సబ్ ఫీచర్

కాంగ్రెస్ సమర వ్యూహం ఫలించేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గత సార్వత్రిక ఎన్నికల తర్వాత వరుస పరాజయాలతో సతమతమవుతున్న కాంగ్రెస్ పార్టీ రానున్న సంవత్సర కాలంలో ఆరు రాష్ట్రాల శాసనసభలకు జరిగే ఎన్నికలలో సత్తా చాటేందుకు సమాయత్తమవుతోంది. రాబోయే ఎన్నికలలో పార్టీ పరిస్థితిని మెరుగుపచుకోవడానికి ఇప్పటి నుంచే వ్యూహాలకు పదును పెడుతోంది. ఈ ఏడాది జరిగిన అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్‌లో మాత్రమే అధికారాన్ని సంపాదించింది. మణిపూర్, గోవా రాష్ట్రాల్లో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ పాలనా పగ్గాలు చేపట్టలేకపోయింది. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ కాంగ్రెస్‌కు ఎలాంటి ప్రయోజనం దక్కలేదు.
ఈ సంవత్సరం చివరిలో హిమాచల్‌ప్రదేశ్, గుజరాత్ శాసనసభలకు, వచ్చే సంవత్సరం ప్రథమార్థంలో మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్, కర్ణాటక శాసనసభలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఆరు రాష్ట్రాలలో కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్ మినహా మిగిలిన రాష్ట్రాల్లో బిజెపి ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి. ఈ ఆరు రాష్ట్రాలలో ఓటర్లకు చేరువ అయ్యేందుకు కాంగ్రెస్ పార్టీ స్వచ్ఛంద సేవా సంస్థల (ఎన్‌జివో) సహకారం తీసుకొంటున్నది. నరేంద్ర మోదీ ప్రధాని అయ్యేంతవరకు దేశంలోని అనేక స్వచ్ఛంద సేవా సంస్థలకు విదేశాల నుంచి విరాళాలు వెల్లువలా వచ్చి పడుతుండేవి. విదేశీ విరాళాలు దుర్వినియోగం అవుతున్నాయని పలు ఆరోపణలు వచ్చినప్పటికీ, వాటిపై విచారణ జరిపించడానికి గత ప్రభుత్వాలు ఏ విధంగానూ సాహసించలేదు. దీంతో స్వచ్ఛంద సేవా సంస్థల ముసుగులో కొందరు మత మార్పిడులను ప్రోత్సహించారు. నరేంద్ర మోదీ ప్రధాని అయిన తరువాత స్వచ్ఛంద సేవా సంస్థలకు వస్తున్న విదేశీ నిధులపై ఆంక్షలు విధించారు. దీంతో పలు సంస్థలకు విదేశీ నిధులు అందటం లేదు. స్వచ్ఛంద సేవా సంస్థలు ప్రతి సంవత్సరం తమ జమాఖర్చులను ఆడిట్ చేయించి ప్రభుత్వానికి విధిగా అందజేయాలి. అయితే ఎక్కువ శాతం సంస్థలు 2014 వరకు ఈ నిబంధనలను పాటించలేదు. మోదీ ప్రభుత్వం ఈ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో స్వచ్ఛంద సేవా సంస్థల ముసుగులో మత మార్పిడులకు పాల్పడుతున్న వారికి నిధుల కొరత ఏర్పడింది. దీంతో పలు సంస్థలు తమ కార్యకలాపాలను తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సంస్థల కార్యకలాపాలు ఎక్కువగా పేద ప్రజలు నివసించే ప్రాంతాలలోనే జరుగుతాయి. మురికివాడలు, దళితవాడలు, గిరిజన ప్రాంతాలలోని ప్రజలతో వీరికి సత్సంబంధాలు ఉంటాయి. వీరు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంకుగా ఉండే వారు. ప్రస్తుతం ఆ పార్టీ పట్టు నుంచి వారు జారిపోయారు. తిరిగి వారికి చేరువకావడానికి కాంగ్రెస్ పార్టీ స్వచ్ఛంద సేవా సంస్థల సహకారాన్ని తీసుకొంటున్నది. దేశంలో ఎన్‌జిఓలు ఎక్కువగా క్రిస్టియన్ మైనారిటీలకు సంబంధించి ఉన్నాయి. క్రిస్టియన్ మైనారిటీ నాయకులలో ఎక్కువ శాతం కాంగ్రెస్ అభిమానులు. సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన తరువాత నుంచి వీరు కాంగ్రెస్‌ను బలపరుస్తున్నారు. దీనిని అవకాశంగా తీసుకొని, కాంగ్రెస్ నేతలు ఎన్‌జివోల సహాయంతో ప్రజలకు చేరువ అయ్యేందుకు వ్యూహరచన చేస్తున్నారు.
ఎన్‌జిఓల ద్వారా ఆయా ప్రాంతాలలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించే పనిలో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. ప్రజా సమస్యలను గుర్తించి వాటిని ఆయా రాష్ట్రాల ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపరచనున్నారు. తమకు వెల్లువలా వచ్చిపడుతున్న విదేశీ విరాళాలకు అడ్డుకట్ట వేసిన బిజెపి పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్న కొన్ని ఎన్‌జిఓలు కాంగ్రెస్ నేతలకు బాహాటంగానే సహకరిస్తున్నాయి. అయితే, తిరిగి ప్రజల మన్ననలను పొందటానికి ఎన్‌జిఓల సహకారం తీసుకొంటున్న కాంగ్రెస్ పార్టీకి వారి సహకారం ఏ మేరకు ఓట్ల రూపంలో మారుతుందో తెలియడానికి ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే!

-పి.మస్తాన్‌రావు