మెయిన్ ఫీచర్

కార్యదక్షతకు సత్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్పష్టమైన లక్ష్యాలను ఏర్పర్చుకుని, పట్టుదల, అంకితభావంతో కృషి చేస్తే అద్వితీయ ఫలితాలు సాధించవచ్చని ఆచరణాత్మకంగా నిరూపిస్తున్నారు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ డాక్టర్ యోగితారాణా. ఒకే కార్యస్థానంలో విధులు నిర్వర్తిస్తూ, ఏడాదిన్నర వ్యవధిలోనే రెండు పర్యాయాలు జాతీయ స్థాయి అవార్డులు, హరితహారం అమలులో రాష్ట్ర ప్రభుత్వం నుండి కూడా అవార్డును పొందడం ద్వారా కలెక్టర్ యోగితారాణా తన కార్యదక్షతను చాటుకున్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో అత్యుత్తమ ఫలితాలను నమోదు చేసినందుకు గతేడాది కేంద్ర ప్రభుత్వం నిజామాబాద్‌ను ఉత్తమ జిల్లాగా ప్రకటిస్తూ కలెక్టర్ యోగితారాణాకు అవార్డును బహూకరించింది. తాజాగా ఈ ఏడాది ‘ఇ-నామ్’ అమలులో నిజామాబాద్ మార్కెట్ యార్డును దేశంలోనే అగ్రస్థానంలో నిలిపినందుకు సివిల్ సర్వీసెస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ఏడాది ఏప్రిల్ 21వ తేదీన ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా యోగితారాణా జాతీయ స్థాయి అవార్డును అందుకున్నారు. హరితహారం కార్యక్రమం అమలులోనూ లక్ష్యానికి మించి మొక్కలు నాటి, వాటి సంరక్షణకు పకడ్బందీ చర్యలు చేపట్టినందున ఆమె కృషిని గుర్తించిన ముఖ్యమంత్రి కెసిఆర్ గతేడాది గోల్కొండ కోటలో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఉత్తమ కలెక్టర్ అవార్డును బహూకరించి సత్కరించారు.
బాధ్యత పెరిగింది
చిత్తశుద్ధి చేసిన పనికి గుర్తింపుగా వచ్చిన ఈ అవార్డులు తన బాధ్యతను మరింతగా పెంచాయని యోగిత పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ హరితహారం లక్ష్యాన్ని అధిగమించేలా ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. ప్రభుత్వ ప్రాధామ్యాల అమలుకు ప్రాధాన్యతనిస్తూనే, తాను ఎంచుకున్న అంశాలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తూ సమర్ధవంతమైన పాలనాధికారిణిగా జిల్లాపై తనదైన ముద్ర వేయడంలో యోగితారాణా కృతకృత్యులయ్యారనే చెప్పాలి. తాను వైద్య విద్యను అభ్యసించినప్పటికీ, ప్రజలకు మరింత విస్తృత స్థాయిలో సేవలందించాలనే దృక్పథంతో సివిల్ సర్వీసెస్ రాసి 2003లో ఐఎఎస్‌కు ఎంపికయ్యాయని ఆమె వివరించారు. జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి చెందిన యోగితారాణా తన విద్యాభ్యాసాన్ని అక్కడే పూర్తి చేశారు. అనునిత్యం ఉద్రిక్తతలతో కూడిన ప్రాంతమైనప్పటికీ, విద్యాభ్యాసం పూర్తి చేసే క్రమంలో తనకెప్పుడూ ఎలాంటి ఇబ్బందులు ఎదురవలేదని ఆమె పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా కలెక్టర్‌గా పని చేసే అవకాశం లభించడాన్ని తనకు దేవుడు ఇచ్చిన వరంగా భావిస్తానని ఒకింత ఉద్వేగానికి లోనయ్యారు. అందరి సహకారంతో చక్కటి ఫలితాలను సాధించడం ద్వారా అనతికాలంలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి చక్కటి గుర్తింపు పొందడం మర్చిపోలేనని అన్నారు.
