రాష్ట్రీయం

రెండంచెల పాలనే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 28: పరిపాలనా వ్యవస్థలో స్టేట్, జోనల్, డిస్ట్రిక్ట్ మూడంచెల వ్యవస్థకు స్వస్థిపలికి స్టేట్, డిస్ట్రిక్ట్‌గా రెండంచెల వ్యవస్థ రూపొందించడానికి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. జోనల్ వ్యవస్థ రద్దుకు ఇటీవల జరిగిన మంత్రిమండలి సిఫారసు చేయడంతోపాటు రెండంచెల వ్యవస్థ రూపకల్పనకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీ మొదట ముసాయిదా రూపొందించి దానిపై ఉద్యోగ సంఘాల ప్రతినిధుల సూచనలు, సలహాల తర్వాత సవరణలు చేసి సాధారణ పరిపాలనా శాఖకు పంపిస్తుంది. ఆ తర్వాత అక్కడి నుంచి న్యాయశాఖకు పంపిస్తుంది. న్యాయశాఖ పరిశీలన అనంతరం ముసాయిదా తుది ప్రతిని జత చేసి జోనల్ వ్యవస్థ రద్దు చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి, రాష్టప్రతికి పంపిస్తుంది. రాష్టప్రతి ఆమోదం తెలపగానే జోనల్ వ్యవస్థ రద్దుపై గెజిట్ నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉంది. మంత్రిమండలి నియమించిన జోనల్ వ్యవస్థ రద్దుపై అధ్యయనం చేయడానికి నియమించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్ నేతృత్వంలోని కమిటీ ముసాయిదాపై బుధవారం ఉద్యోగ సంఘాల అభిప్రాయ సేకరణను చేపట్టింది. గురువారం ఉద్యోగ సంఘాలన్నింటితో మరోసారి సమావేశం కానున్నట్టు సిఎస్ ఎస్‌పి సింగ్ తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసిన డిస్ట్రిక్ట్, జోనల్, స్టేట్ మూడంచల పరిపాలనా వ్యవస్థనే ఇప్పటి వరకు కొనసాగుతోంది. అలాగే రాష్ట్రాన్ని ఆరు జోన్లుగా విభజించి ఉద్యోగులు, అధికారులు, సిబ్బంది నియామకాలు జరిగాయి. ఆరు జోన్లలో నాలుగు జోన్లు ఆంధ్రలో, రెండు జోన్లు తెలంగాణలో (ఐదు, ఆరు) కొనసాగాయి. రాష్ట్ర విభజన తర్వాత జోనల్ వ్యవస్థను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో తెలంగాణ రాష్ట్ర మొత్తంగా ఒకటే యూనిట్‌గా, డిస్ట్రిక్ట్, స్టేట్ రెండు క్యాడర్లు మాత్రమే కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జోనల్ వ్యవస్థ రద్దువల్ల ప్రస్తుతం జోనల్ క్యాడర్‌లో ఉన్న అధికారులు, ఉద్యోగులను యధాతథంగా కొనసాగిస్తూ, కొత్తగా జరిగే నియామకాల్లో మాత్రమే స్టేట్, డిస్ట్రిక్ట్ క్యాడర్‌గా పోస్టుల నియామకం జరుగుతుందని ముసాయిదాలో పేర్కొంది. జోనల్ వ్యవస్థ రద్దుకు దాదాపు అన్ని ఉద్యోగ, అధికారుల సంఘాలు సానుకూలంగా స్పందించడంతో రెండంచెల వ్యవస్థకు అమలుకు అడ్డంకులు తొలిగాయి. అయితే డిస్ట్రిక్ట్, స్టేట్ కేడర్ నియామకాలలో ఎంతమేరకు ఉద్యోగాలను రిజర్వు చేయాలన్నది ప్రధాన అంశం. ప్రస్తుతం కొనసాగుతున్న మూడంచల వ్యవస్థలో డిస్ట్రిక్ట్ పోస్టులలో 80 శాతం స్థానికులకు, 20 శాతం ఒపెన్ కేటగిరి కింద ఇతర జిల్లాల అభ్యర్థులకు కూడా అర్హత కల్పించారు. జోనల్ పోస్టులలో 30 శాతం స్థానికులకు 70 శాతం ఒపెన్ క్యాటగిరి (స్థానికేతరులు కూడా అర్హులు) స్టేట్ క్యాడర్‌లో 20 శాతం స్థానికులకు, 80 శాతం ఒపెన్ క్యాటగిరికి రిజర్వు చేశారు. జోనల్ వ్యవస్థ రద్దయ్యాక డిస్ట్రిక్ట్ క్యాడర్ పోస్టులను వందకు వందశాతం స్థానికులకు కేటాయించి, స్టేట్ క్యాడర్ పోస్టులను 80శాతం స్థానికులకు, 20 శాతం ఓపెన్ కేటగిరికి కేటాయించాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం, తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది. ఈమేరకు కమిటీకి రెండు సంఘాలు బుధవారం తమ అభిప్రాయాలు తెలియజేశాయి. డిస్ట్రిక్ట్ క్యాడర్ పోస్టులన్నీ స్థానికులకు కేటాయించడానికి ప్రభుత్వం సుముఖంగా ఉన్నప్పటికీ, స్టేట్ క్యాడర్ పోస్టులు 80శాతం స్థానికులకు రిజర్వు చేయడం సాధ్యం కాకపోవచ్చని ప్రభుత్వ వాదన. ప్రస్తుతం అమలులో ఉన్న 20 శాతాన్ని 80 శాతానికి పెంచడం న్యాయశాఖ అనుమతించక పోవచ్చని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నారు. స్టేట్ క్యాడర్ నియామకాలలో స్థానికులు, ఓపెన్ క్యాటగిరికి కేటాయించే శాతంపై పీటముడి ఏర్పడటంతో ఈ అంశంపై ఉద్యోగ సంఘాలతో సిఎస్ కమిటీ గురువారం మరోసారి సమావేశం కావాలని నిర్ణయించింది.
చిత్రం.. జోనల్ వ్యవస్థ రద్దుపై ఉద్యోగ సంఘాల నుంచి అభిప్రాయాలు స్వీకరిస్తున్న సిఎస్ ఎస్‌పి సింగ్