బిజినెస్

టాటాల చేతికి ఎయిరిండియా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 21: ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియాను సింగపూర్ ఎయిర్‌లైన్స్‌తో కలిసి టాటా గ్రూప్ కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓ ప్రముఖ జాతీయ వార్తా చానెల్ వివరాల ప్రకారం పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన ఎయిరిండియాను టాటా గ్రూప్ హస్తగతం చేసుకునే వీలుందని సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. ఒకవేళ ఇదే గనుక నిజమైతే ఎయిరిండియా.. తిరిగి తన సొంత యజమాని వద్దకే చేరినట్లవుతుంది. 1932లో టాటా సన్స్.. టాటా ఎయిర్‌లైన్స్‌ను స్థాపించింది. టాటా ఎయిర్‌లైన్స్ తొలి విమానం కరాచీ నుంచి ముంబయి మధ్య ప్రయాణించగా, ఇందులో జెఆర్‌డి టాటా ఎక్కారు. 1946లో టాటా ఎయిర్‌లైన్స్.. ఓ పబ్లిక్ కంపెనీగా మారింది. అనంతరం ఎయిరిండియాగా నామకరణం జరిగింది. 1953లో ఎయిరిండియా జాతీయమైంది. ఈ క్రమంలో 64 సంవత్సరాలపాటు ప్రభుత్వరంగ సంస్థగా సేవలందించిన ఎయిరిండియా.. గత దశాబ్దకాలంలో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంది. ప్రస్తుతం ఎయిరిండియా రుణ భారం 52,000 కోట్ల రూపాయలుగా ఉంది.
అనేకసార్లు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందుకున్నప్పటికీ ఎయిరిండియా కష్టాలు మాత్రం తీరలేదు. ఎయిరిండియాను ఆదుకునేందుకు 30,000 కోట్ల రూపాయల ప్యాకేజీకి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపగా, ఇప్పటికే 24,000 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయి. అయితే ఇటీవల ఎయిరిండియా ప్రైవేటీకరణ బాగా చర్చనియాంశమవుతోంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ సైతం ఎయిరిండియా ప్రైవేటీకరణకు అనుకూలంగా మాట్లాడారు. దీని ప్రైవేటీకరణకున్న అవకాశాలను అనే్వషిస్తున్నామని ప్రకటించారు. నీతి ఆయోగ్ కూడా ఎయిరిండియాకు ప్రభుత్వం అందించే సాయం నిష్ప్రయోజనమని అభిప్రాయపడింది. ఆ నిధులతో ఎన్నో ప్రభుత్వ సంక్షేమ పథకాలను నడపవచ్చని పేర్కొంది. కాగా, 2013లోనే టాటా గ్రూప్.. ఎయిరిండియా కొనుగోలుకు ఆసక్తి కనబరిచింది. అప్పటి టాటా గ్రూప్ చైర్మన్ రతన్ టాటా ఈ విషయంపై స్పందిస్తూ ఎయిరిండియాను ప్రైవేటీకరిస్తే.. దాన్ని అందిపుచ్చుకోవడానికి టాటాలు ముందుంటారని అన్నారు. ఉప్పు నుంచి ఉక్కు వరకు, సైకిళ్ల నుంచి సాఫ్ట్‌వేర్‌దాకా వ్యాపారాలను చేస్తున్న టాటా గ్రూప్‌లో 100కుపైగా సంస్థలున్నాయి. దేశ, విదేశాల్లో వ్యాపార కార్యకలాపాలున్న టాటా గ్రూప్ విలువ 103 బిలియన్ డాలర్లపైమాటే. అయినప్పటికీ విమానయాన రంగంపై మాత్రం టాటాలకు మమకారం పోలేదు.
ఈ క్రమంలోనే మలేషియాకు చెందిన ఎయిర్ ఏషియాతో కలిసి ఎయిర్ ఏషియా ఇండియా జాయింట్ వెంచర్‌ను నెలకొల్పిన టాటా గ్రూప్.. సింగపూర్ ఎయిర్‌లైన్స్ భాగస్వామ్యంతో విస్తారా ఎయిర్‌లైన్స్‌ను ఏర్పాటు చేసింది. అయితే ఒకప్పటి టాటా ఎయిర్‌లైన్స్.. ఎయిరిండియాగా మారి మళ్లీ తమ చేతికి వచ్చే వీలుండటంతో టాటాలు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే టాటా గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్.. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో చర్చలు కూడా ప్రారంభించేశారు. ఈ సందర్భంగా 51 శాతం ఈక్విటీతో ఎయిరిండియాలో మెజారిటీ వాటాను పొందేందుకు తాము సిద్ధమని చెప్పినట్లు సమాచారం. సింగపూర్ ఎయిర్‌లైన్స్‌తో కలిసి ఎయిరిండియాను టాటా గ్రూప్ కొనుగోలు చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. కాగా, ఎయిరిండియా ప్రైవేటీకరణపై తుది నిర్ణయం కేంద్ర కేబినెట్‌దేనని పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా స్పష్టం చేశారు. అయితే సంస్థలో మెజారిటీ వాటాను ప్రభుత్వం వద్దే ఉంచుకుని, మైనారిటీ వాటాను విక్రయిస్తే బాగుంటుందన్న ఆలోచనా కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ చేస్తోంది. కానీ నీతి ఆయోగ్ మాత్రం ఎయిరిండియాను పూర్తిగా ప్రైవేట్‌పరం చేయాలని సూచిస్తోంది.
ఎయిరిండియాకు చెందిన ఇతరత్రా ఆస్తులనూ అమ్మేయాలంటోంది. విమానయాన రంగంలో ప్రైవేట్ సంస్థల నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకోలేక, ప్రభుత్వ అవసరాలు, ప్రజా ప్రతినిధుల ప్రయాణాలకు సంబంధించిన బకాయిలు సకాలంలో వసూలవ్వక ఎయిరిండియా ఆర్థిక ఇబ్బందుల్లో పడింది.