అనాథలకు అండ
జిల్లా పాలనాధికారిణిగా ఓ వైపు బాధ్యతలు నిర్వర్తిస్తూనే, మరోవైపు అనాథ పిల్లల కోసం డిచ్‌పల్లిలో మానవతా సదన్‌ను నిర్వహిస్తున్నారు. ఏ కాస్త సమయం లభించినా అనాథ బాలలతో గడపడం ఆమెకు ఎంతో ఇష్టం. ఇటీవలే మానవతా సదన్‌లో ఆశ్రయం పొందుతున్న 70 మందితో కలిసి కలెక్టర్ యోగితారాణా ‘బాహుబలి-2’ సినిమాను వీక్షించి చిన్నారుల్లో ఎనలేని ఆనందాన్ని నింపారు. తమకు ఎవరూ లేరనే భావన వారి దరి చేరకుండా అన్ని సదుపాయాలను కల్పిస్తూ సమాజానికి చక్కని పౌరులుగా ఉపయోగపడేలా తీర్చిదిద్దాలన్న తన చిరు ప్రయత్నం విజయవంతమైతే ఎంతో సంతృప్తి చెందుతానని యోగితారాణా పేర్కొంటారు.
ప్రజారోగ్యంపైనా శ్రద్ధ
స్వతహాగా వైద్యురాలైనందున జిల్లాలో ప్రభుత్వాసుపత్రుల పనితీరును మెరుగుపర్చేందుకు ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తున్నారు. ఆమె కృషి ఫలితంగా ప్రభుత్వాసుపత్రు ల్లో ప్రసవాల సంఖ్య 40శాతానికి చేరడం విశేషం. ఆర్మూర్ ఆసుపత్రిలో రికార్డు స్థాయిలో నెల రోజుల వ్యవధిలోనే 200 కాన్పు లు చేయగలిగారు. తన స్నేహితురాలితో పాటు తెలిసిన బంధువు ఒకరు క్యాన్సర్ వ్యాధితో అర్ధంతరంగా తనువు చాలించడాన్ని తల్చుకుని కలెక్టర్ యోగితారాణా తరుచూ చలించిపోతుంటారు. ఏ ఒక్క మహిళకు కూడా అలాంటి పరిస్థితి రాకూడదనే ఉద్దేశ్యంతో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలను జరిపిస్తూ, అవసరమైన వారికి చికిత్సలు అందించేలా పర్యవేక్షణ జరుపుతున్నారు.
ఒత్తిడులు ఎదురైనా...
భౌగోళికంగా చిన్న జిల్లా అయినప్పటికీ, అనేక మంది ఉద్దండులతో రాజకీయ చైతన్యం ఒకింత ఎక్కువగా ఉండే నిజామాబాద్‌లో జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వర్తించడం సవాల్ అనే చెప్పవచ్చు. ఇలాంటి జిల్లాలో మహిళా అధికారిణిగా రెండేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకోబోతున్న కలెక్టర్ యోగితారాణా కూడా ఒకటిరెండు పర్యాయాలు రాజకీయపరమైన ఒత్తిళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే నిబద్ధత, నిజాయితీతో కూడిన తన పనితీరుతో ప్రభుత్వ పెద్దలను ఆకట్టుకుని ఎంతో సునాయాసంగా ఆ ఒత్తిళ్లను అధిగమించగలిగారు. తమ పని పట్ల స్పష్టత ఏర్పర్చుకుని, అందుకు అనుగుణంగా ముందుకు సాగితే స్ర్తి, పురుషులు అనే తేడా లేకుండా అధికారులు ఎవరైనా సత్ఫలితాలు సాధించవచ్చని, తన విషయంలో ఇంతవరకు ఎలాంటి వివక్షకు గురి కాలేదని యోగితారాణా ఎంతో ఆత్మవిశ్వాసంతో పేర్కొంటారు.

- యం.డి.జావీద్‌పాషా, నిజామాబాద్