గుంటూరు

చేనేతను నాశనం చేసేందుకే చిలపల నూలుపై పన్ను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళగిరి, జూన్ 11: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం చేనేతను నాశనం చేయడానికే చిలపల నూలుపై 5శాతం పన్ను విధించిందని ఎపి చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి బాలకృష్ణ ఆరోపించారు. ఆదివారం నాడిక్కడ విలేఖర్లతో బాలకృష్ణ మాట్లాడుతూ జిఎస్‌టి పేరిట కేంద్రప్రభుత్వం ప్రజలపై పన్నుల భారం మోపుతోందని, దానిలో భాగంగానే చేనేతకు అవసరమైన చిలపల నూలుపై 5శాతం పన్ను విధించారని విమర్శించారు. చిలపల నూలు ధరలు పెరిగి చేనేత మరింత సంక్షోభంలో కూరుకుపోతుందని, పవర్ లూమ్ పోటీని తట్టుకోలేక ఇప్పటికే కార్మికులు ఉపాధి కోల్పోయే స్థితికి చేనేత పరిశ్రమ చేరిందన్నారు. ఆకలి చావులు, ఆత్మహత్యలు చేనేత రంగంలో పెరుగుతున్నాయని, వీటిని నివారించే చర్యలు ప్రభుత్వం తీసుకోకపోగా మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా చిలపల నూలుపై 5శాతం పన్ను వేయటం క్షంతవ్యం కాదన్నారు.
గతంలో బిజెపి అధికారంలో ఉన్నప్పుడు చిలపల నూలుపై 9.2 శాతం పన్ను విధించి చేనేత రంగాన్ని దెబ్బతీశారని, అప్పుడు చేనేతవర్గం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగినా పన్ను రద్దు చేయకపోగా సత్యం కమిటీ సిఫార్సుల మేరకు చిలపల నూలు తయారు చేయరాదని నిర్ణయించిందన్నారు. బిజెపి విధించిన పన్నుకు వ్యతిరేకంగా ఆనాడు గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఆందోళన జరిపి అప్పటి ప్రధాని వాజ్‌పేయికి వినతిపత్రం ఇచ్చినా ఫలితం లేకపోయిందని, నేడు మోడీ ప్రభుత్వం కూడా 5శాతం పన్ను విధించి చేనేతను ధ్వంసం చేసి కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరించడం సరికాదన్నారు. చిలపల నూలుపై విధించిన పన్ను ఉపసంహరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే చేనేత సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని బాలకృష్ణ పేర్కొన్నారు.

కాంట్రాక్టర్‌కు బిల్లులు నిలిపివేయండి
గుంటూరు, జూన్ 11: సిసి రోడ్లు, డ్రైన్లు, నాసిరకంగా నిర్మించిన కాంట్రాక్టర్‌కు బిల్లులు నిలిపివేయాలని, సంబంధిత కాంట్రాక్టర్‌ను బ్లాక్‌లిస్టులో పెట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా అనూరాధ అధికారులను ఆదేశించారు. ఆదివారం కమిషనర్ అనూరాధ స్వర్ణ్భారతినగర్, తారకరామానగర్, ఎస్‌విఎన్ కాలనీ, విజయపురికాలనీ, విద్యానగర్, బ్యాంకు కాలనీ తదితర ప్రాంతాల్లో పర్యటించి ఎస్సీ సబ్‌ప్లాన్ కింద చేపట్టిన పనులను, ఆయా ప్రాంతాల్లోని పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. స్వర్ణ్భారతినగర్‌లో ఎస్సీ సబ్‌ప్లాన్ కింద నిర్మించిన సిమెంటు రోడ్లు, డ్రైన్లను తనిఖీ చేశారు. డ్రైన్లు, సిసి రోడ్లు, నాసిరకంగా నిర్మించడంతో పగుళ్లించి విరిగిపోయే పరిస్థితిలో ఉండటాన్ని గమనించిన కమిషనర్ ఇంజనీరింగ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. వాటిని నిర్మించిన కాంట్రాక్టర్‌కు బిల్లులు నిలిపివేయాలని ఆదేశించారు. పూర్తిస్థాయిలో మరమ్మతులు నిర్వహించిన తర్వాతే పేమెంట్ చేయాలని స్పష్టంచేశారు. నాసిరకంగా నిర్మాణాలు జరుగుతుంటే ఇంజనీరింగ్ అధికారులు ఏం చేస్తున్నారంటూ నిలదీశారు. పలు ప్రాంతాల్లో రోడ్లపైనే చెత్త పేరుకుపోయి ఉండటాన్ని గమనించిన కమిషనర్ తక్షణం తొలగించాలని ఆదేశించారు. ఇంటింటి చెత్త సేకరణకు చర్యలు తీసుకోవాలని, పుష్‌కార్టులు కొనుగోలు చేసేందుకు త్వరితగతిన టెండర్లు పిలవాలని ఆదేశించారు. చెత్తను తరలించేందుకు అవసరమైతే అదనంగా ట్రాక్టర్లను పనిలోకి తీసుకోవాలని ఆదేశించారు. ఎస్‌విఎన్ కాలనీ, విజయపురి కాలనీల్లో అండర్‌గ్రౌండ్ డ్రైన్లు నిర్మించేందుకు తవ్విన గుంటలను నెలలు గడుస్తున్నా పూడ్చలేదని స్థానిక ప్రజలు కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. ఎస్‌విఎన్ కాలనీలోని పార్కులో పిల్లలు ఆడుకునే ఆట వస్తువులను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యానగర్ 3వ లైనులో నగరపాలక సంస్థకు చెందిన ఖాళీస్థలంలో సబ్‌స్టేషన్ నిర్మించేందుకు విద్యుత్‌శాఖ అధికారులు సిద్ధమయ్యారని, ఆ ప్రాంతంలో పార్కును అభివృద్ధి చేయాల్సిందిగా స్థానికులు కోరారు. దీనిపై స్పందించిన కమిషనర్ సంబంధిత స్థలానికి చెందిన పూర్తి నివేదికను తనకు అందజేయాలని పట్టణ ప్రణాళికాధికారులను ఆదేశించారు.

వైద్యం వికటించి బాలింత మృతి
తెనాలి, జూన్ 11: తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో వైద్యం వికటించి బాలింత మృతి చెందగా బిడ్డ క్షేమంగా బయటపడింది. ఈ సంఘటనను సహించలేని మృతురాలి బంధువులు ఆసుపత్రి ముందే శవంతో ఆంధోళన చేపట్టారు. శ్యావకోశ వ్యాధితో బాలింత మృతి చెందిందని తాత్కాలిక సూపరింటెండెంట్ డాక్టర్ హనుమంతురావు చెబుతుండగా మృతురాలి బంధువులు మాత్రం వైద్యుల నిర్వక్ష్యంవల్ల వైద్య వికటించి చనిపోయిందంటూ ఆందోళనకు దిగిన సంఘటన ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. మృతురాలి బంధువులు, ఆసుపత్రి వైద్యుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. వేమూరు మండలం చంపాడు గ్రామానికి చెందిన పీక చంటి భార్య బేబి(27) మాసాలునిండి పురిటి నొప్పులతో బాధపడుతుండగా భర్త చంటి బంధువుల సహకారంతో ఆమెను తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించాడు. శుక్రవారం సాయంత్రం డాక్టర్ సింహాచలం బేబీని పరిశీలించి ఆపరేషన్ చేయనిదే బిడ్డ బయటకు రావటం కష్టమని చెప్పటంతో భర్య చంటి అనుమతితో శస్తచ్రికిత్స చేశారు. బేబీ రెండవ కాన్పుగా మరోమారు అడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆ మరునాటి నుండి బేబీ కడుపు, వెన్నుముక, నడుములు నొప్పి అంటూ విపరీతమైన బాధను అనుభవిస్తుండటంతో బంధువులు విషయాన్ని వైద్యులు, నర్సుల దృష్టికి తీసుకువెళ్ళారు. ఈక్రమంలో ఆదివారం ఉదయం 2.30 గంటల సమయంలో బేబీ పరిస్థితి మరింత విషమించిందని గ్రహించిన డ్యూటీ డాక్టర్ ఆమెను పెద్దాసుపత్రికి తరలించాలంటూ సూచించారు. దీంతో హడావిడిగా 108వాహనం సహకారంతో బేబీని గుంటూరు జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమద్యంలో నారాకోడూరు సమీపానికి వెళ్ళగానే బేబీ మృతి చెందినట్లు 108 సిబ్బంది గుర్తించారు. వెంటనే 108 వాహనాన్ని తిరిగి వెనక్కుతిప్పుకొని తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తీసుకురాగానే అక్కడున్న డాక్టర్ సింహాచలం బేబీని పరిశీలించి మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో ఆగ్రహించిన మృతురాలి బంధువులు ఒక్కసారిగా ఆసుపత్రిలో ఏడ్పులు పెడబొబ్బలు