బిజినెస్

ప్రీ-జిఎస్‌టి సేల్స్ అదుర్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 1: ప్రీ-జిఎస్‌టి సేల్స్ అదిరిపోయాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) శుక్రవారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చినది తెలిసిందే. అయితే అంతకుముందే పన్ను భారం తగ్గించుకోవడానికి వ్యాపారులు ముందస్తు జిఎస్‌టి అమ్మకాలకు తెరతీశారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా భారీ ఎత్తున అమ్మకాలు జరిగాయి. ముఖ్యంగా కన్స్యూమర్ డ్యూరబుల్ ఉత్పత్తులకు పెద్ద ఎత్తున డిమాండ్ కనిపించింది. గరిష్ఠంగా 50 శాతం వరకు డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించారు దుకాణదారులు. శనివారం నుంచి దేశమంతా జిఎస్‌టి అమల్లోకి రావడంతో ముఖ్యంగా శుక్రవారం వినియోగదారులను ఆకట్టుకునే పనిలోపడ్డారు పలు ఎలక్ట్రానిక్ వస్తువుల రిటైలర్లు. దుకాణాల్లోని స్టాక్‌ను తగ్గించుకునేందుకు ఆఖరు క్షణం వరకు శ్రమించారు. మరోవైపు వస్త్ర దుకాణదారులు తమ డిస్కౌంట్లను శనివారం కూడా కొనసాగించారు. లెవీస్, యారో, యునైటెడ్ కలర్స్ ఆఫ్ బెనెట్టన్, యుఎస్ పోలో స్టోర్ల ప్రతినిధులు తెలిపిన వివరాల ప్రకారం ‘బై 2 గెట్ 2’ ఆఫర్ ఇంకా ఉందన్నారు. అయతే కంప్యూటర్ సిస్టమ్స్ అప్‌డేట్ కావడం, కొత్త పన్ను రేటు రావడంతో పాత స్టాక్స్‌పై డిస్కౌంట్ ఉన్నా.. ఫలితం లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. యునైటెడ్ కల ర్స్ ఆఫ్ బెనెట్టన్ 50 శాతం వరకు డిస్కౌంట్ పెట్టగా, యుఎస్ పోలో బై 3 గెట్ 2 ఆఫర్‌ను ప్రకటించింది. జిఎస్‌టి రాకతో ఆఫర్లు అలాగే పెడుతున్నామని, అయతే శుక్రవారం బిల్లుతో పోల్చితే, శనివారం నుంచి బిల్లుల్లో జిఎస్‌టి పడుతోందని, దీంతో బిల్లు పెరుగుతోందని వ్యాపారులు చెబుతున్నారు. ఫలితంగా కస్టమర్లు షాపుల నుంచి వెనుదిరు గుతున్నారని వారు అంటున్నారు. 1,000 రూపాయల ధర లోపున్న చేనేత వస్త్రాలకు జిఎస్‌టిలో 5 శాతం పన్ను పడుతోంది. శుక్రవారం వరకు 7 శాతం పన్నుండేది. అయతే 1,000 రూపాయలు దాటితే శనివారం నుంచి 12 శాతం పన్ను పడుతోంది. దీంతో కస్టమర్లు అవసరానికి మించి కొనుగోళ్లు జరపలేని పరిస్థితి నెలకొందని పలువురు వస్త్ర వ్యాపారులు అన్నారు. కాగా, వ్యాపారులు ఆకర్షణీయమైన డిస్కౌంట్లను ప్రకటించడంతో వినియోగదారులు శుక్రవారం కొనేందుకు ఎగబడ్డారు. ప్రధానంగా సోనీ, ఎల్‌జి ఎల్‌ఇడి టెలివిజన్లకు భారీగా డిమాండ్ కనిపించింది. మైక్రోవేవ్ అవెన్, వాషింగ్ మెషీన్లు, ఎయర్ కండీషనర్లనూ కొనేందుకు కస్టమర్లు పెద్ద ఎత్తునే ఆసక్తి కనబరిచారు. గోద్రెజ్ వాషింగ్ మెషీన్లు 12,000 రూపాయలకే అమ్మగా, లాయడ్ ఎసీలపై 3,000 రూపాయల వరకు ధర తగ్గింది. టెలివిజన్లు, ఎసీలు, వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు తదితర కన్స్యూమర్ డ్యూరబుల్స్‌పై జిఎస్‌టిలో 28 శాతం పన్ను పడుతున్నది తెలిసిందే. దీంతో సదరు పన్నును తప్పించుకునేందుకు దుకాణదారులు డిస్కౌంట్లతో అమ్మకాలను పెంచుకున్నారు. నిజానికి జిఎస్‌టి కారణంగా ఆ వస్తువు, ఈ వస్తువు అని తేడా లేకుండా అన్నింటిపైనా డిస్కౌంట్లు దర్శనమిస్తున్నాయి. కార్లు, స్మార్ట్ఫోన్లు, పాదరక్షలు, వస్త్రాలు ఇలా.. అన్నింటి ధరలు తగ్గాయి మరి. కొత్త పరోక్ష పన్నుల విధానం రానుండటంతో తమ దుకాణాల్లోని వస్తు నిల్వలను తగ్గించుకుంటే న్యాయపరమైన