విశాఖపట్నం

సర్వే జనా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అది ఒక ఆశ్రమం. స్వామీజీ తన శిష్యులను చెంతకు పిలిచారు. ‘మన చుట్టూ వున్న సమాజం రానురాను మంచి అలవాట్లను మరచిపోతూ చెడు చేసేవాటికి లొంగిపోయి తన ఆరోగ్యాన్ని తానే పాడుచేసుకుంటోంది. మనం గ్రామ గ్రామానికి వెళ్లాలి. ‘ఇప్పుడు మీరు చేస్తున్న పని సరైనది కాదు- మంచి మార్గంలో నడిస్తే ఆరోగ్యం బాగుంటుందని వివరించాలి’ అని చెప్పారు. ‘మీరు కాగితం, పెన్నూ తీసుకురండి. నేను చెప్పిన విషయాలు రాసుకోండి. కొన్ని గ్రామాల్లో పరిస్థితులను బట్టి మీరు కూడా కొన్ని విషయాలు కలుపుకోండి’ అని సూచించారు స్వామీజీ. శిష్యులు సిద్ధమయ్యారు. ‘గత 30 సంవత్సరాలుగా ముఖ్యంగా టీవీలు వచ్చాక ప్రజల్లో మార్పు వచ్చింది. గతంలో ప్రతి ఇంట్లో కట్టెల పొయ్యిపై వంట చేసుకునేవారు. వంట చేసేచోటే కింద కూర్చొని కూరగాయలు తరిగేవారు. వంటపాత్రలు కూడా కింద కూర్చొని శుభ్రం చేసేవారు. దీనివల్ల ఒంటికి మేలు జరిగేది. ప్రతి ఇంటినీ ఆవు, గేదె పేడతో చక్కగా అలికి ముగ్గులు వేసేవారు. నాపరాయి, గచ్చునేల మీద నీటితో కడిగి కింద కూర్చొని పాతగుడ్డతో తుడిచేవారు. మనకు తెలియకుండానే ఆ పద్ధతి మనకెంతో మేలుచేసేది. నేటి ఇల్లాలు వంటకు ఫ్లాట్‌ఫారాలు కట్టించింది. దానిమీద గ్యాస్ స్టౌ పెట్టి వంట చేస్తోంది. వంటపాత్రలను కూడా షింకు వద్ద నిలబడి శుభ్రం చేస్తోంది. పాలరాతి ఇల్లు తుడవటానికి నాలుగడుగుల లావుపాటి దారాల కర్రను వాడుతోంది. దుస్తులు కూడా మిషన్‌లో వేసి నిలబడే శుభ్రం చేసేస్తోంది. వంట, ఇంటి శుభ్రత, పాత్రల శుభ్రత, దుస్తుల శుభ్రత వంటి పనులన్నీ గృహిణి నిలబడే చేస్తోంది. లేదంటే పనిమనుషులతో చేయిస్తోంది. ఇది మంచి పద్ధతి కాదు. గతంలో పెళ్లిళ్లు, శుభకార్యాల్లో వందలాది మంది వరుసగా కింద కూర్చొని భోజనాలు చేసేవారు. అంతమందికీ వంట కూడా నేలపైనే కట్టెల పొయ్యిలపై వండేవారు. నేడు ‘టేబుల్ మీల్స్’ పద్ధతి వచ్చేసింది. టేబుల్ మీద కూర్చొని తినటం మంచిపద్ధతి కాదు. నిలబడి తినే బఫే పద్ధతీ మంచిది కాదు. ఇదికూడా మారాలి. నేల మీద కూర్చొని తినాలి. ఇక పిల్లల ఆటల సంగతి- గోలికాయలు, తొక్కుడు బిళ్ల, గచ్చకాయలు, చెడుగుడు వంటివన్నీ నేల మీద కూర్చునే ఆడేవారు. దుకాణాల్లో గతంలో కూర్చొని వ్యాపారం చేసేవారు. ఇప్పుడు అక్కడ కూడా మార్పు వచ్చింది’ అంటూ వివరించారు స్వామీజీ. ‘ఈ ముఖ్య విషయాలన్నీ రాసుకున్నారుగా! మనం ప్రతి గ్రామానికి వెళ్లి ఈ సంగతులన్నీ ప్రజల దృష్టికి తేవాలి. ప్రజల్లో మార్పు రావాలి’ అని ఆకాంక్షించారు ఆయన. ‘నేటికీ కొన్ని చిన్న పల్లెల వాసులు రాత్రి 7గంటలకు భోజనాలు ముగించి నిద్రకు ఉపక్రమిస్తున్నారు. ఉదయం నాలుగ్గంటలకే నిద్ర లేస్తున్నారు. వారంతా తమకు తెలియకుండానే ఆరోగ్యాలను కాపాడుకున్నట్లే. ఆసుపత్రులకు తిరగాల్సిన దుర్గతిని తప్పించుకున్నవారే. కానీ పెద్ద గ్రామాలు పట్టణాలు, నగరాల్లా మారిపోతున్నాయి. కొనే్నళ్ల క్రితం పట్టణాల్లోనూ రాత్రి 9 గంటలకే దుకాణాలు మూసేసేవారు. కానీ ఈరోజు 24 గంటలూ అన్ని రకాల వ్యాపారాలు సాగిస్తున్నారు. మరీ విడ్డూరంగా అర్ధరాత్రిళ్లు అల్పాహారాలు, భోజన హోటళ్లు నడుస్తున్నాయి. గతంలో ‘గూటిలో దీపం - నోటిలో ముద్ద’ అనేవారు. సాయంత్రం 6గంటలకు దీపం వెలిగిస్తే భోజనం చేసి హాయిగా నిద్రించటమే! కానీ నేటి పరిస్థితి పూర్తిగా తిరగబడింది’ అని స్వామీజీ నిట్టూర్చారు. ‘ప్రతి మనిషి జీవన విధానంలో మార్పు రావాలి. మన నడవడి, మన విధానాలనే భావితరాల పిల్లలు అనుసరిస్తారు, ఆచరిస్తారు. గ్రామ గ్రామాన గ్రామదేవతల గుడులు ఉంటాయి. ఆ తల్లికి ప్రతి సంవత్సరం ఉత్సవంగా జాతర చేస్తారు. సంబరం చేస్తారు. కానీ నేడు ఆమె అడక్కుండానే మొక్కుబడుల పేరుతో జంతుబలులు ఇస్తున్నారు. గ్రామదేవత హింసను కోరదు. కనుక జాతర పేరిట జంతుబలులు ఆపాలని, మూగజీవాలను బతకనిద్దామని మనం ప్రచారం చేయాలి’ అని స్వామీజీ ఆదేశించారు. ‘శాకాహారమే ఆరోగ్యకరం. శిష్యులారా! ఈ చుట్టుపక్కల గ్రామాలకు జట్లుజట్లుగా వెళ్లండి. ప్రతి గ్రామంలో ప్రజలను కలవండి. మనం చెప్పదలుచుకున్న మంచిని ఓపికగా వివరించండి. వినకుంటే నచ్చజెప్పండి. వారిని మంచివైపు మళ్లించటమే, వారి జీవితాల్లో ఆరోగ్యకరమైన మార్పు తేవటమే మన లక్ష్యం కావాలి. అందరం సుఖంగా బతుకుదాం.. ఆరోగ్యంగా జీవిద్దాం.. ఇదే మన నినాదం. సర్వే జనా సుఖినో భవంతు’ అని శిష్యుల వద్ద సెలవు తీసుకున్నారు స్వామీజీ.

- మునగాల బాలకృష్ణారావు