ఆటాపోటీ

క్రికెట్‌పైఆటగాళ్లదే ఆధిపత్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత క్రికెట్‌లో అధికారులపై ఆటగాళ్ల ఆధిపత్యం కొనసాగుతున్నది. బిసిసిఐ పాలనాధికారుల బృందం (సిఒఎ)లోని సభ్యుడు రామచంద్ర గుహ రాజీనామాతో తెరపైకి వచ్చిన ప్రశ్నల పరంపర కొనసాగుతునే ఉంది. అతను ఆరోపించిన విధంగా భారత క్రికెట్‌లో సూపర్ స్టార్ సంస్కృతి కొనసాగుతున్నదని ఆతర్వాత చోటు చేసుకున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. సిఒఎలోని మరో సభ్యుడు విక్రం లిమాయే కూడా త్వరలో రాజీనామా చేయనున్నాడు. జాతీయ స్టాక్ ఎక్ఛ్సేంజి మేనేజింగ్ డైరెక్టర్/ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారిగా బాధ్యతలు చేపట్టనున్న కారణంగా సిఒఎ నుంచి లిమాయే వైదొలగుతున్నాడు. భారత క్రికెట్‌లో నెలకొన్న పరిస్థితులకు, అతని రాజీనామాకు సంబంధం లేకపోయినా, సిఒఎ సభ్యుల సంఖ్య రెండుకు పడిపోవడం తప్పనిసరిగా ప్రభావం చూపుతుంది. దేశ క్రికెట్‌లో కొనసాగుతున్న అవాంఛిత విధానాలను సిఒఎ సమర్థంగా అడ్డుకోలేకపోయిందని గుహ తన రాజీనామా లేఖలో పేర్కోవడంతో, టీమిండియా క్రికెటర్ల తీరుపై ఎంతోకాలంగా వినిపిస్తున్న విమర్శలు మరోసారి తెరపైకి వచ్చాయి. ప్రపంచ క్రికెట్‌ను బిసిసిఐ శాసిస్తుంటే, బోర్డుతో ఆటగాళ్లు సర్కస్ ఫీట్లు చేయిస్తున్నారన్న వాస్తవాన్ని టీమిండియా కోచ్ అనిల్ కుంబ్లే, కెప్టెన్ విరాట్ కోహ్లీ మధ్య తలెత్తిన వివాదం, ఆతర్వాత జరిగిన పరిణామాలు వెల్లడిస్తున్నాయి. కోచ్‌గా కుంబ్లే అత్యుత్తమ సేవలు అందించాడని అతని మార్గదర్శకంలో భారత్ సాధించిన విజయాలు, అధిరోహించిన శిఖరాలు చెప్పకనే చెప్తున్నాయి. ఆటగాళ్ల ఆధిపత్యానికి, ఇష్టారాజ్యంగా వ్యవహరించే విధానానికి తెరదించి, అందరినీ క్రమశిక్షణలో పెట్టడానికి ప్రయత్నించడమే అతను చేసిన పొరపాటు! నెట్ ప్రాక్టీస్‌పై పట్టుబడతాడని, మ్యాచ్‌ల్లో సక్రమంగా ఆడలేకపోతే, పాఠశాలల్లో విద్యార్థులను ఉపాధ్యాయులు తిట్టే రీతిలో మందలిస్తాడని కోహ్లీ బృందం బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నది. బిసిసిఐ కూడా కుంబ్లే మొండివాడంటూ నిర్లజ్జగా ప్రకటించింది. ఇంతకంటే దురదృష్టం మరొకటి ఉండదు. కోచ్ చేసిన సూచనలను ఆటగాళ్లు పాటించి తీరాలి. అందులోనూ కుంబ్లే అసాధారణ నియమనిబంధనలేవీ ఆచరణలో పెట్టలేదు. సమయానికి నెట్ ప్రాక్టీస్‌కు రావాలని కోరాడు. సరైన సమయానికి రాని వారిని వివరణ కోరాడు. నెట్స్‌లో చెమటోడ్చాలని స్పష్టం చేశాడు. ప్రతి మ్యాచ్ ఎంతో కీలకమైనదని, కాబట్టి, ప్రతి ఒక్కరూ సర్వశక్తులు ఒడ్డి పోరాటం సాగించాలని ఆశించాడు. నిర్లక్ష్యంగా వ్యవహరించి, పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరచిన క్రికెటర్లను ఉపేక్షించలేదు. ఘాటుగానే మందలించాడు. జాగ్రత్తగా ఆడకపోతే, జాతీయ జట్టులో స్థానం ఉండదని హెచ్చరించాడు. జట్టుకు పెద్దదిక్కుగా ఉండే కోచ్ ఎవరైనా ఈ విధంగానే వ్యవహరిస్తాడు. ఇలానే స్పందిస్తాడు. కానీ, దశాబ్దాలుగా తాము ఆడింది ఆట, పాడింది పాటగా చెల్లుబాటు చేయించుకుంటూ వస్తున్న టీమిండియా క్రికెటర్లు మాత్రం కుంబ్లే వైఖరిని జీర్ణించుకోలేకపోయారు. జట్టు మొత్తం తన కనుసన్నల్లోనే నడవాలని కోరుకునే కెప్టెన్ కోహ్లీ నిరసన బాట పట్టాడు. కుంబ్లేకు సహాయ నిరాకరణను అమలు చేశాడు. సుమారు ఆరు నెలల నుంచే కుంబ్లేతో కోహ్లీ మాట్లాడడం లేదని, ఇద్దరి మధ్య ఏమాత్రం సయోధ్య లేదని బిసిసిఐ అధికారులు ఇప్పుడు చెప్తున్నారు. జట్టు ప్రదర్శనపై తీవ్ర ప్రభావం చూపే ఈ సమస్యను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించకుండా ఇన్నాళ్లు ఎందుకు తాత్సారం చేశారో వారికే తెలియాలి. జరగాల్సిన నష్టం జరిగిన తర్వాత, నింపాదిగా కుంబ్లే, కోహ్లీ వివాదం గురించి వ్యాఖ్యలు చేస్తున్నారు. కుంబ్లేతో చర్చించాల్సిందిగా తాము సూచించిన తర్వాత కోహ్లీ అందుకు సమ్మతించాడంటూ, అదో ఘన కార్యంగా చెప్తున్నారు. అపార్థాలు, మనస్పర్థలు ఏమీ లేవంటూ, చర్చలకు కుంబ్లే నిరాకరించాడంటూ తప్పు మొత్తాన్ని అతనిపై నెట్టే ప్రయత్నం చేశారు. కుంబ్లేను మొండివాడిగా అభివర్ణించారు. కోహ్లీని విమర్శల నుంచి తప్పించి, తప్పులన్నీ కుంబ్లేపై నెట్టి, అతనిని సాగనంపడంలో ఎలాంటి పొరపాటు లేదని ప్రజలను నమ్మించేందుకు బోర్డు అధికారులు ప్రయత్నిస్తున్నారన్నది స్పష్టమవుతున్నది. బోర్డుపై ఆటగాళ్లదే పెత్తనమన్న విషయం బహిర్గతమైంది. ఏదైతేనేం... కోహ్లీ కోరిందే జరిగింది. అతని పంతమే నెగ్గింది. టీమిండియా ఇక అతని చెప్పుచేతల్లోనే ఉంటుంది. క్రమశిక్షణతో ఉండాలన్నందుకు నష్టపోయిన కుంబ్లేను చూసి, రాబోయే కోచ్‌లు జాగ్రత్త పడతారేమో!