మంచి మాట

నరకద్వారాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామక్రోధ లోభాలు మూడూ నరక ద్వారాలని అవి ఆత్మ నాశనానికి కారణాలని మనిషిని అధోగతిపాలు చేస్తాయని, కావున వీటిని సమూలంగా విడిచిపెట్టాలని శ్రీకృష్ణ్భగవానుని గీతాప్రబోధం. ఇదే విషయాన్ని శ్రీశంకరులు కూడా రుూ మూడింటినీ మనిషిలో ఉన్న జ్ఞానమనే రత్నాన్ని తస్కరించడానికి తిష్టవేసుకొని ఉంటాయని, కావున జాగ్రత్తపడమని, తన పంచరత్నాల్లో మానవుని హెచ్చరించారు.
ఇవి ఒకదాన్ని మించి ఒకటి ప్రమాదకరమైనవనీ, వీటిని తొలగించుకోవాలని, అలా చేయడం బుద్ధిమంతుల లక్షణమని మహర్షులు నొక్కి వక్కాణించారు. క్లుప్తంగా ఒక్కొక్కదాని గురించి తెలుసుకుందాం.
కామం:్ధర్మార్థ కామమోక్షాలనబడే పురుషార్థములలో మూడవది. అధర్మకామం అతి నీచమైనది, ప్రమాదకరమైది. ఇంద్రియాలకు లోబడినవారు దేవతలైనను వినాశనం చెందుదురని మహాభారతమందలి విదురనీతి చెబుతోంది. ఏనుగు స్పర్శ సుఖాన్నాశించి వేటగాడికి చిక్కి నశించిపోతుంది. కావున కామ సుఖం కోరి భోగవాంఛలకు లోనైనవారికి అధోగతి తప్పదని అనుభవజ్ఞులైన పెద్దల మాటతోపాటు శాస్త్ర కథనం హెచ్చరిక చేస్తోంది.
ఆధ్యాత్మిక మార్గాన్నాటంకపరిచే బలీయమైన కామంవలన పది వ్యసనాలు పుడతాయని అవి ధర్మాన్ని అతిక్రమించేవిగా మనిషిని మారుస్తాయని, అవి- వేటాడడం, జూదం, పగటినిద్ర, పరుల దోషాల నెత్తిచూపడం, స్ర్తిలను కించపర్చడం, హింసించడం, మత్తుపదార్థాలను సేవించడం, ఆట, పాట, వాద్య వినోదాలు, వృధా ప్రయాణాలు అనేవి. వీటిని తొలగించుకోవాల్సి వుంటుందని మను ధర్మశాస్త్రం చెబుతోంది.
క్రోధం:క్రోధం మనిషిని దిగజారుస్తుంది. తపస్సును చెరుస్తుంది. మంచి గుణాలను రూపుమాపుతుంది. ధర్మమయ క్రియలకు బాధ కలిగిస్తుంది. పలు విధాలుగా చేటుచేయు క్రోధం ఎవరికీ పనికిరాదని ‘మహాభారతం ఆదిపర్వం’ చెబుతోంది.
అవినీతి, అన్యాయం, అధర్మం, హింస, క్రోధం- రుూ అయిదూ పంచమహాపాతకములతో సమానమని శాస్త్ర వచనం. ఏమి చేస్తే ఆయుష్షు పెరుగునో, తెలుపమన్న ధర్మజుని ప్రశ్నకు ‘అసత్యం, క్రోధం, అసూయ, హింస లేకుండా మంచి నడవడితో ఉండేవారికి ఆయుష్షు పెరుగునని భీష్ముని జవాబు.
చాడీలు చెప్పడం, మంచివారిని అవమానించడం, ద్రోహం చేయడం, ఈర్ష్య, ద్వేషం, హింసించి పరుల ధనాన్ని అపహరించడం, ఇతరులను దూషించడం, అకారణంగా దండన విధించడం అనే రుూ ఎనిమిది వ్యసనాలు క్రోధం నుండి పుడతాయని మనుధర్మశాస్త్రం చెబుతోంది.
లోభం:ఇది పైన పేర్కొన్న కామ క్రోధములకు మూలమైన దుర్గుణం. లోభం వలన అపకీర్తి వస్తుంది. మనిషి స్థాయిని కిందకు లాగే పాశం లాంటిదిది. లోభంలో చిక్కుకున్నవారికి మనశ్శాంతి కొరవడుతుందని విదురనీతి వివరిస్తోంది.
ధనం అశాశ్వతమైనదని, ఉన్నవారు కొంత అనుభవించి, కొంత ధనాన్ని పరులకందించడంలో మేలుందని, భారతం- శాంతి పర్వం చెబుతోంది. ధనవంతుడైన లోభికంటే, దానగుణమున్న పేద మేలని, సముద్రమునందలి ఉప్పునీటికంటే చిన్న మంచినీటి చలము సేద తీర్చునని గువ్వల చెన్నా శతకకారుడు వెలిబుచ్చాడు.
దానమీయక ధనాన్ని కూడబెట్టి తాననుభవించక తేనెటీగలు పట్టు పెట్టుకొన్న విధంగా చివరికి చోరుల పాలు కాగా, పశ్చాత్తప్తుడై మ్రగ్గునని, దానహీనుజూచి ధనము నవ్వునని, లోభివాని నడుగ లాభంబు లేదయా అని వేమన లోభత్వం గురించి చెప్పి లోభులకు చురక అంటించాడు.
లోభి ధనర్జనలోనూ, పిసినిగొట్టుతనంలోనూ ఉంటూ నిరంతరం దానిని భద్రపరుచుకొనే యాతనలోనే తలమునకలై తన అమూల్య కాలాన్ని వెచ్చిస్తాడుగాని, జీవన తత్వాన్ని గాని, లక్ష్యాన్నిగాని గ్రహించలేక నష్టపోతున్నాడని, లోభంవలన ఎందరో చరిత్రహీనులై నశించిపోయినట్లు పురాణాలలో వివరించబడింది. మనిషిని పతనావస్థకు తీసుకుపోయే కామ క్రోధ లోభాలనే మూడింటినీ విజ్ఞతతో మట్టుబెట్టి మనిషి మనీషిగా ఎదగాలన్న శాస్తవ్రచనాన్ని శిరసావహిద్దాం.
ధర్మాచరణతో సత్యధారణతో జీవితాన్ని ఆనందమయం చేసుకొందాం. మనమూ లోకకల్యాణకారులం అవుదాం.

-చెళ్ళపిళ్ళ సన్యాసిరావు