ఫోకస్

గుదిబండగా ఫీజులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్కూల్ ఫీజు 20 లక్షలు అంటే చాలామందికి ఆశ్చర్యం కలగొచ్చు, కాని అలాంటి సకల సదుపాయాలు హైదరాబాద్‌లోనే ఉన్నాయి. అత్యధిక ఫీజు ఉండే స్కూళ్లకోసం కొంతమంది వెదికి పట్టుకుని అందులోనే తమ పిల్లల్ని చేర్చడంద్వారా తమ హోదాను, సామాజిక స్థితిని తేటతెల్లం చేస్తుంటారు. అలాంటి పాఠశాలల్లో చేరే విద్యార్ధులు అంతా అదే ఆర్థిక స్థోమతతో ఉంటారుకనుక దానినే సమసమాజంగా భావించే కుటుంబాలున్నాయి. కాని అత్యధికంగా నిరుపేదలు, మధ్యతరగతి వర్గాలు జీవించే రాష్ట్రంలో సాధారణ స్కూలు ఫీజులు కూడా చెల్లించలేని కుటుంబాలు లక్షల్లో ఉన్నాయి. అన్నీ ఉచితంగా ఇస్తున్నారనే పేరుతో ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించలేక, మంచి చదువుకోసం, నాణ్యమైన నాగరికతకోసం ప్రైవేటు పాఠశాలల్లో చేర్పించి ఫీజులు చెల్లించలేక నానాఅగచాట్లు పడే కుటుంబాలు కోకొల్లలు. డిజిటల్ స్కూళ్లు, ఒలింపియాడ్ స్కూళ్లు, కానె్సప్ట్ స్కూళ్లు, ఇంటర్నేషనల్ స్కూళ్లు, గ్రామర్ స్కూళ్లు, టెక్నో స్కూళ్లు, గ్లోబల్ స్కూళ్లు, ఐబి స్కూళ్లు పేరేదైనా వారు వసూలు చేసే ఫీజులు మాత్రం లక్షల్లోనే. ఆంగ్లభాష, ఆంగ్లమాధ్యమం, నూతన పోకడలు, టెక్నాలజీ వినియోగం, రంగురంగుల యూనిఫారాలు, బ్లేజర్లు, ఎసి తరగతి గదులు, ఎసి బస్సుల్లో రవాణా వంటి హంగులతో ఈ స్కూళ్లు తల్లిదండ్రులను ఒక విధంగా చెప్పాలంటే దోచుకుంటున్నాయి. ఎల్‌కెజికి సైతం ఐదారు లక్షల రూపాయిల ఫీజులను సునాయాసంగా వసూలు చేస్తున్నాయి. ఉన్నత తరగతులకు ఈ ఫీజు రెట్టింపుగా మారుతోంది. ఇంత పెద్దఎత్తున ఫీజును కట్టేందుకు కొంతమంది తల్లిదండ్రులు ఏమాత్రం వెరవడం లేదు. చాలామంది పేదవారికి మాత్రం ఇదో పెద్ద శాపంగా తయారైంది. ఇంజనీరింగ్ చదివేవారికి లేని ఫీజు ప్రాథమిక పాఠశాలల్లోనే వసూలు చేస్తున్నాయి. ఈ పరిస్థితి తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాలేదు, ఇతర రాష్ట్రాలోనూ ఇదే దుస్థితి కొనసాగుతోంది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం ప్రొఫెసర్ టి తిరుపతిరావు అధ్యక్షతన కమిటీని నియమించింది. ఈ కమిటీ వివిధ రాష్ట్రాలు పర్యటించి, ప్రముఖులతో మాట్లాడి ఫీజుల నియంత్రణకు ముసాయిదాను రూపొందించింది. ముసాయిదా అమలుచేసే ప్రయత్నంలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. స్కూళ్లను వర్గీకరించి అక్కడున్న సదుపాయాల ఆధారంగా ఫీజులు ఉండాలనేది తల్లిదండ్రుల వాదనగా ఉంది. ఫీజుల పెంపుదలకు, నిర్ణయానికి ఒక పద్ధతి, విధానం ఉండాలని వారు కోరుకుంటున్నారు. అది ఎంతవరకూ నెరవేరుతుందో చూడాలి. ఈ అంశంపై కొంతమంది నిపుణుల అభిప్రాయాలే ఈ వారం ఫోకస్.