అమృత వర్షిణి

నిస్వార్థ సంగీతాభిమాని నారుమంచి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాహిత్యమంటే సినిమాల్లోదే సాహిత్యమనీ, సంగీతమంటే సినిమా పాటనే అని భావించేవారి సంఖ్య రానురానూ పెరిగిపోతున్న రోజుల్లో ఈ వేళ శుద్ధమైన సంగీతాన్ని గురించి, మాట్లాడాలన్నా, పాడి వినిపించాలనే ప్రయత్నం చేసినా, దానికి సిద్ధంగా కూర్చుని, కుతూహలంతో వినాలనీ ఆసక్తి కలిగినవారు లేరు. ఆకర్షణకు ఉచితానుచితాలుండవు. అయినా అక్కడక్కడ ఆరిపోకుండా కొన్ని సంగీత సభలు నడుస్తూనే ఉన్నాయి. ఆదాయంతో నిమిత్తం లేకుండా సంప్రదాయ సంగీతం పదిమందికీ వినిపించాలనే వెర్రి సంగీతాభిమానులు ఇంకా అక్కడక్కడ మనకు తారసపడుతూనే ఉంటారు.
ఎన్ని సంగీత కళాశాలలున్నా విద్యార్థుల సంఖ్య బాగానే ఉంటుంది కానీ, విద్వాంసులెందరు తయారవుతున్నారనేది సమాధానం దొరకని ప్రశ్న. ఏదో చెబుతున్నామనే భావన అధ్యాపకులకూ, సంగీతం వచ్చేస్తోందనే తృప్తి విద్యార్థులకూ ఏర్పడటం తప్ప, ప్రభుత్వ సంగీతం ఎదుగూ బొదుగూ లేక అలాగే వుంది. అలాగే ఉంటుంది. ‘తప్పని జ్ఞానమునకు దైవమే సహజము’ అంటాడు అన్నమయ్య.
నేర్చుకోవాలనే జిజ్ఞాస ఉంటే తెలుసుకోవాలనే ఆసక్తి పెరుగుతూ ఉంటుంది. దీనికి తగిన సంగీత వాతావరణం కూడా ఉండాలి. దక్షిణాదిలో సంప్రదాయ సంగీతాన్ని ప్రోత్సహించేవారూ, వినాలనే ఆసక్తి వున్నవారూ కూడా ఉండటం వల్ల అక్కడ సంగీత వాతావరణం పుష్కలంగా ఉంది. భయభక్తులతో సంగీతం నేర్చుకుంటారు. తలిదండ్రుల ప్రోత్సాహంతోబాటు, ఎన్నో సంగీత సభలు కూడా ఉన్నాయి. అందుకే అక్కడ సంగీతం ఉంది. పెరుగుతూ ఉంది. ఆర్థిక సహాయం అందించే దాతలకూ కొదవలేదు. పెద్దపెద్ద వస్త్ర దుకాణాలు, బ్యాంకులూ, చిట్‌ఫండ్ కంపెనీలు సంగీత కచేరీలకు స్వచ్ఛందంగా విరాళాలిచ్చి ప్రోత్సహిస్తాయ.
తెలుగు నేలపై అటువంటి వాతావరణం లేదు. సమాజంలో వ్యక్తులకు ‘సామాజిక స్పృహ’ లోపిస్తే జరిగేదంతా నష్టమే. ఆలుబిడ్డలకంటే, సమాజ శ్రేయస్సే మిన్నగా భావించిన వ్యక్తులు, వారు నమ్మిన సిద్ధాంతాల కోసం, ఆదర్శం కోసం తమ జీవితాలనే త్యాగం చేసిన మహానుభావులున్నారు. లేకపోలేదు. కవిత్వం, గానం, లలిత కళలు మొదలైనవి లెఖ్ఖలు, జియాగ్రఫీలా ఉన్నపాటున ఒక్కసారిగా అరటిపండు ఒలిచినంత సులభంగా విప్పి చెప్పేందుకు వీలులేదు. కవికైనా, గాయకుడికైనా, అసలు సంగీతానికి ఒక మంచి వాతావరణం ఉండాలి. అది భౌతికం కాదు. మానసికమైనది. హృదయానికి సంబంధించినది. ఎందుకంటే యివన్నీ మనస్సు మీద ప్రభావం చూపేవే.
