వరంగల్

ఈద్ ముబారక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబాబాద్, జూన్ 26: మహబూబాబాద్ జిల్లాలో పవిత్ర రంజాన్ వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. రంజాన్ పండుగ పురస్కరించుకొని స్థానికంగా ఉన్న మసీదులు ముస్తాబయ్యాయి. విద్యుత్ అలంకరణతో నింపారు. ఉదయం నుండే ముస్లిం సోదరులు కొత్త దుస్తులు ధరించి ఈద్గా, మసీదుల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసారు. రంజాన్ పండుగ మతసామరస్యానికి ప్రతీకగా నిలిచింది. పండుగ పురస్కరించుకని ముస్లిం సోదరులకు హిందువులు, ఇతరులు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్, మానుకోట మున్సిపల్ చైర్‌పర్సన్ ఉమా మురళినాయక్ ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. రాంజాన్ పండుగ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసారు. ఎక్కడా ఎలాంటి సంఘటనలు జరుగకుండా ముమ్మరంగా పెట్రోలింగ్ చేపట్టారు.
కురవి మండలంలోని గ్రామగ్రామాన ముస్లిం సోదరులు పవిత్ర రంజాన్ పర్వదినాన్ని సోమవారం ఘనంగా నిర్వహించుకున్నారు. మజీదు వద్ద ప్రార్థనలు ముగించుకున్నారు. తోటి ముస్లింలను అలయ్‌బలయ్ ఆలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ముఖ్యంగా ఇతర మతస్థులకు పండుగ గుర్తుగా కీర్‌ను పంపిణీ చేసారు. చిన్నాపెద్దా తారతమ్యం లేకుండా ముస్లింలు వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు.
కొత్తగూడలో ముస్లింల పవిత్ర పర్వదినమైన రంజాన్ పండుగను సోమవారం మండల ముస్లిం ప్రజలు భక్తి శ్రద్ధలతో ఆనందోత్సాహాల నడుమ ఘనంగా జరుపుకున్నారు.రంజాన్ ఉపవాసాలు గత నెల 28నుండి మొదలు కాగా కఠిన నియమాలతో రోజంతా అల్లాహ్‌ను తలచుకుంటూ సాయంత్రం ఇఫ్తార్ వరకు ఉపవాస దీక్షను చేపట్టి అలా నెల రోజులు పూర్తి చేసుకొని నేడు రంజాన్ పర్వదినంతో ఉపవాస దీక్షను పూర్తిచేస్తారు. రంజాన్‌ను పురస్కరించుకొని వేకువ జామునే మేలుకొని తల స్నానం ఆచరించి నూతన వస్త్రాలు ధరించి ముస్లిం సోదరులంతా ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం ఇమామ్ ద్వారా ఖురాన్ విన్నారు. పిదప ముస్లిం సోదరులు ఒకరిని ఒకరు అలింగనం చేసుకొని రంజాన్ శుభాకాంక్షలు అందచేసుకున్నారు. అక్కడినుండి మరణించిన బంధువుల సమాధుల వద్ద వౌనం పాటించి వారికి నివాళులు అర్పించి అనంతరం ఇంటి వద్ద తల్లి దండ్రుల ఆశీర్వాదాలు పొంది ఇంట్లో తయారు చేసిన ఘుమ ఘుమలాడే సేమియాలతో రంజాన్‌ను ఘనంగా నిర్వహంచుకున్నారు. తమ బంధువులకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు తియ్యటి సేమియాలు అందించి తమ పండుగా విశిష్టతను చాటుకున్నారు. ఈకార్యక్రమంలో ఇమామ్ ముదస్సిర్, మజీద్ కమిటీ చైర్మెన్ ఎండి సర్వర్,అధ్యక్షులు ఎండి అజ్మీర్ పాషా,యాకుబ్ పాషాలు పాల్గొన్నారు.
