విశాఖపట్నం

సీత నవ్వు (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలివి అంటే లోతైన సత్యాలను ఆచరణతో
జీవించడానికి అనువుగా తీర్చిదిద్దుకోవడం
- వాల్మీకి రామాయణం

రాముని మాటకు జనకుని సభలో నిశ్శబ్దం ఆవహించింది.
ఇప్పుడెలా? ఇంత జరిగిన తర్వాత భవిష్యత్ ఏమిటి?
సున్నిత మనస్కురాలైన సీత ఏం కావాలి.
రాముడు మహా వీరుడు. జనక మహారాజు విధించిన నిబంధన ప్రకారం అవలీలగా ముల్లోకాలు దద్దరిల్లేటట్లుగా శివధనస్సు విరిచాడు. రాముని గొప్పతనం వశిష్టుని విద్యలో ఉందన్నారు. కాదు విశ్వామిత్రుని శిక్షణలోనిదన్నారు. దశరథుని పెంపకం అటువంటిదన్నారు. తల్లి కౌశల్య పుణ్యాల నోముల ఫలితమన్నారు.
జనం మెచ్చారు. జనకునికి నచ్చారు రాములవారు.
మిథిల పండగను ఉత్సాహంగా జరుపుకోవాలనుకున్నారు. సీత నోములు ఫలించాయన్నారు. దశరథుడు అదృష్టవంతుడన్నారు.
జనం పరిపరి విధాలుగా ఆనందించారు.
సరిగ్గా ఈ సమయంలోనే సీత వరమాల రాముని మెడలో వేసింది. రాముడు కూడా ఆమె మెడలో మాల వేశాడు.
దేవతలు పూలవర్షం కురిపించారు. చూడచక్కని జంట, కనులకింపైన జంట. ప్రపంచంలో ఏ కవికి వీరి అందాన్ని వర్ణించడం సాధ్యం కాదు.
జనకుని చింత తీరింది.
విశ్వామిత్రుని కోరిక ఫలించింది.
సీత వరానే్వషణ పూర్తయింది.
సీత తెలివైనది. జనకుని ఆంతర్యం, రాముడు వీరుడు, ధర్మ పరాయణత్వం కలిగిన వాడు. విశ్వామిత్రుని విశ్వాసం, సీతారాముల జంట కనుల పంట.
సరిగ్గా ఆ సమయంలోనే రాముని నోటి వెంట వచ్చిన ఆ వాక్యాలు అందరిని భయాందోళనలో ముంచివేశాయి.
‘‘నేను ఈ వివాహం చేసుకోలేను’’ రాముని మాటలు.
మొదలు నరికిన చెట్టులా సింహాసనంపై జనకుడు కూలిపోయాడు.
ఏం చేయాలో తెలియని అయోమయం విశ్వామిత్రుడు వెంటనే తేరుకున్నాడు. అయినా మిన్నకున్నాడు.
రాముడెవరో వశిష్టుని వలన విశ్వామిత్రుని తెలుసు.
రాముడేమిటో యజ్ఞసంరక్షణ కోసం తీసుకు వచ్చిన వేళ స్వయంగా తను తెలుసుకున్నాడు.
రాముని ఆంతర్యలోని అంతరార్ధం?
సభ మొత్తం నిశ్శబ్దం. జనులు గాలి వీచని వృక్షాల్లా శిలాప్రతిమల్లా ఎక్కడున్న వారు అక్కడే నిలిచిపోయారు.
చీమ చిటుక్కుమన్నా వినిపించేటంతటి నిశ్శబ్దం.
శబ్దం కన్నా నిశ్శబ్దం ఇచ్చే జ్ఞానం ఎక్కువ. తెలుసుకోవాలి అంతే.
అందరు అనంతమైన విషాదంలో మునిగిపోయారు.
పరిపరి విధాలుగా ఆలోచనలను కొనసాగించారు.
