మెయన్ ఫీచర్

నెహ్రూకు పాఠం నేర్పిన రాజేంద్ర..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్టప్రతి భవనంలో రాష్టప్రతి వ్యక్తిగత ఉపయోగం కోసం కేటాయించిన విభాగంలో అనేక మార్పులు జరిగాయి. ఆర్భాటం తొలగిపోయి నిరాడంబర సౌందర్యం నెలకొనడం ఈ మార్పులలోని ప్రధాన అంశం. రాష్టప్రతి శయన మందిరం నుంచి భారీ వెలల అలంకరణ సామగ్రిని, విలాసవంతమైన వ్యవస్థను తొలగించారు. ఖరీదైన తెరలను, విభాగినుల-పార్టిషన్స్, ‘కుషన్’ పరుపులను, పట్టుదుప్పట్లను తీసివేసారట. ఖద్దరు దుప్పట్లను, చేనేత వస్త్రాలను సాధారణ చెక్కసామానును ఆయన శయన మందిరం-బెడ్‌రూమ్‌లో ఏర్పాటు చేసారట! ఈ మార్పులు జరిగింది 1950 జనవరి నెలలో. చేయించినవాడు స్వతంత్ర భారత ప్రథమ రాష్టప్రతి డాక్టర్ రాజేంద్రప్రసాద్! రైతు కుటుంబంలో జన్మించిన రాజేంద్రప్రసాద్ గ్రామీణ జీవన పద్ధతికి అజరామరమైన ఆదర్శం, సనాతన భారత జాతీయ సంస్కృతికి చెరగని విగ్రహం! రాష్టప్రతి కావడానికి ముందు ఆయన గడిపిన నిరాడంబర జీవనం పనె్నండేళ్లపాటు రాష్టప్రతి భవనంలో కూడా కొనసాగింది! ఆయన ఆచార్యుడు, న్యాయవాది, బ్రిటన్ వ్యతిరేక సమరయోధుడు, కాంగ్రెస్ అధ్యక్షుడు. బిహార్‌లోని ‘శివా’ జిల్లాలోని ఝెరదాల్ అన్న తన స్వగ్రామం వెళ్లినపుడు చెట్టుకింద వున్న బండమీద కూర్చునేవాడు. మరో వ్యవసాయదారుడు తమ మధ్య కూర్చుని వున్నాడని మాత్రమే తెలియనివారు భావించేవారు. తెలిసిన వారు- ‘రాజేంద్ర..! ఈ ‘జాబు’ చదివిపెట్టు..’ అని ఆ రోజు తపాలాలో వచ్చిన ఉత్తరాన్ని ఆయన చేతికి ఇచ్చేవారు! ‘మా కూతురినీ అల్లుడినీ పండగకు రమ్మని ‘జాబు’ రాసిపెట్టు..’ అని మరి కొందరు కోరేవారు. రాజేంద్రప్రసాద్ వారి పాలిట కేవలం ‘అక్షరాల సరం’, ఆయన ‘విజ్ఞాన శిఖరం’ అన్న సంగతి వారికి పట్టని వాస్తవం! న్యాయ శాస్త్రంలో ‘స్నాతకోత్తర’ పట్టా-మాస్టర్స్ ఇన్ లా- పరీక్షలో ఆయనకు బంగారు పతకం లభించింది. అలహాబాద్ విశ్వవిద్యాలయం నుంచి ఆయన ‘పరిశోధక’ పట్టా-డాక్టరేట్-ను కూడా పొందారు. కలకత్తా విశ్వవిద్యాలయం నుంచి ఆర్థికశాస్త్రంలో స్నాతకోత్తర పట్టాను పొందిన రాజేంద్రప్రసాద్ ఆర్థిక శాస్త్ర ఆచార్యుడు-ప్రొఫెసర్-, ఆంగ్ల భాషాచార్యుడుగా పనిచేసాడు.. నిరాడంబరుడు!
