ఆటాపోటీ

గ్రాస్ కోర్టుల్లో స్టార్స్ వార్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎటిపి లేదా డబ్ల్యుటిఎ టూర్ టోర్నమెంట్లు, సిరీస్‌ల్లో విజయాలు, ట్రోఫీలు సాధించడం కంటే వింబుల్డన్‌కు అర్హత సంపాదిస్తేనే జన్మ ధన్యమవుతుందని అనుకోవడం టెన్నిస్‌లోకి అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికీ సహజం. నాలుగు గ్రాండ్ శ్లామ్ టోర్నీల్లోనూ వింబుల్డన్‌నే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారు. దీనిని అనధికార ప్రపంచ చాంపియన్‌షిప్‌గా అభివర్ణిస్తారు. టెన్నిస్ ర్యాకెట్ చేతపట్టిన ప్రతి ఒక్కరికీ వింబుల్డన్‌లో ఆడడం ఒక కల. ఈ టోర్నీపై ఎన్నో ఆశలతో నిరంతరం శ్రమిస్తారు. మెయిన్ డ్రాకు అర్హత లభించడంతోనే, టోర్నీని గెలిచినంతగా సంబరపడతారు. జయాపజయాలు ఎలావున్నా, వింబుల్డన్ టెన్నిస్ కోర్టుల్లో గడిపిన ప్రతి క్షణాన్ని మధుర స్మృతిగా మార్చుకొని, జీవితాంతం తమ జ్ఞాపకాల్లో పదిలంగా దాచుకుంటారు. ఇక టైటిల్ గెలిచిన వారి ఆనందానికి అంతే ఉండదు. ఇంతటి ఆదరణ ఉంది కాబట్టే వింబుల్డన్‌ను టెన్నిస్‌కే మణిహారమని అభివర్ణిస్తారు. మిగతా క్రీడలతో పోలిస్తే, టెన్నిస్‌కు ఎన్నో ప్రత్యేకతలు ఉండేవి. విలక్షణమైన పద విన్యాసాలు, కళాత్మక విలువలు ఈ క్రీడకే సొంతమని అనేవారు. క్రీడాస్ఫూర్తికి టెన్నిస్ మారుపేరుగా నిలిచేది. క్రమంగా ఈ పరిస్థితి మారింది. కళాత్మక ఆట కనుమరుగవుతూ, ఆ స్థానాన్ని పవర్ ప్లే ఆక్రమించింది. వింబుల్డన్‌ను మినహాయించి, మిగతా మూడు గ్రాండ్ శ్లామ్ టోర్నీలు, ఆస్ట్రేలియా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, యుఎస్ ఓపెన్‌లోనూ టెన్నిస్ మూల సూత్రాలు మసకబారుతున్నాయి. అయితే, ఈ మలినం అంటని ఏకైక గ్రాండ్ శ్లామ్‌గా వింబుల్డన్ ఇప్పటికీ తన ప్రత్యేకతను చాటుకుంటున్నది. అందుకే దీనిని కేవలం ఒక టోర్నీలా కాకుండా, టెన్నిస్ చరిత్రకు ప్రతిరూపంగా పేర్కొంటారు. అసలైన టెన్నిస్ రూపురేఖలు చెదిరిపోతూ, కళాత్మక విలువలు భూస్థాపితమవుతున్న రోజుల్లోనూ వింబుల్డన్ మాత్రమే సుందర దృశ్యకావ్యంలా మన కళ్ల ముందు ఆవిష్కరిస్తున్నది.
