డైలీ సీరియల్

ట్విన్ టవర్స్ - 33

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అతనితో నా సహచర్యం అతి స్వల్పం. అందుకనే అతన్ని అర్థం చేసుకోగలిగే అంత దగ్గరతనం నాకు లేదు. ఆ వెలితి మాత్రం మనసులో అలాగే ఉండిపోతోంది. ఈమధ్య అతని దగ్గరనుంచి వచ్చే ఉత్తరాలు కూడా క్లోజ్‌నెస్‌ని పెంచడంలేదు.
మొత్తంమీద ఏడాది వెనకపడ్డా మళ్లీ కాలేజీలో చేరాను 2వ సంవత్సరంలో. నా క్లాస్‌మేట్స్ అంతా నాకంటే ముందుకు వెళ్లిపోయారు.
అదే బాధ వ్యక్తం చేసేదాన్ని వాళ్ళతో. పోనీలేవే. జీవితంలో మా కంటే ముందుకు వెళ్లిపోయావు కదా! అనేవారు.
కాలేజీలో చేరానని రఘుకు ఉత్తరం రాశాను. మంచి పని చేవావు, బాగా చదువు అంటూ సమాధానం ఇచ్చాడు.
నా చదువు నిరాటంకంగా సాగిపోతోంది. వౌళి ఏ విధంగానూ అడ్డురాలేదు, అమ్మ, మామ్మ, వదినల మూలంగా. అమ్మ మాత్రం వాడికి జరపవలసిన వేడుకలన్నీ ఒక్కటీ మానకుండా చేసేది. ఉయ్యాలలో వేయడం, అన్నప్రాసన, పుట్టినరోజు ఒకటేమిటి అన్నీను.
అనుకున్నట్లు 2వ సంవత్సరం పూర్తి కావస్తుంటే- నాన్న పాస్‌పోర్ట్ తెప్పించాలని ప్రయత్నించారు. రఘుకు ఉత్తరం రాశారు. రఘు నాన్నగారితో కూడా మాట్లాడారు. కానీండి. చదువు మధ్యలో ఆపకండి. మరో సంవత్సరమే కదా! డిగ్రీ ఆపకండి అన్నారు.
నిరాటంకంగా నా చదువు చివరకు వచ్చింది. పగలంతా కాలేజీ, సాయంత్రం వౌళితో గడపడం, రాత్రి హోంవర్క్, సంగీత సాధన- పెద్దగా దేనికీ ఆలోచించకుండా రోజులు గడుస్తున్నాయి.
రఘు దగ్గర నుంచి వచ్చే ఉత్తరంకి, ఉత్తరంకి మధ్య కాలం పెరగడం, ఉత్తరాల్లో సారాంశం తరగడం మొదలుపెట్టాయి.
కేవలం యోగక్షేమాలు, తన రీసెర్చ్ గురించి తప్ప మరొకటి ఉండేది కాదు. కనీసం మా ఇద్దరినీ మిస్ అవుతున్నట్లుగాని, నా రాక కోసం ఎదురుచూస్తున్నట్లుగానీ, ఏదీ ఉండేది కాదు. అది మాత్రం చాలా నిరాశగా ఉండేది. అంతలోనే నాకు నేను సమర్థించి చెప్పుకునేదాన్ని.
అతను చేసే రీసెర్చ్ ఏమీ సామాన్యమైనది కాదు కదా. అతను చెప్పిన ప్రకారం అతను చేసేది సక్సెస్ అయితే అది ఒక పెద్ద సైంటిఫిక్ బ్రేక్‌త్రూ. ప్రపంచంలో అంత గొప్ప కార్యాలు సాధించాలంటే మరోచోట త్యాగం తప్పదు కదా! రఘు అంత పెద్ద కార్యాలు సాధించాలంటే తను ఈ మాత్రం ఇబ్బందులు, నిరుత్సాహాలు భరించాలి. ఆ మాత్రం తన కర్తవ్యం కదా- అనుకునేదాన్ని.
మూడో సంవత్సరం ముగింపు దగ్గరపడుతున్న కొద్దీ రఘుకు ప్రతి ఉత్తరంలోనూ రాసేదాన్ని. వీసాకు అవసరమైన పేపర్స్ పంపమని అంటూ. అతను త్వరలో పంపుతా అనేవాడు కానీ అవి మాత్రం రాలేదు.
చివరకు నాన్నకు అనుమానం రావడం మొదలయింది. అతను వౌళిని తీసుకువెళ్లడానికి సందేహిస్తున్నాడేమో అని.
నాన్న నన్ను రఘుకు ఉత్తరంలో రాయమన్నారు. తను సెటిల్ అయ్యేవరకు వౌళి ఇండియాలోనే మా దగ్గర ఉంటాడని, వాడిని గురించి ఏమీ సందేహించవద్దని. అదే విషయం నాన్న రఘు నాన్నగారికి ఫోన్ చేసి చెప్పారు.
