విశాఖ

శారదానగర్‌లో మద్యం దుకాణాల ఏర్పాటును తీవ్రంగా ప్రతిఘటిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనకాపల్లి, జూన్ 25: శాంతి సామరస్యాలకు మారుపేరుగా ఉన్న శారదానగర్ ప్రాంతంలో నిబంధనలకు తిలోదకాలిచ్చి మద్యం దుకాణాలు ఏర్పాటు చేస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని ఆ ప్రాంత ప్రజలు హెచ్చరించారు. శారదానగర్ పరిరక్షణ సమితి నేతృత్వంలో ఆదివారం జరిగిన అఖిలపక్ష సమావేశానికి ఆ ప్రాంతానికి చెందిన వివిధ వర్గాల ప్రజలు అనూహ్య సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సదస్సునుద్ధేశించి ఆర్‌ఇసిఎస్ రిటైర్డ్ ఎండి ఎస్‌ఎ దావూద్ అలీ మాట్లాడుతూ శారదాబ్రిడ్జీనుండి ఎఎంఎఎల్ కళాశాల అండర్ బ్రిడ్జీ వరకు గల ప్రధాన మార్గంలో నూతనంగా రెండు మద్యం షాపులను ఏర్పాటు చేయాలనే ఆలోచన చాలా అన్యాయమన్నారు. ఈ ప్రాంతంలో మద్యం దుకాణాలు ఏర్పాటయితే శాంతిభద్రతల సమస్యకు విఘాతం కలుగుతుందని, అరాచకాలు పెరిగిపోతాయని ఆవేదన వ్యక్తం చేసారు. జనవిజ్ఞాన వేదిక జాతీయ కన్వీనర్ ఎంవిఆర్ కృష్ణ మాట్లాడుతూ మద్యం విక్రయాలు మూడు పువ్వులుగా ఆరు కాయలుగా సాగుతున్నాయని, తద్వారా శాంతిభద్రతల సమస్యకు విఘాతం కలుగుతుందన్నారు. అధికార తెలుగుదేశం పార్టీ పాలకులు ఈ చర్యలను ప్రోత్సాహించడం సిగ్గుచేటన్నారు. ఈ ప్రాంతంలో మద్యం దుకాణాల ఏర్పాటును వ్యతిరేకిస్తూ జరిగే ఉద్యమం మరోసారి రాష్టవ్య్రాప్తంగా జరిగే సంపూర్ణ మద్యపాన నిషేధ ఉద్యమానికి నాంది కావాలని ఆయన ఆకాంక్షించారు. శారదానగర్‌లో ఉన్న కంపోస్టుయార్డును తరలించేందుకు జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావు చేసిన కృషి ఈ ప్రాంతీయులు మరిచిపోలేనిదన్నారు. అదే స్పూర్తితో మద్యం దుకాణాల ఏర్పాటును కూడా మంత్రి గంటా నిలిపివేసే చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. కొత్తూరు గ్రామ సర్పంచ్ మేడిశెట్టి రాము మాట్లాడుతూ శారదానగర్‌లో మద్యం దుకాణాల ఏర్పాటను వ్యతిరేకిస్తూ ఇప్పటికే ఈ ప్రాంత ప్రజలు ఆర్డీవోకు, ఎక్సైజ్ ఉన్నతాధికారులకు ప్రతిపాధనలు పంపారన్నారు. గ్రామ పంచాయతీ పాలకవర్గం ఏకగ్రీవంగా ఈ ప్రాంతంలో మద్యం దుకాణాల ఏర్పాటును వ్యతిరేకిస్తూ తీర్మానం చేసిందన్నారు. ఈ చర్యలను వ్యతిరేకిస్తూ జరిగే ఉద్యమానికి తన సంపూర్ణ మద్దతును గ్రామ సర్పంచ్ మేడిశెట్టి రాధ ప్రకటించారు. సీమాంధ్ర బీసి సంక్షేమ సంఘం కన్వీనర్ గుడాల సత్యనారాయణ ముదిరాజ్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో మద్యం దుకాణాలను ఏర్పాటు చేస్తే తగులబెడతామని హెచ్చరించారు. శారదానగర్ పరిరక్షణ కమిటీ కన్వీనర్ మల్లారెడ్డి శంకరప్రసాద్ ఈ సమావేశంలో అధ్యక్షోపన్యాసం చేస్తూ సమస్యల పరిష్కారంపై ఈ ప్రాంతీయులు సాగించిన పోరుబాట ఇంతవరకు సత్ఫలితాలనే సాధించిందన్నారు. మంత్రి గంటా దృష్టికి ఈ సమస్య తీవ్రతను తీసుకెళ్లి మద్యం దుకాణాలు ఏర్పాటు కాకుండా అడ్డుకుంటామన్నారు. మద్యం దుకాణాల ఏర్పాటుకు కొందరు సామాజిక వాదులు తమ దుకాణాలను సైతం అద్దెకు ఇవ్వకుండా సహకరించారని, అదే స్పూర్తితో మద్యం దుకాణాల ఏర్పాటుకు అద్దెకు ఇవ్వాలనుకునేవారు కూడా తమ ఆలోచనను విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేసారు. వైఎస్సాఆర్ సిపి అనకాపల్లి పట్టణ యువజన విభాగం అధ్యక్షులు జాజుల రమేష్ మాట్లాడుతూ శారదానగర్ ప్రాంతంలో మద్యం దుకాణాలు ఏర్పాటు చేయడం వలన అఘాయిత్యాలు పెరిగిపోతాయని, శాంతిభద్రతల సమస్యకు విఘాతం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేసారు. మండల బిజెపి నాయకులు రాజారావు, సిపిఎం నాయకులు ఎ. బాలకృష్ణ, జనసేన నియోజకవర్గ కన్వీనర్ వేలం నూకరాజు, సామాజికవేత్త శారద తదితరులు ఈ సమావేశంలో ప్రసంగించారు. శారదానగర్‌లో మద్యం దుకాణాల ఏర్పాటు ప్రతిపాదనను విరమించుకోవాలని, డ్రైనేజీ కాలువలు ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ పరమైన ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని తదితర సమస్యలపై సభ్యులు ప్రతిపాధించిన తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. పంచాయతీ వార్డుమెంబర్ వర్మ, సోమశేఖర్, కొత్తపల్లి శ్రీనివాస్, వేపాడ సత్తిబాబు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.