పెట్టటంతో పాటుగా బేబీ మృతికి వైద్యుల నిర్లక్ష్యం, వైద్యం వికటించటమే కారణంగా పేర్కొంటూ శవంతో ఆసుపత్రి ముందు ధర్నా, నిరసనకు దిగారు. ఇంత జరుగుతున్నా జిల్లా స్థాయి అధికారులు, స్థానిక ప్రజాప్రతినిథులు ఎవరూ ఆసుపత్రి వైపుకు రాకపోవటంపై మృతురాలి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షాత్తు తమ నియోజకవర్గం ఎమ్మెల్యే, ప్రస్తుత రాష్ట్ర సాంఘీక, సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు నుండి కూడా ఎటువంటి స్పందన లేకపోవటం పట్ల వారు అసంతృప్తిని వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న డిఎస్పీ రమణమూర్తి, 1,3 పట్టణ సిఐలు బెల్లం శ్రీనివాసరావు, అశోక్‌కుమార్‌లు తమ సిబ్బందితో ఆసుపత్రికి చేరుకొని ఆందోళనకారులను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. వారెంతకూ విరమించక ఆందోళన ఉదృతం చేయటంతో కొందరు దళిత నాయకులు చొరవ తీసుకొని మృతురానికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వటంతో వారు శాంతించారు. ఈక్రమంలో దాదాపుగా 4 గంటలపాటు ఆసుపత్రి వైద్యులు, నాయకుల మధ్య చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా ఆసుపత్రి ఆవరణలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
* ఆసుపత్రి సూపరింటెండెంట్ వివరణ :
ఈ సంఘటనపై ఆసుపత్రి ఇన్‌చార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ హనుమంతురావు స్పందిస్తూ బాధితులు బంధువులు ఆరోపిస్తున్న వాటిలో అవాస్తవాలు ఉన్నాయన్నారు. ఆపరేషన్‌చేసి శిశువును బయటకు తీసినకాలం నుండి బేబీ ఆవేదన, ఆందోళనకు గురైందని ఫలితంగా ఆమెకు బిపి పెరిగి వాంతులుకావటం, దీంతో శ్వాసకోశంలోకి వాంతులకు సంబందించిన వేస్ట్‌వెళ్ళిన కారణంగా ఇన్‌ఫెక్షన్ సోకి మృతి చెందిందని తెలిపారు. అంతేగాని వైద్యం వికటించటం, వైద్యుల నిర్లక్షం ఇందులో లేనే లేదన్నారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన వివరించారు.

కళ్లకు గంతలు కట్టుకుని ఉపాధ్యాయుల నిరసన
తాడేపల్లి, జూన్ 11: ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియను నిరసిస్తూ ఆదివారం ప్రభుత్వ ఉపాధ్యాయులు కళ్లకు గంతలు కట్టుకుని ప్రభుత్వానికి తమ నిరసన తెలిపారు. మండల పరిదిలోని ఉండవల్లి గ్రామంలో ఉపాధ్యాయులకు కొనసాగుతున్న శిక్షణా తరగతుల అనంతరం ఉపాధ్యాయులు బదిలీ ప్రక్రియను వ్యతిరేకంగా నిరనన చేపట్టారు. ఈకార్యక్రమంలో వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు రాజశేఖర్, జోజప్ప, తదితరులు పాల్గొన్నారు.

బదిలీలపై నిరసన
పెదనందిపాడు, జూన్ 11: పెదనందిపాడు మండల విద్యా వనరుల కేంద్రం ఎదుట ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు ఆదివారం ధర్నా నిర్వహించారు. ఐక్యకార్యాచరణ సమితి పిలుపుమేరకు వెబ్ కౌనె్సలింగ్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నల్లరిబ్బన్లు ధరించి కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. రేషనలైజేషన్ పేరుతో ప్రభుత్వ పాఠశాలల మూసివేత నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అశాస్ర్తియమైన పద్ధతులను అవలంభించి గందరగోళం సృష్టించవద్దని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రతినిధులు, ఎం సుబ్బారావు, జి మోహనరావు తదితరులు పాల్గొన్నారు.