గంగారం మండలంలో ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించే రంజాన్ పండుగ(ఈద్ ఉల్ ఫీతర్) వేడుకలను సోమవారం ఘనంగా జరుపుకున్నారు. ఆదివారం రాత్రి నెలవంక దర్శనం ఇవ్వడంతో ఇస్లాం సంప్రదాయ లోగిళ్లలో ఆనందం వెల్లివిరిసింది. నెలవంక పొడుపుతో ప్రారంభైన ఉపవాస దీక్షలు మళ్లీ నెలవంక దర్శనం ఇచ్చేదాకా కొనసాగాయి. గంగారం మండలంలో సోమవారం ఉదయమే లేచి ముస్లింలు పవిత్రస్నానం చేసి నూతన దుస్తులు ధరించి స్థానికంగా ఉన్న ఈద్గాలలో నమాజ్(ప్రార్ధన)లు చేశారు. అనంతరం ఈద్ ముబారక్ అంటూ ఆత్మీయ ఆలింగనాలు చేసుకొని పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ప్రార్ధన అనంతరం కులమత భేదం లేకుండా స్నేహితులను తమ ఇళ్లలోకి ఆహ్వానించి పాయసాన్ని వడ్డించి బిర్యాని ఘుమఘుమల రుచి చూపించారు. ఈ సంవత్సరం అన్ని మతాల వారికి మంచి జరగాలని అల్లాను ప్రార్దించామని మండలంలోని ముస్లింలు సంతోషంగా తెలిపారు.
నర్సింహులపేటమండలంలో రంజాన్ వేడుకల సందర్భంగా మండల కేంద్రంలోని స్థానిక మజీద్‌లో తమ కుల దైవానికి ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై సిహెచ్ నాగేశ్ మాట్లాడుతూ.. పండుగలనేది కుల సామరస్యానికి తోడ్పడుతాయని అన్నారు. వారి వెంట ముస్లిం నాయకులు సర్వర్‌పాషా, మోయినుద్దీన్, సలీం, యాకుబ్, ఖాన్, అన్వర్, మధార్, ఉస్మాన్ తదితరులు ఉన్నారు.
నెల్లికుదురు మండలకేంద్రంతోపాటు వివిధ గ్రామాల ముస్లింలు ఆదివారం రాత్రి నెలవంక కనిపించడంతో నెలరోజులుగా ఆచరిస్తున్న ఉపవాస దీక్షను విరమించి సోమవారం రంజాన్ పండుగను అత్యంత భక్తిశ్రద్ధల మద్య ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మజీద్‌లు, ఈద్గాలలోప్రత్యేక ప్రార్ధనలు చేశారు.
నర్సంపేట: నర్సంపేట డివిజన్‌లో రంజాన్ వేడుకులను సోమవారం ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. సోమవారం ఉదయం పట్టణంలోని జామా మసీదులో ముస్లింలు సామూహిక ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి సైతం ప్రత్యేక ప్రార్ధనలలో పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు హిందువులు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. హిందూ ముస్లిం బాయి బాయి అంటూ అలింగనం చేసుకున్నారు. మత గురువులు గౌసియా బేగ్, అక్బర్ రెహమాన్ అల్లా సందేశాన్ని చదివి వినిపించారు. ఖురాన్ సారంశాన్ని ఉద్బోధించారు. ఈవేడుకల్లో మజీద్ కమిటీ అధ్యక్షుడు మహ్మద్ ముర్షద్, కార్యదర్శి రిహీమ్, యాకూబ్‌పాష, యాకూబ్ అలీ, షేక్ జావీద్, మహబూబ్‌ఖాన్, మహబూబ్ అలీ, జలీల్, అయూబ్‌ఖాన్, సంథాని, యాకూబ్, కోఆప్షన్ సభ్యుడు ఎండి అలీమ్‌తో పాటు పలు రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
గూడూరు: గూడూరు మండలంలో రంజాన్ పర్వదినాన్ని ముస్లిం సోదరులు సోమవారం ఘనంగా జరుపుకున్నారు. మండల కేంద్రంలోని పాఖాల వాగు సమీపంలో గల ఈద్గా వద్ద ముస్లీంలు ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. అనంతరం ఒకరికొకరు అలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు. ముస్లిం సోదరులకు హిందువులు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈవేడుకల్లో జడ్పీటిసి మహ్మద్ ఖాసీం, ఎంపిపి చెల్పూరి వెంకన్న, సలీం, యాకుబ్‌పాష, కరీమ్, అక్బర్, షాబోద్దిన్, రహమాన్, సులేమాన్, మున్వర్, అన్వర్, అఫ్జల్, బొప్పిడి చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కాటారం: హిందూ, ముస్లింల ఐక్యతకు ప్రతీకగా రంజాన్ పండుగను చేసుకోవాలని కాంగ్రెస్, తెరాస పార్టీలకు చెందిన నేతలు పేర్కొన్నారు. సోమవారం రంజాన్ పండుగ సందర్భంగా కాటారం మండల కేంద్రమైన గారెపల్లిలోని మసీద్‌లో ముస్లింలతో పలు రాజకీయ నేతలు అలయ్‌బలయ్ తీసుకున్నారు. ముస్లింకుటుంబాలు రంజాన్ పండుగను అనందంగా జరుపుకున్నారు. తీపి పంపకాలు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పుల్లూరి రాజేశ్వర్‌రావు, కాటారం ఉపసర్పంచ్ కొట్టె శారదప్రభాకర్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు చీమల సందీప్ తదితరులు పాల్గొన్నారు. తెరాస పార్టీ తరఫున మండల టిఆర్‌ఎస్ పార్టీ మాజీ అధ్యక్షుడు తోట జనార్దన్, మండల యువజన విభాగం అధ్యక్షుడు నాయిని శ్రీనివాస్ ముదిరాజ్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు భూపెల్లి రాజు, కార్యదర్శి బొడ్డు రాజబాపు తదితరులు పాల్గొన్నారు.
సంగెం: ముస్లింలు రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సోమవారం మండలంలోని చింతలపల్లి, దవిచర్ల ఈద్‌గాలో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి రంజాన్ శుభకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం నాయకులు, మత పెద్దలు పాల్గొన్నారు.
నల్లబెల్లి: నల్లబెల్లి మండల కేంద్రంలోని సోమవారం రంజాన్ వేడుకలను ముస్లిం మతపెద్దలు ఘనంగా నిర్వహించారు. ఉదయానే్న ఒకరికి ఒకరు శుభాకాంక్షలు (ఈద్ ముభారక్) తెలుపుకున్నారు. మత గురువు మహ్మద్ అహ్మద్ ముస్లింలకు శుభాకాంక్షలు తెలుపుతూ స్నేహభావం పెంపొందించేందుకు ఈ వేడుకలు దోహదపడుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పాషా, సద్దామ్, అన్వర్, చోటేమియా తదితరులు పాల్గొన్నారు.
కేసముద్రం: రంజాన్ వేడుకలు కేసముద్రం మండలంలో సోమవారం ఘనంగా జరిగాయి. వర్షం కారణంగా ఈద్గా వద్ద కాకుండా స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో ముస్లింలు సామూహిక నమాజ్ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన ముస్లింలు నమాజ్‌లో పాల్గొన్నారు. అనంతరం పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కేసముద్రం (స్టే) మజీద్ కమిటీ అధ్యక్షకార్యదర్శులు హాశం, షబ్బీర్, పెద్దలు రవూఫ్, మహ్మదలీ, జాని, అబ్బాస్ హుస్సేన్, అంకూస్, షాబుద్దీన్, ఉప సర్పంచ్ మహ్మద్ రఫీ, వార్డు సభ్యుడు తాజుద్దిన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కో ఆప్షన్ మెంబర్ నజీరహ్మద్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత టిఆర్‌ఎస్ ప్రభుత్వం ముస్లింల అభివృద్ధికి అనేక చర్యలు చేపట్టిందని, ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ముస్లింలు పండగను ఆనందంగా జరుపుకుంటున్నారని కొనియాడారు. కాగా ముస్లింలకు స్థానిక ఎస్ ఐ శ్రీనివాస్‌రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుగులోతు ఈరునాయక్, అల్లం నాగేశ్వర్‌రావు శుభాకాంక్షలు తెలిపారు.
