సాహితి

కష్టాల కొలిమి నుంచి ఇష్టాల కొలిమికి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కలిసి వున్నన్నాళ్లూ నన్ను కాల్చుకుతిన్నావు. ఆ మహాతల్లి మా అత్తగారు చచ్చి యే లోకాన వున్నదో ఆమె బతికుండగా మాత్రం కొంచెం సుఖపడ్డాను. ఆమె పోయింది- నీకు అడ్డులేకుండా పోయింది. నన్ను మనిషిలాగ ఎన్నడైనా చూశావా? ఎన్ని హింసలు పెట్టావు? చివరకు జంతువులాగా కన్నబిడ్డను పొట్టన పెట్టుకున్నావు. అదృష్టవంతుడివి- మంచిదాన్ని గనక వదిలేశాను. లేకపోతే కేసు చేసి నీ అంతు చూసివుండేదాన్ని..’- ఈ మాటలు కష్టాల కొలిమిలోనుంచి బయటపడి స్వతంత్రంగా తన సంపాదన మీద తాను బతుకుతున్న చుక్కమ్మ అనే ఆడకూతురు, పూర్వపు మొగుడి ముఖంమీద గుమ్మరించిన అగ్నికణాల లాంటి మాటలు.
పెద్దిబొట్ల సుబ్బరామయ్య రాసిన కథ ‘చుక్కమ్మ కథ’లో రుూ సన్నివేశం. మొగుడు తనను వదిలి వెళ్లిపోయిన తర్వాత జీవితానికి కాస్త సుఖము, శాంతి దొరికినట్లు అయింది ఆమెకు. చిన్న పాకలో టీ దుకాణం పెట్టుకుని బతుకుతెరువు వెళ్లమారుస్తోంది. అప్పుడయినా ఆ పాత మొగుడు ఆమెను రికామిగా వుండనిచ్చాడా అంటే అదీ కాదు. అప్పుడప్పుడూ ఆమె దగ్గరకు వచ్చి గల్లాపెట్టెలో డబ్బులు దొంగిలించుకుంటూ పోతూ వుంటాడు. ఇట్లా అనేకమార్లు జరగగా ఆమెకు ఈ స్థితి కూడా అసంబద్ధం అనిపించింది. అతనితో పూర్తిగా తెగతెంపులు చేసుకుంది. వచ్చినప్పుడు ‘టీ’ నీళ్లు పోయడం కూడా మానుకుంది.
ఆమెకు టీ దుకాణంలో సహాయకుడిగా వున్నాడు సుబ్రమణి అనే తమిళ దేశం కుర్రవాడు. కథలో ఉప కథలాగ అతని వర్తమానం కూడా విచిత్రమయినదే. తమిళనాడు మారుమూల నుంచి రైలెక్కివచ్చాడు. టిక్కెట్టు లేనివాళ్లను టిసిలు పట్టుకుంటూ ఉంటే పసిగట్టి, చివరి పెట్టెలోనుంచి వేగం తగ్గిన అదును చూసి క్రిందికి దూకేశాడు. చూస్తే అంతా కొత్త దేశం. ఊళ్లోకి వచ్చి నడవడం సాగించాడు. ఊరు వెనకబడింది. నడుస్తూనే ఉన్నాడు. అంతలో ప్రమాదం జరిగిపోయింది. రివ్వున దూసుకు వచ్చిన లారీ అతన్ని పక్కకునెట్టేసి, ఆగకుండా వెళ్లిపోయింది. తాను విసిరేసినట్లు దూరంగా పడిపోయాడు. వెంటనే లేద్దామనుకున్నాడు కాని లేవలేకపోయాడు. తనకంతవరకే తెలుసు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు. ఎదురుగా టీ దుకాణం. దేవతలా చుక్కమ్మ తనను రక్షించింది. పదిహేను రోజులు కాబోలు ఆస్పత్రిలో ఉండి ఈలోకంలో పడ్డాడు, అవిటి కాలుతో. తర్వాత ఎక్కడికీ పోలేదు. ఇదే లోకమయిపోయింది. తనకు వచ్చిన ఒకే ఒక విద్య తనకు ఆధారమైంది. ఇలా సంవత్సరం గడిచిపోయినా యిక్కడే చుక్కమ్మకు దుకాణంలో సహాయం చేస్తూ వుండిపోయాడు. మధ్య మధ్యలో ఆ మొగుడు పెళ్లాల దెబ్బలాటలు చూస్తూ కాలం గడుపుతున్నాడు.