అబ్బురపర్చిన బైక్ విన్యాసాలు
గుంటూరు (పట్నంబజారు), జూన్ 11: ప్రొఫెషనల్ స్టంట్ రైడర్స్‌చే నిర్వహించిన బైక్ విన్యాసాలు యువతను అబ్బురపర్చాయి. ఆదివారం స్థానిక అమరావతిరోడ్డులోని బండ్లమూడి గార్డెన్స్‌లో కెటిఎం స్టంట్ షోను నిర్వహించారు. ప్రొఫెషనల్ స్టంట్ రైడర్స్ బృందం అద్భుతమైన స్టంట్స్‌ను కెటిఎం డ్యూక్ బైక్‌లతో చేశారు. ఈ సందర్భంగా ప్రోబైకింగ్, బజాజా ఆటో లిమిటెడ్ అధ్యక్షుడు అమిత్ నంది మాట్లాడుతూ యూరోపియన్ రేసింగ్ లెజెండ్ కేటిఎం ఊపిరి తీసుకోలేనట్టి కెటిఎం స్టంట్ షోను గుంటూరులో నిర్వహించామని తెలిపారు. హై ఫర్వార్మెన్స్ రేసింగ్ బైక్‌లకు కెటిఎం బ్రాండ్ ప్రసిద్ధి చెందిందన్నారు. మా వినియోగదారులు ఉత్తేజకరమైన సాహస అనుభూతులను సొంతం చేసుకోవాలని తాము కోరుకుంటామన్నారు. యువత ఎక్కువ ఇష్టపడేది కెటిఎం బైక్‌లనేనన్నారు. ధృడమైన బ్యాలెన్సింగ్ బాడీతో పాటు వేగంగా దూసుకుపోయే బైకులు కెటిఎం అన్నారు. దేశవ్యాప్తంగా ఈ బైక్‌ల కొనుగోలుపై యువత ఆసక్తి కనబరుస్తున్నారని, ఈ దృష్ట్యా రాజధాని నగరమైన గుంటూరులో బైక్ స్టంట్ షోను ప్రదర్శించినట్లు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని పట్టణాల్లో ఈ షో నిర్వహించనున్నట్లు తెలిపారు. స్థానిక ఆటోనగర్‌లో తమ కెటిఎం షోరూంను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలు
రొంపిచర్ల, జూన్ 11: అద్దంకి- నార్కెట్‌పల్లి రాష్ట్ర రహదారిపై రొంపిచర్ల, సంతగుడిపాడు గ్రామాల మధ్య ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు గాయాలపాలయ్యారు. 2 గ్రామాల మధ్యగల కృష్ణమ్మకుంట సమీపంలో ఎదురుగా వస్తున్న ఆటోను మోటారు సైకిల్‌పై వస్తున్న ముగ్గురు వ్యక్తులు ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో రొంపిచర్లకు చెందిన తన్నీరు శరణ్‌కుమార్‌కు తీవ్రగాయాలు కాగా, మోటారు సైకిల్‌పైనున్న మరో వ్యక్తి బండారు శ్రీకాంత్, ఆటోడ్రైవర్ గంగిరెడ్డి శ్యామలరెడ్డికి స్వల్పగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నర్సరావుపేట ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. రొంపిచర్ల ఎస్‌ఐ నక్కా ప్రకాశరావు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమం
మంగళగిరి, జూన్ 11: కేంద్ర, రాష్ట్ర పాలకులు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు అన్నారు. స్థానిక సిపిఎం కార్యాలయంలో ఆదివారం పార్టీ మంగళగిరి డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రాజకీయ శిక్షణా తరగతుల్లో రామారావు మాట్లాడారు. పేదల సమస్యల పరిష్కారం కోసం సమరశీల పోరాటాలకు సిపిఎం శ్రేణులు సిద్ధం కావాలన్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం మతోన్మాద పోకడలతో పాలన సాగిస్తూ తినే ఆహారంపై కూడా ఆంక్షలు విధిస్తోందని, దళితులు, మైనార్టీలపై దాడులు పెరుగుతున్నాయని, మూడేళ్ల బిజెపి పాలనలో ప్రజల కిచ్చిన వాగ్దానాలేవీ అమలు కాలేదని విమర్శించారు. పోరాడి సాధించుకున్న చట్టాలను కూడా మార్చి పెట్టుబడీదారులకు అనుకూలంగా కొత్త చట్టాలను తీసుకు వస్తున్నారని, కార్మిక వర్గానికి, పేదలకు నష్టం కలిగించే విధానాలు అవలంభిస్తున్నారని విమర్శించారు. టిడిపి ప్రభుత్వం కూడా రాష్ట్రంలో రాజధాని నిర్మాణం పేరిట రైతుల నుంచి 3 పంటలు పండే బంగారు భూములను తీసుకుని ఆ భూములను తక్కువ ధరకు పెట్టుబడీదారులకు ఇస్తున్నారని ధ్వజమెత్తారు. వామపక్ష ప్రజాతంత్ర శక్తులను బలోపేతం గావించేందుకు కృషి చేయాలన్నారు. పార్టీ నిర్మాణం అంనే అంశంపై ఆయన బోధించారు. ఎస్‌ఎస్ చెంగయ్య ప్రిన్సిపల్‌గా వ్యవహరించారు. ఈమని అప్పారావు, జెవి రాఘవులు, పిల్లలమర్రి బాలకృష్ణ, నన్నపనేని శివాజీ, మొసలి పకీరయ్య తదితరులు పాల్గొన్నారు.

