డైలీ సీరియల్

ట్విన్ టవర్స్ - 36

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘వాళ్ళు తీసుకోవాల్సిందే! వాళ్ళు ముందుకు రానపుడు, మనం ఎలా వదిలేస్తాం?’’
‘‘వదిలేయనక్కరలేదు. కాస్త డిమాండ్ చేయచ్చు కదా’’ అన్నాడు చిన్న అన్నయ్య.
‘‘అలాంటివన్నీ మాట్లాడకు. నాన్న బాధపడతాడు. నాన్న తన జీవితంలో ఇంతవరకు ఎవ్వరినీ ఏమీ అడగాల్సి రాకుండా బతికాడు. ఇప్పుడు దీనికోసం ఆ పని చేయక్కరలేదు’’.
‘‘ఇది నాన్నకోసం కాదు. వాళ్ళ కోడలికోసం’’ అన్నాడు అన్నయ్య.
ఇంక పెద్దన్నయ్య క్కూడా కొంచెం చిరాకేసింది. అదే మగ పిల్లాడైతే మీ అందరిలానే చదివేది కదా. అప్పుడీ ఖర్చు దండగ అనుకుంటామా?’’ అడిగాడు.
‘‘మీ ఇష్టం.. మీకెలా తోస్తే అలా చెయ్యండి’’ అని వెళ్లిపోయాడు చిన్నన్నయ్య.
కొంచెం అందరికీ మనసులో ఇబ్బందిగానే ఉంది. నాన్న కూడా రిటైర్ అయ్యే వయసు వచ్చింది. ఏది ఎటైనా అన్నయ్య నన్ను ఎం.ఏలో చేర్చడానికే నిర్ణయం చేశాడు.
రఘు ఎప్పుడు తీసుకువెడతాతో తెలియదు. అలాటప్పుడు ఎప్పుడో ఏదో జరుగుతుందని దాని చదువు ఇప్పుడు ఆపడం సరికాదు. ఒకవేళ అతను రమ్మంటే వెడుతుంది. పోతేపోతుంది- ఓ ఏడాది జీతం అంతేనా! అంటూ తేల్చిపారేశాడు అన్నయ్య.
నేను నిరాటంకంగా విశాఖలో ఎం.ఏలో చేరాను. నాన్న రిటైర్ అవ్వక్కరలేకుండా చూసుకున్నారు.
అది అన్నయ్యకు పెద్ద నచ్చలేదు. రిటైర్ అయి విశ్రాంతి తీసుకోవలసిన వయసులో ఇంకా పని చేయడం ఎందుకు నాన్నా అని వారించబోయాడు. నాన్న మాత్రం వినదలుచుకోలేదు. నువ్వు చాలా బాధ్యతలు పంచుకున్నావు. ఇంకా దాన్ని ఎక్కువ చేయడం నాకిష్టం లేదు. నువీ విషయంలో మాట్లాడకు అని.
విశాఖపట్నం నుంచి వీలయినంతగా విజయవాడ వచ్చి వెడుతూనే ఉన్నాను, వౌళి కోసం ఏమాత్రం వీలు కలిగినా సరే! ఆఖరికి శని, ఆదివారాలకు మాత్రమే అయినా.
విశాఖలో ఆ యూనివర్సిటీ జీవితం ఒక పెద్ద కనువిప్పు. విజయవాడ ప్రాంగణాలు దాటని నాకు, కేవలం ఒక డిగ్రీ కాలేజీ తప్ప తెలియని నాకు, అక్కడ చాలా పెద్ద మార్పు కనిపించింది. మనిషి ఎదగడానికి ఎక్స్‌పోజర్ ఎంత ముఖ్యమో అర్థమయింది.
మనిషి పెరుగుదలలో చదువు సగం విజ్ఞానం ఇస్తే, మిగిలిన సగం చుట్టూ ఉన్న వాతావరణమే!
ఇంజనీరింగ్ విద్యార్థులు, మెడికల్ విద్యార్థులు, పిహెచ్‌డి విద్యార్థులు ఒకటేమిటి ఎన్ని రకాల ఫీల్డ్‌లో చదివేవారితోనో పరిచయం జరిగింది. ఆడవాళ్ళ హాస్టల్‌లో వారంతా, నూటికినూరు పాళ్ళు అవివాహితులే. జీవితం గురించి బంగారు కలల్లో తేలుతున్నవాళ్ళే. భవిష్యత్తుకు రాచబాటలు వేసుకుంటున్న వాళ్ళే! అక్కడో ఇద్దరో ముగ్గురో తప్ప.
వాళ్ళందరితో పోల్చుకుంటే నా జీవితం చాలా తేడాగా అనిపించేది. నేనొక వివాహితను, ఒక తల్లిని- ఆ సంగతి అక్కడ ఎవరికీ నే ప్రత్యేకంగా చెప్పలేదు. ఒకరిద్దరికి తెలిసినా ఎవరూ ఎక్కువగా ఆ విషయం మాట్లాడేవారు కారు. నేను అందరికంటే తరచుగా ఊరు వెడుతూ ఉంటే మాత్రం పాప ఇంటిబెంగ అని జోక్ చేస్తూ ఉండేవారు.
హాయిగా మెడికల్ విద్యార్థులు, మిగిలిన వాళ్ళు ఆడా, మగా కలిసి తిరుగుతూ తమ భవిష్యత్తులు, కలుపుకోవడం, పెళ్లిళ్ళు చేసుకోవడం, చెడగొట్టుకోవడం, భగ్న హృదయులవడం ఒకటేమిటి ఎన్నో కనిపిస్తూ ఉండేవి.
నాతో పరిచయం చేసుకోవాలని కొద్దిమంది కుర్రాళ్ళు ప్రయత్నం కూడా చేశారు.