రామాయణ భారత భాగవతాలపై ఎంతోకాలం నుండి అనర్గళంగా ప్రవచనం చెప్పే పండితుల చుట్టూ వేలాది జనం ఎందుకు వెర్రిగా పోగవుతూ కూర్చుని వింటున్నారు? ఈ కథలు తెలియక కాదు. యిళ్లల్లో ఈ గ్రంథాలు లేకా కాదు. పారాయణం చేసే ఓపిక లేకనే. అలాగే సంగీత కచేరీలు కూడాను. కొన్ని సంస్థలుంటాయ - దీనికి సమాజంలో బాగా పలుకుబడి వున్న రాజకీయ నాయకులనో, పారిశ్రామికవేత్తలనో పిలుస్తుంటారు. వీళ్లకు సంగీతం వినే అలవాటు సాధారణంగా ఉండదు. సమయం ఎక్కడుంటుంది పాపం? మొహమాటంతో, సంగీతంలో ఓనమాలు తెలియనివాళ్లని పిలిచి బలవంతంగా వేదికలపై కూర్చోబెడ్తారు. వెంటనే పూలదండలతో ముంచెత్తి సత్కారాలు, సన్మానాలు చేస్తూ సొమ్ముచేసుకునేవారు ఈవేళ కోకొల్లలు.
సినిమా పాటల పిచ్చి వ్యామోహంతో పాపం గంటకు ముందే సీట్లలో కూర్చుని వినే వెర్రిజనమే వీళ్ళకు పెద్ద ఆకర్షణ. పెట్టుబడి అవసరం లేని ఓ చిన్న సైజు వ్యాపారమిది. మీరు వింటే ఆశ్చర్యపోతారు. సంగీత మూర్తిత్రయం ఉపాసించిన శుద్ధమైన సంగీతం, కేవలం భగవంతుడి రూపమే అని, వేద స్వరూపిణియని, పాపహారిణి, ఆనందవర్ధిని, దైవదర్శిని, మోక్షప్రదాయిని అని నమ్మిన త్యాగరాజ భక్తుడు నారుమంచి సుబ్బారావు - పేరు సంగీత ప్రియులకు మాత్రమే తెలుసు. తెనాలి సుబ్బారావుగా తమిళనాడులోని రసికులందరికీ ఎంతో చిరపరిచితుడు. అంతేకాదు. అరుదైన సంగీతాభిమానిగా సంగీత విద్వాంసుల అభిమానాన్ని చూరగొన్న వ్యక్తి. వృత్తిరీత్యా సుబ్బారావు న్యాయవాది. కానీ ఆయన ప్రవృత్తి ‘సంగీతం’ వినటం.
ఎప్పుడో జరిగిన సంఘటన. విజయవాడలో నా గురువైన వోలేటి గారి కోసం ఆలిండియా రేడియో కేంద్రానికి వచ్చి, సంగీత మూర్తిత్రయం వారి కీర్తనల చిట్టా ఒకటి ఆయన చేతికిచ్చి, నమస్కరించి చక్కా వెళ్లిపోయారు సుబ్బారావు. ప్రక్కనే నేనూ వున్నాను. నిరాడంబరంగా వున్న ఆయన్ని చూసి ఆశ్చర్యపడుతూ, గురువుగారిని వివరాలు అడగ్గా, ‘సంగీత మూర్తిత్రయం వారి కృతులు ఎవరి చిత్తం వచ్చినట్లు వారు పాడకుండా, కట్టుదిట్టమైన (ఓ 100 కృతులు) స్వరంతో పుస్తకం వేయాలని పాపం ఆయన సంకల్పం’ అన్నారు. రెండు మూడు మాసాల వ్యవధిలో ఆయన కోరినట్లుగా గురువుగారూ, నేను కలిసి ఆయన కోరికన కీర్తనల పాఠాన్ని తయారుచేసి, ఆయనకు అందజేశాం. పరమానందపడిన నారుమంచి సుబ్బారావు ‘కృతికదంబం’ పేరుతో ఎవరినీ ఒక రూపాయి ఆశించకుండా తానే అచ్చువేసి ఆ గ్రంథాలను సంగీత రసికులకూ, విద్యార్థులకూ విద్వాంసులకూ పంచిపెట్టిన వెర్రి సంగీతాభిమాని.
