కృష్ణ

గోదావరి నీళ్లొచ్చేశాయ్..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూజివీడు, జూన్ 22: గోదావరి జలాలు గురువారం కృష్ణా జిల్లాలోకి ప్రవేశించాయి. జిల్లా ముఖద్వారమైన మండలంలోని సీతారామపురం వద్ద రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జలపూజలు నిర్వహించారు. ఉదయం 10 గంటల సమయంలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు జలపూజలు నిర్వహించి, గోదావరి నదీజలాల్లో పూలు వేసి స్వాగతం పలికారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టును సకాలంలో నిర్మించి జాతికి అంకితం చేస్తామని చెప్పారు. ఈ నెల 12న పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి తొమ్మిది మోటార్ల ద్వారా గోదావరి జలాలు విడుదల చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం పట్టిసీమ ఎత్తిపోతల పథకం వద్ద 15 మోటార్లు పనిచేస్తున్నాయని చెప్పారు. పోలవరం కుడి కాలువ ద్వారా సుమారు 5వేల క్యూసెక్కుల గోదావరి జలాలను కృష్ణానదికి తరలిస్తున్నాయని తెలిపారు. శుక్రవారం ఉదయానికి పవిత్ర సంగమంలోకి ప్రవేశిస్తాయన్నారు. రెండు నదుల జలాలను సద్వినియోగం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నామని, ప్రతి ఎకరానికి సాగునీరు అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. జూలైలో ఆల్‌మట్టి నుండి మిగులు జలాలను శ్రీశైలం, జూరాల, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల్లో పూర్తిస్థాయిలో నీరు చేరుతుందని, తద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సాగునీరు అందిస్తామని చెప్పారు. కృష్ణా-గోదావరి నదుల అనుసంధానంతో వేలాది కోట్ల రూపాయల పంటలను రక్షించామన్నారు. విపక్షాలు పట్టిసీమ ఎత్తిపోతల పథకంపై పలు విమర్శలు చేసి అడ్డుకునే ప్రయత్నం చేశాయని, అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టుదలతో దీన్ని పూర్తిచేసి గోదావరి-కృష్ణా నదులను అనుసంధానం చేసి రైతులకు సాగునీరు అందించారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై నమ్మకంతో రైతులు పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి స్వచ్ఛందంగా భూములు అప్పగించారన్నారు. భూములిచ్చిన రైతులకు నష్టం జరగకుండా పరిహారం చెల్లించామని, ఇళ్లు కోల్పోయిన వారికి స్థలాలు అందించామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యేలోగా రైతులను ఆదుకోవాలనే సదుద్దేశ్యంతో వృథాగా పోతున్న గోదావరి జలాలను పొలాలకు అందించేందుకే పట్టిసీమ ఎత్తిపోతల ఏర్పాటు చేశామన్నారు. పట్టిసీమ ద్వారా 55 టిఎంసిల గోదావరి జలాలను రైతులకు అందించి 55 కోట్ల రూపాయల విలువైన పంటలను రక్షించామని చెప్పారు. పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని మెట్టప్రాంత రైతుల సాగునీటి సమస్య తీర్చేందుకు చింతలపూడి ఎత్తిపోతల పథకం నిర్మిస్తున్నామని, దీనికి త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేస్తారని తెలిపారు. ఇది పూర్తయితే రెండు జిల్లాల పరిధిలో సుమారు 7లక్షల ఎకరాలకు సాగునీటి సౌకర్యం కలుగుతుందని, నూజివీడు, మైలవరం, తిరువూరు, గన్నవరం నియోజకవర్గాల పరిధిలోని పలు ప్రాంతాల భూములను నీరు అందుతుందని మంత్రి ఉమా వివరించారు. కార్యక్రమంలో ఎంపిపి టి శ్రీనివాసరావు, జిల్లా తెలుగురైతు అధ్యక్షుడు చిట్నేని శివరామకృష్ణ, మాజీ అధ్యక్షుడు చలసాని ఆంజనేయులు, ఇతర నాయకులు, అధికారులు పాల్గొన్నారు.