భక్తి కథలు

స్వామియే శరణం అయ్యప్పా! - 55

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ సమయంలో కలి పురుషుని ప్రభావానికి లోనైన ఉదయనుడనే గజదొంగ కారణంగా చిన్న చిన్న ముక్కలుగా విడిపోయిన పందల రాజ్యంలో కొంత కాలంగా అరాచకత్వం, బీభత్సం తాండవిస్తున్నాయి.! ఉదయనుడు తనను ఎదిరించేవారు లేకపోవడంతో ఆ ప్రాంతమంతటా స్వేచ్ఛగా తిరుగుతూ కనిపించిన వారిని దారుణంగా చంపివేస్తూ ప్రజల ఆస్తులను దోచుకుని వీరవిహారం సాగిస్తున్నాడు! రాజైన రాజశేఖరుడికి అతడిని ఎదిరించే బలం లేకపోవడంతో భగవంతునిమీద భారం వేసి రోజులు భారంగా గడుపుతున్నాడు!
ఆ రోజు ధర్మశాస్తా మందిరంలో స్వామిని ప్రార్థిస్తున్న పూజారి వులిక్కిపడి లేచాడు గుర్రం డెక్కల చప్పుడు విని! అతని గుండెలు దడదడమన్నాయి! ‘ఉదయనుడే ఇట్లు వస్తున్నట్లున్నాడు’! ఈ ఆలయంమీద ఆ దుష్టుడి చూపు పడి లోపలకు రాడు గదా! అనే ఆలోచన వచ్చేసరికి భయంతో గజగజలాడుతున్న పూజారి ప్రక్కగా దేవుడి పళ్లాల సవరిస్తున్న కొడుకు వైపు ఆందోళనగా చూస్తూ ‘‘జయవర్థనా! నాయనా! పరుగెత్తివెళ్లి ఎక్కడైనా దాక్కో! ఆ దుర్మార్గుడు గుడిలోపలకు వస్తాడేమో! పారిపో, వాడి కంటబడకుండా!’’ అంటూ తొందరపెట్టాడు!
‘‘మరి మీరో?’’ తండ్రివైపు చూస్తూ అడిగాడు పనె్నండేళ్ల జయవర్థనుడు!
‘‘నీవు ప్రాణాలు దక్కించుకో నాయనా, నా మాట విను! నేను పరుగెత్తలేను! ఇక్కడే మనం నమ్మిన స్వామి దగ్గరే వుంటాను! ఏమైతే అదే అవుతుంది! వెళ్లు, ఆలస్యం చేయకు!’’ అన్నాడు పూజారి విష్ణుదత్తుడు!
జయవర్థనుడు ఇష్టం లేకపోయినా తండ్రి మరీ మరీ చెప్పడంతో బయటకు పరుగెత్తాడు! అప్పటికే ఉదయనుడి గుర్రం ఆలయం ముందర వచ్చి ఆగింది! దిగి లోపలకు వెళ్లాడు! దేవుడి మెడలో మాల సవరిస్తున్న పూజారి వైపు క్రూరంగా చూస్తూ, ‘‘ఆ రాతి బొమ్మకేం వేస్తావు? అసలు దేవుడిని నేను! నా మెడలో వేయి!’’ అంటూ గద్దించాడు!
అతనట్లా గద్దించడంతో కోపం, అసహ్యం కలిగాయి పూజారికి! అందుకే భయపడకుండా ‘‘పాపాత్ముడా! ఎన్నో పాపాలు చేసావు ఇప్పటివరకు! ఇప్పటికైనా బుద్ధితెచ్చుకుని ధర్మశాస్తా అయ్యప్పస్వామిని శరణు వేడుకో! నిన్ను మన్నించి సద్బుద్ధి ప్రసాదిస్తాడు ఆ పరబ్రహ్మ, జ్యోతిరూపుడు’’ అంటూ హితవు చెప్పాడు.
ఆ మాటలకు మరింత కోపంతో కళ్లనుండి నిప్పులు కురిపించాడు ఉదయనుడు!
‘‘నాకు ఎదురు చెప్పే సాహం చేస్తావా, ముసలి బ్రాహ్మణుడా! ఇప్పుడే నీకు తగిన శిక్ష విధిస్తాను చూడు!’’ అంటూ కత్తిని చర్రున దూసి పూజారి కడుపులో బలంగా గుచ్చాడు ఉదయనుడు!
‘‘హా! అయ్యప్పా! స్వామియ శరణం!’’ అంటూ నేలకొరిగిపోయాడు పూజారి! ఆయన ప్రాణం గాలిలో కలిసిపోయాయి.