బ్రిటన్ దురాక్రమణ ముగిశాక నూతన రాజ్యాంగం 1950 జనవరి 26న అమలులోకి వచ్చింది. రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడిగా వుండిన రాజేంద్రప్రసాద్ 1950 జనవరి 24న తొలి రాష్టప్రతిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. ఉప ప్రధానమంత్రి సర్దార్ వల్లభభాయ్ పటేల్ ప్రతిపాదించిన అభ్యర్థిత్వ పత్రాన్ని ‘రాజ్యాంగ పరిషత్’ ప్రధాన ఆదేశకుడు-చీఫ్ విప్-సత్యనారాయణ సినివా ఇరవై మూడవ తేదీన ఎన్నికల నిర్వహణ అధికారి-రిటర్నింగ్ ఆఫీసర్-హెచ్.వెంకటరంగ అయ్యంగార్‌కు స మర్పించాడు. రాజేంద్రప్రసాద్ తూర్పు, జవహర్‌లాల్ నెహ్రూ పడమర! భారతీయ స్వభావుడు రాజేంద్రప్రసాద్, పాశ్చాత్య భావజాల ప్రభావితుడు నెహ్రూ. బ్రిటన్ తరహా పార్లమెంటరీ సంప్రదాయాలను అనవసరంగా గుర్తుచేసిన నెహ్రూకు రాజేంద్రబాబు ‘జనాదేశ సిద్ధాంతం’- డాక్టరిన్ ఆఫ్ మాండేట్-గురించి వివరించాల్సి రావడం చారిత్రక ప్రాధాన్యాన్ని సంతరించుకున్న మహా పరిణామం.
రాజేంద్రప్రసాద్ అభ్యర్థిత్వం నెహ్రూకు ఇష్టం లేదు! గణతంత్ర వ్యవస్థ ఏర్పడే వరకు బ్రిటన్ రాజప్రతినిధిగా దేశాధిపత్యం వహించిన ‘మహారాజ్యపాల్’-గవర్నర్ జనరల్-చక్రవర్తుల రాజగోపాల ఆచారి తొలి రాష్టప్రతి కావాలన్నది నెహ్రూ ఆకాంక్ష! ఈ ఆకాంక్షను 1950లోను, 1952లోను కాంగ్రెస్ కార్యవర్గం తోసిపుచ్చడం ఆ సంస్థలో నెహ్రూకు ‘లేని పలుకుబడి’కి నిదర్శనం. వల్లభభాయి పటేల్ కాంగ్రెస్‌కు నిజమైన నాయకుడు. అందువల్ల రాజేంద్రప్రసాద్‌ను నెహ్రూ అంగీకరించక తప్పలేదు. 1952లో కలకత్తాలో జరిగిన కాంగ్రెస్ కార్యవర్గ, పార్లమెంటరీ మండలి సంయుక్త సమావేశంలో రాష్టప్రతి రాజేంద్రప్రసాద్‌ను మళ్లీ అభ్యర్థిగా ఎన్నుకున్నారు. ఈ సంగతిని కాంగ్రెస్ ప్రతినిధి లాల్‌బహదుర్ శాస్ర్తీ 1952 మార్చి ఇరవయ్యవ తేదీన కలకత్తాలో ప్రకటించాడు! రాజ్యాంగం అమలు జరగడంతో 1950లో రాజేంద్ర బాబు రాష్టప్రతి అయ్యేనాటికి ‘వయోజన’ వోటు హక్కు ప్రాతిపదికగా దేశంలో ఎన్నికలు జరగలేదు. అందువల్ల 1951-52లో సార్వజనిక వోట్ల ప్రాతిపదికగా శాసనసభలు, లోక్‌సభ ఏర్పడిన తరువాత రాజేంద్రప్రసాద్ 1952లో మళ్లీ ఎన్నికయ్యాడు. ఆయనకు కె.టి.షా అనే అభ్యర్థి ప్రధాన ప్రత్యర్ధి! పార్లమెంటు, శాసనసభల సభ్యులున్న వరణమండలి-ఎలక్టోరల్ కాలేజి-లో రాజేంద్రప్రసాద్‌కు ఎనబయి నాలుగు శాతం వోట్లు లభించాయి. 1957లో నెహ్రూ మళ్లీ రాజేంద్రప్రసాద్ అభ్యర్థిత్వాన్ని వద్దన్నాడు. అప్పటి ఉప రాష్టప్రతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ను రాష్టప్రతి పదవికి ఎంపిక చేయాలని నెహ్రూ కోరాడట. కానీ కాంగ్రెస్ కార్యవర్గం మరోసారి రాజేంద్రప్రసాద్‌ను అత్యున్నత పదవికి ఎంపిక చేసింది. అలా 1950 జనవరి 26 నుండి 1962 మే 13 వరకు పనె్నండు ఏళ్లకు పైగా రాజేంద్రప్రసాద్ రాష్టప్రతి. 1962లో మళ్లీ పదవికి పోటీ చేయడం తనకు ఇష్టం లేదని కూడ ఆయన స్పష్టం చేసాడు. రాధాకృష్ణన్ రాష్టప్రతి కాగలిగాడు! బిహార్ రాజధాని పాట్నా సమీపంలోని బిహారస్ విద్యాపీఠం ప్రాంగణంలోని సదావ్రత్ ఆశ్రమంలో రాజేంద్ర ప్రసాద్ తన శేష జీవితం గడిపాడు. 1963 ఫిబ్రవరి 28న పార్ధివ శరీర పరిత్యాగం చేసాడు.
