విశాఖపట్నం

నిదానపురం బాలకవుల ‘వెలుగుబాట’! (కథానిక)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విద్యార్థుల్లో దాగిన సృజనను వెలికితీయగలిగే సామర్థ్యమున్న గురువు లభిస్తే ఆ శిష్యుడు భావి సమాజానికి మార్గనిర్దేశనం చేయగలిగిన జ్ఞానుడు అవుతాడనటంలో అతిశయోక్తి లేదు. అలాంటి గురువులు ప్రాచీన కాలంలో ఎందరో శిష్యులను తయారుచేయటం వల్లే మనదేశ సంస్కృతి వేనోళ్ల కొనియాడబడుతోంది. నేటి ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల పనితీరు అనేక విమర్శలకు గురవుతున్న తరుణంలో విద్యార్థుల్ని శక్తిమంతులు, బాధ్యాతాయుతులైన పౌరులుగా తయారుచేయగలమని నిరూపించారు ఖమ్మం జిల్లా నిదానపురం ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు. మాతృభాషపై మక్కువ పెంచటమే కాకుండా కవిత్వంపై ఆసక్తి కలిగించి క్రమేణా ఛందోబద్దమైన పద్యరచన చేయటంలోనూ తర్ఫీదునిచ్చి తమ విద్యార్థులతో శత పద్య సంకలనం తెచ్చారు తెలుగు ఉపాధ్యాయుడు కొమ్మవరపు కృష్ణయ్యగారు. ఇదివరలో ఇదే పాఠశాల విద్యార్థులతో ‘బాలకిరణాలు’ కవితా సంకలనం ప్రచురించి సాహితీలోకానికి విద్యార్థుల కవితాశక్తి ఏమిటో తెలియపరిచారు. అంతటితో ఆగకుండా వారికి పద్యం రుచిచూపించి నిరంతర కృషితో ఆ విద్యార్థులతోనే ఆటవెలది పద్యాలు రాయించే స్థాయికి తీర్చిదిద్దిన కృష్ణయ్య మాస్టారు మనసు నిండా మానవత్వం నిండిన ఉత్తమ బోధకులు. ఎందుకంటే మట్టిలో మాణిక్యాలను వెతికి పట్టుకొని సానబట్టి మరింత వెలుగులు విరజిమ్మగల ఓర్పు, నేర్పు ఆయనకున్నాయని నిరూపించింది ‘వెలుగుబాట’ శత పద్య సంకలనం.
గద్యం చదవటానికే ఎంతో కష్టపడటమే కాకుండా తెలుగుభాషను చిన్నచూపు చూస్తున్న నేటికాలంలో ఈ సంకలనంలోని పద్యాలు చదువుతుంటే విద్యార్థులకు భాషపై ఉన్న పట్టు, మాతృభాషపై వారికున్న ప్రేమ, అభిమానం తేటతెల్లవౌతాయి. 8వ తరగతి చదివే విద్యార్థిని వట్టివేళ్ల శ్రీలక్ష్మి తన గట్టి వేళ్లతో కలంపట్టి కులమతాలను పట్టి వెంపర్లాడే వారిని ఎండగడుతూ రాసిన పద్యం ఎంతగానో ఆలోచింపజేస్తుంది.
‘కులము మతము యంటు కొట్టుకోకుండుము
ఒకరినొకరు కలసి ఓర్మితోడ
కలసి మెలసి ఉండు కలకాలము ధరపై
ఇల నిదానపురపు వెలుగుబాట’
ఈ పద్యాన్ని మనముందుంచటం ద్వారా శ్రీలక్ష్మి సామాజిక స్పృహ అవగతవౌతుంది. ‘వాగ్భూషణం భూషణం’ అన్న భర్తృహరి భావనను వంటపట్టించుకున్న గోరింట్ల అజయ్‌కుమార్ ‘మంచిమిత్రు గెల్వ మంచి వాక్కవసరం/ సత్యవాక్కు కీర్తి సల్పు మనకు/ తాను జారుమాట తలకొరివిని దెచ్చు/ ఇల నిదానపురపు వెలుగుబాట’ అనే పద్యం రాసి సత్యం పలకటం వల్ల కలిగే ప్రయోజనాన్ని తెలియజేశాడు.పద్యం రస నైవేద్యమే కాదు, తెలుగువారి సంస్కృతీ సంప్రదాయాల్ని, విలువల్ని తెలియజేయటంతో పాటు సామాజిక చైతన్యం కలిగించే మాధ్యమం. ‘పద్యాలంటే పాతతరానికి సంబంధించిన ప్రక్రియ.. మాదంతా ఆంగ్లపు తోటలో విహరించే నవీనత’ అనేవారి చెంప ఛెళ్లుమనిపించేలా విద్యార్థుల్లో భాషా నైపుణ్యాల్ని పెంపొందింపజేసి ఆటవెలదులతో ఈటెలను విసరగల దిట్టలుగా వారిని తీర్చిదిద్ది, అక్షరాయుధాలతో నేటి దుస్థితిని మార్చే ప్రయత్నం చేస్తున్న కృష్ణయ్య మాష్టారు అభినందనీయులు. గురువు చూపిన మార్గం ద్వారా భాషా సంపదను, పద ప్రయోగ నైపుణ్యాన్ని అలవర్చుకొని క్రమశిక్షణతో నేటి సమాజానికి ‘వెలుగుబాట’ను పరిచిన నిదానపురం ఉన్నత పాఠశాల బాలకవులందరికీ అక్షరాభినందనలు. ఈ పిల్లలు చూపిన వెలుగుబాటలో పయనిస్తే సమాజంలో ప్రస్తుతం పేరుకున్న చీకట్లు తొలిగిపోతాయంటే అతిశయోక్తి కాదుకదా!

వెలుగుబాట
పేజీలు : 51+29, వెల : రూ. 50
ప్రతులకు: కొమ్మవరపు కృష్ణయ్య,
ఉపాధ్యాయుడు,
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,
నిదానపురం, మధిర మండలం,
ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రం.
చరవాణి : 9440671251

- సిద్ధాంతపు ప్రభాకరాచార్యులు, చరవాణి : 9491357842