సంప్రదాయ సంగీతంలోని మాధుర్యం తానొక్కడే కాక, సమాజంలో అందరూ అనుభవించాలనే భావంతో ‘సీతారామ గానసభ’ను 1947లో తెనాలిలో ప్రారంభించారు. గానసభ అంటే ధ్యానసభలా వుండాలనీ, ‘్ధనసభ’ కాకూడదని వాంఛించిన నిస్వార్థ వ్యక్తి. సంగీత జ్ఞానం భక్తి వినా సన్మార్గాన్ని చూపించదని నమ్మినవాడు - ఆ సంగీత సభను కూడా ఆ మార్గంలోనే నిజాయితీగా నడిపినవాడు. దక్షిణ దేశం నుంచి బాగా పేరున్న సంగీత విద్వాంసులైన మహారాజపురం విశ్వనాథయ్యర్ (సెమ్మంగుడికి గురువు, మహారాజపురం సంతానంకు తండ్రి) ఎంఎస్ సుబ్బులక్ష్మి, డి.కె.పట్టమ్మాళ్, ఎం.డి.రామనాథన్, వోలేటి వెంకటేశ్వర్లు, మణికృష్ణ స్వామి, సుప్రసిద్ధ వేణుగాన విద్వాంసుడు టి.ఆర్.మహాలింగం కూడా ఈ సభలో పాల్గొన్నవారే.
ప్రసిద్ధి చెందిన వయొలిన్ విద్వాంసులు పాపా వెంకట్రామయ్యర్, టి.ఎన్.కృష్ణన్, ఎం.చంద్రశేఖర్, ఎం.ఎస్. గోపాలకృష్ణన్, పాల్ఘాట్ మణిఅయ్యర్, టి.కె.మూర్తి, తంజావూర్ ఉపేంద్రన్, ఉపయాల్పురం శివరామన్ వంటి పెద్ద మృదంగ విద్వాంసులు ఈ సభలో పాల్గొనటం విశేషం.
ఈ సభలో సంగీత కళానిధులు ముదిగొండాన్ వెంకట్రామయ్యర్, డా.శ్రీపాద పినాకపాణి వంటి సంగీత విద్వాంసులు తమ గానాన్ని వినిపించారు. తెనాలి సంగీత ప్రియులకు ఇవన్నీ మధురమైన జ్ఞాపకాలే.
తానొక్కడై సంగీత ప్రియుల కోసం భక్తితో ఆ సభను నడిపిన సుబ్బారావుపై గల గౌరవంతో విద్వాంసులు పారితోషికంతో నిమిత్తం లేకుండా వచ్చి కచేరీలు చేసి వెళ్లటం గమనార్హం. సీతారామ గానసభ ఆధ్వర్యంలో 2015లో సుబ్బారావుగారి శత జయంత్యుత్సవాలు, ఆయన కుమారులు నారుమంచి శివప్రసాద్, ఆంజనేయ ప్రభులు ఎంతో వైభవంగా నిర్వహించటం నాకింకా గుర్తే. నారుమంచి సుబ్బారావు తండ్రి చిన సీతారామయ్య పేరుతో ప్రారంభించిన ఈ సంగీత సభకో విశేషం ఉంది.
కర్ణాటక సంగీతానికి అఖండ గౌరవం కలిగిన మదరాసు నగరంలో సుబ్బారావుకు 1979లో ‘సంగీత విద్యారత్న’ బిరుదుతో పెద్ద సత్కార సభ జరిగింది. శ్రీరామ నామ యజ్ఞ మండలి ఆధ్వర్యంలో సుబ్బారావు చేసిన సంగీత సేవకు గుర్తింపుగా లభించిన గౌరవం అది. సుబ్బారావుకు సమకాలికులైన టంగుటూరి ప్రకాశం పంతులు, పొట్టి శ్రీరాములు, బి.ఎన్.రెడ్డి, విశ్వనాథ సత్యనారాయణ, ప్రముఖ పాత్రికేయుడు ఎం.చలపతిరావు వంటి ప్రముఖుల దృష్టిలో నారుమంచి సుబ్బారావు సంఘ సేవకుడు. సామాజిక స్పృహ కలిగి లోక కల్యాణం కోసం, తన జీవితానే్న అంకితం చేసిన మహా వ్యక్తి. సంప్రదాయ సంగీత వ్యాప్తికి ఆస్తులను కూడా అమ్ముకున్న ఇటువంటి నిస్వార్థ సంగీత ప్రియులు చాలా అరుదుగా ఉంటారు.
