ఫోకస్

ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విద్య అనేది ప్రజలందరికీ అందుబాటులో ఉండాలి. తల్లితండ్రులు తమ పిల్లల చదువుకు సంబంధించిన ఫీజులను భరించలేమన్న భావనకు రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన తర్వాత ధనిక, పేద అన్న తారతమ్యాలు లేకుండా అందరికీ విద్య అందుబాటులోకి వస్తుందని ప్రజలంతా భావించారు. అయితే ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ మూడేళ్ల తర్వాత కూడా చెప్పుకోదగ్గ మార్పులు రాలేదు. ప్రభుత్వ విద్యాసంస్థలలో నిపుణులైన బోధనా సిబ్బంది ఉన్నారు. అయితే వీరి సేవలను, నైపుణ్యాన్ని ఉపయోగించుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా సఫలం కాలేదు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో వౌలిక సదుపాయాలు లేవు. ఈ విద్యాసంస్థలపై ప్రజల్లో నమ్మకం కలిగించేందుకు ప్రభుత్వ పరంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రైవేట్ సంస్థలను ప్రభుత్వం నియంత్రించలేక పోతోంది. ఫీజులను నియంత్రించేందుకు ప్రభుత్వం అనేక కమిటీలను నియమిస్తున్నప్పటికీ సరైన ఫలితాలు రావడం లేదు. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ రక్కర్ ఆచార్య (విద్య) పరిశీలనలో స్టేట్ లెవెల్ స్టీరింగ్ కమిటీని నియమించారు. విద్యాసంస్థల్లో అడ్మిషన్లు, ఫీజు రెగ్యులేటరీ కమిటీని నియమిస్తూ ప్రభుత్వం జీఓ ఆర్‌టి నెంబర్ 160ని జారీ చేసింది. గతంలోకూడా అనేక కమిటీలను ప్రభుత్వం వేసింది. వివిధ కమిటీలు సమగ్రంగా అధ్యయనం చేసి, పరిశీలించి చేస్తున్న సిఫార్సులను ప్రభుత్వం అమలు చేయలేకపోతోంది. ప్రైవేట్ విద్యాసంస్థలు విద్యను వ్యాపారంగా మార్చివేశాయి. ఎసి గదుల్లో తరగతుల నిర్వహణ, పాఠశాలలల్లో స్విమ్మింగ్ పూల్స్ ఏర్పాటు చేయడం, తదితర విపరీతపోకడలకు పాల్పడుతున్నాయి. నాణ్యమైన విద్యను అందించడం ఎలా ఉన్నప్పటికీ, విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ప్రలోభపెట్టేవిధంగా, ఎక్కువ మందిని ఆకర్షించేవిధంగా కార్పొరేట్ సంస్థలు ప్రచారం చేసుకుంటున్నాయి. ప్రతి విద్యాసంస్థకు గ్రంథాలయం, ప్లేగ్రౌండ్ తదితర వౌలిక సదుపాయాలు అవసరమే కాని లగ్జరీ సౌకర్యాలు అవసరం లేదు. మన సామాజిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, గ్రామీణ, పట్టణ ప్రాంతాలు, నగరాల్లో నడుస్తున్న విద్యాసంస్థల్లో ఫీజులను నిర్ణయించడంలో ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవాలి. చిత్తశుద్ధి ఉంటే ఏదైనా సాధ్యమే.
- పి. మురళీమనోహర్
మెంబర్, ఎన్‌సిఇఆర్‌టి