ఆ సమయంలో ఆమె సీత ఒకసారి రాముని వంక చూసింది. రాముని లోనికి చూసింది.
ప్రేమంటే మనసు లోతులను స్పృశించి మనిషిని అంచనా వేయడం.
ఆమెకు అతని ఆంతర్యం అర్ధమయింది.
ఆమె పెదవులపైన ముసిముసి నవ్వులు.
పక్కనున్న చెలికత్తెలకు భయం వేసింది. సీత మనసు చెదిరిందనుకున్నారు. మతి భ్రమణ అనుకున్నారు. ఏడ్వలేక నవ్విందనుకున్నారు.
సభలోని వారంతా విషాదంగా వారి వారి గృహాలకు కదిలారు. ఆనందించవలసిన వేళ ఆవేదనను అనుభవించారు.
ఆ రాత్రి
జనకుని ఆంతరంగిక మందిరంలో కుల గురువుతో సమావేశమయ్యారు.
‘‘ ఏమిటీ విపత్కరం గురువర్యా’’ అన్నాడు జనకుడు.
అతని కనుకొలకులలో నీరు.
‘‘ ఏమీ లేదు మహారాజా. చింతించకండి. రేపటికి అంతా సర్దుకుంటుంది. ఆ దేవునిపై విశ్వాసముంచండి రాజా’’ గురువుల ఉపశమనపు మాటలు.
‘‘అది కాదు గురువర్యా సీత మనోస్థితి ఏమిటో. ఆ ముసిముసి నవ్వులేమిటో అర్ధం కావడంలేదు. భయం ఉంది స్వామీ’’ జనకుని ఆవేదన.
‘‘మహారాజా తండ్రిగా నీ ఆవేదన అర్ధమయింది. కాని గతం నుండి వర్తమానం దిశగా ఆలోచిస్తే భవిష్యత్ అవగతమవుతుంది. తండ్రిగా కాకుండా సీత జన్మ గురించి ఆలోచించు రాజా. ఆమె ఏమిటన్నది నీకు అవగతం అవుతుంది. పరిష్కారానికి మార్గం వేస్తూ గురుదేవుడు చెప్పిన మాట.
జనకుడు ఆలోచించసాగాడు. అతనికి వాస్తవం పొరలు పొరలుగా విడిపోతున్న భావన.
కొన్ని దృశ్యాలు అతని కనుల ముందు కదలాడుతున్నాయి.
భూమిలో అయోనిజగా ఆమె జననం. శివధనస్సును అవలీలగా ఆవలికి నెట్టడం ఎన్నో సందర్భాల్లో ఆమె తనకు సలహాలు, సూచనలు అందజేయడం.
అవును ఆమె మానవమాత్రురాలు కాదు. ఆమెనే అడుగుదాం.
‘‘స్వామి సీతను పిలిపిస్తాను’’ అన్నాడు జనకుడు.
గురువు తల ఊపారు సరేనన్నట్లుగా.
ఇంతలో విశ్వామిత్రుల వారు వస్తున్నట్లుగా భటుడు భయపడుతూ వచ్చాడు.
జనకుడే ఎదురెళ్లి విశ్వామిత్రుల వారిని తన ఆంతరంగిక మందిరానికి తీసుకువచ్చి ఉచితాసనముపై కూర్చోబెట్టాడు.
‘‘ ఇంత వేళప్పుడు తమరు శ్రమ తీసుకుని రావడం కబురు పెడితే నేనే వచ్చే వాడిని కదా’’ జనకుని వినయం.
‘‘రాజా రాముని ఉద్దేశ్యం ఏమిటో మీరు గ్రహించారా’’
ఇంతలో సీత వచ్చింది మెల్లగా తల వంచుకుని. పెద్దల ఎడల భక్తి ఆమె నడవడిలో ద్యోతకమవుతున్నది.
తండ్రి, గురువు, విశ్వామిత్రుల వారి పాదాలకు నమస్కరించి మేలిముసుగు చాటున వౌనంగా నిల్చుని ఉంది.