కర్ణాటక సంగీత మూర్తిత్రయమైన త్యాగరాజు, శ్యామశాస్ర్తీ, ముద్దుస్వామి దీక్షితుల వారి రచనలు బహుళ వ్యాప్తమై, ప్రజలకు సంప్రదాయ సంగీతం పట్ల గౌరవం, భక్త్భివం పెరగాలని మనస్ఫూర్తిగా వాంఛించిన త్యాగధనుడు నారుమంచి సుబ్బారావు. సర్వసాధారణంగా ఊరూ వాడా త్యాగరాజ ఆరాధనోత్సవాలు జరుగుతూంటాయి. లోక కళ్యాణం కోసం పుట్టిన మూర్తిత్రయం వారి జయంత్యుత్సవాలు విరివిగా జరగాలనే కంచి పరమాచార్యుల వారి సూచన. త్యాగరాజు, శ్యామశాస్ర్తీ, దీక్షితుల వారి జయంత్యుత్సవాలను మొదటిసారి తెనాలిలో జరిపిన వ్యక్తి నారుమంచి సుబ్బారావే కావటం విశేషం. సీతారామ గానసభ ఆధ్వర్యంలో తెనాలిలోనే కాదు, మదరాసు, తిరువారూరు, తిరువయ్యారు (సంగీత మూర్తిత్రయం వారి జన్మస్థలాలు) హైద్రాబాద్, భద్రాచలం, గోల్కొండ ప్రాంతాల్లో నిర్వహించిన నారుమంచి వంటి సంగీత ప్రియులు చాలా అరుదుగా పుడ్తారు. కాసుల కోసం వెంపర్లాడుతూ, కళామతల్లి సేవలో తరిస్తున్నామని గొప్పలు చెప్పే సభలను చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ సామాన్య శ్రోతల స్థాయికి బాగా దిగిపోయి చౌకబారు సంగీతంతో, వారి పబ్బం గడుపుకునేవే తప్ప, సమాజానికి ఒరిగేదేమీ వుండదు. కాసుల ప్రయోజనమే తప్ప కళా ప్రయోజనం ఉండదు. సినీ మాయాజాలానికి లొంగిపోయి క్షణికానందాన్నిచ్చే సంగీతమే సంగీతమనుకునే సంస్థలకు ఇబ్బడిముబ్బడిగా విరాళాలిచ్చే వదాన్యులెందరో. వారికి నచ్చిన సంగీతమే సంగీతం అనుకుంటూ జయంతులూ, వర్థంతులూ పేరిట లక్షలు లక్షలు వసూలు చేసేస్తూ, అల్లరిచేసే సంస్థలే ఈవేళ సమాజంలో స్థిరంగా నెలకొన్నాయి - వర్థిల్లుగాక.
కానీ ఒక్కటి ఆలోచించాలి. స్వరం, రాగం, లయ, మొదలైన సంగీతపరమైన అంశాలన్నీ మనలను సృష్టించిన విధాత తేజోంశాలే. పరబ్రహ్మం నాదరూపుడు. ఆకాశమే ఆయన శరీరం. ఆకాశ తత్త్వం నాదమే. నాదమయుణ్ణి సినిమా పాటలతో కాదు నాదం ద్వారానే, ఆరాధించాలి.
‘ఓంకారం’ అన్ని స్వరాలకూ మూలం. స్వరాల సారమే రాగం. అన్ని రాగాలకు శ్రుతి మూలం. ఆ నారాయణుడు శ్రుతి సాగరుడు. ఆ శ్రుతిలోనుండే ఈ రాగాలు, స్వరాలు బయలుదేరాయి. భాష వికసించింది. కాలతత్త్వం నుండి లయ పుట్టింది. ఈ దృష్టితోనే గాయకులు పరాత్పరుని గురించి ధ్యానించాలి అనేవారు నారుమంచి. నిజమే. భక్తులు సత్సంగంలో ఆ పరాత్పరుణ్ణి గూర్చి పాడాలి. వినాలి. పనికిరాని లోకాభిరామాయణం వల్ల ఎవరికి ప్రయోజనం? తానొక్కణ్ణే మహా గాయకుడనని విర్రవీగకుండా ఆ పరమేశ్వరుణ్ణి శుద్ధచిత్తంతో, స్వర రాగ లయాదులతో పాడే విద్వాంసులకే తన మనస్సు నర్పించి, తానేమీ మిగుల్చుకోకుండా, బాహ్య ప్రపంచానే్న మరచిపోయి, బ్రహ్మానందాన్ని అనుభవించిన వారందర్నీ ఎందరో మహానుభావులని కీర్తించారు త్యాగరాజు.
