సాహితి

బహుముఖీన ప్రజ్ఞావంతులు గురజాడ - పాలగుమ్మి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కథానికా చరిత్రలో 1915 సంవత్సరానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆధునిక కథాద్యులైన గురజాడ వేంకట అప్పారావుగారు మనల్ని విడిచిపోయింది ఆ సంవత్సరంలోనే. తెలుగు ఆధునిక కథ- కథనానికి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిన పాలగుమ్మి పద్మరాజుగారు జన్మించింది ఆ సంవత్సరంలోనే. అంటే పాలగుమ్మి పద్మరాజుగారి శతజయంతి సంవత్సరం గురజాడ వేంకట అప్పారావుగారి శతాబ్ది సంస్మరణ సంవత్సరం!
గురజాడవారు మొదట్లో ఆంగ్లంలో రచనలు చేయడం ప్రారంభించారు. ‘కుకూ’తో పాలగుమ్మివారు మొదట రచనలు చేయడం ప్రారంభించింది ఆంగ్లంలోనే! త్రివేణి పత్రికలో ఆంగ్ల కథానిక ‘సుబ్బి’ మొదట ప్రచురితమైంది. తర్వాత అప్పటి త్రివేణి సంపాదకులు బుర్రా సుబ్రహ్మణ్యంగారి ప్రోత్సాహంతోనే తెలుగులో రాయడం ప్రారంభించారు. గురజాడవారూ శంభుచంద్ర ముఖర్జీగారి సలహా మేరకే తెలుగు సాహిత్యం వైపు దృష్టి మళ్లించారు.
ఇద్దరూ బహుముఖీన ప్రజ్ఞావంతులు. ఇద్దరూ చందోబద్ధమైన కవిత్వం, వచన కవిత్వం, గేయాలు, కథానికలు, నాటకాలు లాంటి అన్ని ప్రక్రియలలోనూ గొప్ప రచనలు చేశారు.
మొదట్లో ఇద్దరి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. ఇద్దరూ తమ్ముళ్ళకు అండగా నిలిచారు. ఇద్దరిదీ వృత్తి వేరైనా, ప్రవృత్తి సాహిత్యమే! అప్పారావుగారు కథానికకి క్లుప్తత, స్పష్టత ప్రధానమని భావించారు. పద్మరాజుగారు ఆయన అడుగుజాడల్లోనే నడిచారు. ఎనభై దాకా కథానికలు రాసినా క్లుప్తతని పాటించారు. ఒక సందర్భంలో పద్మరాజుగారు ‘‘కథానిక అప్పారావుగారి చేతుల్లో యవ్వనం పుట్టింది. ఆ తర్వాత దాదాపు పదిహేనేళ్ళపాటు బాల్యానికి తప్పటడుగులు వేసింది’’ అన్నారు. అదీ ఆయనకు అప్పారావుగారి చేతుల్లో పుట్టిన ‘కథానిక’ మీద గౌరవం. ఆ గౌరవంతో అప్పారావుగారి కథానికా రచనని ఆదర్శంగా తీసుకున్నారు పద్మరాజు.
అప్పారావుగారి ప్రభావంతో పద్మరాజుగారు మాట్లాడే భాషకే ప్రాధాన్యమిచ్చారు. మొదటినుంచి ఆయన రచనలను వ్యావహారిక భాషలోనే రాశారు. చుట్టూ వున్న వ్యక్తుల్ని, సంఘటనలని పాత్రలుగా చేసి రాసేరు కాబట్టి అందరికీ అర్థమయ్యే భాషలోనే రాశారు. అప్పారావుగారు జరిగిన సంఘటనల్ని కొందరు మనుషుల గురించి డైరీలో రాసుకున్నారు. ఆ తర్వాత వాటి ఆధారంగా కథానికలు రాశారు. పద్మరాజుగారు కూడా చిన్నప్పటినుంచి చూస్తున్న మనుషుల గురించే కథానికలు రాశారు. ఇద్దరి ఉద్దేశ్యం అక్షరంతో వాస్తవ సమాజాన్ని చూపించి సంస్కరించడమే.
సమాజానికి అతీతమైన వ్యక్తులుగా తమకి ప్రత్యేకత ఉందని ఇద్దరూ అనుకోలేదు. తమ కర్తవ్యంగా భావించి రచనలు చేశారు. ‘‘నేను పదిమందిని ఆకర్షించే మనిషిని కాను. నాలో ఏదో అద్భుతమైన శక్తి వుందని నమ్మేటంతటి అహంకారమూ లేదు. అందుచేత నా కథానికల్లో వేటిల్లోనూ నేను కథానాయకుణ్ణి కాను..’’ అన్నారు పద్మరాజుగారు ఓ సందర్భంలో.

- వేదగిరి రాంబాబు