ప్రాచీన క్రీడకు ఆధునిక రూపం
టెన్నిస్ ఎప్పుడు, ఎక్కడ ప్రారంభమైందో చెప్పడం కష్టం. అయితే, 12వ శతాబ్దంలోనే ఈ క్రీడ ఆడినట్టు చెప్పడానికి చారిత్రక ఆధారాలున్నాయి. అప్పట్లో ర్యాకెట్లు లేవు. అర చేత్తో బంతిని కొట్టేవారు. అందుకే, మొదట్లో టెన్నిస్‌కు ‘జియూ డి పామ్’ అనే పేరు స్థిరపడింది. 16వ శతాబ్దం వరకూ ఇదే పరిస్థితి కొనసాగింది. ఫ్రాన్స్‌లో బాగా ప్రాచుర్యం పొందిన తర్వాత బ్రిటన్‌లో అడుగుపెట్టిన టెన్నిస్‌ను కింగ్ హెన్రీ ప్రోత్సహించాడు. చాలా తక్కువ కాలంలోనే బ్రిటన్‌లో టెన్నిస్‌కు గుర్తింపు లభించింది. మొత్తం మీద ప్రాచీన కాలం నుంచి వివిధ పద్ధతుల్లో ఆడుతూ వస్తున్న టెన్నిస్‌కు ఆధునిక రూపాన్నిచ్చిన ఘనత ఆల్ ఇంగ్లాండ్ టెన్నిస్ క్లబ్‌కు దక్కుతుంది. ఈ క్లబ్ ఆధ్వర్యంలోనే అప్పట్లో లండన్ శివార్లలోని వింబుల్డన్‌లో మ్యాచ్‌లు ఆరంభమయ్యాయి. కాలక్రమంలో అదే గ్రాండ్ శ్లామ్ టోర్నీగా రూపుదిద్దుకుంది. చాలాకాలం టెన్నిస్‌ను ఇన్‌డోర్ ఈవెంట్‌గానే ఆడేవారు. దీనిని అవుట్ డోర్ గేమ్‌గా మార్చాలన్న ఆలోచన మేజర్ వాల్టర్ క్లాప్టన్ వింగ్‌ఫీల్డ్‌కు వచ్చింది. వెంటనే అతను తన ఆలోచనలకు కార్యరూపాన్నిచ్చాడు. 1873లో స్పెయిరిస్టయిక్ పేరుతో వేల్స్‌లో అవుట్ డోర్ టెన్నిస్ ఈవెంట్‌ను ఆరంభంచాడు. వింబుల్డన్ టోర్నీకి అదే పునాది. ఈ టోర్నీ కొద్దికాలంలోనే ప్రాచుర్యాన్ని పొందిందిగానీ స్పెయిరిస్టయిక్ పేరును పలకడానికి చాలా మంది ఇష్టపడలేదు. దీనితో, అవుట్ డోర్ టెన్నిస్‌ను స్పెయిరిస్టయిక్ అని కాకుండా లాన్ టెన్నిస్ అనే పేరుతో పిలవడం ఆరంభించారు. 1874లో బెర్ముడాకు వెళ్లిన
మేరీ ఇవింగ్ అవుటర్‌బ్రిడ్జి అనే మహిళ న్యూయార్క్ నగరానికి తిరిగి వచ్చేటప్పుడు బ్రిటిష్ ఆర్మీ బహుమతిగా ఇచ్చిన టెన్నిస్ ర్యాకెట్, ఇతర పరికరాలను తనతో తీసుకెళ్లింది. ఆమె ద్వారా అమెరికాలో టెన్నిస్ మొదటిసారి అడుగుపెట్టింది. ఆరేళ్ల కాలంలోనే అమెరికాలోనూ టెన్నిస్ ఒక ప్రధాన క్రీడగా ఎదిగింది. 1880 దశకం ఆరంభం నాటికి క్రీడా రంగంలో టెన్నిస్ ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. 1886లో ఐరోపా, అమెరికా ఖండాలతోపాటు బ్రిటన్‌లోనూ లాన్ టెన్నిస్‌కు స్పష్టమైన రూపం వచ్చింది. నియమనిబంధనలు ఖరారయ్యాయి.