భారతీయ కుటుంబ వ్యవస్థకు అద్దంపట్టిన కృష్ణబిలం నాటిక
గుంటూరు (కల్చరల్), జూన్ 11: వెంకటేశ్వర విజ్ఞాన మందిర వేదికపై ఆదివారం రాత్రి జెపి థియేటర్ సంస్థ ఆధ్వర్యంలో నెలనెలా నాటక ప్రదర్శనలో భాగంగా కళాంజలి హైదరాబాద్ కళాకారులు ప్రదర్శించిన కృష్ణబిలం నాటిక ప్రపంచ ప్రజలు నచ్చిమెచ్చిన మన సనాతన భారతీయ కుటుంబ వ్యవస్థకు అద్దంపట్టింది. ఆకురాతి భాస్కరచంద్ర రచించిన ఈ నాటికకు కొల్లా రాధాకృష్ణ చక్కని దర్శకత్వాన్ని అందించారు. నవీన, శ్రీలక్ష్మి, వరప్రసాద్, కొల్లా రాధాకృష్ణలు ఆయా పాత్రలకు వనె్న తెచ్చారు. విభిన్న సంస్కృతుల నిలయమైన మన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వంలా కలిసి మెలసి జీవనాన్ని సాగించే అత్యున్నత సంస్కృతి, సంప్రదాయాలు మనకు ఉన్నాయని, ఇలాంటి సంప్రదాయాలను ప్రతి ఒక్కరూ గౌరవించి, ఆ బాటలో సాగినట్లయితే మన కుటుంబ వ్యవస్థకు సముచితమైన గౌరవాన్ని కల్పించినవారమవుతామని కృష్ణబిలం నాటిక స్పష్టం చేసింది. ఇక రెండవ ప్రదర్శనగా ది అమెచ్యూర్ డ్రెమటిక్ అసోసియేషన్ కళాకారులు ప్రదర్శించిన నల్లకోడి - తెల్లగుడ్డు హాస్యనాటకం నాటక కళాప్రియులపై నవ్వుల జల్లులు కురిపించింది. అద్దేపల్లి భరత్‌కుమార్ రచించిన ఈ నాటకానికి షేక్ షఫి ఆనందాత్మకమైన దర్శకత్వాన్ని అందించి ప్రేక్షకుల మన్ననలు అందుకున్నారు. షేక్ షఫి, ఫిరోజ్ గాంధీ, విహెచ్‌కె ప్రసాద్, కొత్తా శివరామప్రసాద్, రాజు, నవీన, లీలామోహన్, పి శేషగిరి తదితరులు ఆయా పాత్రలకు సరైన న్యాయం చేకూర్చారు. ఏ రంగుకోడిపెట్టే గుడ్డు అయినా తెల్లగానే ఉంటుందని, ఇది మనం తెలుసుకోవడం జీవితానికి ఎంతో అవసరమన్న వాస్తవాన్ని తెలియజేస్తూ నల్లకోడి - తెల్లగుడ్డు హాస్యనాటిక నవ్వుల పువ్వులు కురిపిస్తూ కళాభిమానుల హర్షధ్వానాల మధ్య అర్థవంతంగా ముగిసింది. రంగస్థల సినీనటుడు జయప్రకాష్‌రెడ్డి, డాక్టర్ ఎన్‌వికె ప్రసాద్, గాంధీ, చంద్రప్రకాష్‌రెడ్డి, పలువురు నగర వైద్య ప్రముఖులు నటీనటులను సత్కరించారు. దివంగత గ్రంథి సుబ్బారావు స్మారకార్థం వారి సంస్థల సహకారంతో ఈ నాటికను ప్రదర్శించినట్లు జయప్రకాష్‌రెడ్డి తెలిపారు.