‘హా.. హ.. హ! నాకే చెప్పే సాహసం చేస్తాడా! తగిన శిక్ష విధించాను అనుకుంటూ అక్కడ వున్న పూజా ద్రవ్యాలన్నిటిని చిందరవందరగా విసిరేసి స్వామి విగ్రహాన్ని పెకలించి ప్రక్కకు విసిరేసి పెద్దగా నవ్వుకుంటూ బయటకు వెళ్లిపోయాడు ఉదయనుడు!
****
‘‘ఏమిటి! ఉదయనుడు అంతటి దుర్మార్గానికి పాల్పడ్డాడా? పూజారిని చంపి గుడిని ధ్వంసం కావించాడా? ఎంతటి ఘోరానికి సిద్ధపడ్డాడు! ఎట్లా వాడి దుండగాలను అరికట్టడం? ఎవరు ఆ కార్యం చేయగలరు? అయ్యప్ప స్వామే పూనుకుని వాడిని అంతం చేయాలి! ఆ స్వానిని ప్రార్థించడం మాత్రమే మనం చేయగలిగింది!’’ అంటూ తమ పూజా గృహంలోని అయ్యప్ప స్వామి విగ్రహానికి నమస్కరించి ధ్యానించాడు పంబరాజు!
‘‘తేజో మండల మధ్యగం త్రినయనం దివ్యాంబరాలంకృతం
దేవం పుష్ప శరేక్షు కార్ముక లసన్మాణిక్య పాత్రాభయం
బిభ్రాణాంకరపంకజైర్ మదగజ స్కంధాది రూఢం విభుం
శాస్తారం శరణం భజామి సతతం త్రైలోక్య సమ్మోహనం!’’
(తేజోమండల మధ్యలో దివ్యాభరణాలతో, పట్టువస్త్రాలతో అలంకరింపబడి మూడు నేత్రాలతో ప్రకటితమై హస్తాలలో పుష్పం, చెరుకుగడ, శరాలు, విల్లు, మాణిక్య పాత్ర ధరించి భక్తులకు అభయముద్రను ప్రసాదిస్తూ, శతృవులను సంహరించడానికి మత్తగజాన్ని అదిరోహించి వస్తున్న ధర్మశాస్త అయ్యప్ప స్వామిని మూడు లోకాలను తన దివ్య మోహన రూపంతో సమ్మోహితులను కావించే స్వామిని ఎల్లప్పుడూ భజిస్తూ వుంటాను)
ఆయన మనోనేత్రం ముందు కదలాడిన దివ్యరూపాన్ని చూస్తూ పరవశించిపోయాడు!
‘‘హే జ్యోతిరూపా! పందళరాజకుమారుడివి నీవు! ఈనాడు ఈ దుస్థితి నీ రాజ్యానికి ఉదయనుడనే దుర్మార్గునివల్ల సంభవించింది! మా మీద దయతో అతడిని వధించి మమ్మల్ని కాపాడు! మహిషి సంహారం కోసం అవతరించిన నీవు తిరిగి నీ భక్తులను ఉద్ధరించడానికి తరలిరా తండ్రీ!’’ అంటూ ప్రార్థించాడు!
రాజు ప్రార్థన స్వామిని చేరింది!
అందుకే శాంత గంభీర స్వరంతో పలికాడు!
‘‘రాజా! ఉదయనుడి కాలం తీరడానికి మరికొంత వ్యవధి ఉన్నది! ప్రస్తుతం కలిపురుషుని ప్రభావంతో అతడు కావిస్తున్న దుష్కర్మలు అంతం కావించడానికి త్వరలోనే నేను తిరిగి నీ వంశంలోనే అవతరిస్తాను! రాజా! మరికొద్దికాలంలో నీ దగ్గరకు ఒక బ్రాహ్మణ కుమారుడు వస్తాడు! అతనికి నీ కుమార్తెనిచ్చి వివాహం కావించు!’’
ఆ పలుకులు అమృతపు జల్లులా కురిసాయి రాజు కర్ణపుటాలలో!
‘‘మీరు చెప్పినట్లే కావిస్తాను! నా మీద ఎంతటి కరుణ చూపావు తండ్రీ! నీకు నా కోటి కోటి ప్రణామాలు!’’ అంటూ అంజలి ఘటించాడు రాజు!
***
‘‘జయవర్థనా! లే! వెంటనే బయలుదేరి పంబల రాజ్యానికి వెళ్లు! అన్న పలుకులు స్పష్టంగా వినపడటంతో చప్పున లేచి కూర్చున్నాడు జయవర్థనుడు!
-ఇంకాఉంది

- డా. టి. కళ్యాణీసచ్చిదానందం