ఆ పరిస్థితి ఎలా హేండిల్ చేయాలో అర్థం కాని నేను ఒకసారి విజయవాడ నుండి వెనక్కు వెడుతూ మెళ్ళో నల్లపూసల గొలుసు వేసుకువెళ్ళాను. అది కొద్దిమందిని నిరుత్సాహపరిచింది అని తెలుసు. అది నన్ను చాలా పరిస్థితులు ఎదుర్కోకుండా చేస్తుంది అని అననుకున్నాను. కాని పెద్ద పొరపాటు- ఆ పనితో నా భర్త గురించి తెలుసుకోవాలన్న కుతూహలం చాలామందిలో కలిగింది.
దానితో నేను నిజమవ్వాలనుకునే కలనే నిజంలా చాలామందితో చెప్పాల్సి వచ్చింది. రఘు అమెరికాలో చదువుకు వెళ్లాడనీ, నా ఎం.ఏ పూర్తి అవ్వంగానే నేను వెళ్లిపోతానని.
తమాషా, నా స్థాయి పెరిగిపోయింది. నా రూంమేట్ అయితే నేనేదో అమెరికన్ రిటర్న్‌లా మాట్లాడేది. నా బంగారు భవిష్యత్తు గురించి ఊహలు చేస్తూండేది. జీవితంలో అన్నీ అలా సమకూడడం ఎంత అదృష్టమో అని నా అదృష్టాన్ని పొగుడుతూ ఉండేది.
దూరపు కొండలు ఎప్పుడూ నునుపే కదా!
మధ్యలోనే వౌళిని స్కూల్లో వేయాల్సిన సమయం వచ్చింది. నిర్మలా కానె్వంట్‌లో చేర్చాలని అప్లికేషన్ ఫారం పూర్తిచేసి నాన్నకిచ్చాను.
దానివంక చూస్తూ- ఇదేం పని కల్యాణీ? అన్నారు. నాన్న దేని గురించి మాట్లాడుతున్నారో నాకు తెలుసు. నేను సమాధానం ఇవ్వలేదు. నాన్న పెన్ తీసుకుని వౌళి ‘సర్’నేమ్ అన్న చోట దిద్దపోయారు. నేను నాన్న చెయ్యి పట్టుకున్నాను.
‘‘వద్దు నాన్న, దాన్ని మార్చకు’’
‘‘నీకు తెలియదు కల్యాణి. ఇది చాలా తప్పు’’ అన్నారు.
‘‘నాకు తప్పొప్పులు తెలియవు నాన్న. కానీ నా మనసుకు ఇదే రైట్ అనిపిస్తోంది. వాడు ఈ ఇంట్లో పుట్టాడు, పెరుగుతున్నాడు. వాడికీ ఇంటిపేరే ఉండాలి’’.
‘‘అమ్మా కల్యాణీ, వాడు మగ పిల్లవాడు. ఆ ఇంటి వంశాకురం. వాడికి అన్ని హక్కులు, అధికారాలు ఉండాల్సినవాడు. వాడి ఇంటిపేరు నీ ఇష్టం వచ్చినట్లుగా నా ఇంటిపేరు చేయకూడదు.
‘‘ఏం హక్కులు, అధికారాలు నాన్న? వాటిని ఎవరిమీద ఉపయోగించమంటారు? వాడు ఏ ఇంటికి సంబంధించినవాడో చెప్పండి? ఏ ఇంటి వారు వాడిని వాళ్ళ బిడ్డ అనుకుంటున్నారో చెప్పండి. నేను అభ్యంతరం పెట్టను. నా మనసుకు వాడు అన్నయ్య కొడుకులా పెరుగుతున్నాడు. కొడుకుతో సమంగా ఆస్థిపాస్తులు వాడికి ఇవ్వక్కర్లేదు. ప్రేమ ఒక్కటే చాలు. అది వాడికి ఎలాగో దక్కుతోంది’’ అని వెళ్లిపోయాను.
తరువాత అన్నయ్య నాన్నకి సర్ది చెప్పి ఒప్పించాడు. వాడికి పాస్‌పోర్ట్ అప్లై చేసేటప్పుడు అన్నీ కరెక్ట్ చేద్దాం. ఏం ఫరవాలేదు అంటూ...
ఎం.ఏ యూనివర్సిటీ రాంక్‌లో పూర్తిచేసుకుని వెనక్కి తిరిగి వచ్చాను. అందరిమీద ఆర్థికమయిన బరువులు తగ్గించాలన్న తపన లేకపోతే పిహెచ్‌డి కూడా ప్రయత్నించేదానే్న!
నాన్న కూడా రఘు నాన్నగారికి ఫోన్ చేయడం తగ్గించారు. వాళ్ళు కూడా పెద్దగా ఏమీ చేయాల్సిన పరిస్థితిలో ఉన్నారనిపించసాగింది. ఇంట్లో అందరికీ నేనో ప్రశ్నార్థకమయిన గుర్తుగా మిగిలిపోయాను. రఘు తల్లిదండ్రుల దగ్గరనుంచి ఎటువంటి సహయం అందడంలేదు.
నా ఉద్దేశ్యంలో వాళ్లకి కూడా ఎక్కువగా రఘుతో కాంటాక్ట్‌లో లేరనే!
వాళ్ళు కూడా రఘుకు ఏమీ చెప్పలేకపోతున్నారో, వాళ్ళు ఏం చెప్పినా, స్వీకరించే స్థితిలో అతను లేడేమో?
కొడుకు విషయంలో ఏం చేయలేకపోతున్నామన్న బలహీనత అందరి ముందు వెల్లడి చేయలేకుండా ఉండి ఉంటారు.
-ఇంకాఉంది

-రమాదేవి చెరుకూరి