సాహితి

నిజానికి నిలువ నీడ లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనకాపల్లినుంచి విశాఖపట్టణానికి వచ్చాడు నూకరాజు. అతని వెంట అతని భార్య కూడా ఉంది. నగరంలో ఓ సినిమా చూచి, రాత్రంగా హాయిగా ఓ హోటల్ గదిలో గడిపి తిరిగి తన ఊరుకు వెళ్లిపోవాలని అతని అంచనా. కానీ, మనుషులు అనుకున్నవన్నీ అనుకున్నట్టుగా జరగవు. ఊహించుకున్నవన్నీ ఉయ్యాలలో ఊగించవు. ‘అంతఃపుర ద్రోహి’లా కనిపించాడు నూకరాజు, తన బీద దుస్తుల్లో ఆ హోటల్ గుమాస్తాకు. ఒంటరిగా ఉన్న జంటకు, వెంట యే సామాను లేనివాళ్లకు గది అద్దెకు ఇవ్వడం ఆ గుమాస్తాకు నచ్చదు. అందుకని నిర్మొహమాటంగా ‘రూమ్ లేదు’ అని జవాబు చెప్పేసి ఇంకేమీ చెప్పవలసిందీ, చూడవలసినదీ యేమీ లేదన్నట్టుగా తన కాగితం లెక్కల్లో కూడిపోయాడు గుమాస్తా. నూకరాజుకు మరో దారిలేదు. వీధిన పడ్డాడు. ఆ పడడానికి ముందు హోటల్ గుమాస్తాకు తైనాతీగా వున్న ‘దేవుళ్లు’ అనే పనివాడి వంక చూసి ముందుకు నడుస్తాడు. దేవుళ్లు కట్టుకున్న దుస్తులు ‘కాకీ గుడ్డలు’, అతనిలాగే నలిగి నలిగి చిరగడానికి సిద్ధంగా ఉన్నాయి.
గుమాస్తామీద కోపం, తైనాతీమీద అసహ్యం కలగలుపుకుని నూకరాజు భార్యతో సహా ‘టక్‌టక్ టక్’మంచూ బూట్లు, మెట్టు కొట్టుకుంటూ ఉండగా వీధిన పడ్డాడు. అక్కడితో కథ అయిపోతే యేమి చిక్కూ ఉండదు. అయితే కథ మటుకు అక్కడినుంచే ప్రారంభం అవుతుంది. అదే కథ!
* * *
కాళీపట్నం రామారావు మాష్టారు కథ ‘నోరూమ్’లో జరిగేది ఇదే. ప్రధాన పాత్ర నూకరాజు అయితే, అప్రధానంగా కనిపించే ‘దేవుడు’ ప్రాముఖ్యం సంపాదించుకుంటాడు-తరువాత. అతని జీవితం కష్టాల మయం. ఏ దేవుడూ అతన్ని ‘సుఖంగా బతకరాపోయి’ అని భూమి మీదకి పంపించలేదు. గులాబీ పువ్వు కంటె ముందు గుచ్చుకునే ‘ముల్లు’ అతనికి అడుగుడుగునా అడ్డం పడుతూనే ఉంటుంది. దుఃఖభాజనం అయిన తన జీవితాన్ని ప్రపంచ జీవితంతో సరిపోల్చుకు చూచుకోవడానికి ప్రయత్నిస్తాడు ప్రతిసారీ. అతనికి అనేక ఆలోచనలున్నాయి. అయితే అవి అక్షరరూపం ధరించవు. మనస్సులోనే కరుడుగట్టుకుపోయి, ఆ సమయంలో బయటకు వచ్చి అతడిని యమయాతన పెడుతూ ఉంటాయి. చివరకు దెబ్బలు తిని దిమ్మెక్కిన తలతో తిమ్మిరెక్కిన శరీరంతో అక్కడక్కడ మంటలు పోట్లుగా ఒక్కడే అరుగుమీద చతికిలపడి వుండిపోతాడు. ‘ఎవరో ఇచ్చిన సోడా, ఇంకెవరో వెతికి తెచ్చిన గుడ్డ లేరుకుని ఇంకెందుకో ఇంకా ఎందుకో గుబులు కొస్తున్న దుఃఖాన్ని అణచుకోలేక అణుచుకుంటూ దెబ్బలపై దెబ్బలతో దుఃఖాల వెంట దుఃఖాలతో శోషిల్లుతున్న కట్టెనీడ్చుకుంటూ లాడ్జింగ్‌కేసి నడుస్తున్నాడు!
నూకరాజు కాళీ రిక్షా చూచుకుని, భార్యతోపాటు అనకాపల్లెకు తిరుగు ప్రయాణం చేస్తున్నాడు. భార్యకు పుట్టెడు దుఃఖం. భర్త ఆమెను పొదవి పట్టుకుని, ఇంకో చేత నీటుగా మడిచిన జేబు రుమాలుతో చిట్లిన తన కింది పెదవిని అద్దుకుంటున్నాడు’. ‘రిక్షా వెనె్నలలో దూరమయ్యింది’ అనే వాక్యంతో కథ ముగుస్తుంది. ఎక్కడిది ఈ వెనె్నల? ‘వెనె్నల పిండి ఆరేసినట్టు లేదు’ అన్న కథా ప్రారంభ వాక్యంలోనే కనిపిస్తుంది; పరిశీలనాత్మకంగా-సాంకేతికంగా చూడడం అలవాటు అయిన పాఠకుడికి. మామూలు చదువరికి షరా మామూలే. ‘దేవుడు’ కథ చదువుతున్నామా? అతని తీరని కోరికలు నూకరాజులో ప్రతిగా కనబడడం చూస్తున్నామా? దేవుడితో పోలిస్తే నూకరాజుకు వచ్చిన ఇబ్బందేమీ కొత్తదీ, ఘనమైనదీ కాదు గదా!
నూకరాజు నిజాయితీని ‘ఎటెస్ట్’ చేయగల నిజం దేవుడికి తెలిసినా, ఆ దేవుడు నోరు మూసుకునే వుంటాడు. అతని మాట చెల్లదని తెలుసు గనుక, చేతకాని వాడులా మిన్నకుండిపోతాడు. అయితే మనసులో మటుకు ‘ఆ కుర్రదీ కుర్రాడూ యేమైపోనారో?’ అనుకుని తన జీవితాన్ని పునరావృత్తం చేసుకుంటాడు. లాడ్జింగ్ హౌస్ కట్టిన మేస్ర్తిలలో ఒకడు ‘పోతరాజు’. కాంట్రాక్టర్లే తనకు దడవాలని సిద్ధాంతీకరించే పల్లకీ బోరుూ అతను. పల్లకీ యెక్కడం తనకు యెన్నటికీ సాధ్యం కాదని తెలుసుకున్న మనిషి. అతని అభిప్రాయాలు దేవుడికి ప్రామాణికం. ‘తమదేం పుటుకోగాని ఒక యింటినుంచి ఇంకొక యింటికి సుఖపడాలని వచ్చే ఆడకూడుళ్లను ఆవగింజలో అరవంతైనా సుఖపెట్టలేదు. అప్పాయమ్మను తను కూడా చాలా మందిలాగే యెనె్నన్నో బాధలు పెట్టాడు-’అని స్వగతంలో చెప్పుకోగల ధైర్యం వున్నది అతనికి.
