అదిలాబాద్

వామ్మో.. కూర‘గాయాలు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, జూన్ 23: నిన్న మొన్నటి వరకు ఎండలు భగ భగ మండిపోగా ప్రస్తుతం కూరగాయల ధరలు అదే రీతిలో భగ్గుమంటున్నాయి. వర్షాకాలంలో రైతులు ఖరీఫ్ సీజన్ సాగులో బిజీ కాగా కూరగాయల సాగు ఒక్కసారిగా తగ్గిపోవడంతో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పల్లెల నుండి పట్టణాలకు కూరగాయలు రవాణా తగ్గిపోవడంతో సామాన్యులను వీటి ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. వారం రోజుల క్రితం కిలో రూ.15 ధర పలికిన టమాట ప్రస్తుతం ఆమాంతం రూ.50కి పెరిగిపోవడంతో వీటిని కొనుగోలు చేసేందుకు సామాన్యులు సైతం ముఖం చాటేస్తున్నారు. వంకాయ కిలో రూ.60, బీర, క్యారెట్ కెజి రూ.80 పలకగా పచ్చిమిర్చి మరింత ఘాటెక్కి కెజి రూ.70కి చేరడంతో రైతు బజారుకు వెళ్ళి కూరగాయలు కొనాలంటేనే జేబులో కనీసం రూ.500 ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. వేసవి చివరితో కూరగాయల పంటల సాగు ముగియడం, వర్షాకాలంలో ఆకు కూరలు, కూరగాయలు పండించే రైతుల సంఖ్య తగ్గిపోవడం దిగుబడులు లేక ధరలకు రెక్కలు వచ్చాయి. దీనికి తోడు రంజాన్ మాసంలో కూరగాయలకు డిమాండ్ పెరగడం, వర్షాకాలంలో మాంస విక్రయాలు తగ్గిపోవడంతో వినియోగదారులు తప్పనిసరి పరిస్థితుల్లో కూరగాయల వైపు మొగ్గుచూపాల్సి వస్తోంది. అంతేగాక ఆకు కూరల ధరలు కూడా అదే రీతిలో చుక్కలు చూపిస్తున్నాయి. మొన్నటి వరకు రూ.10కి నాలుగు పాలకూర, మెంతికూర కట్టలు లభ్యంకాగా ప్రస్తుతం మార్కెట్‌కు వెళ్తే ఒక్కో కట్ట ధర రూ.8 పలుకుతుండడం గమనార్హం. కాలిప్లవర్ మార్కెట్‌లో కెజి రూ.60 ఉంటే క్యాబేజి కెజి రూ.40, దొండకాయలు కిలో రూ.40, బెండకాయలు కెజికి రూ.50 పలుకుతున్నాయి. పైగా పంటలు సాగుచేసిన పలు గ్రామాల్లో పంటలపై తెగుళ్ళు, పురుగుల దాడులు తీవ్రతరం కావడంతో రైతులు నష్టపోవాల్సి వచ్చింది. టమాటలో వేరుకుళ్ళు, వంకాయలో కాయతొలుచు పురుగు కారణంగా దిగుబడులు ఆమాంతం తగ్గిపోయాయి. ఇంద్రవెల్లి, ఆదిలాబాద్, గుడిహత్నూర్, ఇచ్చోడ, తలమడుగు మండలాల నుండి అధికంగా కూరగాయలు ఆదిలాబాద్ మార్కెట్‌కు తరలివస్తుండగా గత వారం రోజుల నుండి ఖరీఫ్ పనుల్లో రైతులు నిమగ్నం కావడం, కూలీలు సైతం అందుబాటులో లేకపోవడం, మరోవైపు కూరగాయలు, ఆకు కూరల పంటలు వర్షానికి దెబ్బతినడం వల్ల దళారీలు మహారాష్ట్ర, నాగ్‌పూర్ నుండి కూరగాయలను దిగుమతి చేసుకొని అధిక ధరలకు విక్రయిస్తున్నారు. గత ఏడాది జూన్ నెలను పోల్చిచూస్తే ఈసారి కూరగాయల ధరలు విపరీతంగా పెరిగి పప్పుదినుసు ధరలు తగ్గుముఖం పట్టడం విశేషం. గత ఏడాది కంది పప్పు కిలో ధర రూ.180 పలకగా ఈసారి అందుబాటులో ఉండే విధంగా మార్కెట్‌లో కిలో కందిపప్పు రూ.80కె లభ్యం కావడం కాస్త ఊరటకల్గిస్తోంది. కాగా ఆదిలాబాద్, ఇచ్చోడ, నేరడిగొండ, బజార్‌హత్నూర్, ఉట్నూరు మండలాల్లోనూ కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో సామాన్య మద్యతరగతి కుటుంబాలు పప్పుదినుసులపైనే ఆసక్తిచూపాల్సిన పరిస్థితి నెలకొంది.