‘‘మన్నించాలి పెద్దల ఆంతరంగిక చర్చల మధ్యలో నేను వచ్చినందుకు’’ మెల్లగా స్థిరంగా, స్పష్టంగా చెప్పింది సీత.
‘‘లేదమ్మా నేనే నిన్ను పిలిపిద్దామనుకున్నాను’’ జనకుని మాటకు సీత మెల్లగా కదిలి తండ్రి ఆసనం పక్కన నిల్చుంది.
‘‘చెప్పు తల్లీ’’ విశ్వామిత్రుని వాక్కు.
‘‘మహర్షి రాముని దశరథుడు మీ వెంట కేవలం యాగరక్షణకు మాత్రమేపంపారు. వివాహం చేసుకుని రమ్మని కాదు. నేను రాముని తప్ప అన్యులను వివాహమాడలేను. రాముని కోరిక కూడా అదే కావచ్చు. అతను ఉత్తమ కుమారుడు. మంచి ప్రేమికుడిగా బాధ్యతను ప్రస్తుతం అతను నిర్వహించలేడు. నేను కూడా’’ క్షణం ఆగి ‘‘తల్లిదండ్రుల అనుమతి లేకుండా నన్ను వివాహం చేసుకోవడం అతనికి ఇష్టంలేదు. అతను చేసుకోలేను అన్నారు గాని చేసుకోను అనలేదు కదా నాన్న. అతని ఆంతర్యం దశరథునికి కబురు చెయ్యమని. గురువుగారు రమ్మన్నారు. మిథిలకు వచ్చారు. ధనస్సు విరవడం వీర లక్షణం. విరిచారు. మన్నించండి. ఎక్కువగా మాట్లాడి ఉంటే’’ అని పలికి మరొక్కసారి వారు ముగ్గురి పాదాలకు నమస్కరించి మెల్లగా అక్కడి నుండి కదిలిపోయింది.
ముగ్గురు చిత్తరువుల్లా ఉండిపోయారు.
మెల్లగా విశ్వామిత్రుడు ‘‘జనక మహీపతి సీతారాముల కళ్యాణం ఆగదు. చిత్రం ఒకటి చెప్పనా. సరిగ్గా ఇవే మాటలు నా మందిరంలో రాముడు నాకు చెప్పాడు. రాముని అంతరంగాన్ని స్పష్టంగా చదవగలిగింది సీత. రామునికి తగ్గ ఇల్లాలు సుమీ. దేవుని ప్రేమించాలంటే దేవుడు ప్రేమించే ప్రతి వస్తువును దేవుని కంటే ఎక్కువగా ప్రేమించాలి. ఈ గ్రహింపు ఆమెకుంది. రాముడెవరో ఆమెకు తెలుసు అనుకుంటాను. రేపు అగమేఘాల మీద అయోధ్యకు మనిషిని పంపు. నా మాటగా చెప్పు రాముని కళ్యాణం దశరథునికి ఇష్టమే. కాదనడు’’ అన్నాడు.
ముగ్గురి మనసులు శాంతించాయి. ఆనందంగా లేచారు.
సీత ఎందుకు నవ్విందో వారికి తెలిసింది.
అయోధ్యలో విషయం తెలుసుకున్న వారంతా ఆనందడోలికల్లో మునిగిపోయారు.
ఒక్కరు తప్ప ఆమె మంధర.
వశిష్టుని భవిష్యత్ ఏమిటో మంధర పరోక్షంగా హెచ్చరించింది పర్యావశానం ఏమిటో?
(వాల్మీకి రామాయణంలోని
బాలకాండ నందు ఒక శ్లోకం స్ఫూర్తిగా)

- భమిటిపాటి గౌరీశంకర్, నరసన్నపేట, శ్రీకాకుళం జిల్లా. సెల్ : 9492858395.