ఉత్తర తెలంగాణ

అనుభూతిని పంచేదే కవిత్వం (అంతరంగం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కవి హృదయంలో అంకుర దశలో ప్రారంభమైన భావం విలక్షణమైన వ్యక్తీకరణను, విశిష్టమైన వర్ణనను కలబోసుకొని వచన పద్యగేయ రూపాన్ని సంతరించుకొని పాఠకులకు అపూర్వ అనుభూతిని పంచిపెట్టేదే కవిత్వమని భావించే తెలంగాణ సారస్వత పరిషత్తు ప్రధాన కార్యదర్శి డాక్టర్ జె.చెన్నయ్య మహబూబ్‌నగర్ జిల్లా కావేరమ్మపేటకు చెందినవారు. పాత్రికేయునిగా, రచయితగా, అనువాదకునిగా, వ్యాఖ్యాతగా ప్రజా సంబంధాల వృత్తి నిపుణునిగా మూడున్నర దశాబ్దాల అనుభవం ఉన్న ఆయన జడ్చర్లలోని డాక్టర్ బి.ఆర్.ఆర్. కళాశాలలో డిగ్రీ, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పి.జి పూర్తిచేశారు. 1996లో ‘తెలుగు దినపత్రికలు-్భషా సాహిత్య స్వరూపం’ అనే అంశంపై పరిశోధన చేసి పిహెచ్‌డి పట్టా పొందారు. ‘లక్షగళ సంకీర్తనార్చన’, ‘అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనం’ వంటి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులు సొంతం చేసుకున్న చెన్నయ్య అంతర్జాతీయ సమ్మేళనాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించి అందరి మన్ననలు పొందారు.
ఆకాశవాణిలో ఎనౌన్సర్‌గా, న్యూస్ రీడర్‌గా, ట్రాన్స్‌లేటర్‌గా పనిచేశారు. జాతీయ పర్వదినాల్లో ప్రత్యేక సందర్భాల్లో రాష్టప్రతి, ప్రధానమంత్రి, గవర్నర్ చేసే ప్రసంగాలను తెలుగులోకి అనువదించడంలో ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆయన రాసిన ‘లకుమ’, ‘మహ్మద్ కులీ కుతుబ్ షా’, ‘మైత్రీ సూత్రం’, ‘్ధన్యగాంధారి’, మహాప్రస్థానం తదితర నాటక, నాటికలు ఆకాశవాణిలో ప్రసారమై శ్రోతల ప్రశంసలనందుకున్నాయి! సుమారు పది రచనలు చేసిన ఆయన అనువాదకునిగా, ప్రజాసంబంధాల అధికారిగా, న్యూస్‌రీడర్‌గా మూడు బాధ్యతలను ఏకకాలంలో నిర్వహించిన డాక్టర్ చెన్నయ్య మూడు రంగాల్లోనూ పురస్కారాలను అందుకోవడం విశేషం! పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రజా సంబంధాల అధికారిగా, పబ్లిక్ రిలేషన్స్ సోసైటీ ఆఫ్ ఇండియా హైదరాబాద్ చాప్టర్ కార్యదర్శిగా, ఉపాధ్యక్షునిగా, అధ్యక్షునిగా సేవలందించారు. సిలికానాంధ్ర (అమెరికా)కు భారతదేశ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ప్రతిష్ఠాత్మకమైన తెలంగాణ సారస్వత పరిషత్తు ప్రధానకార్యదర్శిగా ప్రస్తుతం సేవలందిస్తున్న ఆయనతో ‘మెరుపు’ ముచ్చటించింది. ముఖాముఖీ వివరాలు ఆయన మాటల్లోనే పాఠకులకు అందిస్తున్నాం.

ఆ మీ దృష్టిలో కవిత్వం అంటే ఏమిటి?
కవి హృదయంలో అంకురదశలో ప్రారంభమైన భావం విలక్షణమైన వ్యక్తీకరణను, విశిష్టమైన వర్ణనను కలబోసుకొని వచన పద్యగేయ రూపాన్ని సంతరించుకొని పాఠకులకు అపూర్వానుభూతిని పంచిపెట్టేదే కవిత్వం. కవి రూపొందించుకున్న శైలి, కవిదైన గొంతు, కవి అభిప్రాయాల మిశ్రమం కవిత్వం.
ఆఇప్పుడొస్తున్న వచన కవిత్వంపై అభిప్రాయం?
ఆయా కాలాల మీదుగా సాగివస్తున్న వివిధ ధోరణులను పరిశీలించి నేటికాలపు వచన కవిత్వాన్ని అంచనా వేయాలంటే ఒక్కమాటలో చెప్పలేం. ఇప్పుడొస్తున్న కవిత్వంలో వైవిధ్యం వుంది. శక్తివంతంగా రాసే కవులూ, అందమైన వచనాన్ని చలామణిలోకి తెచ్చే కవులూ ఉన్నారు. అయితే రాశిలోనూ, వాసిలోనూ చెప్పుకోదగ్గ కవిత్వం వస్తున్నది.

ఆ మీ ముద్రిత రచనలు?
సుమారు పది. నేను రచయితనే గాక అనువాదకుడిని, పత్రికా రచయితను.

ఆ మీకు నచ్చిన కవి, రచయిత?
ప్రముఖ కవి డాక్టర్ సి.నారాయణ రెడ్డి.