గ్రాస్ కోర్టుపై హోరాహోరీ
టెన్నిస్ ఆటలో వేగం పెరగడంతో, ఈ ఆట మొదలైన గ్రాస్ కోర్టుల స్థానాన్ని క్లే, హార్డ్ కోర్టులు ఆక్రమించాయి. సంప్రదాయబద్ధంగా ఇప్పటికీ గ్రాస్ కోర్టుపై జరుగుతున్న ఏకైక టోర్నీ వింబుల్డన్ మాత్రమే. అందుకే, ఇక్కడి కోర్టుల్లో గడ్డిని ఏడాది పొడవునా సంరక్షిస్తారు. పచ్చికను ఎప్పటికప్పుడు కత్తిరిస్తూ, ఆటకు అనువుంగా ఉంచుతారు. వింబుల్డన్‌లోని 18 టోర్నమెంట్ కోర్టుల్లో ఎక్కడ చూసినా పచ్చిక ఎత్తు ఖచ్చితంగా 8 మిల్లీ మీటర్లే ఉంటుంది. టోర్నమెంట్ సహజంగా జూన్, జూలై మాసాల్లో నిర్వహిస్తారు. ఈసారి జూలై 3 నుంచి 16వ తేదీ వరకూ వింబుల్డన్ గ్రాండ్ శ్లామ్ ఉంటుంది. అయితే, ఏడాది ఎప్పుడు చూసినా ఇక్కడి కోర్టులు టోర్నీలకు అప్పుడే సిద్ధం చేసినట్టుగా తాజాగా ఉండడం విశేషం. టెన్నిస్‌పై మంచి పట్టు ఉన్న వారికే గ్రాస్ కోర్టులపై రాణించడం సాధ్యమవుతుంది. అలాంటి అరుదైన శక్తిసామర్థ్యాలున్న వారు బరిలోకి దిగుతారు కాబట్టే, ఇక్కడ గ్రాస్ కోర్టులపై హోరాహోరీ యుద్ధాలు జరుగుతాయి.
1887లో తొలి టోర్నీ
టెన్నిస్ ఒక ప్రొఫెషనల్ క్రీడగా మార్చి, దానిని పర్యవేక్షించేందుకు 1887లో ఆల్ ఇంగ్లాండ్ టెన్నిస్ క్లబ్ ఏర్పడింది. అదే ఏడాది జూలై 7న వింబుల్డన్‌లో లాన్ టెన్నిస్ టోర్నమెంట్ ఆరంభమైంది. మొదటి టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగానికే పరిమితమైంది. ఒక షెల్లింగ్‌ను చెల్లించి టికెట్లు తీసుకున్న సుమారు 200 మంది ప్రేక్షకులు హాజరయ్యారు. 22 మంది క్రీడాకారులు పోటీపడ్డారు. స్పెన్సర్ గోరె తొలి టైటిల్ కైవసం చేసుకున్నాడు. ఆ తర్వాతి కాలంలో మహిళల సింగిల్స్, పురుషుల డబుల్స్, మహిళల డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్, బాలురు, బాలికల విభాగాల్లో సింగిల్స్, డబుల్స్ పోటీలు రంగ ప్రవేశం చేశాయి. ఇప్పుడు వెటరన్, వీల్‌చైర్, లెజెండ్స్ విభాగాల్లోనూ పోటీలను నిర్వహిస్తున్నారు. తక్కువ కాలంలో విశేష ఆదరణ పొందిన వింబుల్డన్ నేడు క్లాసికల్ టెన్నిస్‌కు మారుపేరుగా మారింది. అత్యంత ప్రతిష్ఠాత్మక టోర్నీగా ఎదిగింది. ఈ టోర్నమెంట్‌లో టైటిల్ సాధించడం మాట ఎలావున్నా, అందులో ఆడితే చాలని అనుకుంటారు. ఇప్పటికీ సంప్రదాయ, కళాత్మక టెన్నిస్ వింబుల్డన్‌లో మాత్రమే సజీవంగా కనిపిస్తుంది. ఎప్పటి మాదిరిగానే ఈ ఏడాది కూడా అభిమానులను అలరించడానికి వింబుల్డన్ గ్రాండ్ శ్లామ్ సిద్ధమైంది. ఫలితాలు ఎలావున్నా, అంతిమ విజయం వింబుల్డన్ టోర్నీదే.
చిత్రం.. తన్మయత్వంతో వింబుల్డన్ ట్రోఫీని ముద్దాడుతున్న డిఫెండింగ్ చాంపియన్ ఆండీ ముర్రే