‘ఒకరాత్రి ఇడవకుండా ఒకే పక్కమీద నీతో పడుకోవాలని వుందిరా’ అన్నది అప్పాయమ్మ, వాళ్లు కాపురం అంటూ ఆరంభించి ఇరవై సంవత్సరాలు గడిచాక. నూకరాజు మనోవేదన కూడా తరువాతి కథనంలో చోటు చేసుకుంటుంది. తనను తక్కువ చేసి చూపించిన సన్నివేశాలన్నీ మనసులో మెదులుతాయి. జీవితం పరిచిన విస్తళ్లు విసుగు కలిగిస్తున్నాయి. ఒకే ఒక్క కోరిక. ‘అంతంత మాత్రమైనా శుభ్రమైన లాడ్జింగ్ హౌస్‌లో-మారుమూల గదయినా పరవాలేదు-అమ్మడుతో ఒక్కరాత్రి’. మూడు నెలలపాటు ముష్టి కోరికలు ఎనె్నన్నో చంపుకుని డబ్బు మూట కట్టాడు. చివరకు మిగిలింది-తిరస్కారం, అవమానం! ఒకపక్క బీదరికాన్ని, మరో ఎదురుగానే శ్రీమంత స్థితినీ చూడగలుగుతాడు చీత్కారంలోనే నూకరాజు. ‘జనానికి నిజమైన అనుభవాలు అందవు. అందాలనే కోరికలు వూహలలో కదిలినా ప్రమాదం...’ అని నిర్ణయానికి వచ్చేస్తాడు. నిరాశలు ముసుగులు కప్పుకున్న స్థితిలో నూకరాజు, అతని భార్య-మళ్లీ దేవుడికి కనిపిస్తారు. దేవుడు తన సానుభూతి చూపించబోతాడు. కాని కథ ఎదురు తిరుగుతుంది. నూకరాజు చేతుల్లో దెబ్బలు, నోటిలో బూతులు తినవలసి వస్తుంది-దేవుడికి. ఎవరో మధ్యవర్తులు సర్దిచెప్పగా చావుతప్పి బతికి బయట పడగలుగుతాడు.
దేవుడి కథ, నూకరాజు కథ-తీరని కడసారి కోరికలు, -అవయినా అంత అసాధ్యమయినవి కాదు-సుసాధ్యం చేసుకుందుకు నవ సమాజం అంగీకరిచనివి మాత్రమే!
జీవితం పరస్పర ఆశ్రయంతో నడుస్తుంది, నడవాలని అనిపిస్తుంది. కానీ జరుగుతున్నవి మటుకు పరస్పర అనుమానంతో, సందేహంతో, సంశయాలతో మనిషిని మనిషి నమ్మలేని స్థితి-యే దేవుడూ ఆశించినది కాదు, మనిషి తనంత తాను నిర్మాణం చేసుకున్న, తీవ్రమయినన గాలికి పడిపోయే పేకమేడ! అలాంటి గాలి వీచాలి గదా. అలాంటి దానికి ‘ప్రచోదనం’ చేయటానికి కథలయినా కావ్యాలయినా.
* * *
కాళీపట్నం రామారావుగారు అనేక కథలు వ్రాశారు. అన్నిటిలోనూ ఏకత్వమే ప్రతిపాదించారు. ‘జీవధార’ అయినా, ‘ఇల్లు’ అయినా, మరింకేదో అయినా చదువరి మనస్తత్వాన్ని బట్టి మన్నించదగినదిగా అనిపిస్తుంది. నామటుకు నాకు ఇలా మన్నన పొందిన వాటిలో ‘మిన్న’ అయినది ‘నోరూమ్’ అనిపిస్తుంది. నిజాయితీకి, ఈ ప్రపంచంలో-మానవ నిర్మితం అయిన కృతక ప్రపంచంలో-నిలవ నీడ లేదు గదా! నిలవ నీరును పారదోలగలిగితే తప్ప, నిలవ నీడ దొరకదు. మనిషి నిలవగలిగితేనే ‘మనుగడ’ సాగించగలగుతాడు. నిజమైన ‘మా-నవ’ సమాజం నిర్మించుకోగలుగుతాడు.

- శ్రీవిరించి, ఫోన్: 09444963584