అదిగో! ఆ కోవలోని వ్యక్తే ఈ నారుమంచి.
*

ఓం తద్ధీతం నమః
మృదంగ వాద్యాలలో వినిపించే శబ్దాలు 16. వీటితోనే మృదంగంలో రకరకాల జతులు (వరుసలు) కూర్చబడ్డాయ. అయతే ‘తా-్ధ-తోం-నం’ అనే వాటితోనే ప్రారంభ వరసగా మృదంగ గురువులు శిష్యులకు బోధిస్తుంటారు. ‘ఓం తద్ధీతం నమః’ అనేది మృదంగ పంచాక్షరి. ‘జ్ఞాన స్వరూపిణియైన తల్లీ! నీకు నమస్కారం!’ అని భావం. ఈ అక్షరాలే ‘తా-్ధ-తోం-నం’ అనే తొలి పాఠం. అక్షరాభ్యాసంలో ‘ఓం నమశ్శివాయ’ అనే శివ పంచాక్షరితో ఎలా ఆరంభం చేస్తారో అలాగే మృదంగ సరస్వతికి నమస్కరిస్తూ వాయంచే అక్షరాలివి. ఇదే మృదంగ పంచాక్షరి. లయవాద్యాలన్నింటిలో మృదంగమే సామ్రాట్. వీణు, వేణువు, మృదంగం - ఈ మూడూ వాద్య త్రయమని పెద్దలు చెబుతారు. ‘వీణా వేణు మృదంగ వాద్య రసికే’ అని అమ్మవారికి పేరు. అందుకే ఉదయం నిద్ర లేవగానే మృదంగం చూస్తే చాలా మంచిదంటారు. మృదంగ వాద్యకుడికి సున్నితమైన హెచ్చరిక ఒకటుంది. అదేమిటంటే - ‘‘ఓ మార్దాంగికా! పాటకి ఏవిధంగానూ చెడు చేయకుండా అన్ని విధాలుగా రక్తి కట్టడంలో దోహదపడేలా సహకార వాద్యంగానే ఉండు. దానికి కావాల్సిన అభిమానాన్ని సంపాదించుకో. గాయకుడి హృదయపూర్వక అభినందన, శ్రోతల మనఃపూర్వక ప్రశంసలు పొందాలని దాని అర్థం’’ - అని అంటారు మృదంగ కళా తపస్వి వంకాయల నరసింహం. ఎంతటి మహా విద్వాంసులైనా మృదంగ విద్వాంసులు, వయొలిన్ విద్వాంసులు ప్రధాన గాయకుణ్ణి వింటూ తదనుగుణంగా వాయంచాలి. పాటకు రక్తినిచ్చేవే ఈ సహకారవాద్యాలు. అనుసరణ ప్రజ్ఞావంతంగా ఉంటేనే గౌరవం ఆనందమయం. ఎవరి వాద్యాలు వారు వాయంచేసుకుంటూ పోతే ‘అల్లరి’ మిగుల్తుంది కానీ, సభలో ఒక్కడుండడు. సాహిత్యాన్ని మింగేసే ధ్వని అల్లరే మరి. ‘‘అయ్యా! ఈవేళ మృదంగ విద్వాంసునికి విడిగా (తని) వాయంచే అవకాశం ఎందుకివ్వలేదు?’’ అని ఓ శ్రోత అడిగాడు. ఆ గాయకుడు నవ్వుతూ ‘‘కచేరీ ప్రారంభం నుంచీ ఆయన వాయంచినదంతా తనియే కదా’’ అన్నాడు. పాట వింటూ అనుసరిస్తేనే ఆదరణ. అదొక ప్రత్యేక ప్రజ్ఞ. వెనకటి తరంలోని మహా మృదంగ విద్వాంసులందరూ అనుసరణ ప్రజ్ఞతోనే పేరు ప్రఖ్యాతులు సంపాదించారు.

చిత్రాలు..వంకాయల నరసింహం

- మల్లాది సూరిబాబు 9052765490