తొర్రూరు: ముస్లింల ప్రధాన పర్వదినం అయిన రంజాన్ పండుగ వేడుకలను సోమవారం తొర్రూరు డివిజన్ కేంద్రంలో ముస్లిం సోదరులు సాంప్రదాయ బద్దంగా ఆనందోత్సవాల మధ్య జరుపుకున్నారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని సోమవారం ఉదయం డివిజన్ కేంద్రంలోని జామా మజీద్‌లో ముస్లింలు ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. రంజాన్ పండుగ సందర్భంగా నూతన దుస్తులు ధరించి చిన్నాపెద్దా అనే తేడా లేకుండా మసీద్‌లకు చేరుకొని సామూహిక ప్రార్ధనలు నిర్వహించారు. అనంతరం ముస్లింలు ఆత్మీయ ఆలింగనం చేసుకొని అలాయి బలాయి చెప్పుకున్నారు. ఈ సందర్భంగా పలువురు హిందువులు కూడా తమ స్నేహితులైన ముస్లిం సోదరుల ఇళ్లకు వెళ్లి రంజాన్ శుభాకాంక్షలు తెలిపి వారితో కలిపి ఆనందోత్సవాలు పంచుకున్నారు. రంజాన్‌ను పురస్కరించుకొని ముస్లింలు తమ స్నేహితులకు కీర్ రుచి చూపించారు. డివిజన్ కేంద్రంలో జరిగిన ప్రత్యేక ప్రార్ధనలో తొర్రూరు సర్పంచ్ దారావత్ రాజేష్‌నాయక్ హాజరై ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
జనగామ టౌన్: ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్ పండుగను సోమవారం జనగామ జిల్లావ్యాప్తంగా ముస్లింలు ఘనంగా నిర్వహించుకున్నారు. గత నెల రోజులుగా కఠోర ఉపవాస దీక్షలతో గడిపిన ముస్లిం సోదరులు ఉదయమే ఈద్గాల వద్దకు వెళ్లి ప్రత్యేక నమాజ్‌లు చేశారు. ఇన్నాళ్లూ వేర్వేరు మసీదుల్లో నమాజ్‌లు చేసిన ముస్లింలు వేడుకల సందర్భంగా ఈద్గా మైదానం చేరుకొని ఒకేచోట నమాజ్ చేసి అల్లాను ప్రార్థించారు. ఈ సందర్భంగా ఈద్గాల వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇస్లాం మతపెద్దలు మాట్లాడుతూ రంజాన్ పవిత్రతను వివరించారు. ఖురాన్‌లోని ముఖ్యమైన ఘట్టాలను చదివి వినిపించారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకొని రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియచేసుకున్నారు. ఈద్గాల నుంచి బయటికి వెళ్లిన ముస్లిం సోదరులకు గేటు వద్ద వివిధ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు పోటీ పడి శుభాకాంక్షలు తెలియచేశారు. జనగామ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి తాగునీరు అందచేశారు. స్థానిక సిద్దిపేట రోడ్డు సమీపంలోని ఈద్గా వద్ద సామూహిక నమాజ్ చేసిన ముస్లింలు అనంతరం ప్రభుత్వ ఏరియాసుపత్రి ఎదుట ఉన్న ఖబరస్థాన్ చేరుకొని తమ పూర్వీకుల సమాధుల వద్ద పుష్పగుచ్ఛాలు చల్లి నివాళ్లర్పించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ ప్రేమలతారెడ్డి, వైస్‌చైర్మన్ నాగారపు వెంకట్, మార్కెట్ చైర్‌పర్సన్ బండ పద్మయాదగిరిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, ధర్మపురి శ్రీనివాస్, రంగు రవి, బిజెపి నాయకులు దేవరాయ ఎల్లయ్య, శివరాజ్ యాదవ్, పెద్దోజు జగదీష్, టిడిపి నాయకులు బొట్ల శ్రీనివాస్, బాబు, చీకట్ల నవీన్‌లు ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు.