‘‘మీరు రఘుకు నచ్చచెప్పండి. వౌళి గురించి వర్రీ అవ్వద్దని. వాడికి అమ్మమ్మ, అత్తా బాగా చేరువ. రఘు సెటిల్ అయ్యేవరకు మా దగ్గరే ఉంటాడని’’. అది మాత్రం నాకు మనసులో చాలా దిగులనిపించింది. రెండు సంవత్సరాలు నిండనివాడిని వదిలేయడం అంటే! నాన్న మాత్రం చాలా నచ్చచెప్పాలని చూశారు. పరిస్థితులబట్టి మనం కూడా ప్రవర్తించాలని.
చివరకు మనసు ఎలాగో అలా బిగపెట్టుకుని అదే ఉత్తరం రాశాను రఘుకు. మా మామగారికి ఆ ఆలోచన బాగా నచ్చింది. అదే రఘుతో చెప్పాలని ప్రయత్నించారు. నా పాస్‌పోర్ట్ అన్నీ సిద్ధం అయ్యాయి. ఇక వీసా కోసం రఘు పేపర్స్ పంపమని.
అంతలోనే పిడుగులాంటి ఉత్తరం వచ్చింది రఘు దగ్గరనుంచి.
కళ్యాణీ,
నా జీవితంలో ఇంత నిరాశ నేనెప్పుడూ ఎదుర్కోలేదు. ఓటమి ఇంత చేదుగా ఉంటుందని తొలిసారిగా తెలిసింది. నేనింతవరకూ ఎక్కడా ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు. అన్నిట్లోనూ ఫస్ట్ రాంక్ తప్ప.
నా మూడేళ్ల కష్టం సైంటిఫిక్ వరల్డ్‌లో మేజర్ స్టెప్పింగ్స్ స్టోన్ అవుతుందని అనుకున్నాను. ఇక ముందు ముందు ఈ రీసెర్చి ఆధారంగా ఎన్నో అనూహ్యమైన ఫలితాలు వస్తాయనుకున్నాను. అటువంటిది పూర్తిగా ఓడిపోయాను. నా ఈ ప్రపంచంలో నా థీరీ సంచలనాన్ని సృష్టిస్తుందని ఆశిస్తుంటే- పూర్తిగా మరొకరి సొంతం అయిపోతుందని నా కంటే మరొకరు ముందుకు వస్తారని అనుకోలేదు.
నిద్రపోయి వారం రోజులయింది. నిరుత్సాహం అనేది మనిషిని ఇంత క్రుంగదీయగలదని ఇప్పుడే తెలిసింది. ఒక్కోసారి చచ్చిపోవాలనిపిస్తోంది. నా గైడ్ అండ్ ప్రొఫెసర్ కూడా నా పరిస్థితిలోనే ఉన్నారు. అతని మొహం కూడా చూడాలనిపించడంలేదు.
అమెరికా రాగానే ఏ ఇతర డైవర్షన్ లేకుండా ఉండి ఉంటే ఇంకొంచెం త్వరగా పూర్తిచేయగలిగే వాళ్ళమేమో!
అసలు పెళ్లి చేసుకురావడమే తప్పు చేశాను. నీ మీద నుంచి మనసు మళ్లించుకోవడానికి చాలా టైం వేస్ట్ చేశాను. ఆ తరువాత రెండు నెలల్లో మరో డైవర్షన్. అది నేను వేరే చెప్పాల్సింది లేదు.
నా మనసు ఎందుకింత బలహీనమయిపోయింది? ఎవ్వరికీ నా ఇష్టాయిష్టాలు ఎందుకు తెగించి చెప్పలేకపోతున్నాను. తాత, నాన్న, అమ్మ, నువ్వు మీ అందరి అభిప్రాయాలు నేను అంగీకరించాల్సి వచ్చింది. కాని, నన్ను, నా అవసరాలు ఎవ్వరికీ అర్థం కాలేదు. నేనేం కోరుకుంటున్నానో ఎవ్వరికీ అర్థం కాలేదు. ఎంత సాధించాలనుకున్నాను. భారతదేశంలోనే ఈ రీసెర్చికి గౌరవం తేవాలనుకున్నాను. నన్ను తీర్చిదిద్దిన ఇన్‌స్టిట్యూట్‌కి గౌరవం తేవాలనుకున్నాను.
అన్ని కలలు చెదిరిపోయాయి. మిగిలింది ఒక్కటే- కలలన్నిటిని చంపుకుని ఏ ప్రత్యేకతా లేకుండా బతకడం.
అబ్బ ఫెయిల్యూర్ ఇంత బాధాకరం అని నేనెప్పుడూ అనుకోలేదు. నాన్న వెంటనే ఇండియా రమ్మంటున్నారు. కొద్ది రోజులు పోయాక మళ్లీ ప్రయత్నిద్దువుగాని ఒంటరిగా వుండవద్దు వచ్చేయ్ అని బలవంతం చేస్తున్నారు.
-ఇంకాఉంది

- రమాదేవి చెరుకూరి