ఆ మీకు నచ్చిన గ్రంథం?
విశ్వనాథ ‘వేయి పడుగలు’

ఆ సాహితీ సంస్థలు క్రియాశీలకంగా
పని చెయ్యాలంటే?
తగిన ఆర్థిక వనరులుండాలి. ప్రభుత్వ సహాయం ఉండాలి. నిర్వాహకుల్లో సాహితీ, సాంస్కృతిక అభినివేశం ఉండాలి. భిన్న వయసులు, వర్గాల కవులు, రచయితలు, రచయిత్రులు, సాహితీ సాంస్కృతిక అభిమానులకు క్రియాశీల సభ్యత్వం ఉండాలి.

ఆ సాహితీ పురస్కారాలపై మీ అభిప్రాయం?
పురస్కారాలు ఉండాలి. పురస్కారాల ఎంపిక విధానం పక్షపాత రహితంగా ఉండాలి. సమాజంలోని అన్ని వర్గాల వారి కృషికి తగిన గుర్తింపు లభించాలి. పురస్కారాలు గుర్తింపు తీసుకొస్తాయి. గుర్తింపు ప్రోత్సాహాన్నిస్తుంది. ఇప్పుడున్న విధానంలో సీనియర్‌కే అన్ని సంస్థలూ పురస్కారాలిస్తున్నాయి. మిగతా వారు నిస్పృహకు లోనవుతున్నారు. ఒక్కరికే అందరూ పురస్కారాలను ఇవ్వడం పోయి యువతరానికి, ఎలాంటి గుర్తింపు రాని వారికి గౌరవం దక్కాలి.

ఆ తెలంగాణ సారస్వత పరిషత్తు ద్వారా
నిర్వహించిన విశేషమైన కార్యక్రమాలు ఏమిటి?
‘తెలంగాణ ప్రాచీన నృత్యరీతులు’, ‘తెలంగాణ ప్రాచీన కవుల కవితాప్రాభవం’, ‘తెలంగాణ సాహిత్య వికాసం’, ‘తెలంగాణ రచయిత్రుల సమ్మేళనం’, ‘కవి సమ్మేళనాలు’, ‘వచన కవిత’ ‘సినీ గీత రచన’ వంటి సదస్సులు, శిక్షణ శిబిరాలు వంటి ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి.

ఆ సారస్వత పరిషత్తు ప్రత్యేక రచనలు?
ఇటీవలి కాలంలో శేషాద్రి రమణ కవుల ‘పరిశోధన వ్యాసమంజరి’, తెలంగాణ ఉద్యమంలో రచయిత్రుల కృషి’, ‘పరిణతవాణి’ ప్రసంగ వ్యాసాల సంకలనం, ‘తెలంగాణ చరిత్ర’ ‘తెలంగాణ సాహిత్య చరిత్ర’, ‘కుతుబ్ షాహీల తెలుగు సాహిత్య సేవ’ వంటి గ్రంథాలెన్నో వచ్చాయి.

ఆ పరిషత్తు నిర్వహించే తెలుగు పరీక్షల
గురించి తెలపండి.
పరిషత్తు నిర్వహిస్తున్న తెలుగు పరీక్షలు కొద్దిగా తగ్గాయి. గతంలో పరిషత్తు నిర్వహించిన విశారద పరీక్షలు ఉత్తీర్ణులైతే పాఠశాలల్లో తెలుగు ఉపాధ్యాయులుగా ఉద్యోగాలు దొరికేవి. పిడిసి పరీక్ష ఉత్తీర్ణులైతే పండిత శిక్షణకు అర్హులయ్యేవారు. ఇప్పుడవి లేవు. ఆ పరీక్షల గొప్పతనాన్ని గురించి చెప్పినా వినిపించుకునే వారు లేరు. డిగ్రీలో తెలుగు లేకపోయినా తెలుగు ఎం.ఏ చేసేందుకు అర్హత కల్పిస్తున్న దూర విద్యాకేంద్రాలున్న కాలంలో పరిషత్తు పరీక్షలకు ఆదరణ ఎక్కడుంటుంది?

ఆపరిషత్తులో ప్రతియేటా ఇస్తున్న పురస్కారాలు?
డాక్టర్ యశోదారెడ్డి సాహితీ పురస్కారం, శ్రీమతి తిరుమల స్వరాజ్యలక్ష్మి, డాక్టర్ తిరుమల శ్రీనివాసాచార్య పురస్కారాలు, ఆచార్య రావికంటి వసునందన్ సాహితీ పురస్కారం, డాక్టర్ కె.అంజిరెడ్డి ధర్మనిధి సాహితీ పురస్కారం మొదలైనవి.

ఆ కొత్త కవులకు, రచయితలకు మీరిచ్చే
సలహాలు, సూచనలు?
మొట్టమొదట భాషమీద అభిమానం ఉండాలి. కవిత్వం, కథ, నవల ఇతర ప్రక్రియల్లో రచనలు చదవాలి. ఆయా ప్రక్రియల స్వరూపాన్ని అవగాహన చేసుకోవాలి. పద సంపదను వృద్ధి చేసుకోవాలి. రచనల్ని పత్రికలకు పంపుతుండాలి. వెంటనే పుస్తకం వేసుకోవాలనుకోరాదు. రాస్తూ రాస్తూ పరిణత రచనలు వచ్చాక పుస్తక రూపంలో తేవాలి.

చిరునామా:
డా. జె. చెన్నయ్య
ఫ్లాట్.నం.502
జయభేరీస్ విజయలక్ష్మి హోమ్స్, మోతీనగర్, హైదరాబాద్-500018
సెల్.నం.9440049323

ఇంటర్వ్యూ: దాస్యం సేనాధిపతి, సెల్.నం.9440525544