మొగుడు ఆమెతో సమాధానపడి వుండిపోయి, జీవిత శేషం సుఖంగా గడుపుకోవాలనే ప్రయత్నిస్తాడు. కాని ఆ ప్రయత్నం చక్కగా నెరవేరదు. దొంగతనాలు ఎందుకు చేస్తున్నావు అంటే- అతను చెప్పే సమాధానం యిలా వుంటుంది. ‘డబ్బు సంపాదిద్దామని చేశాను. నీ కష్టం చూడలేక చేశాను. నన్ను నమ్ము, నువ్వు నా దేవతవు. పువ్వుల్లో పెట్టి పూజించుకోవాలని చేశాను..’. రంగురంగుల లాటరీ టిక్కెట్లు తెచ్చి ఆమె ముందు ప్రదర్శిస్తాడు. చివరకు ఆమెకు ‘రంకుతనం’ కూడా అంటకట్టి సాధించి జయించాలని ప్రయత్నిస్తాడు. ‘మళ్లీ నీ వెధవ ముఖం నాకు బతికుండగా చూపించకు’ అనిపించుకుని కూడా సిగ్గు శరం విడిచి ఆమెతో కర్ర యుద్ధానికి పూనుకుంటాడు. అతను చుక్కమ్మను కొట్టబోతూ వుండగా ‘అతని మొహం మీద దెబ్బ పడింది. కొరడాతో కొట్టినట్టు, మాడుమీద తేలు కుట్టినట్లు అయింది. కళ్లు బైర్లు కమ్మయి. చేతిలో కర్ర కిందపడిపోయింది. మనిషి కూలబడిపోయాడు’. ఈ దెబ్బ సుబ్రమణి నుండి వచ్చిందని కథకుడు చెప్పడు. చదువరి ఊహకు వదిలేస్తాడు. కథను నడిపించే వాతావరణం అంతా ప్రకృతి ఆమె కదలికలకు అనుకూలంగా ప్రతిధ్వనిస్తూ వుంటుంది.
తల్లి కడుపులో ఉన్న పిల్లవాడిలా కనిపిస్తాడు సుబ్రమణి ఆమెకు. తను కప్పుకున్న మెత్తని బొంతను, వణుకుతున్న సుబ్రమణిమీద పరుస్తుంది. ‘పైన పరచుకుంటున్న వెచ్చని, మెత్తని దట్టమైన బొంత’తోపాటు ‘పక్కనే లీలగా ఒక ఆకారం’- కొన్ని క్షణాలు కదలకుండా వుండి ‘తరువాత నెమ్మదిగా కదిలి లోపలకు వెళ్లిపోయింది. సుబ్రమణి హాయిగా నిద్రపోయాడు. ‘నిద్రలో మంచుతో నిండిన అందాల పర్వత శిఖరాలు, రంగు రంగుల సముద్రాలూ పువ్వులూ’ కనిపిస్తాయి అతనికి.
జీవితం చాలా విచిత్రమయింది. భౌతికంగా ఎంత సుఖకరంగా వుంటే, సుషుప్తిలోనూ అంతే శుభకరంగా ఉంటుందనే నూతన కథారూపంలో కళకళలాడుతూ కనిపిస్తుంది.
పెద్ద్భిట్ల సుబ్బరామయ్య అనేక కథలు వ్రాశారు. 1959 నుంచి రచనా వ్యాసంగంలో శ్రమించి సాహిత్య ఎకాడమీ పురస్కారం పొందిన బహు కొద్దిమందిలో ఒకరుగా స్థిరపడ్డారు. పాత్రలు జీవితంతో ఒదిగిపోవడం, తమకు అనుకూలమయిన స్థితిగతులను స్వశక్తితో సంపాదించి సమన్వయ పరచుకోవడం ఈయన కథలలో ప్రత్యేక లక్షణం. ఒక కథ చదివితే తతిమ్మా కథలు కూడా సంపాదించి చదవాలనే ఉత్సాహం పాఠకులలో కలిగించడం మరో ఉదాత్త లక్షణం.