మంచి మాట

ప్రేమ - భక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రేమ అనంతమైనది. అద్భుతమైనది. ఈ ప్రపంచం అంతా ప్రేమమయం. సముద్రమునుండి అలలు, చంద్రుని నుండి వెనె్నల, సూర్యభగవానుని నుండి కిరణం ఎలా ఉద్భవించాయో అలాగే దైవం నుండి ప్రేమ పుట్టింది. మనిషి నిజ జీవితం ఎన్నో ఇబ్బందులు, ఒడిదుడుకులు, బాధలతో నిండి ఉంటుంది. ఈ అన్నింటిని మరుగున పరిచి ఆనంద సాగరంలో మునిగితేలునట్లు చేయునదియే ప్రేమ. ఎంతటి కర్కశ హృదయాలనైనా మార్చే శక్తి ఒక్క ప్రేమకే యున్నది. ప్రేమే సృష్టికి మూలం. మన జీవితాలకు ఆధారం. ప్రేమే ధర్మం. ప్రేమే భాష్యం, ప్రేమే కావ్యం, ప్రేమ ఎన్నటికీ మారనది. ప్రేమకు అన్య విషయాలతో పనిలేదు. ప్రేమ త్యాగమనే సుగుణాన్ని కలిగి ప్రతిఫలాన్ని ఆశించనిది. ప్రేమను దేనితో కూడా పోల్చలేము. ఇది నిత్యమైనది. సత్యమైనది. శాశ్వితమైనది. ఇంతటి అద్భుత శక్తి కలిగిన మహత్తర ప్రేమను బాహ్యంలోని వ్యక్తులకు, వస్తువులకు ఉపయోగిస్తే చివరకు మిగిలేది శూన్యమే.
ప్రతి వ్యక్తి ఏదో ఒక దానిని ప్రేమిస్తుంటాడు. తులసీదాసు భార్యను చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండేవాడు కాదు. ఒక రోజు భార్య పుట్టింటికి వెళ్ళగా అది భరించలేక అర్థరాత్రి భయంకరమైన వర్షాన్ని లెక్కచేయకుండా అత్తవారింటికెళ్లి ఎవరికీ నిద్రాభంగం కలిగించకుండా ఒక త్రాడు సహాయంతో భార్య గదిలోకి ప్రవేశించాడు. అంత రాత్రి తన భర్తను చూచిన రత్నావళి భర్త ప్రవేశించిన తీరు తెలిసికొని చూడగా అది త్రాడు కాదు పాము అని తులసీదాసుకు చూపిస్తుంది.
కోపంతో అశాశ్వితమైన ఈ పాంచభౌతిక శరీరము చీము నెత్తురుతో దుర్గంధపూరితమైనది. దీనిపై ఇంత మమకారమా! కోటి ప్రకాశంతో వెలిగే శాశ్వితమైన ఆ శ్రీరామచంద్రుని ప్రేమించడము వలన ముక్తి లభిస్తుంది కదా! అని ఆవేశంతో భర్తను మందలిస్తుంది. భార్య పలికిన మాటలలోని సత్యాన్ని గ్రహించిన తులసీదాసు వెంటనే వెనుదిరిగిపోయాడు. భార్య రత్నావళి మాటలనే గురుబోధగా భావించి అతడు మహాభక్తుడుగా మారాడు. మనం ప్రేమించే భార్యాబిడ్డలు, ధన కనక వస్తు వాహనాలు అన్నీ నశించేవే.
కాని ఈ సృష్టికి కారణభూతుడైన ఆ పరంధాముని ప్రేమించిన వ్యక్తి వేటికి లోబడక అతని అనంత దివ్య తేజస్సులో కలిసిపోతున్నాడు. తుకారం, సూరదాసు, మీరాబాయి, సక్కుబాయి, ఇంకా పాండురంగడు సుఖాలన్నీ త్యజించి శాశ్వితుడైన ఆ పరమాత్మునే్న ప్రేమించారు. భగవంతునిలో ఐక్యమైనారు. పరమాత్మను తెలిసిన జ్ఞానులు దేనిని ఆశించక, వేటికిని లొంగక కోర్కెల ప్రలోభావాలలో చిక్కుకొనక శాశ్వత ఆనందాన్నందించే దైవం కోసం ప్రతిక్షణం ఆరాటపడతారు. వాస్తవానికి అదే నిజమైన ప్రేమ. ప్రేమ ఉన్న చోట దుఃఖం, ద్వేషం, క్రోధములకు తావులేదు.