నగరవాసుల ఆశలపై నీళ్లుచల్లిన పాలకులు
గుంటూరు, జూన్ 11: నవ్యాంధ్ర రాజధాని అమరావతి ఏర్పడిన నేపథ్యంలో గుంటూరు నగరాభివృద్ధి జరుగుతుందని ప్రజలు పెట్టుకున్న ఆశలపై ప్రభుత్వ పాలకులు నీళ్లుచల్లారని, వైసిపి రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. ఆదివారం 20, 26 డివిజన్ల పరిధిలో బూత్ స్థాయి కమిటీల నాయకులతో అప్పిరెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అప్పిరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చి 3ఏళ్లు గడుస్తున్నా నగరంలో జరిగిన అభివృద్ధి ఆనవాళ్లు శూన్యమన్నారు. చినుకుపడితే చిత్తడిగా మారే రోడ్లు, పొంగిపొర్లే డ్రైన్లు, ఎక్కడపడితే అక్కడ పేరుకుపోయే చెత్త ఇలా ఎన్నో సమస్యలతో నగరవాసులు నిత్యం సహజీవనం చేసే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఆయా అంశాల్లో కొత్తగా ఏ మార్పూ రాలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పటివరకు కొత్తగా ఒక రోడ్డుగానీ, పేదలకు ఇల్లు కానీ కట్టించిన దాఖలాలు లేవని విమర్శించారు. పార్టీని బూత్‌స్థాయిలో బలోపేతం చేసినప్పుడే విజయం చేకూరుతుందని, ఈ దిశగా నాయకులు, కార్యకర్తలు కృషిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో 20, 26 డివిజన్ల అధ్యక్షులు శ్యామ్‌శేఖర్, గేదెల రమేష్, చంగలశెట్టి సత్యనారాయణ, బొజ్జా సుబ్బారావు, షేక్ ఖాజామొహిద్దిన్, శివారెడ్డి, పల్లపు మహేష్, మార్కొండారెడ్డి, ఎస్‌కె గౌస్, షమీవుల్లా, గంపా వెంకటేశ్వరరావు, ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు.

కార్మికుల సంక్షేమానికి కృషి
గుంటూరు, జూన్ 11: కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కేంద్రప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ, అభివద్ధి కార్యక్రమాలను వారి దరికి చేర్చి అన్ని విధాలా ఆదుకునేందుకు కృషిచేస్తానని బిజెఎంఎం రాష్ట్ర అధ్యక్షుడు, భవననిర్మాణ వెల్ఫేర్‌బోర్డు సభ్యుడు కొత్తూరు వెంకట సుబ్బారావు పేర్కొన్నారు. ఆదివారం స్థానిక మాజేటి గురవయ్య కళాశాలలో ఇటీవల బోర్డు మెంబర్‌గా బాధ్యతలు స్వీకరించిన కొత్తూరు దంపతులను బిజెపి నాయకులు, కార్యకర్తలు ఘనంగా సత్కరించారు. కార్యక్రమానికి బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి జూపూడి రంగరాజు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ దేశంలోనే కొన్ని కోట్ల మంది అసంఘటితరంగ కార్మికులు ఉన్నారని, వారి పెన్షన్ కోసం ఏర్పాటుచేసిన బోర్డు సభ్యునిగా ఎంపికకావడంతో తన జన్మసార్థకమైంన్నారు. తన ఎంపికకు కృషిచేసిన కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర నాయకులు రఘునాథబాబు, జమ్ముల శ్యామ్‌కిషోర్, మంత్రులు కామినేని శ్రీనివాసరావు, పైడికొండల మాణిక్యాలరావు తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలు కొత్తూరు దంపతులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు జూపూడి హైమావతి, శ్రీనివాసరాజు, మువ్వల సుబ్బాయ్య, కాయితి సైదారెడ్డి తదితరులు పాల్గొన్నారు.