స్టేషన్‌ఘన్‌పూర్‌లో రంజాన్ పర్వ దినాన్ని పురస్కరించుకుని సోమవారం మండలంలో ముస్లిం సోదరులు వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండలకేంద్రంలోని మసీద్‌కు చేరుకున్న స్థానిక ఎమ్మెల్యే డా. తాటికొండ రాజయ్య పవిత్ర ప్రార్థనలో పాల్గొని, ముస్లిం సోదరులతో అలాయ్, బలాయ్ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడుతూ రంజాన్ పర్వదినం ముస్లిం సోదరుల ఐకమత్యాన్ని చాటుతుందన్నారు. అంతేకాక ముస్లిం సోదరులకు రాష్ట్రప్రభుత్వం దస్తులను పంపిణీ చేయడమే కాకుండా ఆయా సోదరులతో నియోజకవర్గంలోని ఏడు మండలాల కేంద్రాల్లో రంజాన్ మాసంలో ప్రభుత్వ పరంగా ఇఫ్తార్‌విందు ఏర్పాటు చేసి ప్రతి ముస్లిం సోదరుడిని కలుసుకునే భాగ్యం కలిగినందుకు ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. రంజాన్ పర్వదినం సందర్భంగా కేవలం ముస్లిం సోదరులే కాకుండా వారికి హిందువులు, క్రైస్తవులు కూడా శుభాకాంక్షలు తెలపడం గర్వించదగ్గ విషయన్నారు. మండల కేంద్రంలోని మసీదు వద్ద కార్యక్రమంలో ముస్లిం సోదరులు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖులు పాల్గొని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
రఘునాథపల్లి మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో రంజాన్ పర్వదిన వేడుకలు సోమవారం ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించారు. నెల రోజులుగా కఠోర ఉపవాస దీక్షలు చేపట్టిన ముస్లింలు పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకొని నూతన వస్త్రాలు ధరించి ఈద్గాల వద్ద ప్రత్యేక నమాజ్‌లు చేశారు. నమాజ్‌ల అనంతరం హిందూ, ముస్లింలు ఒకరినొకరు ఆలింగనం చేసుకొని ఈద్ ముబారక్‌లు తెలుపుకున్నారు. ముస్లిం సోదరులకు టిఆర్‌ఎస్ మండల చీఫ్ మారుజోడు రాంబాబు, మండల పార్టీ అధ్యక్షుడు పోకల శివకుమార్, మాజీ ఎంపిపి వై.కుమార్, ఎంపిపి దాసరి అనిత, జడ్పీటిసి బానోతు శారద, సర్పంచ్ సఫియాబేగం, మైనార్టీ సెల్ మండలాధ్యక్షుడు బాషుమియాలు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
నర్మెట, తరిగొప్పుల మండలాల్లో పవిత్ర రంజాన్ వేడుకలను సోమవారం ముస్లింలు ఘనంగా జరుపుకొన్నారు. మతసామరస్యానికి ప్రతీకైన రంజాన్ ఉపవాసాలు ఆదివారంతో ముగిశాయి. ఆయా ఈద్గాల వద్ద ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేసి అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటూ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు.ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు ఎండి. గౌస్, మసీద్ కమిటీ పెద్దలు అలీమోద్దీన్, సనావుల్లా, బాబుమియా, ఎండి. ఖాజా, రజాక్, లల్లు, హమీద్, షర్ఫోద్దీన్, సలీం, గపూర్, శంషోద్దీన్‌లు పాల్గొన్నారు.జఫర్‌గడ్ మండల కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో రంజాన్ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. సోమవారం మండల కేంద్రంలోని జామా మసీద్ వద్ద ముస్లింలు ప్రత్యేక నమాజ్‌లు చేశారు. అనంతరం ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున ఈద్గాకు ర్యాలీగా వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు.చేర్యాలలో రంజాన్ పండుగ వేడుకలు మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో సోమవారం ఘనంగా జరిగాయి.
ముస్లిం సోదరులు రంజాన్ సందర్భంగా మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు, నమాజ్‌లు చేశారు. అనంతరం పరస్పరం రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆనందోత్సాహాల మధ్య పండుగను నిర్వహించుకున్నారు. హిందువులు సైతం మతాలను పక్కన పెట్టి ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్‌తో చేర్యాలలో సందడి వాతావరణం నెలకొంది.