తూర్పుగోదావరి

టిడిపిలో ఇసుక తుపాను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూన్ 23: పార్టీలకతీతంగా అక్రమాల అడ్డాగా మారిన రాజమహేంద్రవరం ఇసుక ర్యాంపుల వ్యవహారం అధికార తెలుగుదేశం పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. రాజమహేంద్రవరం నగరం పరిధిలో ఉన్న రెండు ప్రధానమైన ఇసుక ర్యాంపుల్లో సాగుతున్న అక్రమాలు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి లోకేష్ దృష్టికి వెళ్లినట్టు సమాచారం. ఈ నేపధ్యంలోనే ఈ రెండు ఇసుక ర్యాంపులు రద్దయినట్టు సమాచారం. ట్రాఫిక్ ఇబ్బందులు, నగరంలో ఇసుక లారీల ప్రమాదం కారణంగా రద్దుచేసినట్టు అధికారులు చెబుతున్నప్పటికీ కొంత మంది తమ్ముళ్ల ఇసుక మామూళ్ల బాగోతం అధిష్ఠానం దృష్టికి వెళ్లడంవల్లే ఈ రెండు ర్యాంపులు రద్దయినట్టు తెలిసింది.
రాజమహేంద్రవరం నగరంలో కుమారి టాకీస్ సమీపంలోని ఇసుక ర్యాంపు, మార్కండేయ స్వామి గుడి సమీపంలోని ఇసుక ర్యాంపులను యుద్ధప్రాతిపాదికన అధికారులు 19వ తేదీన నోటీసులు జారీ చేసి రద్దు చేశారు. ఇసుక లారీల వల్ల ప్రమాదాలు సంభవిస్తున్నాయని, ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ రెండు ర్యాంపులను రద్దు చేసినట్టు స్థానిక అధికాఠులు ప్రకటించారు. దీంతో కంగుతిన్న ఇసుక సిండికేట్ బ్రదర్స్ స్థానిక అధికారుల వద్దకు పరుగులు తీశారు. ట్రాఫిక్ ఇబ్బందుల వల్ల కలెక్టర్ ఆదేశాలపై రద్దుచేశామని చెప్పారు. అనంతరం స్థానిక నేతల వద్దకు పరుగులు పెట్టారు. అధినాయకుడి చేతిలో ఇసుక అక్రమాల చిట్టా వెళ్లిందని తెలియడంతో వారు కూడా చేతులెత్తేశారు. ఇక లాభం లేదనుకున్న స్థానిక శాండ్ సిండికేట్ ఇసుక నావలు కలిగిన ఒక కార్పొరేటర్ నేతృత్వంలో స్థానిక నాయకుడి సహకారంతో ఉప ముఖ్యమంత్రి చినరాజప్పని కలిసినా ఫలితంలేదని తెలిసింది. దీంతో ఇతర ర్యాంపుల్లో ఏవిధంగా ఇసుక ధర వసూలు చేస్తున్నారో పరిశీలించి దానిని దృష్టిలో పెట్టుకుని ర్యాంపులను నిర్వహించే విధంగా అనుమతించాలని కోరుతున్నట్టు తెలిసింది.
కాగా ఏ ర్యాంపు నుంచి ఎవరెవరికి ఎంతెంత ముడుపులు ముడుతున్నాయో కచ్చితమైన లెక్కలు అధినేత చంద్రబాబునాయుడు ద్వారా చినబాబు చేతికి వెళ్లినట్టు తెలిసింది. ఇసుక ర్యాంపులను ఆదాయ వనరుగా మార్చుకోవడంతో పార్టీ రహితంగా అందరూ ఒకటైపోయారని అధిష్ఠానం ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం. పార్టీలతో సంబంధం లేకుండా ఇసుక అక్రమాల్లో ఒకటిగానే వ్యవహరిస్తున్న విషయంపై చినబాబు సీరియస్ కావడంవల్లే అందరూ చేతులెత్తేశారని తెలిసింది. ఈ దందాలో అధిష్ఠానం పేరుకూడా ఉపయోగిస్తుండటమే లోకేష్ ఆగ్రహానికి కారణమని తెలియవచ్చింది. ఉచిత ఇసుక మాటున జరుగుతోన్న దందా లెక్కలు కూడా అధిష్ఠానం పరిశీలిస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుతం రద్దయిన ర్యాంపుల్లో రెండు యూనిట్ల లారీ ఇసుకను రూ.3000కు సరఫరా చేస్తున్నట్టు తెలిసింది. వాస్తవానికి సుమారు రూ.800 ఇసుక తీసే నావ కార్మికులకు, లోడింగ్‌కు రూ.200, లారీ కిరాయి వెరసి రూ.1800 అవుతోంది. అయితే రూ.3000 చొప్పున వసూలు చేస్తున్నారు. ఇందులో రూ.1200 పక్కదారి పడుతోంది. ఈ సొమ్ము ఎవరి జేబుల్లోకి వెళుతుందో చెప్పకనే చెప్పొచ్చు.
ఈ రెండు ర్యాంపుల నుంచి రోజూ రెండు యూనిట్ల లారీలు సుమారు 300 వరకు సరఫరా అవుతాయి. ఉచిత ఇసుకను లారీ కిరాయితో కలిపి సుమారు రూ.1800కు ఇవ్వాల్సి వుంది. కానీ ఉచిత ఇసుక అడిగితే వారం లేదా పది రోజులు పడుతుందని చెబుతారు. దీంతో వినియోగదారులు అంత సమయం ఎదురు చూడలేక సిండికేట్లు చెప్పినట్టుగా రెండు యూనిట్ల లారీకి రూ.3వేలు చెల్లించి ఇసుక తీసుకుంటారు. ఇదీ జరుగుతోన్న తంతు. ఈ వ్యవహారమంతా చినబాబు పరిశీలించి ముందుగా ఈ రెండు ర్యాంపులపై వేటు వేశారని తెలిసింది. స్థానిక నేతల నుంచి చినబాబు వరకు ఈ వాటాలు వెళ్లడం వల్లే ఈ బరితెగింపు అనే ప్రచారం కూడా విస్తృతంగా జరుగుతుండటం కూడా ఆయన దృష్టికి వెళ్లడంతో ఈ వేటు వేశారని తెలిసింది. ఇది గమనించిన స్థానిక నేతలు కొంతమంది తేలుకుట్టిన దొంగల్లా మిన్నకున్నట్టు తెలిసింది. కొద్దిరోజులపాటు అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తే అందుకు రూ.1 లక్ష ఇచ్చేందుకు తాజాగా ఇరిగేషన్ అధికారులతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిసింది.