతను తెలియజేసే పద్యాన్ని 9వ తరగతి చదివే షేక్ షమీమున్ రాసింది. షట్కర్మయుక్తగా కులధర్మపత్నిని చూసిన భారతీయ సమాజంలోనే స్ర్తి పట్ల చిన్నచూపు ఉండటం, కూతురు పుడితే కుట్రలు చేసి మట్టుపెట్టటం వంటివి జరిగే పరిస్థితి రావటం మన దౌర్భాగ్యం. ఎన్ని చట్టాలు వచ్చినా సమాజంలో మార్పు రావటం లేదు. అందుకే స్ర్తి లేకపోతే నీకు పుట్టుకెక్కడిదని ప్రశ్నిస్తోంది ఈ చిట్టితల్లి. సమాజంలోని దుష్టాంతాల్ని కలంపట్టి ఎత్తిచూపటమే కాకుండా వాటికి పరిష్కారాలను చెపుతూ 21 పద్యాలతో వెలుగుబాటను పరిచింది షమీమున్. ‘పాడిపశువెరగదు పాపపుణ్యములను/ మంచి గోవు వినును మనిషి మాట/ దాని పాలు తాగి దానినే మరచియు/ దాని ఉసురు తీయు పాపమె కద’ గోమాంసం భక్షించటం తప్పుకాదంటూ వాదనలకు దిగి, బీఫ్ ఫెస్టివల్ జరిపే గోమాంస భక్షకులకు కనువిప్పు కలిగేలా కనపర్తి రమ్య రాసిన ఈ పద్యం కరుణ రసామృతంగా ఉంది. మన దేశంలో గోవులను పవిత్రంగా భావించటం ఎప్పటినుంచో ఉన్నదే. హిందూ మతంలోనే గాక జైన, బౌద్ధ, జొరాష్ట్రియన్ మతాలు, ప్రాచీన ఈజిప్ట్, గ్రీస్, రోమ్, ఇజ్రాయెల్, జర్మనీల్లోనూ పశువులను పవిత్రంగా భావిస్తారు. జిహ్వచాపల్యం కోసం గోమాతను హత్యచేసి భక్షించేవారికి గోహత్య మహాపాతకం అని తెలుసుకోండని హెచ్చరిస్తోంది రమ్య.
మానవీయ సంబంధాలు మంటగలుస్తున్న నేటి సమాజంలో భార్య మాట విని కన్నతల్లిని కూడా తన్ని తరిమేసే కుసంస్కారులు తల్లి విలువను తెలుసుకోమని చాటిచెప్పే పద్యాన్ని 7వ తరగతి చదివే షేక్ నాగుల్‌బీ అక్షరీకరించింది. ‘తల్లియున్న వారు తన్ని తరుముతుంటె/ తల్లి లేనివారు తల్లడిల్లె/ సర్వమాయె కొడుకు సహధర్మచారిణి/ ఇల నిదానపురపు వెలుగుబాట’. ఈ సృష్టిలో అత్యంత తీయనైనది అమ్మ పదం. భర్తల్ని తమ చెప్పుచేతల్లో పెట్టుకొని తల్లీ కొడుకుల్ని దూరం చేయాలనుకునే ఆడవాళ్లకు తాము కూడా అదే పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తుందని చెప్పకనే చెప్పింది ఈ చిన్నారి. అమరవాది శ్రీలావణ్య రాసిన పద్యంలో కాకి గొప్పతనాన్ని చాటిచెప్పి కాకిని ఎగతాళి చేయొద్దని వేడుకుంటూ పక్షిప్రేమను చాటిచెప్పింది. ఇంకా స్నేహం, మాట మంచితనాన్ని గురించి పద్యాలల్లింది. ఇంద్రసేనారెడ్డి వలస కూలీల బతుకు చిత్రాన్ని చూపెడితే, జంగం పావని మద్యపానం వల్ల కలిగే నష్టాన్ని, సెల్లు వల్ల కలిగే ఇబ్బందుల్ని, గురువు గొప్పతనాన్ని, స్నేహం విలువను ఆటవెలదుల ద్వారా అందించారు. పావని రాసిన మరో పద్యంలో ‘సంప్రదాయమొదిలి సరదాల కోసము/ చిన్నబట్టలేసి చిందులేయు/ అంత దుస్తులేచె అవసరమేమొచ్చె/ పరువుతీయునట్టి పనులు ఏల?’ అంటూ ప్రశ్నిస్తుంది. ఈ పద్యం చాలు ఆడవాళ్ల పరువు తీసే మన సంప్రదాయాలు, సంస్కృతిని నిర్వీర్యం చేస్తున్న వారిపై ఎంత కోపం కలిగివున్నారో చెప్పటానికి. అంతేకాకుండా మన సంస్కృతీ విలువల పట్ల ఈ విద్యార్థులకు వున్న అవగాహన, గౌరవాల్ని చూస్తే ముచ్చటేస్తుంది. ఇలాంటి భావాల్ని తెలుసుకోవాలంటే 24 మంది విద్యార్థుల ఆలోచనామృతాలతో అక్షరీకరించిన ‘వెలుగుబాట’ చదవాల్సిందే.
పద్యం రస నైవేద్యమే కాదు, తెలుగువారి సంస్కృతీ సంప్రదాయాల్ని, విలువల్ని తెలియజేయటంతో పాటు సామాజిక చైతన్యం కలిగించే మాధ్యమం. ‘పద్యాలంటే పాతతరానికి సంబంధించిన ప్రక్రియ.. మాదంతా ఆంగ్లపు తోటలో విహరించే నవీనత’ అనేవారి చెంప ఛెళ్లుమనిపించేలా విద్యార్థుల్లో భాషా నైపుణ్యాల్ని పెంపొందింపజేసి ఆటవెలదులతో ఈటెలను విసరగల దిట్టలుగా వారిని తీర్చిదిద్ది, అక్షరాయుధాలతో నేటి దుస్థితిని మార్చే ప్రయత్నం చేస్తున్న కృష్ణయ్య మాష్టారు అభినందనీయులు. గురువు చూపిన మార్గం ద్వారా భాషా సంపదను, పద ప్రయోగ నైపుణ్యాన్ని అలవర్చుకొని క్రమశిక్షణతో నేటి సమాజానికి ‘వెలుగుబాట’ను పరిచిన నిదానపురం ఉన్నత పాఠశాల బాలకవులందరికీ అక్షరాభినందనలు. ఈ పిల్లలు చూపిన వెలుగుబాటలో పయనిస్తే సమాజంలో ప్రస్తుతం పేరుకున్న చీకట్లు తొలిగిపోతాయంటే అతిశయోక్తి కాదుకదా!

వెలుగుబాట
పేజీలు : 51+29
వెల : రూ. 50
ప్రతులకు: కొమ్మవరపు కృష్ణయ్య,
ఉపాధ్యాయుడు,
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,
నిదానపురం, మధిర మండలం,
ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రం.
చరవాణి : 9440671251

- సిద్ధాంతపు ప్రభాకరాచార్యులు, అశ్వారావుపేట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. చరవాణి : 9491357842