నిజామాబాద్

నేటి నుండి పాఠశాలలు పునఃప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, జూన్ 11: వేసవి సెలవుల అనంతరం ప్రస్తుత విద్యా సంవత్సరంలో పాఠశాలలు సోమవారం నాటి నుండి పునః ప్రారంభం అవుతున్నాయి. నిజానికి సెలవులకు ముందే కొత్త విద్యా సంవత్సరం కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని వార్షిక పరీక్షలు ముగిసిన మీదట కూడా బడులలో కొన్నాళ్ల పాటు తరగతులను నిర్వహించారు. అయితే వేసవి ఎండలు తీవ్రరూపం దాల్చడంతో ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుని ఏప్రిల్ మూడవ వారం నుండి బడులకు వేసవి సెలవులు ప్రకటించింది. దీంతో బడి పిల్లలంతా మండుటెండలను సైతం లెక్కచేయకుండా ఆటపాటలతో వేసవి సెలవులను ఆహ్లాదంగా గడిపారు. ప్రస్తుతం వారంతా సోమవారం నుండి బడిబాట పట్టేందుకు సమాయత్తమయ్యారు. ఇప్పటికే బ్యాగులు, నోట్‌బుక్కులు, పెన్నులు, స్కూల్ యూనిఫాంలు, పాదరక్షలు (షూస్) తదితర సరంజామాను సిద్ధం చేసుకున్నారు. కార్పొరేట్ విద్యా సంస్థలను సైతం తలదనే్న రీతిలో హంగామా చేసే స్థానిక ప్రైవేట్ స్కూళ్లకు చెందిన విద్యార్థుల హడావుడి మరింత ఎక్కువగానే కనిపిస్తోంది. ఆర్థిక స్థోమత కలిగిఉన్న వారు వేలాది రూపాయల ఫీజులు చెల్లిస్తూ తమ పిల్లలను ఈ పాఠశాలల్లో చదివిస్తుండగా, మధ్య తరగతి, నిరుపేద వర్గాలకు చెందిన పిల్లలకు సర్కారీ పాఠశాలలే విద్యార్జనకు దోహదపడుతున్నాయి. అయితే ఎప్పటిలాగే ఈసారి కూడా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు సవాలక్ష సమస్యలతో విద్యార్థులకు స్వాగతం పలుకుతున్నాయి. తాజాగా చేపట్టిన డీఎస్సీ నియామకాల ద్వారా కొంతవరకు ఉపాధ్యాయుల ఖాళీలు భర్తీ చేసినప్పటికీ, ఇంకా అనేక పాఠశాలల్లో టీచర్ల కొరత సర్కారీ పాఠశాలల విద్యార్థుల పాలిట శాపంలా మారుతోంది. చాలీచాలని బోధకులతో అరకొర స్థాయిలో పాఠ్యాంశాలను బోధిస్తుండడం వల్ల ప్రైవేట్ విద్యార్థులతో పోటీపడలేక వెనుకంజలోనే ఉంటున్నారు. ఈ ఏడాది పదవ తరగతిలో ఉత్తీర్ణత ఒకింత మెరుగుపడినప్పటికీ, ప్రతీసారి ప్రైవేట్ సంస్థలకు చెందిన విద్యార్థులకే రాష్టస్థ్రాయి, జిల్లా స్థాయిలో ర్యాంకులు వస్తున్నాయి. జిల్లా విద్యాశాఖ అధికారులు మాత్రం సగటు ఉత్తీర్ణత శాతాన్ని చూసుకుంటూ అది తమ ఘనతగానే చెప్పుకుంటున్నారు. ఉపాధ్యాయుల కొరతను అధిగమించేందుకు విద్యావాలంటీర్లను నియమిస్తున్నప్పటికీ, ఆశించిన ఫలితం కనిపించడం లేదు. అనేక మంది నకిలీ సర్ట్ఫికెట్లతో విద్యా వాలంటీర్లుగా చెలామణి అవుతుండడంతో సర్కారీ బడులలో నాణ్యతతో కూడిన విద్యాబోధన జరగడం లేదు. ఇదిలాఉండగా, ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న పాఠ్య పుస్తకాల సమస్యకు ఈసారి అంతగా ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉండవని తెలుస్తోంది. ఇప్పటికే మెజార్టీ పాఠశాలలకు టెక్ట్స్ బుక్‌లను సరఫరా చేయడంతో వాటిని వేసవి సెలవులకు ముందే యాభై శాతం వరకు విద్యార్థులకు అందించినట్టు జిల్లా విద్యాశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. సర్కారీ బడులలో ఇతర వౌలిక సదుపాయాలను గమనిస్తే, అనేక లొసుగులు దూరం కాలేకపోతున్నాయని తెలుస్తోంది. మారుమూల ప్రాంతాల్లోని పాఠశాలలకు గదులు లేకపోవడంతో చెట్ల కింద, పశువుల పాకల్లో పాఠ్యాంశాల బోధన సాగుతున్న దృశ్యాలు ఇప్పటికీ కనిపించనున్నాయి. విద్యార్థుల సంఖ్య తగినంతగా లేదనే సాకుతో బడులను విలీనం చేయడం, కొన్నింటిని మూసివేయడం వల్ల అనేక బడులలో తరగతి గదుల కొరత ఈసారి మరింతగా తెరపైకి రానుంది. సర్వశిక్ష అభియాన్ ద్వారా ప్రభుత్వం ప్రతి ఏటా లక్షలాది రూపాయల నిధులను వెచ్చిస్తున్నప్పటికీ, పూర్తిస్థాయిలో తరగతి గదుల నిర్మాణాలు చేపట్టిన దాఖలాలు లేవు. మరుగుదొడ్లు, మూత్రశాలల నిర్మాణాలు నాసిరకంగా ఉండడంతో వాటిని నిర్మించిన కొన్నాళ్లకే అవి అవసాన దశకు చేరుకుని వినియోగంలో లేకుండాపోతున్నాయి. దీంతో విద్యా సంవత్సరం ప్రారంభం నుండే విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు సమస్యలపై ఉద్యమించేందుకు సిద్ధమవుతున్నాయి.