రాష్టప్రతి కేవలం లాంఛన ప్రాయమైన దేశాధినేత కాదన్న వాస్తవాన్ని నెహ్రూకు రాజేంద్రప్రసాద్ పదే పదే గుర్తు చేయడం 1951లోనే మొదలైంది! 1952లో మళ్లీ రాష్టప్రతి ఎన్నిక జరిగిన నాటికి ఉభయుల మధ్య అధికార పరిధికి సంబంధించిన విభేదాలు పతాక స్థాయికి చేరాయి. అయినప్పటికీ నెహ్రూ అభీష్టానికి విరుద్ధంగా కాంగ్రెస్ కార్యవర్గం రాజన్‌బాబును ఎంపిక చేయడానికి కారణం హిమశృంగం వంటి రాజేంద్ర వ్యక్తిత్వం. పదవి ఆయనకు ప్రధానం కాలేదు! విలువలు, మానవుని మానవునిగా నిలబెట్టిన జీవన ధర్మం రాజేంద్రప్రసాద్ రూపంలో భాసించాయి! 1884 డిసెంబర్ మూడవ తేదీన రాజేంద్ర జన్మించే నాటికి బిహార్ ప్రాంతం బెంగాల్ ‘రాజ్యం’-ప్రెసిడెన్సీ-లో ఉండేది, బ్రిటన్ విద్యావిధానం భారత జాతీయ విజ్ఞాన క్షేత్రాన్ని ‘కర్దమ సరస్సు’-పెద్ద బురదగుంట-గా మార్చిన తరుణమది! అనాదిగా ఒక జాతిగా, ఒకటే జాతిగా పరిఢవిల్లిన భారతదేశం ‘చరిత్రలో ఎప్పుడూ ఒక జాతి కాలేదని, తమ ‘పాలన’ ఫలితంగా ఒక జాతిగా ఏర్పడబోతోందని- ‘ఏ నేషన్ ఇన్ ది మేకింగ్..’ బ్రిటన్ విద్యావిధానం మనకు పాఠాలు చెప్పడం అబద్ధాలకు పరాకాష్ఠ! అలాంటి ‘బురద’ చిత్తడి అంటని స్వచ్ఛమైన సాంస్కృతిక పరిమళ కమల పుష్పాలు స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో వికసించడం కూడ చరిత్ర. ఈ ‘పరిమళ’ జాతీయ పరంపరకు చెందినవాడు రాజేంద్రప్రసాద్. అందుకే ఆయన జీవన ప్రస్థానంలో భారత జాతీయ తత్త్వం నిరంతరం ప్రస్ఫుటించింది! ‘బ్రహ్మీ ముహుర్తంలో’ నిద్ర లేవడంతో భారతీయుని దినచర్య ఆరంభం.. ఇది సనాతన సంప్రదాయం! చిన్ననాట ‘రాజా’ తెల్లవారుజామున బ్రహ్మీ ముహుర్తంలో లేచి పాఠాలు చతువుకునేవాడు! పొద్దెక్కినా నిద్రలేవని ఈ తరం విద్యార్థులు చరిత్ర నుంచి నేర్వవలసిన పాఠం ఇది, దీన్ని మొదట తల్లిదండ్రులు నేర్చుకోవాలి! ‘రాజేంద్ర’ తండ్రి మహదేవ సహాయ్ ఆయనను, ఆయన అన్న మహేంద్రప్రసాద్‌ను తెల్లవారుజామున నిద్రలేపి చదివించేవాడు! రాజేంద్రప్రసాద్ కళాశాలలో పరీక్షలు రాసినప్పుడు పరీక్ష పత్రాలను దిద్దిన ఒక ఆచార్యుడు, ‘పరీక్షకుని-ఎగ్జామినర్-కంటే విద్యార్థి-ఎగ్జామినీ-కి ఎక్కువ పరిజ్ఞానం ఉంది‘ అని పరీక్ష పత్రం మీదనే వ్రాశాడట! మొదటి తరగతి నుంచి ‘డాక్టరేట్’ స్థాయి వరకు రాజేంద్ర అన్ని పరీక్షల్లో మొదటి స్థానం సంపాదించాడు. బంగారు పతకాలు పొందాడు. ఇంటర్ మీడియట్- ఆ రోజుల్లో ‘ఎఫ్‌ఏ’-స్థాయి నుంచి ఆయనకు ‘విజ్ఞాన వేతనం’-స్కాలర్‌షిప్ లభించింది! ఈ మేధా వికసనం బ్రాహ్మీ ముహుర్త పఠనం ఫలితం! రాష్టప్రతి అయిన తరువాత కూడ రాజేంద్రప్రసాద్ తెల్లవారుజామున మూడు గంటలకు నిద్రలేచి ఐదు గంటలవరకు చదివేవాడు, వ్రాసేవాడు! ఆ తర్వాత స్నానం, యోగాభ్యాసం. బ్రిటన్ ‘వైస్రాయి’లు ఉండినకాలంలో పాశ్చాత్య దుర్వాసనలను భరించవలసి వచ్చిన రాష్టప్రతి భవనం రాజేంద్రప్రసాద్ ప్రవేశంతో భారతీయ ఋషిగృహం వలె స్వచ్ఛతతో పరిమళించింది! ‘పాలకంకులు’, ‘చెట్టున మాగిన పండ్లు’ నిండిన గ్రామం వలె రాష్టప్రతి భవనం శోభించింది! రామాయణం, భారతం భారత జాతీయ జీవన రథానికి చక్రాలు, ఆ కథలను రాజేంద్ర బాబు తల్లి కమలేశ్వరి దేవి చిన్నప్పుడు ఆయనకు వినిపించింది! అందువల్లనే పాశ్చాత్య అనుకరణ విన్యాసాలు రాజేంద్రప్రసాద్‌ను తాకలేదు...