నిబంధనలకు లోబడినట్లవుతుందని, అంతేగాక జిఎస్‌టికి అనుగుణంగా పన్ను చెల్లింపులు, ధరల మార్పు వంటి ఇతరత్రా పనులూ తగ్గుతాయని ఆయా షాపుల యజమానులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఊరికే షాపుల్లో పెట్టుకుని వాటిపై జిఎస్‌టి చెల్లించేకంటే ధరలు తగ్గించి కస్టమర్లకు ఇస్తే నయమనుకుంటున్నారు. ఇందులో భాగంగానే రిటైలర్లు, హోల్‌సేల్ వ్యాపారులు వీలైనంత ఎక్కువ వ్యాపారాన్ని చేసుకోవాలని చూశారు. అందులోభాగంగానే ధరల తగ్గింపునకు నాంది పలికారు. ఇప్పటికే ఆటో రంగం ఈ విషయంలో ముందుంది. వివిధ సంస్థలు తమ కార్ల ధరలను 10,000 రూపాయల నుంచి 10 లక్షల రూపాయల మేర తగ్గించినది తెలిసిందే. టూవీలర్ సంస్థలైన రాయల్ ఎన్‌ఫీల్డ్, బజాజ్ ఆటో కూడా తమ వాహనాల ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించాయ. జిఎస్‌టి రేట్ల ప్రకారం 1,200 సిసి సామర్థ్యానికి తక్కువగా ఉన్న ఇంజిన్ కలిగిన చిన్న పెట్రోల్ ఆధారిత కార్లపై ఒక శాతం సెస్సు, 1,500 సిసికి తక్కువగా ఉన్నవాటిపై 3 శాతం సెస్సు పడుతుంది. ఆపై సామర్థ్యం కలిగిన ఇంజిన్లున్న స్పోర్ట్స్ యుటిలిటి వెహికిల్స్ (ఎస్‌యువి)పై 15 శాతం సెస్సు పడుతుంది. వాహనం పొడవు 4 మీటర్లకుపైగా ఉన్నా.. ఇంతే సెస్సు వర్తిస్తుంది. మరోవైపు శనివారం నుంచి జిఎస్‌టి అమల్లోకి రావడంతో గృహోపకరణ ఉత్పత్తుల ధరలు ప్రియమయ్యాయ. శుక్రవారం వరకు 25 నుంచి 27 శాతం పన్నుండగా, శనివారం నుంచి 28 శాతానికి పెరిగింది. దీంతో 20,000 రూపాయల నుంచి 50,000 రూపాయలున్న వస్తువులపై 200 రూపాయల నుంచి 500 రూపాయల మేర పన్ను భారం పడింది. ఇదిలావుంటే పేటిఎమ్ మాల్.. ప్రీ-జిఎస్‌టి సేల్ ఆఫర్లను ప్రకటించగా, ఐఫోన్ 7, ఇతరత్రా వస్తువులపై భారీగా ధరలను తగ్గించింది. డిఎస్‌ఎల్‌ఆర్‌పై 20,000 రూపాయలు, ల్యాప్‌ట్యాప్‌లపై 15,000 రూపాయలు, ఎల్‌ఇడి టెలివిజన్లపై 10,000 రూపాయల వరకు ధరలను దించింది. ఐఫోన్లపై 7,000 రూపాయల వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్లను ప్రకటించింది. ఎయిర్ కండీషనర్లపై 8,000 రూపాయల క్యాష్‌బ్యాక్, రిఫ్రిజిరేటర్లపై 10,000 రూపాయల వరకు డిస్కౌంట్ ఇచ్చింది. ఇవేగాక ల్యాప్‌ట్యాప్‌లు, బ్లూటూత్, స్పీకర్లు, పాదరక్షలు, ఇతరత్రా వస్తువుల కొనుగోళ్లపై 50 శాతం డిస్కౌంట్, అదనంగా 25 శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్లను ప్రకటించింది. పవర్ బ్యాంక్‌లపైనైతే 70 శాతం డిస్కౌంట్, గేమింగ్ కన్సోల్స్‌పై 6,000 రూపాయల క్యాష్‌బ్యాక్‌ను ఇచ్చింది. అయితే మూడు రోజులపాటే ఈ ఆఫర్లు అమల్లో ఉన్నాయ. పాదరక్షల తయారీ సంస్థలూ భారీగా ఆఫర్లను ప్రకటించాయి. మల్టీబ్రాండ్ రిటైల్ సంస్థ ఫ్యూచర్ గ్రూప్ కూడా వివిధ వస్తువులపై డిస్కౌంట్లను తెచ్చింది. మొత్తానికి జిఎస్‌టి ఆఫర్లు మార్కెట్‌లో అర్ధరాత్రిదాకా హల్‌చల్ చేశాయ. ఒకే దేశం.. ఒకే మార్కెట్.. ఒకే పన్ను నినాదంతో వచ్చిన ఈ పరోక్ష పన్నుల విధానంలో 1,200లకుపైగా వస్తువులు, 500ల సేవలకు కలిపి నాలుగు శ్లాబుల్లో పన్ను రేట్లను నిర్ణయించారు. 5, 12, 18, 28 రేట్లలో ఈ పన్నులను వేయగా, బంగారానికి ప్రత్యేకంగా 3 శాతం పన్నును విధించారు. విద్య, వైద్యం, తాజా కూరగాయలకు పన్ను నుంచి మినహాయింపునిచ్చారు. ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్, వ్యాట్ తదితర 16 వేర్వేరు పన్నులను జిఎస్‌టిలో కలిపేశారు.