నిత్య జీవితంలో మనం ఒకరినొకరు ప్రేమించుకొనే ప్రేమ నశిస్తుంది. దుఃఖాన్ని కలిగిస్తుంది. ద్వేషాన్ని రగులుస్తుంది. క్రోధాన్ని కలిగిస్తుంది. క్షణ క్షణానికి మార్పును కలిగించే ఈ ప్రేమ నిజమైన ప్రేమ కాదు. కేవలం ఆకర్షణ, వ్యామోహం మాత్రమే. మానవ జీవితం క్షణికమైనది.
బాల్యం క్రీడలతో, వ్వనం విషయ సుఖాలతో, వృద్ధాప్యం కష్టాలతో ముగుస్తుంది. భగవంతుడు సర్వాంతర్యామి. కావున లౌకిక ప్రేమను ఆధ్యాత్మిక పథం వైపు మళ్లించినచో అది భక్తిగా మారుతుంది. దీనినే ఉజ్వల పారవశ్య స్థితి అని అంటారు. భక్తి అందరి హృదయాలలో ఉద్భవించదు. గత జన్మలోని పుణ్యకర్మలు మానవుని వెంట ఉండి దైవానికి చేరువ చేస్తాయి. ప్రేమే భక్తిగా మారిన వ్యక్తి భక్తుడుగా మారుతాడు. ప్రగాఢమైన ప్రేమయే దైవాన్ని దివి నుండి భువికి రప్పిస్తుంది.
త్రేతాయుగంలో అరణ్యవాసంలోనున్న శ్రీరామచంద్రుని దర్శించుటకు పదునారువేల ఋషులు వచ్చి ఆ దివ్య మంగళ మనోహర రూపాన్ని చూచి చూడగానే వారికి అతని పాదాలను తాకాలని కొందరికి చేతులను స్పృశించాలని, కొందరికి ఇంకా కొందరికి ఆలింగనం చేసికోవాలని కోరిక కలుగుతుంది. వారి హృదయాలలో కలిగిన భావాలను గ్రహించిన కారుణ్యమూర్తి ద్వాపర యుగంలో కృష్ణావతారంతో వారి కోరిక తీరుస్తానని అభయమిచ్చాడు.
ఆ ఋషులే గోకులంలో పదునారు వేల గోపికలుగా జన్మించారు. శ్రీరాముడే శ్రీకృష్ణునిగా జన్మించి వారి కోరిక తీర్చడమేగాక మోక్షాన్ని కూడా ప్రసాదించాడు. పవిత్రమైన భక్తి ఉద్భవించిన భక్తుడు ఈ ప్రపంచంలోని సర్వసుఖాలను తృణప్రాయంగా భావిస్తాడు.
అన్నింటినీ త్యజించి కేవలం దైవం కోసమే జీవిస్తాడు. చివరకు దైవాన్ని పొందుతాడు. అట్టివారి యోగక్షేమాలు భగవంతుడు చూస్తాడు. అందుకే భగవానుడు గీతలో- ఎవరైతే ఏకాగ్ర చిత్తముతో నామ స్మరణ చేయుచు, నాయందే మనస్సును లగ్నం చేసి ననే్న స్మరించుచూ ఉపాసించుచుందురో అట్టివారి యోగక్షేమాలను నేనే వహిస్తాను అని భగవద్గీతలోని రాజ విద్యా రాజగుహ్య యోగంలో విశదపరచాడు. కావున ప్రేమతో భగవంతుని పొందాలి.

-పెండెం శ్రీ్ధర్