మెదక్

ఘనంగా ఈదుల్ ఫితర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, జూన్ 26: పవిత్రమైన రంజాన్ మాసాన్ని ముస్లిం సోదరులు సోమవారం నాటి రంజాన్ పర్వదినంతో ముగించారు. సూర్యోదయానికి ముందుగా కఠినమైన ఉపవాస దీక్షలను చేపట్టి సూర్యాస్తమయం తరువాత విరమణ చేస్తూ నెల రోజుల పాటు ఆధ్యాత్మికంగా, భక్త్భివంతో దేవుడిని స్మరణ చేసుకున్నారు. 30 రోజుల ఉపవాస దీక్షల అనంతరం రంజాన్ రోజున ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి పండుగను జరుపుకోవడం ఆనవాయితిగా వస్తోంది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలుగా ఏర్పడిన మూడు కొత్త జిల్లాల్లో ఉదయం నుంచే ముస్లింల ఇళ్లన్ని సందడిగా మారాయి. ఉద్యోగ, వ్యాపార, ఉపాధి నేపథ్యంలో స్వగ్రామాలను వదిలివెళ్లే వారు సైతం ఈ పర్వదినం రోజున స్వస్థలాలకు చేరుకుని బంధువులు, ఇరుగుపొరుగు, బాల్యమిత్రులతో కలిసి సామూహిక ప్రార్థనలు నిర్వహిస్తారు. పేద వర్గాలకు తమకు తోచిన వాటిని కానుకలుగా సమర్పించుకోవడం రంజాన్ పర్వదినం ప్రత్యేకత. నెలవంకను దర్శించుకున్న అనంతరం రంజాన్ ఉపవాస దీక్షలను విరమించడంలో భాగంగా ఆదివారం నెలవంకను దర్శించుకున్న ముస్లింలు సోమవారం రంజాన్ పర్వదినాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నారు. మతపెద్దలు నిర్ణయించిన సమయానికి పట్టణాలు, గ్రామాల్లో ఉన్న ఈద్గాల వద్దకు పురుషులు చేరుకుని ప్రార్థనలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా మత పెద్దలు పవిత్రమైన ఖురాన్‌లోని ముఖ్యమైన అంశాలను చదివి వినిపించారు. ప్రార్థనలు ముగిసిన అనంతరం ఒకరికి ఒకరు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుని ఆలింగనం చేసుకున్నారు. విభిన్న జాతులు, కులాలు, మతాలకు నిలయంగా భిన్నత్వంలో ఏకత్వంగా జీవిస్తున్న భారతదేశంలో ఒకరి మత సంప్రదాయాన్ని మరొకరు గౌరవించుకుంటూ సహజీవనం సాగిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా ఇతర మతాలు వారు కూడా ఈద్గాలు, ప్రార్థన స్థలాలకు చేరుకుని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు అందజేసారు. పట్టణాల్లో మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఈద్గాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసారు. వేలాది మంది ఒకే చోటకు చేరుకుని సామూహిక ప్రార్థనలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మూడు జిల్లాల పోలీసు అధికారుల పర్యవేక్షణలో పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేసారు. వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా ట్రాఫిక్ చర్యలు చేపట్టారు. రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు సిద్దిపేటకు చేరుకుని ముస్లిం సోదరులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు అందజేసారు. జిల్లా కేంద్రమైన మెదక్‌లో డిప్యూటి స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి ముస్లింలకు రంజాన్ పర్వదినం ప్రత్యేక శుభాకాంక్షలు అందజేసారు. జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌లు హాస్టల్ గడ్డ వద్ద ఉన్న ఈద్గాకు చేరుకుని ముస్లింల ప్రార్థనలను తిలకించారు. అనంతరం మత పెద్దలకు, ముస్లిం సోదరులకు ప్రత్యేక శుభాకాంక్షలు అందజేయడంతో పాటు రంజాన్ పర్వదినం ప్రత్యేకతను ఈ సందర్భంగా వివరించారు. ఖురాన్‌లో చూపించిన విధంగా మంచిమార్గాన్ని అనుసరిస్తే జీవితంలో ప్రశాంతత చేరుకుని మానసిక ఆనందంతో జీవిస్తారని ఉద్భోదించారు. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ముస్లింకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. పటన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో ముస్లింలకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. నర్సాపూర్‌లో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ రాజమణి, మాజీ మంత్రి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునితాలక్ష్మారెడ్డిలు వేర్వేరుగా ముస్లిం సోదరులకు రంజాన్ పర్వదినం శుభాకాంక్షలు తెలియజేసారు. నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి ముస్లింల ఇంటికి వెళ్లి ప్రత్యేకంగా శుభాకాంక్షలు అందజేసారు. జహీరాబాద్‌లో అధికార టిఆర్‌ఎస్ పార్టీ నాయకులతో పాటుగా స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు జె.గీతారెడ్డి ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు అందజేసారు. మైనార్టీలతో సహా కలిసి ఈద్గాకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన ఎమ్మెల్సీ ఫరీదోద్దీన్ టిఆర్‌ఎస్ పార్టీ శ్రేణులతో పాటు ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు అందజేసారు. దుబ్బాకలో ఎమ్మెల్యే రామలింగారెడ్డి రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసారు. అందరిని ఆకర్షించే విధంగా చిన్నారులు వేషధారణ చేసి పరస్పరం శుభాకాంక్షలు అందజేసుకున్న తీరు అందరిని ఆకర్షించింది. చిన్నారులు మొదలుకుని వృద్దుల వరకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడానికి ఆసక్తిని కనబర్చారు. ప్రార్థనలు ముగిసిన అనంతరం మతాలకు అతీతంగా మిత్రులను, రాజకీయ పార్టీల నాయకులు ఇళ్లకు ఆహ్వానించుకుని రంజాన్ సందర్భంగా ప్రత్యేకంగా వండుకునే సీర్‌కుర్మాను ఆరగింపజేసారు. అనంతరం వింధు భోజనాలు చేయించి సంతృప్తి పర్చారు. కాగా మహిళలు సైతం సంప్రదాయం ప్రకారంగా ఇళ్లలోనే రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఇళ్లలోనే ఖురాన్‌ను పఠించి దీవించాలంటూ అల్లాను వేడుకున్నారు. ఏలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా మూడు జిల్లాల్లో రంజాన్ పర్వదిన వేడుకలు ప్రశాంత వాతావరణంలో ముగియడంతో అధికార యంత్రాంగానికి ఊరటనిచ్చింది.