ఫోకస్

తల్లిదండ్రులు ఉద్యమించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రైవేటు విద్యాసంస్థలు వసూలు చేస్తున్న అధిక ఫీజులను నియంత్రించాలంటే తల్లిదండ్రుల ఉద్యమంతోనే సాధ్యపడుతుంది. తల్లిదండ్రుల ప్రమేయం లేకుండా ప్రపంచంలో ప్రైవేటు, ప్రభుత్వ విద్యాసంస్థలు నిర్వహించబడేది ఒక్క భారతదేశంలోనే కావడం మనం చేసుకున్న దౌర్భాగ్యమనే చెప్పాలి. ఎక్కడైనా విద్యార్థుల తల్లిదండ్రులకు ఆయా విద్యాసంస్థలు తప్పక జవాబుదారీగా ఉంటాయి. కాని ఇక్కడ పరిస్థితి వేరు. ప్రభుత్వం జివో నెం.1 ప్రకారం ప్రైవేటు విద్యాసంస్థలు ఏడాదికి వసూలు చేసే ఫీజుల్లో 50శాతం ఉపాధ్యాయులకు, సిబ్బందికి, 15శాతం సిబ్బంది సంక్షేమ కార్యక్రమాలకు, 35శాతం తమ ఆదాయంగా పొందాల్సి ఉంది. కానీ ఈ ఉత్తర్వులు ఎక్కడా అమలు జరుగుతున్న దాఖలాలైతే లేవు. తమిళనాడు రాష్ట్రంలో అక్కడి ప్రభుత్వం తీసుకున్న కొన్ని చర్యల వలన పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంది. ఫీజుల నియంత్రణకు ప్రత్యేక బిల్లు రూపొందించడం ద్వారా ప్రైవేటు విద్యాసంస్థల ధనదాహానికి కాస్తోకూస్తో కళ్లెం వేయగలిగారు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఫీజు నియంత్రణ కమిటిని ఏర్పాటుచేసి ఈ అధిక ఫీజుల బారినుండి కాపాడేందుకు ప్రయత్నం ప్రారంభించింది. కమిటీ నివేదిక కూడా త్వరగా ఇచ్చేలా ఆదేశించారు. తల్లిదండ్రులను కూడా కమిటీలో సభ్యులుగా చేర్చారు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఆ దిశగా కనీసం ప్రయత్నం కూడా ప్రారంభం కాకపోవడం విచారకరం. ప్రభుత్వాలు ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాల అదుపులో ఉండే ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ప్రభుత్వం ఏదో చేస్తుందని ఎదురుచూడడం వృథానే. ఫీజుల నియంత్రణకు శాసనసభలో బిల్లు పాస్ చేయించి అమలు చేయడంద్వారా కచ్చితంగా ప్రైవేటు విద్యాసంస్థల అధిక ఫీజు వసూలును అడ్డుకునే శక్తి ప్రభుత్వానికి ఉంది. విద్యావేత్తలు, రాజకీయ ప్రముఖుల సలహాలతో ఒక కమిటీని ఏర్పాటు చేయడంద్వారా కూడా ఫలితాలను ఆశించవచ్చు. కానీ అటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని అనుకోవట్లేదు. విద్యాసంస్థల ఫీజులకు ఓవైపు భయపడుతూనే పిల్లల భవిష్యత్‌కోసం అష్టకష్టాలు పడేందుకు సిద్ధమవుతున్న తల్లిదండ్రులు ఇకనైనా పోరాటం వైపు సాగాలి. అధిక ఫీజుల బారినుండి తమను తాము కాపాడుకునేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు ఉద్యమించాల్సిన అవసరం ఉంది.
- విఠపు బాలసుబ్రమణ్యం
ఎమ్మెల్సీ, ప్రముఖ విద్యావేత్త