నెహ్రూ మంత్రివర్గం 1951లో రూపొందించిన ‘హిందూ స్మృతి’-హిందూ కోడ్-బిల్లు గురించి రాష్టప్రతి రాజేంద్రప్రసాద్ తన అభిప్రాయాలను స్పష్టం చేయడానికి, మార్పులను సూచించడానికి ఈ ‘్భరతీయ జీవనం’ నేపథ్యం. ఈ ‘బిల్లు’ గురించి పత్రికలలో చదివిన రాష్టప్రతి ‘బిల్లు’ ముసాయిదాను ముందుగానే అంటే పార్లమెంటులో నివేదించడానికంటే ముందు తనకు పంపించాలని ప్రధానిని కోరాడు! దానివల్ల తన అభిప్రాయాన్ని ముందుగానే పార్లమెంటుకు తెలియజేయడానికి వీలుకలుగుతుందని, భవిష్యత్తులో విభేదాలు తల్తెకుండా నిరోధించవచ్చునని రాజేంద్రప్రసాద్ ప్రధానికి రాసిన ఉత్తరంలో కోరాడు! ఇలాంటి పద్ధతి వల్ల ‘తీవ్ర పరిణామాలు’ సంభవించే ప్రమాదం ఉందన్నది నెహ్రూ పంపిన సమాధానం. ‘అలాంటి వివాదాలు, ఘర్షణలు తలెత్తవు, ప్రజాస్వామ్య సంస్థల అధికార పరిధులను మంత్రివర్గం, పార్లమెంటు గుర్తించినప్పుడు ‘ఘర్షణ’ ప్రసక్తి లేదు!’ అని రాజేంద్రప్రసాద్ మళ్లీ నెహ్రూకు ఉత్తరం వ్రాశాడు! ఇలా ఉత్తర ప్రత్యుత్తరాల ప్రహసనం నడిచింది! నెహ్రూ మాటిమాటికీ బ్రిటన్ ప్రజాస్వామ్య ఉదాహరణలను ఉటంకించడాన్ని రాజేంద్రప్రసాద్ వెక్కిరించాడు! ఆంగ్ల సంప్రదాయాల ‘దిగుమతి’- కేవలం రాష్టప్రతి అధికారాలకు పరిమితం కారాదని మరో ఉత్తరంలో రాజేంద్రప్రసాద్ నెహ్రూకు రాజ్యాంగ పాఠం నేర్పాడు. ఈ సందర్భంగానే ‘డాక్టరిన్ ఆఫ్ మాండేట్’ అంటే ఏమిటో నెహ్రూకు రాజేంద్రప్రసాద్ బోధించాడు! ప్రజలకు వివరించకుండా వారి ఆదేశం పొందకుండా ప్రధానమైన చట్టాలను చేయరాదన్నది ‘డాక్టరిన్ ఆఫ్ మాండేట్’ -జనాదేశ సిద్ధాంతం! హిందూ కోడ్ గురించి 1951 నాటికి ‘జనాదేశం’ లేదు. అప్పటి మొదటి లోక్‌సభ ఎన్నికలు జరగలేదు! జనాదేశం కోరాలన్నది నెహ్రూకు రాజేంద్రప్రసాద్ చెప్పిన రాజ్యాంగ పాఠం. కొత్త రాష్టప్రతి ఎన్నిక వేళ స్మరణీయుడు తొలి రాష్టప్రతి!

-హెబ్బార్ నాగేశ్వరరావు